28, సెప్టెంబర్ 2016, బుధవారం

ఖండకావ్యము - 33
సూర్యభగవానుడు
రచన – మంద పీతాంబర్

కోయిల పాటపాడె శతకోటి సుమమ్ములు వేచె బూయగా
కోయని కోడి కూసెగద కోవెల లోపల గంట మ్రోగె దా
హాయిగ విప్పి పింఛమును ఆడె మయూరి మనోజ్ఞరీతి వి
చ్చేయుము భాస్కరా గగన సీమకు, వెల్గులు  జిమ్మ పృథ్విపై !!!

ఏడు గుర్రాలతో జోడు చక్రములేని
తేరుపై తిరుగాడు దేవు డీవు,
ఊరువుల్ లేని యనూరుని కరుణించి
సారధి జేసిన స్వామి వీవు,
పాలకడలిపైన పాము పడగలనీడ
పవళించు హరికంటి పాప వీవు,
కడలిపై పలువేడి సుడులను సృష్టించి
వర్షమ్ము లిడెడు మహర్షి  వీవు,
భూతకోటికి జీవ చైతన్యమునొసంగి
ప్రీతిగూర్చెడు పరంజ్యోతివీవు,
తిమిరమునుబార ద్రోలెడు ద్యుమణి వీవు
ప్రాణికోటిని రక్షించు ప్రభుడ వీవు
సౌర మండల సామ్రాజ్య సార్వభౌమ
స్వాగతము దీనజనపాల సమయ పాల!!

చెంగున దూకి నిన్ మ్రింగ జూచిన కపి
పుంగవునకు శాస్త్రములను జెప్పి,
ఆదిత్య హృదయ మత్యాదరమ్మున ననిన్
ధ్యానించి రాముండు ధనువు నెత్తి
శరపరంపరలచే శిరతోరణము గూల్చ
సీతాపహరణుని ఛిద్రపరచె
మునిమంత్ర వశమున మును కుంతి నిను గోర
వీర విక్రముడైన శూరునిచ్చి
వనవాస సమయాన వినయులై పాండవుల్
ప్రార్థింప నక్షయ పాత్ర నొసగి
మే లొనర్చిన ఘనమైన  కాలపురుష!
ధర్మ పక్షాన నిలిచిన  కర్మసాక్షి
శుభము లెన్నియో చేకూర్చు విభుఁడ వనుచు
దినకరా! నిన్ను గొలుతుము దినదినమ్ము!!!

ఉదజని హీలియమ్ మొదలైన  వాయు
మ్మేళన మయమైన గోళ రూప!
పంచ భూతముల ప్రభావితు జేసి  ప్ర
పంచమ్ము నెల్ల పాలించు రేడ!
కరచరణాలనే కిరణాలుగా జేసి
ధరణిపై  పరిచెడు పరమ పురుష!
విసుగు విరామమ్ము నిసుమంతయునులేక
విశ్వమందున సదా  వెలుగు వాడ!
భాస్కరాదిత్య ఖగ పూష భాను తేజ
రవి సవిత్రార్క సూర్య హిరణ్యగర్భ
కశ్యపాత్మజ  చైతన్య కారకుండ
మమ్ము బ్రోవుము దీవించి మనసు నిండ !!!

తూరుపు దిక్కునన్ వెలుగుతోరణమో యన స్వర్ణ వర్ణ మం
దారములీల గన్పడెడు తామసదూరుని తామరప్రియున్
పూరిత భక్తిభావములు పొంగ మనమ్మున దివ్యమంగళా
కారుని బాలభానుని సహస్ర కరున్ కరమోడ్చి మ్రొక్కెదన్!!!

3 కామెంట్‌లు: