26, జనవరి 2011, బుధవారం

ప్రహేళిక - 42

పేరు చెప్పండి.
సీ.
మృగలాంఛనుండుగ మింటనుండు నెవండు?
ఘనసార మను పేరు గలది యేది?
పుట్టలపైఁ జూడఁ బుట్టెడి గొడు గేది?
పాపడికై తల్లి పాడు నేది?
యవనీతనూజుఁడౌ హరివైరి యెవ్వఁడు?
పక్షులు చరియించు పథ మదేది?
రసము లూరించు భారతదేశ ఫలమేది?
యచ్చువేసెడి కార్య మనఁగ నేది?
తే.గీ.
యన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లందు మొదటి యక్షరముల నరసి చూడ
కాకతీయ సామ్రాజ్యపు ఘనతఁ గన్న
ముఖ్యపట్టణమై వెల్గు పుర మదేది?
కేవలం సమాధానాన్ని చెప్పకుండా, ఆ సమాధానం ఎలా వచ్చిందో వివరించండి.
షరా మామూలే ... మీ సమాధాన వ్యాఖ్యను బ్లాగులో పెట్టకుండా, నాకు మెయిల్ చెయ్యండి.
shankarkandi@gmail.com

2 కామెంట్‌లు:

  1. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీరు 100% సరియైన సమాధానంతో వివరించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    ఎప్పటిలాగే మీ సమాధానం నూటికి నూరు పాళ్ళూ సరైనది. అభినందనలు.

    మంత్రిప్రగడ బాల సుబ్రహ్మణ్యం గారూ,
    మీ సమాధానం 95% కరెక్ట్. రసరాజం తప్పు. ఆలోచించండి.

    రిప్లయితొలగించండి