23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2152 (పద్మవ్యూహమున గెల్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుఁడే"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
లేదా...
"ధరణీశా! యభిమన్యుఁ డుద్ధతినిఁ బద్మవ్యూహముం గెల్చెఁ బో"
('పద్మవ్యూహమునందు...' అని ప్రారంభించి శార్దూలపాదం ఇవ్వవచ్చు
కాని మిత్రులను రెండు విధాలుగా ఇబ్బంది పెట్టడం బాగుండ దనుకున్నాను)

93 కామెంట్‌లు: 1. పద్మ మగడు, విజయుడనియె
  పద్మ ! వ్యూహమున గెల్చె , ఫల్గుణ సుతుఁడే
  పద్మా యవార్డును గెలిచె
  గద్మా యించి తన బెండ్లి గప్పున జేతున్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   బాగుంది మీ పూరణ.
   కాని 'పద్మ!' అని సంబోధన వల్ల 'ద్మ' లఘువై గణదోషం ఏర్పడుతున్నది.

   తొలగించండి
 2. సరిలేరెవ్వరు పార్థ నందనునకున్ సంగ్రామ నైపుణ్యతన్
  మరి రారాజును పాఱెనంగ విభుడున్ మారాడ లేడయ్యె నా
  గురుఁడే కానగ లేడు దారి గెలువన్, కూలెన్ కుతంత్రంబునన్
  ధరణీశా! యభిమన్యుఁ డుద్ధతినిఁ బద్మవ్యూహముం గెల్చెఁ బో!!

  రిప్లయితొలగించండి
 3. పద్మాలయ మండపమున
  పద్మిని తోపరి ణయమని బహు మోదమునన్
  పద్మాక్షి సతియౌ గావున
  పద్మ వ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుఁడే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   పద్యం పూర్తి అయిందనిపించారు.
   మొదటి మూడు పాదాలకు, చివరి పాదంతో అన్వయం?
   మూడవ పాదంలో గణదోషం. 'పద్మాక్షి సతియగు కనుక' అందామా?

   తొలగించండి
  2. నిజమె కష్టపడి కిట్టించాను .అందుకే ఇక అమ్మో ! అసలే మత్తేభం .
   ధన్య వాదములు

   తొలగించండి
 4. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పద్మవ్యూహము చొచ్చిలి
  పద్మాసనునివలె వెలిగి పగరుల నికృతిన్
  పద్మాక్షునిలో శివమై
  పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుడే.

  రిప్లయితొలగించండి
 5. క్రొవ్విడి వెంకట రాజారావు:

  దొరయై ద్రోణుని తమ్మిమొగ్గరమునం దూరి విడంగమ్ముతో
  అరివర్గమ్మును జెండుచున్ వెలుగురేడవ్వంగ మోసమ్ముతో
  కురురాజాధములందరున్ కసుగుతో గూలార్చినా నేమిలే
  ధరణీశా యభిమన్యుడుధ్దతిని బద్మవ్యూహముం గెల్చెబో.
  ( తమ్మిమొగ్గరము= పద్మవ్యూహము)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మత్తేభం మొదటి పాదంలో 'ధూరి' అన్నచోట గణదోషం. 'దూరెన్' అంటే సరి!

   తొలగించండి
 6. కురు సైన్యంబులు ద్రోణు సంరచనచే ఘోరాహవంబందు తా
  మురులీలన్నిలువంగ గూల్చుటకునై యుత్సాహి యైధ్యానత
  త్పరుడై చేరుట విన్ననొక్కరుడనెన్ ధైర్యాన్వితుండాత డో
  ధరణీశా! యభిమన్యు డుద్ధతిని బద్మవ్యూహముం గెల్చెబో.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. ఛద్మముతో పన్నిన యా
  పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుడే!
  యిధ్మంబయి పోయి వ్యూహ
  సద్మంబున గూలెనచట శౌర్యము తోడన్!

  ఛద్మము=మోసము
  ఇధ్మము=చిదుగు
  సద్మము=గృహము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శిష్ట్లా శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "... యిధ్మంబయి వ్యూహంబను" అనండి.

   తొలగించండి
  2. అవును గురువు గారూ గమనించలేదు.... సవరిస్తాను.... ధన్యవాదములు

   తొలగించండి
  3. సవరించినది:

   ఛద్మముతో పన్నిన యా
   పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుడే!
   యిధ్మంబయి వ్యూహంబను
   సద్మంబున గూలెనచట శౌర్యము తోడన్!

   ఛద్మము=మోసము
   ఇధ్మము=చిదుగు
   సద్మము=గృహము

   తొలగించండి
  4. అవును గురువు గారూ గమనించలేదు.... సవరిస్తాను.... ధన్యవాదములు

   తొలగించండి
 8. P.Satyanarayana
  పద్మము నాభిన గల యా
  పద్మాక్షుని కృపయె సిరులు పాధులు సదస
  ద్విద్మహు డల్ప వయస్కుడె
  పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుడే!
  P.Satyanarayana
  మరణంబెంతటి మోసకారియొ జుమీ!మాన్యుండు రామాన్జు న
  క్కరణిన్ గొన్నది యల్ప ప్రాణియె?! గణాంకారాతికిన్ రాజు నే
  సరణిన్ నెమ్మది గొందు మెట్టులిలలో?చావే రణంబైన నో
  ధరణీశా!............

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ మొదటి పూరణ బాగున్నది. 'విద్మహుడు' ?
   రెండవ పూరణ అర్థం కాలేదు. రామానుజు.. అనవలసిన చోట రామాన్జు.. అన్నారు. 'మెట్టు లిలలో'?

   తొలగించండి
 9. మ. పరికింపంగను యుద్ధనీతి విధిగన్ పాటింప వీరుండగున్
  అరులౌ కౌరవ దుష్ట వ్యూహ కతనన్నాతండు కూలెన్ గదా !
  సురలోకమ్మును బొందెగా విజయుడై చూపర్ల మెప్పించియున్
  హరియే పల్కెను ధర్మరాజు గనుచున్ హర్సింప వారందరున్
  ధరణీశా ! యభిమన్యుడుద్ధతిని బద్మవ్యూహముంగెల్చెబో !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దుష్టవ్యూహ' మన్నపుడు ష్ట గురువై గణదోషం.

   తొలగించండి
 10. ఆర్యా ! నా పూరణకు కొంత వివరణ అవసరం. ఈ పూరణ సాపేక్షమే కానీ నిరపేక్షం కాదు.కేవలం ఆసందర్భానికే పరిమితం.విద్యానిలయమైన తిరుపతిలో అనేక ఒడుదుడుకుల నెదుర్కొని ఒక శతావధాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా, దిగ్విజయంగా నిర్వ హించిన ఒక సాహితీ సంస్థకు కార్యదర్శి పేరు ఫల్గుణ కుమార్ కావటంతో ఉద్దేశ పూర్వకంగా మామిత్రుడీ సమస్యని కల్పించటం జరిగింది.(1996 ప్రాంతంలో).అవధాని భారతకథా పరంగానే పూరించినాడు.నా పూరణ.
  కం. పద్మాసను సతి వాణికి
  సద్మమ్ముగ జేసి నేడు చదువుల పురమున్
  పద్మము రేకుల బోలిన
  పద్మ వ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుడే .
  (నూరుగురు పృఛ్ఛకులు శతపత్రాలైనారనుట)

  రిప్లయితొలగించండి
 11. శార్దూల పద్యంలో చిన్న (టైపు) సవరణ : "హర్షింప" అనిఉండాలి.

  రిప్లయితొలగించండి
 12. మరల సవరణ: అది మత్తేభం కదా !(టైపు పొరబాటుకాదు, ఏమరుపాటు)

  రిప్లయితొలగించండి
 13. పద్మారావ్ మాయబ్బాయ్
  బద్మాషులు కొంతమంది బాధలు వెట్టన్
  ఛద్మమునే చేదించుచు
  పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ!సుతుఁడే.

  రిప్లయితొలగించండి
 14. నిరతాభ్యాసుడు విశ్వనాథు డవురా! నిష్ఠాగరిష్ఠాత్ముడై
  ధరనత్యున్నతులై వెలుంగు ఘనులన్ దాటంగ వ్యూహక్రియన్
  భరతోర్విం జదరంగపుం బ్రియులిటుల్ భావించి యన్నార లో
  ధరణీశా! యభిమన్యు డుద్ధతిని బద్మవ్యూహముం గెల్చెబో
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 15. ఛద్మము చేసిరి బాలునిఁ
  బద్మదళాక్ష భగినీప్రవర పుత్రు ననిన్
  సద్మాక్షయము నెఱి నతడు
  పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుఁడే

  [సద్మాక్షయము = అక్షయ ధామము; నెఱి = పరాక్రమము]


  వరదానప్రతి భోగ్ర సైంధవు డటన్ వారింప భీమాదులం
  గురు సైన్యాధిప సత్కృతాహవము సక్రోధంబ ఛేదించియున్
  పరవీరాక్రమ ణావరోధము నురుప్రావీణ్యతం జేయగన్
  ధరణీశా! యభిమన్యుఁ డుద్ధతినిఁ బద్మవ్యూహముం గెల్చెఁ బో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు‌గారూ నమస్సులు. మీ పూరణలు అద్భుతంగా వున్నాయి.

   తొలగించండి
  2. శర్మ గారు నమస్కారములు. మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

   తొలగించండి
  3. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   అభిమన్యుని 'పద్మదళాక్ష భగినీ ప్రవరసుతు' డనడం బాగుంది.
   కురుసైన్యాధిపుని 'దుష్కృతావహము' అంటే బాగుండేదేమో? వ్యూహం మంచిదే, కాని అభిమన్యుని ఒంటరిగా, నిరాయుధుణ్ణి చంపడం దుష్కృతం అని నా అభిప్రాయం.

   తొలగించండి
  4. కామేశ్వర రావు‌గారూ నమస్సులు. మీ పూరణలు అద్భుతంగా వున్నాయి.

   తొలగించండి
  5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సూచన సందర్భోచితముగా నున్నది. ధన్యవాదములు. సవరించిన పూరణ తిలకించ గోర్తాను.

   వరదానప్రతి భోగ్ర సైంధవు డటన్ వారింప భీమాదులం
   గురు సైన్యాధిప దుష్కృతాహవము సక్రోధంబ ఛేదించియున్
   పరవీరాక్రమ ణావరోధము నురుప్రావీణ్యతం జేయగన్
   ధరణీశా! యభిమన్యుఁ డుద్ధతినిఁ బద్మవ్యూహముం గెల్చెఁ బో

   తొలగించండి
 16. 1.పద్మాక్షుని మేనల్లుడు
  పద్మము పేరిట నెఱపిన పన్నాగమునన్
  ఛద్మమున గూలె, నిజముగ
  పద్మ వ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుడే!

  2.'పద్మ 'ముల రాజకీయము
  పద్మాకర, వలదని పిత ఫల్గుణు డనగా
  పద్మశ్రీ బిరుదు విడక
  పద్మ వ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుడే!
  (అప్పట్లో పద్మ బిరుదులను వెనక్కి ఇచ్చేయాలంటూ కొందరు భావించిన అంశం ప్రచార సాధనాల్లో బహుళంగా విహరించింది. ఈ రాజకీయాలు మనకొద్దంటు చెప్పిన తండ్రి ఫల్గుణుని మాటలు విని కొడుకు పద్మాకర్ తన పద్మశ్రీ బిరుదును త్యజించక ఆ రాజకీయ పద్మ వ్యూహంలో చిక్కుకో లేదు అని నా భావం.)

  రిప్లయితొలగించండి
 17. మరణమ్మున్ గొని యుద్ధమందునను దుర్మార్గంపుదుశ్చర్యతో
  విరువన్ రధమ్ము చంపి ఘోటకములన్ వేగమ్ముగా కౌరవుల్
  ధరణీశా! యభిమన్యు డుద్ధతిని బద్మవ్యూహముం గెల్చెబో
  సరిలేరెవ్వరు వానికంచు పొగడన్ స్వర్గమ్మునన్ దేవతల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ గారూ,
   విరువన్ తేరు పతాక చాప యుగమున్ వేగమ్ముగా కౌరవుల్
   అంటే బాగుంటుందేమో పరిశీలించండి.

   తొలగించండి
  2. ఫణి కుమార్ తాతా గారూ - మీ సవరణకు ధన్యవాదములు.

   తొలగించండి
  3. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఫణికుమార్ గారి సవరణ గణదోషాన్ని తొలగించింది.
   'దుశ్చర్య' అంటేనే దుర్మార్గపు చర్య, మళ్ళీ దుర్మార్గంపు దుశ్చర్య..? 'దుర్మార్గంపు కార్యమ్ముతో' అందామా?

   తొలగించండి
 18. గురువుగారు,
  బడుగు సంజ్ఞల కతమున బాధపడుచు
  నంతరికజాల జాలమునందు జిక్కి
  గతదివసపు బూరణల జత పరచక
  నేడు బంపుచు కృపజూడ వేడుచుంటి
  బడుగుసంజ్ఞలు: వీక్ సిగ్నల్స్
  అంతరికజాలము: ఇంటర్నెట్
  శార్దూలమాలిక
  విడ్డూరంబుగ లచ్చివీడ భువికిన్విచ్చేసి వల్మకము
  న్నడ్డంబుంచి విధాత ధేనువుగ పాలన్ద్రాగుచున్నిల్చి యే
  కడ్డాయంబులు లేక దిర్గుచును యాకాసాధిపున్బట్టిఁజేపట్టగా
  దుడ్డేలేక రుణంబుగైకొని గడున్దోరంబుగానైనయా
  వడ్డీ కట్టగ డబ్బు లేనియతడే వర్షించునైశ్వర్యముల్
  అవిరళ బక్తి నన్నమయ నద్భుత సుస్వర రాగధారలన్
  మివులపవిత్ర భావనల మిశ్రమొనర్చి రచించి పాడుచున్
  భువిని దెలుంగు వాఙ్మయమభ్యుదయమొందగ నెంచి యారమా
  ధవుని పదమ్ములన్గొలిచి ధాన్యత గాంచెనతండు వింటిరే

  పద్మప్రియోగ్రతఁ దొలుత
  పద్మవ్యూహమునగెల్చె ఫల్గుణ సుతుడే
  పద్మోద్భవ లిఖితంబున
  ఛద్మవశంబున లయించె శాశ్వత కీర్తిన్


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.
   'అంతరికజాలము'ను 'ఆంతరికజాలము' అనండి.
   'వడ్డీ కట్టగ...' పూరణలో వల్మీకమునకు వల్మకము అని టైపాటు. మూడవపాదం చివర గణదోషం. '...దిర్గుచును నాకాశాధిపున్ బట్టకై' అనండి.
   'ధవుని పదమ్ములన్..' పూరణలో 'భక్తి నన్నమయ యద్భుత..' అనండి. మూడవ పాదంలో గణదోషం. 'భువిని దెలుంగు వాఙ్మయముఁ బూత మొనర్చగ నెంచి...' అందామా?

   తొలగించండి
 19. ఛద్మంబుగ కురుసైన్యము
  పద్మవ్యూహమున గెల్చె, ఫల్గుణ సుతుఁడే
  సద్మమనఁ బరాక్రమమున
  ముద్మయుడై నాకమేగి భువనముఁ గెల్చెన్ ||

  కురుసైన్యమ్మది ఘోరఘాతుకకుయుక్తుల్ పన్నగా చేరెతాన్
  ధరణీశా! యభిమన్యుఁ డుద్ధతినిఁ బద్మవ్యూహముం, గెల్చెఁ బో
  మరి దుర్యోధనుసైన్యమే, తలచగా మాన్యాత్ముడైయర్భకుం
  డరుదౌ కీర్తి గడించె వీరులకతం
  డాదర్శవంతుండునై ||


  రిప్లయితొలగించండి
 20. నరుడే లేడనెఱంగియే కుటిల పన్నాగమ్ముతో శత్రువుల్
  గురువౌ ద్రోణుడు పన్నినట్టి వల సంకోచింపకన్ ద్రుంచుచు
  న్నరి సైన్యమ్మును గూల్చవెళ్ళియనిలో నాదిత్యుడై వెల్గె నో
  ధరణీశా! యభిమన్యుడుద్ధతిని బద్మవ్యూహమున్ గెల్చెబో

  ఛద్మముతో కురు సేనలు
  పద్మవ్యూహమున గెల్చె పార్థుని సుతుడే
  పద్మాక్షుని సోదరిసుతు
  న్నిధ్మము వలె గూల్చిరనిన నేమది తెలుపన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'లేడని+ఎఱింగి' అన్నపుడు యడాగమం వస్తుంది. 'వెళ్ళి' అనడం వ్యావహారికం. 'పోయి' అనవచ్చు.
   రెండవ పూరణ మూడవ పాదం చివర గణదోషం. 'సుతు। నిధ్మము..' అనవచ్చు.

   తొలగించండి
 21. శరసంధానము చేత శత్రుతతినిన్ సంహార క్రీడాక్రియన్
  నరునిన్ మీఱెడి వీరుడంచు కురు సేనల్ పాఱ యుద్ధంబునన్
  విరథుండై రణభూమి నిల్చి సలిపెన్ విఖ్యాత పోరాటమున్
  ధరణీశా! యభిమన్యుఁ డుద్ధతినిఁ బద్మవ్యూహముం గెల్చెఁ బో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శరసంధాన కళా ప్రపూర్ణుడగుచున్ సంహార కేళీక్రియన్

   తొలగించండి
  2. ఫణికుమార్ తాతా గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శరసంధాన..' ప్రారంభం ఏదో పద్యాన్ని గుర్తు చేస్తున్నది. జ్ఞాపకం రావడం లేదు.

   తొలగించండి
  3. శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులుం గల్గి దు
   ర్భర షండత్వ బిలప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్ మానినన్
   నర సింహ క్షితిమండ లేశ్వరుల నెన్నన్వచ్చు నీసాటిగా
   నరసింహ క్షితిమండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా

   మీరు చెప్పినది చూసి గూగుల్ లోవెతికితే ఈ పద్యం దొరికింది గురువుగారూ

   తొలగించండి
  4. వెంటనే మంచి పట్టే పట్టావు మనవడా అని పెద్దన గారు తెనాలి రామకృష్ణసినిమాలో అన్న మాట కూడా గుర్తుకు వచ్చింది. ధన్యవాదములు గురువుగారూ.

   తొలగించండి
  5. ఇంత గొప్ప పద్యం గుర్తుకు రానందుకు సిగ్గు పడుతున్నాను. వృద్ధాప్యం మతిమరుపును పెంచుతున్నట్టుంది. గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.

   తొలగించండి
  6. గురువుగారూ, మీరు అంత పెద్ద మాట అనవలదు. నిజానికి శరసంధాన ప్రారంభంతో పద్యం ఉందని గుర్తు చేసినది మీరే. 38 సంవత్సరాల వయసులోనే నాకు అది గుర్తు రాలేదు.

   మీరు అలా అంటే నేను మళ్ళీ ఆ పద్యాన్ని పోస్టు చెయ్యడం నాకు బాధను కకలిగిస్తోంది.

   మీ వంటి పెద్దల ఆశీర్వాదమే మహద్భాగ్యం అని నేను భావిస్తున్నాను. గురువుల పాదపద్మములకు నమస్సుమాంజలి.

   తొలగించండి
 22. ధరణీశా|యభిమన్యుడుద్దతిని బద్మవ్యూహముంగెల్చెబో
  పరుగుల్ దీసెడి పౌరుషత్వమున కోపంబందు యుద్డంబునన్
  కరమున్ బట్టియు కాటికంపెగద|లౌక్యంబెన్నుటౌ కౌరవుల్
  పరివారంబులు జూచుచుండ యముడే బాలుండు|ధైర్యంబునన్.
  2.పద్మాసనుండు జూడగ
  పద్మాసనుని లిఖితమును పట్టును గూర్చన్
  పద్మా|”వ్యుహమునవెడల
  పద్మ వ్యూహమున గెల్చె”|పల్గుణసుతుడే| {పద్మాసనుడు=సూర్యుడు;పద్మాసనుడు=బ్రహ్మ}

  రిప్లయితొలగించండి
 23. ఛద్మము తోకురుసేనలు
  పద్మవ్యూహమున గెల్చె, ఫల్గుణ సుతుడే
  ముద్మనమున పోరుసలిపి
  పద్మాక్షునిపురముఁజేరె పదుగురు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 24. పద్మవ్యూహము పన్నెను
  ఛద్మముతోడను గురుండు జగతిన్ చంపన్
  పద్మాసన మిత్రుండా
  పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుడే

  రిప్లయితొలగించండి
 25. పద్శాకారమువోలెను
  ఛద్మముతోబేర్చినట్టిసాయుధసేనన్
  పద్మా!చెదరంగొట్టుత
  పద్మవ్యూహమునగెల్చెఫల్గుణసుతుడే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చెదరం గొట్టుచు..' అనండి.

   తొలగించండి
 26. నిన్నటి పద్యాలనోసారి చూడండి
  అవనత వదనుండై మా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్
  బవరము నందున పార్థుడు
  జవమున విల్లును విడుచుచు శరణము కోరెన్

  సవతి యగు సురుచి పుత్రుని
  యవమానింపగ వగచుచు నర్భకు డౌ యా
  ధృవుడావనమున తామా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్

  జవమున తపమును చేయుచు
  బవరము నపరాజయంబు వలదను వరమున్
  కువలయమున వేడ నుమా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్.

  నేటి పూరణ

  పద్మవ్యూహము పన్నెను
  ఛద్మముతోడను గురుండు జగతిని చంపన్
  పద్మాసను మిత్రుండా
  పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుడే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   నిన్నటి సమస్యకు మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 27. మిత్రులందఱకు నమస్సులు!

  పద్మాక్షా! ద్రోణోద్యత
  ఛద్మభరిత నలినరచనఁ జక్కాడుచు సం
  విద్మృతుఁడై దివి కరిగియుఁ

  బద్మవ్యూహమున గెల్చె ఫల్గున సుతుఁడే!

  రిప్లయితొలగించండి
 28. పద్ముల నశ్వముల భటుల
  పద్మాకారమున నిలుప , పగతుల నడచన్
  పద్మాకర మీదె ననగ
  పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుఁడే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పద్ముల'..?

   తొలగించండి
 29. పద్మాకారముగ యనిన్

  ఛద్మముతో నిలువ బెట్ట సైన్యము నంతన్

  పద్మమ్మును ఛేదించగ

  పద్మవ్యూహమున గెలిచె ఫల్గుణ సుతుడే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పద్మాకారముగ ననిన్' అనండి.

   తొలగించండి
 30. అరయన్ భారత యుద్ధరంగమున నత్యంత ప్రభావంబుతో
  కురు సైన్యంబును సంహరించె నొకడే, క్రోధాగ్నులై కౌరవుల్
  కొరగామిన్నవినీతితో నలుగురుంగూ డర్బకున్ జంపిరే
  ధరణీశా! యభిమన్యుఁ డుద్ధతినిఁ బద్మవ్యూహముం గెల్చెఁ బో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కూడి+అర్భకున్' అన్నపుడు యడాగమం వస్తుంది. సంధి లేదు.

   తొలగించండి
 31. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
  కుశలానుయోగ ప్రణామములతో,

  బహుకాలదర్శనం. మీ పలకరింపు మూలాన మళ్ళీ సాధనకు అవకాశం కలిగింది.

  మరణోపాంతులు కౌరవాధములు ధర్మాధర్మనిర్ముక్తులై
  నిరతాబాధు నిరాయుధున్, నిపతితున్, నిశ్చేష్టితుం జేసి న
  ల్వురునుం జేరి వధింపరేనిఁ గుహకుల్, దోర్వీర్యసంపన్నుఁడై
  ధరణీశా! యభిమన్యుఁ డుద్ధతినిఁ బద్మవ్యూహమున్ గెల్చెఁ బో.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఏల్చూరి మురళీధర రావు గారూ,
   మీరు మరల బ్లాగులో దర్శన మివ్వడం మా అదృష్టం! ఆనందకరం! ముఖ్యంగా జ్ఞానదాయకం!
   మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. విద్వన్మణులు సుకవి మిత్రులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు మహోదయులకు వినమ్ర పూర్వక నమస్సులు! శంకరయ్యగారన్నట్లు మీరు బ్లాగులో దర్శనమీయడం మా అదృష్టం. సంతోషకరం. జ్ఞానదాయకమే!

   మీ పూరణ మత్యద్భుతముగ నున్నది. అభినందనలు!

   తొలగించండి
 32. సరి(బోలేమొనగాడెవండు గలడో సారించిచూడంగనా
  హరియేమూడవచక్షువుందెరచి తానాలంబునందూకెనో!
  ధరణీశా! యభిమన్యుఁ డుద్ధతినిఁ బద్మవ్యూహముం గెల్చెఁ బో
  అరివీరోద్ధతులన్; కడంగపటవ్యూహంబందు(దాజిక్కెనే ।

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గూడ రఘురామ్ గారూ,
   బహుకాల దర్శనం... సంతోషం!
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   'హరి మూడవ కన్ను తెరవడం'..? 'హరుడే మూడవ చక్షువుం దెరచి...' అందామా?

   తొలగించండి
  2. గురువు గారికి నమస్కారం!
   "హరుడే" అని రాద్దామనే నా ఉద్దేశ్యం. టైపు చేసేటప్పుడు అనుకోకుండా "హరియే" అని చేసేశాను. పద్యరచన సమయంలోనే కాకుండా టైపుచేసేటప్పుడు కూడా పరధ్యానం పనికిరాదన్న మాట!

   తొలగించండి
 33. పద్మాసను లిఖితమ్మున
  పద్మాక్షునిలీల వలన బాసిన నశువుల్
  ఛద్మంకృతులు భళిర!యన
  పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుడే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అసువుల్.. అశువుల్ అని టైపయింది. ఛద్మంకరులు అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
   పద్మాసను లిఖితమ్మున
   పద్మాక్షునిలీల వలన బాసిన నసువుల్
   ఛద్మంకరులు భళిర!యన
   పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుడే!

   తొలగించండి
 34. బంటురీతి కొలువు....
  నిన్నటి పూరణ : తప్పులున్న తెలుపగలరు
  తవులుకొనంగ గన్నుల నితాంతము తామరసాంఘ్రి యందముల్
  పవన తనూజుడేలు నవ పల్లవ పావర కొల్వు నీ యవే
  భవహర! చారు నేత్ర! యని భక్తి సుమాళము బొంది యా రమా
  ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యతఁ గాంచె నతండు వింటిరే

  సద్మమునెరుగక దమనుడు
  పద్మాక్షుని దలచుచు నట పలువుర గూల్చన్
  పద్మదళము చేజిక్కియు
  పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుఁడే

  రిప్లయితొలగించండి
 35. రిప్లయిలు
  1. మాజేటి సుమలత గారూ,
   బహుకాల దర్శనం... సంతోషం!
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'పామర కొల్వు' దుష్టసమాసం. 'పామర సేవ నందవే' అందామా?

   తొలగించండి
  2. ధన్యవాదములు గురువు గారు. పావర అంటే పాదము అనే అర్థంలో వ్రాసినాను.

   తొలగించండి
 36. నిన్నటి పద్యాలనోసారి చూడండి
  అవనత వదనుండై మా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్
  బవరము నందున పార్థుడు
  జవమున విల్లును విడుచుచు శరణము కోరెన్

  సవతి యగు సురుచి పుత్రుని
  యవమానింపగ వగచుచు నర్భకు డౌ యా
  ధృవుడావనమున తామా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్

  జవమున తపమును చేయుచు
  బవరము నపరాజయంబు వలదను వరమున్
  కువలయమున వేడ నుమా
  ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్.

  నేటి పూరణ

  పద్మవ్యూహము పన్నెను
  ఛద్మముతోడను గురుండు జగతిని చంపన్
  పద్మాసను మిత్రుండా
  పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుడే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణలు అన్నీ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 37. హరినిన్ దల్చుచు రాహులుండు కడు నాహ్లాదంబుగా నోడెబో
  కురులన్ కూర్చుచు సోనియా మమతకున్ కోటీర మిచ్చెన్నుబో
  పరుగో పర్గన పాకిసైన్యమహ మాభారత్ నునోడించెబో ...
  ధరణీశా! యభిమన్యుఁ డుద్ధతినిఁ బద్మవ్యూహముం గెల్చెఁ బో :)

  రిప్లయితొలగించండి