30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

చమత్కార పద్యాలు – 216/9


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

9వ అర్థము –  వరుణ స్మరణ          
                                                                          
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే తాతగా గలవాడును, (బ్రహ్మ సంతానమగు కర్దమ ప్రజాపతి పుత్రుఁడు)
నీరజ అంబక =అగ్గికంటి అయిన శివుని వంటి
భూతి = ఐశ్వర్యముగా గలవాఁడును,
మహిత కరుఁడు = అతిశయ మైనవాఁడును,
అహీన మణి కలాపుఁడు = సర్పరాజమును మణికట్టున భూషణముగా (నాగపాశము) గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = గొప్ప యొప్పుల కుప్ప యగు ప్రభువైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ప్రధానమగు జలమునకు అధిపతి యైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = గొప్ప దేవతా శ్రేష్ఠుఁ డైనవాఁడును (అగు వరుణుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

3 కామెంట్‌లు:

 1. అజుని మనుమడు ముక్కంటి హరునిభూతి
  సర్పభూషిత మణికట్టు చాలగొప్ప
  సద్గుణమ్ములరాశియౌ జలములపతి
  వేలుపువర వరుణుడు మమ్మేలుగాక.

  రిప్లయితొలగించండి
 2. వరుణ దేవుడ !కావుము భద్రముగను
  నీదు రాకకు జూతుము నిత్య మునిట
  పాడి పంటలు గరువాయె భరణి యందు
  కరుణ జూపుము మాపైన కడలి రాయ !

  రిప్లయితొలగించండి
 3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  త్రింశదర్థ పద్యరత్నార్థాలను క్రమం తప్పకుండా వీక్షిండమే కాకుండా పద్యాల రూపంలో మీ స్పందనను తెలియజేస్తున్నందుకు సంతోషం! ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి