24, సెప్టెంబర్ 2016, శనివారం

చమత్కార పద్యాలు – 216/3


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

మూడవ అర్థము - బ్రహ్మ స్మరణ     
భూరి = బంగారము
జఠర = పొట్టగా గల
గురుఁడు = గొప్పవాడును,
నీరజ + అంబక = కమలాక్షుఁడగు విష్ణువునకు
భూతి = పుట్టినవాఁడును,
మహిత = అధికమైన
కరుఁడు = హస్తములు గలవాఁడును,
అహీన = హీనము కాని
మణి కలాపుఁడు = రత్న భూషణములు గలవాఁడును,
అలఘు = ఘనతరమైన
సత్ + గణేశుఁడు = సాధు (మరీచి, అత్రి, అంగీరసాది మహర్షి) గణమున కధ్యక్షుఁడైనవాడును,
అగ్ర గోపుఁడు = తొలి పలుకులకు ప్రభువైనవాఁడును,
(లేక)
అగ్ర = ముఖ్యమగు
గోపుఁడు = వాక్పతి (సరస్వతీ వల్లభుఁడు) ఐనవాఁడును,
మహా = గొప్పయగు
అమర్త్యసింహుఁడు = దేవతాశ్రేష్ఠుఁడును (అగు బ్రహ్మ)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

4 కామెంట్‌లు:

 1. కనకకుక్షివాడు కమలాక్షు పుత్రుండు
  మహితకరు డహీన మణివిభూషు
  సాధుగణములపతి సతిసరస్వతిపతి
  మేలువేలుపుతాత యేలు మనల.

  రిప్లయితొలగించండి
 2. సృజన జేసి మనల సృష్టి కర్త యగుచు
  నుదుట వ్రాయు ఫలము సదయు డగుచు
  బ్రహ్మ యనగ నతడు పరబ్రహ్మ రూపుడు
  వంద నములు సేతువంద లాది

  రిప్లయితొలగించండి
 3. హనుమచ్ఛాస్త్రి గారూ, సుబ్బారావు గారూ,
  ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి
 4. అనితరసాధ్యమౌను భరతావనిఁ గన్యనుఁ గన్నతండ్రియై
  మనువునుజేయనెంచ తరమాయబలాజనరక్షణమ్మునన్
  పనిగొని తత్ప్రయత్నమున ప్రాచ్యులు మేలని గూర్చ కన్య య
  వ్వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్ ||

  వనితనుఁ గని దంపతులిల
  మనువును జేయంగ నెంచ మరి రక్షణకై
  యొనగూర్చగ కన్యలు య
  వ్వనమునఁ దిరుగుటకు లేవె పద్ధతులు గనన్ ||

  రిప్లయితొలగించండి