25, సెప్టెంబర్ 2016, ఆదివారం

చమత్కార పద్యాలు – 216/4


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

నాలుగవ అర్థము - విష్ణు స్మరణ      

భూరి జఠర = కనకగర్భుఁడగు బ్రహ్మదేవునకు
గురుఁడు = తండ్రి యైనవాడును,
నీరజ = పద్మముల వంటి
అంబక భూతి = నేత్రశ్రీ గలవాఁడును,
మహిత = అధికమైన
కరుఁడు = హస్తములు గలవాఁడును,
అహీన = ఘనతరమైన
మణి కలాపుఁడు = రత్న భూషణములు గలవాఁడును,
అలఘు = విస్తారమైన
సత్ + గణేశుఁడు = (నారద, ప్రహ్లాదాది) సాధుగణాధీశుఁడైనవాడును,
అగ్ర = ప్రధానమైన
గోపుఁడు = (కృష్ణావతారమున) గోపాలకుఁడైనవాఁడును,
మహా = గొప్పయైన
మర్త్యసింహుఁడు = నరసింహుఁడైనవాఁడును (అగు మహావిష్ణువు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

4 కామెంట్‌లు:

 1. పసిడి గర్భు తండ్రి, పద్మనేత్రుడు, మహా
  కరుడు, రత్న భూష ధరుడు, సాధు
  గణములపతి, యాలకాపరి మనలను
  నారసింహుడేలు నయముగాను.

  రిప్లయితొలగించండి
 2. కనకగర్భుని పితరుడు కంస హరుడు
  విశ్వరూపుడు జగమున నశ్వరుండు
  శత్రు మూకను జెండాడు చక్రి కియిట
  మోకరిల్లుదు భక్తిని ముక్తి కొరకు

  రిప్లయితొలగించండి