5, సెప్టెంబర్ 2016, సోమవారం

గురుస్మరణగురుస్మరణ

(1954 నుండి 1959 వరకు బళ్ళారి మునిసిపల్ హైస్కూలులో విద్య నేర్పిన గురువులకు)

సీ.      బడిఁ జేరువేళ ముఖ్యుఁడుగ నుండిన వెజ్జు
                   శంకరయ్య ఘనుండు సదమలుండు
          తెలుఁగున నా నేర్పు దెలియ పరీక్షించి
                   కడు మెచ్చుకొనె నీలకంఠ శాస్త్రి
          గణిత విజ్ఞానాల గుణముల నొసఁగియు
                   ‘గురు’నామ గురు డొప్పెఁ గరుణతోడ
          తరగతిఁ జేరుచో సరిలేని ప్రేమతోఁ
జూచె సుబ్రహ్మణ్య శుభకరుండు
          తెలుఁగు పాఠముఁ జెప్పి తేజరిల్లఁగ జేసె
                   కప్గళ్లు సంజీవ కాంతియుతుఁడు
          మల్లప్ప శాస్త్రియు మల్లికార్జున శాస్త్రి
                   వరగుర్వు లేడవ వర్గమందు
          కృష్ణమూర్తియు, నాగిరెడ్డి, గఫార్లు న
                   న్నెనిమిదిఁ జేర్చిరి హితము నెంచి
          రాఘవుల్, వెంకోబరావు, ప్రహ్లాదులు
                   మార్గదర్శకులైరి మా భవితకు
          శ్రీపాద రావును, శ్రీనివాసులు, బిందు
                   మాధవరావులు మమతఁ గనిరి
          హనుమేశ రామయ్య వినుత సుబ్బన్నయుఁ
                   ద్రోవఁ జూపిరి గెల్వఁ దొమ్మిదింట
          సంస్కృతమ్ము గరపె జయలక్ష్మి రెడ్డి నా
                   వాచికమ్మును మెచ్చి పరమదయను
          పదిలోన గురురాజ బహదూరు జీవర
                   త్నము వెల్గఁ జేసిరి తమము నడపి
          నారాయణులు గోపినాథులు మరి పద్మ
                   నాభులు గూర్చిరి ప్రాభవమ్ము
          అసమాన బోధకుం డాంధ్రశాఖకు పెద్ద
                   ఘూళి కృష్ణుల వారు గొప్పవారు
          వాసుదేవాచార్య వర్యుండు తానొండె
                   కన్నడమ్మును చక్క గరపు గురుఁడు
          ఆటపాటల నేర్పె హాస్యోక్తులను రువ్వి
                   డబ్ల్యు నర్సింహుండు డాబు మీర
వేంకటేశయ దెల్పె వింత సంగతు లెల్ల
                   గురుల కొందరి పేర్లు మరచి తేమొ
తే.గీ.   వీరె కారు మరెందరో విమలయశులు
          మాకు నేర్పిరి విద్యలు లోక మరయ
          శిష్యు లందర గమనించి క్షేమ మరసి
          నడక నేర్పిరి మును సాగ నవ్యదిశల
          గురువుల ఋణమ్ముఁ దీర్పఁగా తరమె భువిని
          రెండు చేతుల మోడ్చెద నిండు మదిని
          చంద్రశేఖర రెడ్డిని శరణ మనుచు
          మాన్య గురులార హితులార మహితులార
          మా మునిసిపలు హైస్కూలు మహిమ నెన్న
          నాడు నేడును బళ్లారి కేడుగడయ.

రచన, సమర్పణ
శిష్యపరమాణువు
గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డి,
మియాపూర్, హైదరాబాదు.

12 కామెంట్‌లు:

 1. సుకవి మిత్రులు చంద్రశేఖర రెడ్డి గారూ...నమస్సులు...ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు!

  మీరు చేసిన గురుపూజా స్తుతి సీసపద్య మాలిక మీ మనస్సులోని గురుభక్తినిఁ బ్రకటించుచు, ధారాళముగ సాఁగి, మా గురుదేవుల నందఱను జ్ఞప్తికిఁ దెచ్చినది. చక్కని పద్యము! శుభాభినందనలు!

  రిప్లయితొలగించండి
 2. గురువులరయెడమీకుండిన
  గురుతరమగుభక్తిజూడగూడినరక్తిన్
  నిరతముజేతునుసామీ!
  యిరవుగమరివందనమ్ములివిగోగొనుమా

  రిప్లయితొలగించండి
 3. మొదటిపాాదముసవరణ
  గురువులయెడమీకుoడిన

  రిప్లయితొలగించండి
 4. బాల్యం నుంచీ మీకు విద్య గరపిన గురువులందరినీ పేరు పేరునా స్మరించుకొన్న మీ గురుభక్తి శ్లాఘనీయ మండీ.

  రిప్లయితొలగించండి
 5. రెడ్డిగారూ! మీ గురుపరంపర సీసమాలిక అద్భుతంగా నున్నది. ఆరవ పాదంలో వరగుర్వు లేడైన వర్గమందు అని మార్చితే ఇంకా బాగుంటుందేమో...అన్యధా బావించకండి..

  రిప్లయితొలగించండి
 6. పెద్దలు, గురువర్యులు గుత్తిచంద్రశే ఖర రెడ్డిగారు చిన్నతనంలో చదువు చెప్పిన గురువులను స్మరించుచు చెప్పిన సీసపద్యం , గురువులపై వారికి గల భక్తి వినయములను తెలియజేస్తూ యిత రులకు అనుసరణముగా ఉన్నది. పెద్దలకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 7. భక్తి మీర వివిధ పుష్ప పత్ర ములిడి
  గజపముఖునిఁ ప్రీతి గొలిచి కథను విన్న
  భద్ర మగు భాద్రపద శుక్లపక్షమందు
  చవితి చంద్రుఁడు శుభముల సర్వ మొసఁగు"

  రిప్లయితొలగించండి
 8. గురుపూజోత్సవదినమున
  గురువుల దలపోయుటన్న గొప్పయె|మనలో
  గురువే దైవము లోకము
  గురుతర బాధ్యతలుబంచు కూర్పులు నేర్పుల్|

  రిప్లయితొలగించండి
 9. శ్లో. ఏకమేవాక్షరం యస్తు గురు: శిష్యం ప్రబోధయేత్ !
  పృథివ్యాం నాస్తి తద్రవ్యం యద్దత్వా చానృణీ భవేత్ !!

  రిప్లయితొలగించండి
 10. సీః చంద్ర శేఖర రెడ్డి సరగున దిశఁజూపి
  యోనమాలను నేర్పె నోర్పుతోడ
  రామకృష్ణారావు రంగమందున నిల్పి
  గ్రామరు నేర్పించె కరము తుష్టి
  శంకరార్యుండుతా జంకును పోగొట్టి
  తీర్చిదిద్దెను కడు తీరుగాను
  నరసింహ మూర్తియు కరమగు యిచ్చతో
  పురిగొల్పి చేయించె పూరణములు
  ఆః ఘట్టి కృష్ణ మూర్తి కలిగించి ప్రేరణ
  నమ్మకమ్ముఁ బెంచె నెమ్మితోడ
  గురువులందరునను నిరతము దీవించి
  కవినిజేసినారు కరుణ తోడ
  నమస్సులతో
  సత్యనారాయణ రెడ్డి

  రిప్లయితొలగించండి
 11. ప్రాణము తలిదండ్రు లొసఁగ
  దాని నిలుపుకొనెడు విద్య దక్కును మనకున్
  మానిత గురువర్యులిడగ
  మానకు మఱువకు గురువును మదిలో గొలువన్.

  రిప్లయితొలగించండి