24, జనవరి 2011, సోమవారం

వారాంతపు సమస్యా పూరణం - (ఉత్పలమాల యందు)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
ఉత్పలమాల యందు యతి 
యొప్పును నాల్గవ యక్షరమ్ముతో.
ఈ సమస్యను పంపించిన  
రామమోహన్ అందవోలు గారికి 
ధన్యవాదాలు

42 కామెంట్‌లు:

  1. సత్పథ సాహితీ ప్రియుల సంగతి యించుక గూడియున్నచో
    ఉత్పల మొప్పు పూజ నిడ నొక్కటి యొక్కటి పాద పద్మముల్
    మత్పతి! మంజులమ్ములవి మాధవ ! గైకొను మేల మాడకే
    ఉత్పల మాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో !

    గురువుగారూ సమస్య పాదములో తప్ప మిగిలిన పాదములలో యతి నాల్గవ అక్షరమ్ముతో కుదిరింది.

    రిప్లయితొలగించండి
  2. సత్ఫలితంబు లిచ్చు తగు సాధన జేసిన విద్యలన్నియున్
    నిత్యము దారి జూపునవి నిక్కము గల్గు సుఖంబు పెక్కులున్
    సత్యపు సారమంతయును చక్కగ మాలిక లందు గూర్చగా
    ఉత్పల మాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరంబు తో !!!

    రిప్లయితొలగించండి
  3. కిట్టించిన పద్యం. తప్పులున్న మన్నించగలరు.

    ఉత్పలమాల వృత్తమునఁ యుండును నాలుఁగు పాదముల్ ప్రసా
    దోత్పన ప్రాస నిక్కమగు తూగునుఁ గూర్చును సౌరభమ్ములై
    ఉత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో
    తత్పురతః సదా కలుగుతైదును యొక్కటి యక్కరంబాదిగాన్.

    నాల్గవ అక్షరంబుతో + తత్పురతః - అంటే ముందు; కలుగుత + ఐదును + యొక్కటి (ఐదు+ఒకటి = ఆరు) + అక్కరంబాదిగాన్

    రిప్లయితొలగించండి
  4. పీతామ్బర్ గారూ ప్రాసను సరి జూచుకోండి.

    రిప్లయితొలగించండి
  5. నరసింహ మూర్తి గారూ అద్భుతమైన పూరణ!
    మీరు కూడా పెద్ద కవుల సరసన చేరిపోయారు!

    రిప్లయితొలగించండి
  6. రవిగారూ, నేనూ కిట్టించినదే ! మిస్సన్నగారూ ధన్యవాదములు. నన్ను 'శిశువు 'గానే పరిగణించండి, కవిత్వములో. మరి నాకు కూడా కిశోర్ గారి లాగ 59 సంవత్స్సరాలు. కాని ఆయన స్పీడే స్పీడు !
    ఇది దుష్ట ప్రాస, మీరు ,మిగిలిన హేమాహేమీలు వ్రాస్తే చదివి ఆనందిస్తాము.

    గురువుగారూ శంకరుని ఢమ ఢమక్కులు డాలస్ లో బాగా మారుమ్రోగుతున్నాయని తెలుసుకొన్నాను. మీకు అభినందనలు!

    రిప్లయితొలగించండి
  7. మిస్సన్న గారు ధన్య వాదములు .రెండవ అక్షరమైన "త" ప్రాసగా భావించాను నాకు స్పష్టత లేక .గురువు గారి ఛందస్సు పాఠాలకోసం ఎదిరి చూస్తున్నాను.

    సత్ఫలితంబు లిచ్చు తగు సాధన జేసిన విద్యలన్నియున్
    తత్ఫలితంబు సారములు దప్పక నిచ్చు సుఖంబు పెక్కు,శ్రీ
    సత్పతి యైన శ్రీ హరికి సత్కవితాపద మాల లల్లగా
    ఉత్పల మాల యందు యతి యొప్పును నాల్గవయక్షరంబుతో!!!

    రిప్లయితొలగించండి
  8. 'ఉత్పలమాల'యన్న పదమొప్పగ వేసితి పాద మాదిలో -
    'ఆ','త్పు',‘మి',‘ఓ'యటన్న చతురక్షరముల్ గొని,అందు నేది ఆ
    'ఉత్పలమాల'పాదమున నొప్పునయా యతిగా నటన్న- ఆ
    ఉత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ అక్షరంబుతో!

    రిప్లయితొలగించండి
  9. నరసింహ మూర్తి గారూ చిన్న సవరణ. దుష్ట ప్రాస కాదు. దుష్కర ప్రాస. అప్పుతచ్చు సారీ అచ్చుతప్పు.
    నాకేమీ పాలు పోవడము లేదు. పూరించడం అససాధ్యమేమో అనిపిస్తోంది.
    పీతాంబర్ గారూ కడు చక్కని సవరణ.

    రిప్లయితొలగించండి
  10. మూర్తి గారు, మీరూ, కిశోర్ గారు నాకన్నా వయసులోనూ, అనుభవంలోనూ చాలా పెద్దవారు.

    ఈ సమస్యకు డాక్టర్ గారు వచ్చి మందేస్తే బావుంటుంది. ఇక గురువు గారు గరళమునే మింగినవారు, ఆయనకిది లెక్క కాదు. మహామహుల పూరణలు చూస్తే మనం ఏదైనా ఏరుకోవచ్చు.

    రిప్లయితొలగించండి
  11. మూర్తి గారూ ఈ మాటల భావాన్ని వివరించరా.

    గురువుగారూ శంకరుని ఢమ ఢమక్కులు డాలస్ లో బాగా మారుమ్రోగుతున్నాయని తెలుసుకొన్నాను. మీకు అభినందనలు!

    రిప్లయితొలగించండి
  12. మిస్సన్న గారూ, ధన్యవాదములు. దుష్కర అనే బుర్రలో అనుకొని 'దుష్ట ' అని వ్రాసా. ప్రిస్క్రిప్షన్లు రోజూ వ్రాసేవి. అక్కడ తప్పులు దొర్లవు లెండి. తెలుగు వ్రాయడమే తక్కువయింది.క్షమించండి.
    రవి గారూ నా బోటి వాడు పద్యము వ్రాయడమే వింత.వయస్సు కోసము, అనుభవము కోసము తొందఱ పడకండి.( ఎదగడానికెందుకురా తొందరా!) సంవత్సరాలు త్వరగా గడిచిపోతాయి.

    పీతాంబర్ గారూ యిప్పుడు మీ పూరణ చాలా బాగుంది. డా. అచార్య ఫణీంద్ర గారి పూరణ అద్భుతం.

    డాలస్ లో శంకరాభరణమును అనుసరించే భాషాభిమానులు పెరుగుతున్నారనే నా భావన !

    రిప్లయితొలగించండి
  13. మూర్తి గారూ ధన్యవాదాలు. యేది యేమైనప్పటికీ ఆచార్యులవారి పూరణ తలమానికం కాగా ఇప్పటివరకూ వచ్చిన పూరణలన్నీ కడు రమ్యమై అలరిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  14. ఉత్పలమాల లల్లమని ఊరక జెప్పరు శంకరార్యు లా
    ఉత్పలమాల కుండవలె నో యతి నాల్గవ యక్షరమ్ముతో;
    ఉత్పతనమ్ము నోపుదును, ఉత్పలమాలను ఎట్లు రాతు? నే
    యుత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో?

    రిప్లయితొలగించండి
  15. సత్పదమొంద చక్కగను ఛందము నేర్చిన వాడె మేటియౌ
    ఉత్పల మాలలో పదికినొప్పుఁ గదా యతి వాని విద్యలో,
    తత్పద విద్య లేక కవితా రసమందున వాని నేర్పులో
    ఉత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో.

    రిప్లయితొలగించండి
  16. మా డాలసు తెలుగు ప్రజలు సుజనులు :

    మత్పుర వాసులున్ వినక మానరు చెప్పగ నేను పద్యముల్
    సత్పథ మందు సాగెదరు సంశయ మేమియు లేక చిత్తమున్
    దత్పరులైన బద్య గతి దప్పినఁ బక్షము నిల్పి వేతురే
    'ఉత్పలమాల యందు యతి యొప్పున?' నాల్గవ యక్షరమ్ముతో !

    రిప్లయితొలగించండి
  17. సత్పురుషుండు శంకరుడు చక్కని బ్లాగున శిష్యకోటికిన్
    యుత్పలఛందమందు తమకుండిన ప్రఙ్ఞ పరీక్ష సేయగా
    యుత్పల పాదమందుననె యుక్తిగ నిచ్చె సమస్య నీ గతిన్
    ఉత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో.

    రిప్లయితొలగించండి
  18. సత్పురుషుల్, బుధుల్, గురులు, సత్కవితా ఘన రాజ్య సీమకున్
    సత్పరిపాలనమ్ము నిడు సత్కవిరాజులు చెప్పిరిట్లు 'యే
    యుత్పలమాల కైన యతి యొప్పు పదింట'ని, భావ్యమే యనన్
    'ఉత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో'?

    రిప్లయితొలగించండి
  19. కవి మిత్రు లందరికీ వందన సహస్రాలు.
    వారాంతపు సమస్యా పూరణానికి ఇంతటి ప్రతిస్పందనను నేను ఊహించలేదు. నాకు ఈ రోజు పండుగే. వృత్తరచనలోను ఇందరు ఆసక్తి చూపుతున్నందుకు ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మా ఇంటికి ఇంటర్ నెట్ కనెక్షన్ రాలేదు. అది రాగానే బ్లాగులోని అన్ని శీర్షికలను పునరుద్ధరిస్తాను. చందస్సు పాఠాలూ ప్రారంభిస్తాను.

    రిప్లయితొలగించండి
  20. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చక్కని పద్యం చెప్పారు. అభినందనలు. ప్రతి పాదంలో నాల్గవ అక్షరానికి యతిమైత్రి కూర్చిన విధానం ప్రశంసనీయం.
    నా డమరుకం నుండి వెలువడే ఢమఢక్కులు మీ పద్యాలే కదా ఆ క్రెడిట్ అంతా మీ కవి మిత్రులదే. అందుకు "శంకరాభరణం"లో పద్య నాదాలు వినిపిస్తున్న మీరంతా అభినందనీయులు. నేను కేవలం ఒక "చానెల్"ను మాత్రమే. ధన్యవాదాలు.
    మీ రెండవ పద్యం కూడ ప్రశస్తంగా ఉంది. నా బ్లాగును చూస్తూ, మీ పద్యాలను విని ఆనందిస్తున్న డాలస్ ప్రజలకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. మంద పీతాంబర్ గారూ,
    వృత్త రచనకు బాగానే శ్రమించారు. మీకు నా ప్రోత్సాహం, సహకారం ఎప్పుడూ ఉంటుంది. సవరించిన పద్యంలోను ప్రాసదోషం ఉంది. సంయుక్తాక్షర ప్రాసలోను హల్సామ్యం అవసరం. ప, ఫ లకు ప్రాస వేయరాదు.

    రిప్లయితొలగించండి
  22. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    మీ పూరణ చదివి హాయిగా నవ్వుకున్నాను. పూరణలోని చమత్కారాన్ని మనసారా ఆస్వాదించాను. వృత్తరచనలో మీరు ఆచార్యులు. మీకు తిరుగు లేదు. ఇంత మంచి పూరణ అందించి "శంకరాభరణం" శోభను ఇనుమడింప జేసారు. ధన్యవాదాలు. మీ స్ఫూర్తితో ఔత్సాహిక కవి మిత్రులు వృత్త రచన పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నారు.

    రిప్లయితొలగించండి
  23. రవి గారూ,
    పూర్వుల సంఖ్యాశాస్త్రాన్ని గుర్తుకు తెచ్చే పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
    అయితే "వృత్తమునఁ యుండును" అన్నచోట "వృత్తమున నుండును" అనాలి. "అక్కరం బాదిగాన్" అనేది "అక్కరంబునన్" అంటే గణదోషం తొలగిపోతుంది.

    రిప్లయితొలగించండి
  24. హరి గారూ,
    మీ పూరణ కడు ప్రశంసనీయం. అభినందనలు.

    జిగురు సత్యనారాయణ గారూ,
    నిజమే కదా! శాస్త్రజ్ఞానము లేని వనికి ఉత్పలమాలలో యతిస్థనం పదే. బాగుంది మీ పూరణ. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    సమస్యను పంపిన "అందవోలు రామమోహన్" గారిదే ఆ క్రెడిట్ అంతా.
    మీ రెండు పద్యాలు బాగున్నాయి. వృత్త రచనలోను మీది అందె వేసిన చేయి అన్నది అందరికీ తెలిసిందే. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. అందరికీ వందనములు
    అందరిపూరణలూ
    అద్భుతముగా
    అలరారుచున్నవి.


    01)
    ______________________________________________

    ఉత్పలమాల యందు యతి - యొప్పును యెన్నవ యక్షరమ్ముతో ?
    సత్పధ హీనుడై , చనెడు - ఛాత్రుని , నోజొక ప్రశ్న వేయగా
    నుత్పధముం జరించు నత - డోడుచు నొజ్జను జేరి, యిట్లనెన్
    ఉత్పల మాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో !
    _______________________________________________

    సత్పధము = మంచి దారి
    చాత్రుడు =శిష్యుడు
    ఓజ = ఒజ్జ = గురువు
    ఉత్పధము = కాని దారి
    ఓడుచు = సందేహించుచు
    ______________________________________________

    రిప్లయితొలగించండి
  26. సత్పథ దర్శియై వరలు ఛందమిదే ! దశమాక్షరంబుతో
    నుత్పలమాల యందు యతి యొప్పును ! నాల్గవ అక్షరమ్ముతో
    నుత్పతనంబులన్ జరుపనోపు గదా ! ' హ ' ' త ' ' క ' ల్ విధింప ; జా
    గ్రత్పరిణామముల్ తెలియగావలె సర్వ కవీశ్వరోత్తముల్ !!!

    మనకు మంచి మార్గదర్శియై పేర్గన్న ఛందస్సు యీ ఉత్పలమాలయే ! ఇందులో దశమాక్షరంబుతో యతి యొప్పును ; కానీ నాల్గింట , హ అనే అక్షరాన్ని కానీ, త అనే అక్షరాన్ని కానీ , క అనే అక్షరాన్ని కానీ విధించినచో ఒక వ్యక్తి యొక్క మహా పతనాన్ని శాసించవచ్చు ( విషమాక్షర ప్రయోగాన్ని వినే ఉంటారు కదా ! ) ఈ విధమైన పరిణామాలన్నింటినీ జాగరూకతతో సర్వ కవీశ్వరులూ యెరుగగావలె !!!

    రిప్లయితొలగించండి
  27. డా.విష్ణు నందన్ గారూ నమస్కారములు.
    నా బోటి మిడిమిడి ఙ్ఞానము గల అల్పుల కుపయుక్తమయే
    విషయాన్ని మనోహరంగా చెప్పారు. కృతఙ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  28. వసంత్ కిశోర్ గారూ,
    చమత్కార భరితమైన పూరణ. అభినందనలు.

    డా. విష్ణు నందన్ గారూ,
    విషయ పరిజ్ఞానాన్ని పెంచే అంశంతో పూరణను మెప్పించారు. అద్భుతమైన పూరణ. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. డా. విష్ణునందన్ గారు!
    మీరు ఆధునిక శాస్త్రాధ్యయనం చేసిన వైద్యులు. మీరు మరీ అంత మూఢ విశ్వాసాల వ్యాప్తి చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. మీకది తగదేమో!

    రిప్లయితొలగించండి
  30. గోలి హనుమచ్ఛాస్త్రి.

    ఉత్పల,మాల, స్నేహితులు యొక్కటిజేరి పఠించుచుండె తెల్గునున్
    ఉత్పల లక్షణంబులను యుండుము వచ్చని మాల చెప్పె యా
    ఉత్పలమాల పద్యమున యుండును నాలుగు పాదముల్ మరిన్
    ఉత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో.

    రిప్లయితొలగించండి
  31. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఉత్పలమాలను విడగొట్టి ఉత్పల, మాల అనే స్నేహితురాళ్ళను చేసిన ఆలోచన ప్రశస్తంగా ఉంది. పద్యంలో కొన్ని లోపాలున్నాయి. సమయాభావం వల్ల ఇప్పుడు సవరించలేకున్నాను. మరోసారి వీలు చూసుకొని సవరిస్తాను. మీరు ఇంతకంటే మంచి వృత్తాలు వ్రాయగలరు. మీకు నా అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. శంకరయ్యగారూ..మీఅభినందనలకు,సూచనలకు ధన్యవాదములు.

    గోలి హనుమచ్ఛాస్త్రి

    రిప్లయితొలగించండి
  33. ఉత్పల,మాల, స్నేహితులె యొక్కటిజేరి పఠించుచుండె తెల్గునే
    ఉత్పల లక్షణంబులనె యొప్పుగ జెప్పెద నంచు మాలతో
    నుత్పల జెప్పె పద్యమున నుండును నాలుగు పాదముల్ మరిన్
    ఉత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో.

    రిప్లయితొలగించండి
  34. హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీరు సవరించిన తర్వాతకూడా కొన్ని లోపాలు...
    ‘ఒక్కటిజేరి’ని ‘ఒక్కెడ జేరి’ అనాలనుకుంటాను.
    మొదటి పాదంలో గణదోషం. ‘పఠించుచుండె తెల్గునే’ అన్నచోట ‘పఠించుచుండగా/నుత్పల ...’ అనడం బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  35. తత్పరుడై గురూత్తముడు తప్పుగ వ్రాసెను కైపదమ్మిటన్:👇
    "ఉత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో"
    తత్పరమౌచు మార్చితిని తప్పును దిద్దుచు నివ్విధంబుగన్:👇
    "ఉత్పలమాల యందు యతి యొప్పదు నాల్గవ యక్షరమ్ముతో"

    రిప్లయితొలగించండి