20, జనవరి 2011, గురువారం

సమస్యా పూరణం - 203 (అన్నా యని రాము)

కవి మిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......

అన్నా యని రాముఁ బిలిచె నవనిజ భక్తిన్.

42 కామెంట్‌లు:

  1. ఇన్నాళ్ళకీ యయోధ్యను
    కన్నారము, ప్రజలు మనను గాంచిరి యెలమిన్
    కన్నార్పక, గని కపులే-
    మన్నాయని రాముఁ బిలిచె నవనిజ భక్తిన్.

    రిప్లయితొలగించండి
  2. మిస్సన్న గారు నిన్నటి మీ వ్యాఖ్యకు ధన్యవాదములు .ఈనాటి మీ పూరణ భేష్

    ఉన్నావెక్కడ? లక్ష్మణు
    డన్నా యని రాము బిలిచె ! నవనిజ భక్తిన్
    తన్నున్ గొనిపోయెడుచెడు
    పన్నాగంబును దెలియక పాపిని జేరెన్ !

    రిప్లయితొలగించండి
  3. ఎన్నాళ్ళీ హస్తఁపు నస!
    అన్నా, యభిమాని పిలుపు నాలింపంగా,
    అన్నార్తులమౌ మముఁ గా
    నన్నాయని రాముఁ బిలిచె, నవ-నిజభక్తిన్.

    (తారక రామునికై అభిమాని పిలుపు)

    రిప్లయితొలగించండి
  4. వెన్నాడు లక్ష్మణుండును
    'అన్నా'యని రాముఁ బిలిచె ,నవనిజ భక్తిన్
    క్రొన్ననల సొంపుఁ జూపగ
    పొన్నంగుల చెలువు గూడ పొంగుచు మదిలో !

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు!
    అయ్యలారా!

    "నవనిజ భక్తిన్"

    అంటే ఏమిటో నాకర్థం కాలేదు
    దయజేసి ఎవరైనా వివరిస్తారా?

    రిప్లయితొలగించండి
  6. మూర్తి గారికి ధన్యవాదములు !
    అవనిజ = భూజాత = సీత
    అని తెలుసు .
    కాని నేను లక్ష్మణుని పరంగానే ఆలోచిస్తున్నాను.
    లక్ష్మణుడే గద రాముణ్ణి అన్నా అని పిలిచేది.

    భరతుడు , గుహుడు , సుగ్రీవుడూ , విభీషణుడూ
    కూడా అన్నా యని పిలిచే అవకాశముంది
    గనుక ఎవర్ని రంగంలోకి దింపాలా
    అని ఆలోచిస్తుంటే సందేహం వచ్చింది
    --నవనిజ --అంటే ..ఏంటని???
    అది ఏక పదంగా ఎక్కడా దొరక లేదు
    --నవ--నిజ--అనే రెండు పదాలు గానే ఉన్నాయి.
    నవ నిజ భక్తి = ఉప్పొంగిన భక్తి
    అని అనుకోవచ్చనుకుంటాను.
    మీరంతా ఏ అర్థం తీసుకున్నారో తెలుసు కుందామని
    అర్థం అడిగాను.
    మీ వివరణ చూశాకే
    సమస్యలో ఉన్న మెలిక
    "సీతే రాముణ్ణి అన్నా అని పిలచిందని "
    అర్థమైంది.
    మరోసారి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  7. మిస్సన్న గారి పూరణ ముద్దు లొలుకుతూ ఉంది
    పీతాంబరుని పూరణ పట్టు వస్త్రంలా ఉంది.

    రవి గారి పూరణ రాముణ్ణి పిలుస్తోంది.
    (వస్తాడో ? రాడో ? మరి)

    మూర్తిగారి పూరణ కూడా ముద్దుగానే ఉంది
    (క్రొన్ననలంటే ఏమిటో ? పొన్నంగు లంటే ఏమిటో ?
    కొంచెం వివరిస్తే ఇంకా బావుంటుంది)

    ఈ మధ్య మెదడంతా మొద్దుబారి పోతోంది.
    నాలుగు రోజుల కిందట
    fasting blood sugar-------210
    post lunch blood sugar----440 ఉంది.
    ప్రస్తుతం treatment తీసుకొంటున్నాను.
    మీరేమయినా సలహా ఇవ్వండి మూర్తీజీ!

    రిప్లయితొలగించండి
  8. మూర్తి గారూ !
    ఇక్కడ బావుండదు గాని
    దయచేసి నాకు mail చెయ్యండి.
    vasant.kishore@gmail.com

    రిప్లయితొలగించండి
  9. " అన్నా " అని లక్ష్మణుడు " సీత మీద ఉన్న భక్తి వలన " రాముని " " అన్నా " అని పిలిచాడు అని నేననుకుంటున్నాను తప్పొ రైటొ నాకు తెలియదు

    రిప్లయితొలగించండి
  10. క్రొత్త + నన = క్రొన్నన ( నన అంటే పుష్పము ) పొన్నంగులు రంగు రంగుల పిట్టలు .

    శ్రీ మిస్సన్న గారి పూరణ కిశోర్ గారు చెప్పినట్లు ముద్దు ముద్దుగా ఉంది. శ్రీ పీతాంబర్ గారి పూరణ అందంగా ఉంది. శ్రీ రవి గారు నవ-నిజ భక్తి పద్యము హృద్యముగా ఉంది.పనికి పరుగెట్టే తొందఱలో పద్యము వ్రాసి పెట్టాను.వసంత కిశోర్ గారూ ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  11. మూర్తీజీ !
    ఇప్పుడు మహత్తరంగా వుంది.
    అరవిరిసిన పూలూ -వాటి గుభాళింపులూ
    విచ్చీ విచ్చని మొగ్గలూ -వాటి పరిమళాలూ
    రంగు రంగుల పిట్టలూ -వాటి సోయగాలూ -కిల కిలా రావాలూ
    అన్నీ కళ్ళముందు
    సాక్షాత్కరించి
    సీతా రామ లక్ష్మణుల వెనుక
    నడుస్తున్న అనుభూతి కలుగుతోంది.
    మీకు మరోసారి ధన్యవాదములు
    మంచి పద్య విందు ఇచ్చినందుకు.

    రిప్లయితొలగించండి
  12. అందరు నవ్వకండి అసలు ఎలాఉంటుందో అని ఒక చిన్న ప్రయత్నం.

    అన్నా ఇది మాయలేడి వల
    దన్నా యని తెలిపి నంత దబ్బఱు వెంటన్ !
    విన్నావ మారీచు మాయలు
    అన్నాయని రాముఁబిలిచె నవనిజ భక్తిన్ !

    దబ్బఱు = మోసము , విపత్తు

    రిప్లయితొలగించండి
  13. సీతకై దుఃఖించు రాము
    ననునయింపుచూ లక్ష్మణుడు :

    01)
    _________________________________________

    కన్నీరు కార్చ వలదో
    మన్నీడా యూరడిల్లు - మన భాగ్యంబున్
    మున్నీటి కన్నె జేరుదు
    మన్నా యనిరాము బిలిచె - నవ నిజ భక్తిన్ !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  14. రాముని శరణు గోరి విభీషణుడు :

    02)
    ________________________________________

    నిన్నే నమ్మితి కడు ! మా
    యన్నను సైతము విడచితి - యంబుజ నాభా
    పన్నుని గాపాడుముశర
    ణన్నా యని రాము బిలిచె - నవ నిజ భక్తిన్ !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  15. వనము నందు
    పలు , పలు , విరుల
    సొగసు , సోయగముల
    జూచి, పరవశ యైన సీత
    రామునితో :

    03)
    _________________________________________

    ఎన్నడు కానము ! విరులీ
    చెన్నున , చెన్నొదవు చుండు - చిత్రము లోహో
    కన్నార గాంచు ! భరతుని
    యన్నా ! యని రాము బిలిచె - నవనిజ భక్తిన్ !
    __________________________________________

    రిప్లయితొలగించండి
  16. శ్రీ నరసింహ మూర్తి గారి వివరణ తర్వాత మళ్లీ ఒకసారి వారి పూరణను చదివాను మహదానందం వేసింది .చీకటి నుండి వెలుగులోకి వస్తే కలిగే ఆనందమే అది.

    రిప్లయితొలగించండి
  17. రాజేశ్వరి గారి పద్యము చాలా బాగుంది. వసంత కిశోర్ గారూ నా పద్యానికి మీరిచ్చిన భావ వివరణ చాలా బాగుంది. సీతారాముల వెంట నడవటానికి మేమూ సిధ్ధమే.మీ పద్యాలు అందంగా ఉన్నాయి.మీ పద్యాల తీపితనానికి కారణము తెలిసింది. చక్కెరని పద్యాలలో పోసి, మీ చక్కెరను సాదా స్థాయికి తీసుకు రండి. శ్రీ పీతాంబర్ గారూ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. పడవ నెక్క బోవు
    రామునితో
    గుహుడు :

    04)
    __________________________________________

    అన్నన! క్షణ మాగుము ! నే
    మన్నన , నీ , పాద పూజ - మంగళ మొదువన్
    సన్నుతి జేసెద , నో , మా
    యన్నా ! యని రాము బిలిచె - నవ నిజ భక్తిన్ !
    __________________________________________

    రిప్లయితొలగించండి
  19. కొద్ది సవరణలతో :

    వెన్నాడు లక్ష్మణుండును
    అన్నా! యని రాముఁ బిలిచె నవనిజ భక్తిన్
    క్రొన్ననలు చూపు మెఱయగ
    పొన్నంగుల పొలుపు మీఱ పున్నాగములన్ !

    ( క్రొత+నన (పుష్పము)=క్రొన్నన; పొన్నంగి= ఒక రంగుల పిట్ట ;పున్నాగము=పొన్న చెట్టు

    రిప్లయితొలగించండి
  20. వాలిని వధించిన
    రామునితో
    సుగ్రీవుడు :

    05)
    __________________________________________

    మిన్నగు మా యన్నను , నా
    పన్న వరద , మన్ను జేసి ! - పాలించిన , శ్రీ
    మన్నారాయణ !యో , మా
    యన్నా ! యని రాము బిలిచె - నవ నిజ భక్తిన్ !
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  21. అయోధ్య కిపుడు
    రాలేననిన రామునితో
    చివరిగా భరతుడు :

    06)
    __________________________________________

    అన్నెము , పున్నెము , నెరుగను !
    నన్నును , నా , జననిని ! నను - నయమున , గరుణిం
    చెన్నడు ! నీ పావలు , ని
    వ్వన్నా! యని రాము బిలిచె - నవనిజ భక్తిన్ !
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  22. దశకంఠుని
    చేజిక్కిన
    సీత :

    07)
    ___________________________________________

    ఇన్నీలుడు దుర్నీతిని
    నన్నెత్తుకు బోవనెంచె ! - నదవద రావా!
    నన్నును! నీ భ్రాతను , బ్రో
    వన్నా! యని రాము బిలిచె - నవనిజ భక్తిన్ !
    ___________________________________________
    నీలుడు = నల్లని వాడు = రావణుడు
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  23. రామునితో
    సమరము సేయ గోరి
    జాంబవంతుడు :

    08)
    __________________________________________

    వెన్నను దిను రీతిని , నా
    కన్నులు మిరుమిట్లు గొలుప - కదనము నందున్
    మిన్నవు!నన్ను నిలువరిం
    చన్నా! యని రాము బిలిచె - నవ నిజ భక్తిన్ !
    __________________________________________

    రిప్లయితొలగించండి
  24. అందరికీ వందనాలు.
    నే నిప్పుడు భాగ్యనగర వాసిని. పుట్టి పెరిగి అరవై ఏళ్ళ అనుబంధాన్ని మూటగట్టుకున్న వరంగల్ ను, అక్కడి బంధువులను, మిత్రులను, శిష్యులను విడిచి వచ్చినందుకు బాధగా ఉంది. భాగ్యనగరం నన్నెలా ఆదరిస్తుందో చూడాలి.
    పాకర్స్ అండ్ మూవర్స్ వారి ద్వారా నిన్న అర్ధరాత్రి హైదరాబాద్, కూకట్ పల్లి చేరుకున్నాము. అప్పటినుండి ఇల్లు సర్దుకొనడంతోనే సరిపోయింది. నేనున్న అపార్ట్ మెంట్ లోనే "ఇంటర్ నెట్ సెంటర్" ఉన్నా ఇప్పటికి కొన్ని నిముషాల వ్యవధి దొరికింది. రెండు మూడు రోజుల్లో "నెట్" కనెక్షన్ తీసుకుంటున్నాను.
    అందరి పూరణలు, వాటిపై మిత్రుల సమీక్షలు చదివి ఆనందించాను.
    మిస్సన్న గారు, మంద పీతాంబర్ గారు, రవి గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, వసంత్ కిశోర్ గారు ( ఏడు పూరణలు), అందరి పూరణలూ దేనికదే ప్రత్యేకమై అలరిస్తున్నాయి. రాజేశ్వరి నేదునూరి గారి పూరణ కొంత సవరణ కోరుతున్నది. సమయాభావం వల్ల సవరించలేక పోతున్నాను.
    అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
    ఇక ఈ రోజు క్రొతా సమస్యను ఇవ్వడం లేదు. రేపు ప్రొద్దున్నే క్రొత్త పోస్ట్ పెడతాను. ఆలస్యానికి మన్నించండి.

    రిప్లయితొలగించండి
  25. వసంత్ కిశోర్ గారూ,
    అతి త్వరలో మీ ఆరోగ్యం కుదుట పడాలని కోరుకుంటున్నాను.
    మనకు నవవిధ భక్తులున్నాయి కదా ... నవనిజ భక్తిన్ అంటే నవవిధాలైన నిజభక్తి అని అర్థం చెప్పుకోవచ్చు కదా!

    రిప్లయితొలగించండి
  26. వసంత కిషోర్ గారు. మీరు త్వరలొ పరిపూర్ణ ఆరోగ్య వంతులై మాకందరికి మంచి మంచి పూరణలు అందించాలని కోరుతున్నాము .

    రిప్లయితొలగించండి
  27. శంకరార్యా ! నమస్సులు !
    మీ 60 సంవత్సరాల అనుబంధం

    విడిపోవడం మాకూ
    (నాకూ,మా శాంతికీనూ)
    బాధ గానే ఉంది.

    మీకు
    కొత్త యిల్లూ
    కొత్త వాతావరణం
    కొత్త ఊరూ
    ఆనందం కలిగించాలని

    హైదరాబాదు మిమ్మల్ని
    అక్కున జేర్చుకుంటుందని
    మనసారా
    ఆశిస్తున్నాము.

    రిప్లయితొలగించండి
  28. నాకు ఆరోగ్యం కలగాలని
    ఆశిస్తున్న
    మూర్తి గారికీ
    గురువు గారికీ
    రాజేశ్వరి అక్కయ్యకూ
    మిగిలిన మిత్రులందరికీ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  29. వసంత కిశోర్ గారూ ఆరోగ్యమస్తు. మీరు యెప్పుడూ మీ చమత్కారాలతో
    మిత్రులను అలరిస్తూండాలని మనసారా కొరుకొంటూన్నాము. మేమంతా ఒకటి రెండు మాత్రమే పూరణల నందిస్తూంటే మీరు పూరణా పరంపరలతో ఆనంద పరుస్తూంటారు. మీ అన్ని పూరణలూ అమోఘం.

    రిప్లయితొలగించండి
  30. గురువు గారికి నమస్కారములు .

    నిజమె ! సంవత్సరాల తరబడి ఏర్పడిన అనుబంధాలను వదులుకోవడం కష్టమె మరి. ఏదో తెలియని అవ్యక్తమైన బాధ ." మన మనస్సుని మన వ్యాపకాల వైపు మళ్ళించు కుంటే , కాస్త అలా బయటి ప్రపంచంలొ తెరిగితె కొంత ఉపశమనం కలుగుతుంది.రాజధానిలొ మరింత ఉత్సాహం ఇనుమడించగలదు. " మన పూరణలతొ మరింత ఆనందాన్ని పొంద వచ్చును.

    రిప్లయితొలగించండి
  31. (సీతాపహరణము తరువాత శ్రీ రాముడు సీతకై వెదుకుతూ, ఒక చెట్టు కొమ్మను సీత జాడను అడుగుతున్న సందర్భములో)
    అవనిజము = చెట్టు (భూమి నుండి జనించినది)

    కన్నావే అవనిజమా!
    వెన్నెల మోము వెలదినని విటపమునడుగన్,
    అన్నా! మా నీడకు రా
    రన్నా! యని రాముఁబిలిచె నవనిజ భక్తిన్!!

    రిప్లయితొలగించండి
  32. వసంత్ కిశోర్ గారూ, అమ్మాయి శాంతీ,
    ధన్యవాదాలు.
    అదేమిటో కాని మా ఆవిడ పేరుకూడ "శాంతి". కాని ఆవిడ తీరుతెన్నులు పేరుకు సంపూర్ణంగా వ్యతిరేకం. నన్ను అశాంతిగా ఉంచే టెక్నిక్కులలో డాక్టరేటే చేసింది. ఏదో నెట్టుకొస్తున్నాను. ఇప్పుడు హైదరాబాదుకు షిఫ్ట్ కావడానికి ఆమే ముఖ్య కారణం.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  33. ఒక సవరణ. పొరబాటును ఇప్పుడే గమనించాను. 'వసంత కిశోర్ గారూ ఆరోగ్యమస్తు.' వ్యాఖ్యను పంపింది మిస్సన్న. వాళ్ళ అమ్మాయి ఇంట్లోని యంత్రం వాడటం వల్ల జరిగిన పొరబాటిది. క్షంతవ్యుడు.

    రిప్లయితొలగించండి
  34. గురువు గారూ స్థాయీ భేదంతో యించుమించు అందరి యిళ్ళలోని పరిస్థితీ అంతే.
    అనాదిగా ఆడవాళ్ళు మగవాళ్ళపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉన్నారండీ. ఇది చరిత్ర యెరిగిన సత్యం. ఈవ్యాఖ్యను గురుపత్ని గారికి చూపించకండేం.
    ఇప్పుడే మా ఇంటావిడ నా యీ వ్యాఖ్యను చూసి మీ మొగాళ్ళందరూ అంతే.
    ఇంట్లోనేమో ఆడవాళ్ళని అణగ త్రొక్కేస్తారు పైకి మాత్రం ఇలా చెప్పుకొంటారు
    అని తిడుతోందండీ!

    రిప్లయితొలగించండి
  35. గురువు గారూ
    నమస్కారములు. మీరు కావాలనుకొంటే రెండు,మూడు గంటలలో వరంగల్లు వెళ్ళి,మిత్రులను సందర్శించి, తిరిగి భాగ్యనగరము చేరిపోవచ్చును. ఇంటి వ్యవహారాలన్నీ మా ఆవిడ నిర్వహించి నా చదువు, మీకు పూరణలు వ్రాయడము వరకు నాకు స్వాతంత్ర్యము యిచ్చారు. భోజనం తర్వాత ఒక 'విటమిన్ ట ' యిస్తే వేసుకొంటాను. అది వశీకరణ గుళిక అని నా అనుమానము! తను చెప్పే మాటలు వింటాను కాబట్టి జీవితము సుఖం గా సాగిపోతున్నాది. ఇంతకు మించి చెప్పను.లేకపోతే ఈ రోజు మా యింట్లో కూడు, రేప్పొద్దున్న మిమ్మలను సందర్శించుకొంటే మీ యింట్లో మంచి నీళ్ళు పుట్టాలిగా!

    రిప్లయితొలగించండి
  36. అయ్యా,ఇచట(ఈ బ్లాగునందు) వశీ కరణ గుళికలు ఇచ్చువారును, పుచ్చుకొను వారును కూడా ఉందురు కదా? గుళికలనిచ్చు వారు ఎవరయినా పయి వ్యాఖ్యలను ఒప్పుకుందురా!మా సీతయ్యయునూ బయట నిటులే చెప్పుకొందురని నా యనుమానము.హ్మ్..అకటకటా.....ఏమి యీ విధి వైపరీత్యము!

    గురువు గారు, శాంతి-సౌ"భాగ్య నగరానికి" తరలినందుకు అభినందనలు. మిమ్మల్ని ప్రోత్సహించిన శాంతి గారు అభినందనీయులు...

    రిప్లయితొలగించండి
  37. ఎన్నెలా! వాస్తవములెపుడునూ కఠినముగానే ఉండును కామ్రేడ్!
    గుండె దిటవు చేసుకొనవలయును, తప్పదాయెను!

    రిప్లయితొలగించండి
  38. మూర్తిగారూ మీ చమత్కారం చదువుతూంటే నేను చదివిన జోకు గుర్తుకు వస్తోంది.
    మీ భార్యాభర్తలిద్దరూ అంత అన్యోన్యంగా ఉండడం వెనుక రహస్యం యేమిటండీ అని
    ఒకాయన్ని అడిగితే, ఆయన 'చాలా సింపులండీ మేమిద్దరం యెప్పుడూ ఒకే మాట మీద
    ఉంటాం. ఒకే బాటలో నడుస్తాం. ఆవిడ మాటకు నేనెప్పుడూ యెదురు చెప్పను' అన్నార్ట!

    రిప్లయితొలగించండి
  39. ఎన్నాళ్లో వేచితినిగ
    కన్నీళ్ళే కార్చలేక కలవర మాయెన్
    నన్నిక మార్చుము కన్నెగ
    నన్నా యని రాముఁ బిలిచె నవనిజ భక్తిన్

    అవనిజ = భూమినుంచి పుట్టినది (సీత, చెట్టు, శిల...)

    రిప్లయితొలగించండి
  40. పన్నుగ తమ్ముడు కేకిడి
    యన్నా! యని రాముఁ బిలిచె; నవనిజ భక్తిన్
    మిన్నగ భిక్షము పెట్టెను
    చెన్నుగ నమ్ముచు కపటిని చెజేతులతో

    రిప్లయితొలగించండి