29, జనవరి 2011, శనివారం

వారాంతపు సమస్యా పూరణం - (బారులు లేనిచో కవులు)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
బారులు లేనిచో కవులు బావురు మందురు లోకమందునన్.
ఈ సమస్యను పంపించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

  1. గోలి హనుమచ్ఛాస్త్రి

    ఆ రవి లేక ప్రాణితతి, ఔషధలేమిని రోగులున్,సదా
    చారములేక వైదికులు,స్తన్యము లేనిచొ చంటిపాపలా
    హారములేక బీదజను,లాదరణిచ్చెడి మంచి రాజద
    ర్బారులు లెనిచోకవులు బావురుమందురు లోకమందునన్.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    "స్తన్యము లేనిచొ" అన్నారు. "చో"ను హ్రస్వం చేయరాదు. "స్తన్యము లేకను" అంటే సరి!
    "ఆదరణిచ్చెడి" కూడా "ఆదర మిచ్చెడి" అయితే బాగుంటుంది.
    "రాజ దర్బారులు లేనిచో" అన్నచోట "లెనిచో" అని టైపయింది.

    రిప్లయితొలగించండి
  3. హారము, లగ్రహారములు, హారతులున్, కనకాభిషేకముల్
    కోరరు నేటి కాలమున, కొంచెము చూపి రసేంగితఙ్ఞతన్
    "వారెవ! మేలు! బాగు! శహబాష్! భళా!" యను మెచ్చుకోళ్ళపుం-
    బారులు లేనిచో కవులు బావురు మందురు లోకమందునన్.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. ఏరులు గల్గు ఊరులును, ఎఱ్ఱగులాబులు పూయు తోటయున్,
    వీరులు గల్గు దేశములు ,వీనుల మీటెడు తెల్గుపాట,లా
    హారము గూర్చుచున్ ,పసిడి హారములిచ్చెడు మేటి రాజ ద
    ర్బారులు లేనిచో కవులు బావురు మందురు లోకమందునన్!

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు.
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి.

    01)
    ____________________________________________


    కూరకు తగ్గ కారమును; - కోరిక బెంచెడు కందిపప్పుయున్;
    బూరెలు ,గారె , లప్పడము ; - భూమిని భోజన మందు ముఖ్యమౌ
    క్షారము ; పాయసంబు; మమ - కారపు వడ్డన ; విందునందు సాం
    బారులు ; లేనిచో కవులు - బావురు మందురు లోకమందునన్ ;

    రిప్లయితొలగించండి
  7. కోరిన ఛంద మందుగణకూటము, ప్రాస లు పాకముల్, వళుల్,
    సారెకు మేను దాకు రసశైలులు, రేతులు, శయ్యతోనలమ్
    కారము లల్ల మల్లెల ను గాదను శ్రీమతి నవ్వులిన్ని సం
    బారులు లేనిచో కవులు బావురు మందురు లోకమందునన్.

    రిప్లయితొలగించండి
  8. శంకరయ్య గారూ
    మీరిచ్చిన సూచనలు, సవరణలకు ధన్యవాదములు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  9. నా మునుపటి పూరణలోని దోషమును సవరించుకొన్నాను.

    హారము, లగ్రహారములు, హారతులున్, కనకాభిషేకముల్
    కోరరు నేటి కాలమున, కొంచెము చూపి రసేంగితఙ్ఞతన్
    "వారెవ! మేలు! బాగు! శహభాషు! భళా!" యను మెచ్చుకోళ్ళపుం-
    బారులు లేనిచో కవులు బావురు మందురు లోకమందునన్.

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారూ,
    వారెవ! మేలు! బాగు! శహబాష్! భళా! భేష్! పసందైన పూరణ. అభినందనలు.

    రవి గారూ,
    పూరణ బాగుంది. కాని కొన్ని చిన్న లోపాలున్నాయి. సమయం చూసుకొని సవరిస్తాను.

    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    నోరూరుతున్నది మీ మెనూ చూసాక. చక్కని పూరణ చేసారు. అభినందనలు.

    ఎఱ్ఱాప్రగడ రామ్మూర్తి గారూ,
    "నిరుపహతి స్థలంబు .... " పద్యాన్ని గుర్తుకు తెచ్చింది మీ పూరణ. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. రామ్మూర్తి గారూ మీ పూరణ ఘుమఘుమలాడుతోంది.

    రిప్లయితొలగించండి
  12. కూరిచి దివ్యమైన పద గుంఫనముల్, రస పూర్ణ భావముల్,
    ధారలుగా రచించి కవితల్ వినిపింప కవుల్ - వినన్వలెన్
    వారి కవిత్వమున్ రసిక వర్యులు పెక్కురు వచ్చి, తీర్చియున్
    బారులు! లేనిచో కవులు బావురుమందురు లోకమందునన్!

    రిప్లయితొలగించండి
  13. వరెవాహ్ ! మిత్రుల అందఱి పూరణలు బ్రహ్మాండముగా ఉన్నాయి ! డా.ఆచార్య ఫణీంద్ర గారూ చాలా అద్భుతంగా ఉంది మీ పద్యము. పద్యాలు చదివి ఆనందించే వాళ్ళము బోలెడు మందిమి ఉన్నాము.

    రిప్లయితొలగించండి
  14. రాజ దర్బారులు,మెచ్చుకోళ్ళ పుంబారులు,సాంబారులు, ప్రేక్షక బారుల ,పూరణలు అద్భుతంగా అలరించాయి.
    మరి నాకు నెట్ బారులు మిగిలాయి .

    వారలు దివ్య కీర్తనలు వ్రాసిరి భక్తిని దాళ పత్రముల్
    తీరుగ ముద్రితమ్ములయె తియ్యని గైతలు పుస్తకమ్ములన్
    మీరిన యంత్ర జంత్రముల మేలయె కూర్పులు, జాలకమ్ము లా
    బారులు లేనిచో కవులు బావురు మందురు లోక మందుటన్ !

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. కోరరు డబ్బు దస్కములు కోరరు ఇంపగు విందు బోనముల్
    కోరరు రాజ్య సంపదలు కోరరు మెత్తని పట్టు వస్త్రముల్
    కోరరు మద్య మాంసములు కోరెద రొక్కటి మెచ్చుకోలు కై
    బారులు; లేనిచో కవులు బావురు మందురు లోకమందునన్.

    రిప్లయితొలగించండి
  17. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    ఉచిత పదగుంఫనంతో, మనోహర భావంతో, చక్కని ధారతో మీ పూరణ అలరిస్తూ ఔత్సాహిక కవి మిత్రులకు మార్గదర్శకంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    పద్యం ధారాశుద్ధితో సాఫీగా నడిచింది. వృత్త రచన కూడ మీకు పట్టుబడింది. అభినందనలు.

    హరి గారూ,
    నల్లేరుపై బండిలా సాపీగా సాగింది మీ పద్యం. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. బారులు బారులై జనులు బాగని మెచ్చగ కావ్య రాజమున్
    ధారణఁ జేసి శ్రోతలు సుధారస వాహిణి వోలె పోల్చినన్
    చేరును కీర్తి కాంతలిక చెచ్చెర, మారెను నాటి కాలముల్
    బారులు లేనిచో కవులు బావురు మందురు లోకమందునన్.

    రిప్లయితొలగించండి
  20. కోరి ప్రశంస పత్రములు కొల్లలు కొల్లలు భూషణమ్ములున్
    దూరుచు రాజకీయముల దుష్టపు బుద్ధుల వైరి పక్షముల్
    చేరిచి రంకు పాటలను చిత్రజగత్తున దుడ్డుకోసమై
    బారులు లేనిచో కవులు బావురు మందురు లోకమందునన్

    రిప్లయితొలగించండి