28, సెప్టెంబర్ 2016, బుధవారం

చమత్కార పద్యాలు – 216/7


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

7వ అర్థము యమ స్మరణ             

భూరి జఠర = పెద్ద కడుపు గల భీమునకు,
గురుఁడు = పెదతండ్రి యైనవాడును,
నీరజ అంబక =అగ్గికంటి అయిన శివుని వలన
భూతి = పుట్టిన వాఁడును,
మహిత కరుఁడు = అతిశయ మైనవాఁడును,
అహీన = సర్పరాజమును
మణి కలాపుఁడు = మణికట్టున భూషణముగా గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = గొప్ప యొప్పుల కుప్ప యగు ప్రభువైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్య (దక్షిణ) దిక్పతి యైనవాఁడును,
మహా +అమర్త్యసింహుఁడు = గొప్ప దేవతాశ్రేష్ఠు డైనవాఁడును (అగు యముఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

3 కామెంట్‌లు:

 1. ఆయెపెద్దతండ్రి యావృకోదరునకు
  అగ్నినేత్రపుహరు నంశవాడు
  అనఘుడు మణికట్టు నహినిగట్టుయముడు
  సురవర,దిశనుపతి చూచుమనల.

  రిప్లయితొలగించండి

 2. ధర్మ పాలన త త్ప ర ! ధర్మ రాజ !
  దేహ మారోగ్య ముండగ దేవ ! నాది
  తీ సుకొనుమయ్య ప్రాణంబు తీసుకొనుము
  ప్రణతు లిడుదును గాలుడ ! ప్రతి దినంబు .

  రిప్లయితొలగించండి
 3. గోలి వారూ,
  సుబ్బారావు గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి