29, సెప్టెంబర్ 2016, గురువారం

సమస్య - 2157 (వాలినిఁ జంపె రావణుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వాలినిఁ జంపె రావణుఁడు పార్వతి శోకముఁ గాంచి జాలితో"
లేదా...
"వాలిని భవాని కొఱకు రావణుఁడు చంపె"
ఈ సమస్యను పంపిన విరించి గారికి ధన్యవాదాలు.

72 కామెంట్‌లు:

  1. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సతతము పురాణములు జెప్పు సంస్కృతునకు
    ససిజెడి మతి భ్రమించగ స్మరము బోయి
    వాలిని భవాని కొఱకు రావణుడు చంపె
    ననుచు వీధులందున నాడె నక్కజముగ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. ప్రవచ నములను ప్రవచించు పండి తుండు
    రామ రావణ యుద్ధము రగిలి నంత
    తన్మ యత్వము నొందుచు తనరి బలికె
    వాలిని భవాని కొఱకు రావణుఁడు చంపె

    రిప్లయితొలగించండి
  3. పోలిక లేని కట్టుకథ పుణ్యము గానదు కాళ్ళు వచ్చి లో
    కాలను ముంచివేయుతరి క్రౌర్యము మానవ బంధ ఛేదనల్
    గ్రాలును రాక్షసాధముడు రక్షకుడౌనట దీని వింటిరే?
    "వాలి నిజంపెరా వణుడు పార్వతిశో కముగాంచి జాలి తో"!? P.Satyanarayana
    జాలి జూపగ దుర్గమ్మ బేల యగునె?
    "మాల వెన్నగాల్చుకదిను" మాట వోలె
    కాల గతి జెడు వైనము గనవె! యేమి?!
    వాలి నిభవాని కొరకురా!వణుడు జంపె!? P.Satyanarayana

    రిప్లయితొలగించండి
  4. (1)
    సాలము వెన్క దాగి రఘుసత్తముఁ డేమి యొనర్చె? లంకలో
    నాలమునందు రామ వసుధాధిపు చేత గతించె నెవ్వఁ? డా
    శూలికి భార్య యెవ్వతె? యశోధర పుత్రుడు రాజ్యపుం సుఖం
    బేల యటంచు వీడుటకు నేమి కతంబొ? యెఱుంగఁ జెప్పుమా!
    వాలినిఁ జంపె; రావణుండు; పార్వతి; శోకముఁ గాంచి జాలితో.
    (2)
    నా సహాధ్యాయి యొకఁ డుండె నాగరాజు
    నోరు విప్ప నసత్యముల్ నుడువువాఁడు
    మునుపు మేము కోరంగ వాఁ డనియె నిట్లు
    "వాలిని భవాని కొఱకు రావణుఁడు చంపె"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. '...రాజ్యసౌఖ్య మిం। కేల యటంచు...' అని చదువుకొనండి.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. రావణుడు పొరపాటున రావణుండని వ్రాసారు.
      నాల్గవ ప్రశ్న మార్చితే బాగుంటుందని నా యభిప్రాయము. ఈ సవరణ యెలా యున్నదో చూడండి.

      ...యశోధర పుత్రుడు కృష్ణకాసభం
      జేల సుదీర్ఘ రాశుల నశేషము నీయఁ గతమ్ము సెప్పుమా!

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      ధన్యవాదాలు. కాని యశోద పుత్రుడు యశోధర పుత్రు డెలా అవుతాడు?
      పూరణలో నేనూ తప్పు చేశాను. మాయాదేవి పుత్రుని యశోధర పుత్రు డన్నాను. గౌతమ బుద్ధుని భార్య కదా యశోధర. 'యశోధర పెన్మిటి' అనవలసింది.

      తొలగించండి
    4. సవరించిన నా పూరణ.....

      సాలము వెన్క దాగి రఘుసత్తముఁ డేమి యొనర్చె? లంకలో
      నాలమునందు రామ వసుధాధిపు చేత గతించె నెవ్వఁ? డా
      శూలికి భార్య యెవ్వతె? యశోద సుపుత్రుఁడు కృష్ణ కాసభం
      జేలములం గ్రమంబుగ నశేషము నీయఁ గతమ్ము సెప్పుమా!
      వాలినిఁ జంపె; రావణుఁడు; పార్వతి; శోకముఁ గాంచి జాలితో.

      (పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలతో....)

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పరధ్యానములో యశోధర యశోదగా మనస్సులో ఉండిపోయింది. మన్నించండి. మీ సవరణ చక్కగనున్నది.

      తొలగించండి

  5. రాము డెవరిని చాటుగ తాను చంపె ?
    శివుడు యెవ్వరికై తను శివ మొనర్చె ?
    వానరులనొక్కరులనే నెవరట చంపె ?
    వాలిని, భవాని కొఱకు, రావణుఁడు చంపె"

    *యుద్ధకాండ(వాల్మీకి రామాయణం) లో రావణుని చేతి లో చచ్చింది వానరులు తప్పించి (పేరున్న) వేరొక్కరు కనబడటం లేదు ! (ఆశ్చర్యం !?)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      బాగున్నది మీ పూరణ. అభినందనలు.
      'శివుడు+ఎవ్వరి' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. 'శివుడు తా నెవరి కొఱకు శివ మొనర్చె' అనండి.

      తొలగించండి
  6. తాళపుచెట్లచాటునకు దాగినరాముడదేమి చేసె ? పో
    కాలముదాపురించి జనకాత్మజనెవ్వడు దొంగలించెనో ?
    కాలుని భార్య యెవ్వ?రెరుగన్ తొలి శ్లోకమదెట్లుబుట్టెనో ?
    వాలినిఁ జంపె, రావణుఁడు, పార్వతి, శోకముఁ గాంచి జాలితో ||

    చాటుమాటుగ రాముడుఁజంపెనెవని ?
    దక్షయఙ్ఞమ్ము యెందుచే ధ్వంసమయ్యె ?
    సమరమందు జటాయువుజచ్చెనెట్లు ?
    వాలిని, భవాని కొఱకు, రావణుఁడు చంపె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'దక్షయజ్ఞమ్ము+ఎందుచే' అన్నపుడు యడాగమం రాదు. 'దక్షయజ్ఞ మెవ్వారికై ధ్వంసమయ్యె' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. ఆర్య! అనేక నమస్కారములు. మీ సవరణ అద్భుతంగా ఉన్నది. దోషసవరణగావించినందులకు ధన్యవాదములు. సవరించిన పద్యాన్ని పంపుతున్నాను.

      చాటుమాటుగ రాముడుఁజంపెనెవని ?
      దక్షయజ్ఞమెవ్వారికై ధ్వంసమయ్యె ?
      సమరమందు జటాయువుజచ్చెనెట్లు ?
      వాలిని, భవాని కొఱకు, రావణుఁడు చంపె.

      తొలగించండి
  7. ఆత్మ లింగమును మరచి యడిగెనపుడు
    జ్వాలిని భవాని కొఱకు రావణుడు! చంపె
    రావణుడను నా రక్కసు రహిని గొలుప
    రాముడై పుట్టినట్టి నారాయణుండె!
    (ఆత్మ లింగాన్ని పొందాలని శివునికై తపస్సు చేసిన రావణుడు శివ పార్వతులు ప్రత్యక్షం కాగా విష్ణు మాయ చేత కప్ప బడిన వాడై ఆత్మ లింగం విషయం మరచి పోయి పార్వతి కావాలని అడుగుతాడని ఒక సినిమాలో చూచినట్లు గుర్తు. ఈ విషయానికి గల శాస్త్ర బద్ధత గురించి అయితే నాకు తెలియదు. తప్పులుంటే మన్నించండి. ధన్యవాదములు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      చక్కని విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అనగననగ రాగ మతిశయించుచునుండు అన్నట్లు మిత్రులు శ్రీధర రావు గారు ఆస్త్రేలియానుండు చక్కని పూరణలను చేస్తూ శంకరాభరణంలో మంచి కవిగా రూపుదిద్దుకుంటున్నారు.

      తొలగించండి
    3. కవి మిత్రులు సత్యనారాయణ రెడ్డి గారికి వందనములు. మీ ప్రోత్సాహము, గురువు గారి ఆశీస్సులకు చాలా సంతోషంగా వుంది. కృతఙ్ఞతలు మరియు ధన్యవాదములు.

      తొలగించండి
  8. త్రాగితివొ లేక తిమిరకాంతార కూప
    ముల బడితివేమొ,నజ్ఞానమునవచనము
    పెదవి దాటిన దాటును పృధివి, యేల
    వాలిని భవాని కొఱకు రావణుడు జంపె?

    రిప్లయితొలగించండి
  9. కాలము దారుణంబుగను గన్పడుచుండగ చిత్రసీమలోన్
    చాలవిచిత్రమైనవగుజారుల, దుష్టచరిత్రలన్ గడున్
    మూలముగాగలట్టి మూర్ఖుల నామములుంచ, నొక్కచో
    వాలిదురాత్మకుండుగను పార్వతి రావణులందుమిత్రులై
    వాలినిజంపెరావణుడు పార్వతిశోకము గాంచి జాలితో


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      సినిమా వాళ్ళకు సాధ్యం కాని దేమున్నది? బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  10. అనికి సుగ్రీవు డెన్నిక యాయె సుమ్ము
    వాలి నిభ వాని కొఱకు ,రావణుడు చంపె
    యుధ్ధ రంగాన నెందరో యోధ వరుల
    దనదు బాహుబ లముజూపి దర్ప మలర

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాలి నిభ వాని' అన్న పద విభాగం యుక్తంగా లేదు. 'వాలి నిభుడగు వాని' అనవలసింది కదా!

      తొలగించండి
  11. చాటుగా నుండి రాముడు జంపె నెవని?

    నెవరికై దక్ష యజ్ఞాాని కేగె భవుడు?

    బవరమున లంకను కపుల నెవరు జంపె?

    వాడిని, భవాని కొఱకు, రావణుడు చంపె.

    రిప్లయితొలగించండి
  12. ఆలిని లొంగదీయుటను నాయత తేజుడు నోర్వలేకనే
    వాలిని జంపె ,రావణుడు పార్వతి శోకము గాంచి జాలితో
    బాలిక !యేమియీ పలుకు పార్వతి శోకము గాంచియా తడు
    న్జా లిని గల్గియుండెనట సంభవ మేయిది చింత జేయఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ ప్రయత్నం మెచ్చదగినదే. కాని రెండవ, మూడవ పాదాలలో ఒకే భావం పునరుక్తమయింది.

      తొలగించండి
  13. ఉ.మేలొనరింప రాఘవుడు మిత్రుని నెవ్విధి తృప్తి పర్చెనో?
    జాలియొకింత లేక మరి జానకి నెత్తుకు పోయెనెవ్వడో?
    శూలియె దంతి శీర్షమును సూనుకమర్చెనదెందు కోసమో?
    వాలిని జంపె! రావణుడు! పార్వతి శోకము గాంచి జాలితో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నేను 'పార్వతి శోకము గాంచి జాలితో' అన్న సమాధానానికి గణేశోత్పత్తి సంబంధమైన ప్రశ్నను సిద్ధం చేయడానికి విఫల ప్రయత్నం చేశాను. మీరు సఫలులయ్యారు. సంతోషం!

      తొలగించండి
  14. తరువు చాటుగా రాముడు తఱిగె నెవరి?
    మదను డెవరికై విడె కుసుమాస్త్రములను?
    జగడమందు జటాయువుఁజంపెనెవరు?
    వాలిని,భవాని కొఱకు,రావణుఁడు చంపె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తఱిగె' అనడం కంటె 'తరువు చాటుగా రాము డెవరిని జంపె?' అంటే బాగుంటుందేమో!

      తొలగించండి
  15. మేలుగ నాత్మ లింగమును మీఱి వరింపక కోర పార్వతిం,
    గాల మతిక్రమింప దశకంఠుని శక్యమె, ధర్మ పూజ్య భా
    వాలినిఁ జంపె రావణుఁడు, పార్వతి శోకముఁ గాంచి జాలితో
    శూలి మనోవికాస మికఁ జొప్పడ నూరటిలంగ జేసెగా

    [భావ+ఆలి = భావాలి]

    సుగ్రీవు డంగదునితో పలుకు మాటలు:

    వానరమ్ములఁ బెక్కింటి బాణ ధార
    లు కురిపించి నరికి సేతులు శిరములను
    మనము నిండగ లోభ కామములు పుత్ర!
    వాలినిభ! వాని కొఱకు, రావణుఁడు చంపె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      అద్భుతమైన పూరణలు. పూజ్యభావ+ఆలి అని, వాలినిభ! వాని కొఱకు అని రెండు విధాల విరుపులు మీ భాషానైపుణ్యాన్ని ప్రకటిస్తున్నాయి. ఔత్సాహిక కవిమిత్రులు మీ పూరణలను చదివి పూరణావైవిధ్యాన్ని అవగతం చేసుకొంటారు.
      అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ విశిష్టాభిమానమునకు మిక్కిలి ధన్యవాదములు.

      తొలగించండి
  16. చంపె నెవరిని రాముడు చాటునుండి?
    కాచె నెవరి కొరకు శూలి కరివదనుని?
    కసిగ శూర్పణఖ పతిని గడపె నెవరు?
    వాలిని, భవాని కొరకు, రావణుడు జంపె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      మూడవ ప్రశ్నకు సమాధానమే తృప్తికరంగా లేదు.

      తొలగించండి
  17. తే.రాఘవు డెవని జంపెన మోఘముగను?
    గణపతికినిడె శివుడేల గజ శిరమ్ము?
    వానరు లెటుల సమసె నుత్థానమున?
    (వానరు లెటుల సమసిరి బవరమున?)
    వాలిని! భవాని కొరకు! రావణుడు జంపె!
    (యుద్ధము= ఉత్థానము;బవరము.-"పర్యాయ పద నిఘంటువు"-ఆచార్య G.N.రెడ్డి సంకలనము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జానార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సమసి రుత్థానమున' అనండి.

      తొలగించండి
    2. సూచనకు ధన్యవాదాలు. అక్కడ సందేహం వలనే (బహువచనానికి ఏకవచనక్రియ) మరో పాదం రూపొందించాను.మరొక్క మారు ధన్య వాదాలు.

      తొలగించండి
  18. గురువుగారు, వాలినిభ వాడు లో
    వాలితోసమానమైనవాడు అనవచ్చునా? లేకదుష్టసమాసమా? సంశయముతీర్చప్రార్థన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "వాలినిభ" కేవల సంస్కృతపదము "వాడు" తెనుగు పదము. సమసింప రాదు. "వాలినిభపువాడు" మిశ్రమ సమాసము సాధువు.

      తొలగించండి
    2. సంశయంతీర్చినందుకు కృతజ్ఞతలు కామేశ్వరరావు గారు.

      తొలగించండి
  19. సాలము చాటునుండెవని జంపెను రాముడు? వాయు పుత్రుడన్
    వాలము గాల్చమంచు తమవారికి జెప్పెనెవండు లంకలో
    బాలుని జంపి యెందుకని ప్రాణము వోసెశివుండు చూప్పుమా
    వాలినిఁ జంపె రావణుఁడు పార్వతి శోకముఁ గాంచి జాలితో

    చాటునుండి రాముడెవడిన్ జంపె? శివుడు
    బాలుఁ సంహరించేలను ప్రాణ మొసగె
    సీతనెవ్వాడపహరించి చేర్చెలంక
    యనిల సుతుడేమి జేసెనా యక్షయుడను
    వాలిని భవాని కొఱకు రావణుఁడు చంపె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్షమించాలి........ఉత్పలమాల మూడోపాదం చివర టైపాటు శివుండు చెప్పుమా అని వుండాలండి

      తొలగించండి
    2. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'రాము డెవనిన్ జంపె... సంహరించియు నేల... యక్షయుడిని...' అనండి.

      తొలగించండి

  20. కోలను వైచి యెవ్వరిని గూల్చెను రాముడు చెట్టుచాటుగన్?
    హేలగ వెండికొండ నెవ డెత్తె?శివుండ పుడేమి? గాంచి తా
    వ్రేలిని కొండ నొక్క విలపించెను వింశతిబాహు డెవ్విధిన్?
    వాలినిజంపె,రావణుడు,పార్వతి శోకము గాంచి,జాలితో

    రిప్లయితొలగించండి
  21. . “జాలిదలంచకన్ తగిన చంచల చిత్తుని రామబాణమే
    వాలినిజంపె”|”రావణుడు” “పార్వతి శోకము గాంచి జాలితో
    వాలెను మారువేషమునభార్యయె పార్వతి రూపుదాల్చగా|
    మేలని సంతసించెగద మేటి మగండటు మాయనెంచకన్ {రావణాసురుడు.}
    2.సురభి నాటకమందున సుందరాంగి
    యౌ| భవానిని రావనుండాశ బడుచు
    కలలు గనె వింతపంతాన నిలచియున్న
    వాలిని భవానికొఱకు రావణుడు జంపె|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
      క్త్వాంతములు మున్నగునవి కళలు. కావున కొట్టి, తిట్టి, కొట్టక, తిట్టక మొదలగునవి కళలు. తలంచక కూడా కళయే. కాబట్టి “తలంచకన్” అసాధువని నా సందేహము. నివృత్తి చేయ గోర్తాను.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      ధన్యవాదాలు. అది నా దృష్టికి రాలేదు. "అక ప్రత్యయాంతావ్యయము కళ" అన్న సూత్రం ఉండనే ఉన్నది.
      అక్కడ 'జాలి తలంచ కొప్పయిన...' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీ సవరణ బాగుందండి.

      తొలగించండి
  22. సాలము చాటునుండి వెస జానకిరాముడు చంపెనెవ్వరిన్?
    జాలముతోడపట్టుకొని జానకిఁ దెచ్చెను లంకకెవ్వరో?
    కాలుడు జీవనమ్మునిడె కాళిక పుత్రున కెట్టి కారణమ్ముతో?
    వాలినిఁ జంపె రావణుండు పార్వతి శోకము గాంచి జాలితో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదం చివర గణదోషం. 'పుత్రున కెట్టి సాకుతో' అందామా?

      తొలగించండి
  23. కోలను బట్టి రాఘవుడు గుహ్యముగా విడి యేమి జేసెనో
    కాలుని చెంత జేరుటకు కాంతను సీతను బట్టె నెవ్వడో
    గూలిచె నేలనో కరిని కోరి విరాట్పతి జీవితుండవన్
    వాలినిఁ జంపె రావణుఁడు పార్వతి శోకముఁ గాంచి జాలితో

    నిన్నటి నా పూరణలో మేధనునుచుచు అనగా మేధనుంచుచు
    అని వ్రాసితిని. ఇందులో సంధి అవసరము పడలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిన్నటి పూరణలో నే నెందుకు ఏమని వ్యాఖ్యానించానో గుర్తు లేదు. చూచి స్పందిస్తాను.

      తొలగించండి
  24. చెట్టు చాటుండ రాముండు చిదిమె నెవని?
    మరుని మసిచేసి బ్రతికించె హరుఁడదేల?
    వైరి రామునకైనంత? పోరునందు
    వాలిని, భవాని కొఱకు, రావణుఁడు, జంపె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. రాము డెవరిని జంపెను రహము తోడ
    యతిగ మారెనెవరికై త్రయంబకుండు
    నెదురు పడినట్టి పక్షిని యేమి చేసె
    వాలిని,భవాని కొరకు రావణుండు చంపె.

    ఇనజు డెవ్వాని జంపింప మనసు పడియె
    కపట వటుడుగ తానెందుకయ్యె శూలి/శివుడు
    నిలువరించిన గృధ్రము నేమి చేసె
    వాలిని,భవాని కొరకు రావణుండు జంపె.

    రిప్లయితొలగించండి
  26. కాలము మారగా కవులు కాలము లేకయె టెక్స్టుబుక్కులన్
    వీలుగ నిచ్చి భార్యలకు వెంటనె వ్రాయుడి గంటలోనన
    న్నాలులు వంటజేయుచును హాయిగ వ్రాయగ నిట్లు వచ్చెరా!:👇
    "వాలినిఁ జంపె రావణుఁడు పార్వతి శోకముఁ గాంచి జాలితో"

    రిప్లయితొలగించండి