27, మే 2018, ఆదివారం

ఆముదాల మురళి గారి శతావధానం - 1

సమస్యాపూరణలు
1) "మురళికి రంధ్రముల్ వడెను ముచ్చటగా శతసంఖ్య లొప్పుచున్"
(డా. అమళ్ళదిన్నె వేంకట రమణ ప్రసాద్ గారు)
అరమర లేని జీవిత మహర్నిశముల్ సుమభావబంధుర
స్థిరతరసాహితీమధురతీర్థముఁ గ్రోలి వధానవిద్యకున్
గురుతర సేవఁ జేయు రసకోవిదుఁ డొక్కఁడు మ్రోగ నెంచఁగా
మురళికి రంధ్రముల్ వడెను ముచ్చటగా శతసంఖ్య లొప్పుచున్.

2) "ఆలిడు పాలు చాలును గదా రసమాధురు లొల్క నాల్కకున్"
(మైలవరపు మురళీకృష్ణ గారు)
కాలవశంబు లైనవి జగమ్ములయందున సర్వతంత్రముల్,
మే లొనరించుఁ గొన్ని మరి మేరలు మీరిన కీడుఁ జేయుఁ, ద
త్వాల గణించి యోగిరము తథ్యముఁ బథ్యముగా గ్రహించినన్
ఆలిడు పాలు చాలును గదా రసమాధురు లొల్క నాల్కకున్.

3) "పరహింసాపరులైన దుర్మతులకున్ బాటిల్లుఁ గైవల్యముల్"
(M.S.V. గంగరాజు గారు)
స్మరియింపన్ వలె నిత్యమున్ మనసులో సాక్షాన్మహాదేవునిన్,
దరిజేరన్ వలె భక్తిభావయుతులై ధ్యానంబులన్ జేయుచున్,
దురపేక్షాపరులైనవారికి సదా దూరంబుగా నున్నచోఁ
బరహింసాపరులైన దుర్మతులకున్ బాటిల్లుఁ గైవల్యముల్.

4) "తిరుమల వేంకటేశ్వరుఁడె దేవుఁడు క్రైస్తవభక్తకోటికిన్"
(కంది శంకరయ్య గారు)
తిరుమల వేంకటేశ్వరుఁడె దేవుఁడు హైందవభక్తకోటికిన్
విరచితసర్వశాస్త్రగతవిద్యల సారము సంగ్రహించినన్
బరిపరి భేదముల్ విడుచు వాక్యమునందున దృష్టి నిల్పినన్
దిరుమల వేంకటేశ్వరుఁడె దేవుఁడు క్రైస్తవభక్తకోటికిన్.

5) "దధిపాత్రమ్మునఁ గాలకూట మెసఁగెన్ దావానలాభీలమై"
(మాధవ రెడ్డి గారు)
సుధకై చేరి సురాసురుల్ మహిమతో శోభాయమానంబుగా
మధియించంగను క్షీరసాగరముఁ, గూర్మంబై మహావిష్ణువే
విధులం జేయుచునుండ తొట్టతొలుతన్ బీభత్సమై తన్మహో
దధిపాత్రమ్మునఁ గాలకూట మెసఁగెన్ దావానలాభీలమై.

6) "కలువలు భస్మమాయె శశికాంతులు సోకిన తత్క్షణంబునన్"
(కల్వగుంట్ల రామమూర్తి గారు)
విలువలు లేని విద్యలను వేలము వెఱ్ఱిగ నేర్చుచుండి రీ
తులువలు, కామవాంఛలకుఁ దొత్తులుగా గుణశీలబాహ్యులై
బలిమిని స్త్రీలనెల్లఁ జెరఁ బట్టుచుఁ బ్రేమలఁ గాల వ్రాయఁగాఁ
గలువలు భస్మమాయె శశికాంతులు సోకిన తత్క్షణంబునన్.

7) "వడదెబ్బకు వృద్ధుఁ డొకఁడు వహ్వా యనియెన్"
(సుబ్బ రాఘవ రాజు)
జడదెబ్బఁ దిన్న నాఁడుల
గడసరి జ్ఞాపకముఁ దలఁచి కనుగీటఁగ నా
విడ చేతి వడను విసిరెను
వడదెబ్బకు వృద్ధుఁ డొకఁడు వహ్వా యనియెన్.

8) "ఎండలు మండుటయు నిచ్చు నెంతో హాయిన్"
(మన్నవ గంగాధర ప్రసాద్)
దండిగ మజ్జిగ నిచ్చెడు
పండితుఁ డొకఁ డుండి కావ్యపఠనముఁ జేయన్
జండాంశుఁడు చంద్రుం డగు
నెండలు మండుటయు నిచ్చు నెంతో హాయిన్.

9) "క్రోఁతినిఁ బెండ్లియాడు మికఁ గూటికి గుడ్డకు లోటు రా దిలన్"
(టెంకాయల దామోదరం)
జాతర వచ్చె నింక జలజాతముఖుల్ నడయాడుచుందు రీ
భూతలమందుఁ, గన్నెలనుఁ బూని వరించుము, వంక లేలనో
క్రోఁతులు కొంగ లంచుఁ, గడు గొప్ప ధనాఢ్యుని కూఁతుఁ జూచి యా
క్రోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు రా దిలన్"

10) "సారా తెమ్మనె రాఘవుండు హనుమన్ సంతోష మేపారఁగన్"
(డా. మాలేపట్టు పురుషోత్తమాచారి గారు)
ఘోరాశీవిషదైత్యబాణకృతసంక్షోభమ్మునన్ లక్ష్మణుం
డా రక్షోజనమధ్యరంగమునఁ బ్రాణాపాయమం దుండఁగాఁ
జేరెన్ మారుతి మూలికాస్థగితప్రస్థీయుక్తుఁడై "వీర! దో
స్సారా! తె"మ్మనె రాఘవుండు హనుమన్ సంతోష మేపారఁగన్.

11) "హనుమత్పుత్రుఁడు భీష్మపుత్రిని వివాహం బాడె దీవింపుఁడీ"
(గుమ్మడి జయరామిరెడ్డి గారు)
ఘనసంస్కారవిలాసమానవతియై కారుణ్యవాక్సీమయై
వినయోదంచితవర్తనాగరిమయై విద్యాప్రవీణాఢ్యయై
కనులం దన్పెడి రుక్మిణీసతిని ఋక్సామాదివేదాంతదే
హను మత్పుత్రుఁడు భీష్మపుత్రిని వివాహం బాడె దీవింపుఁడీ.

12) "మల్లియ తీఁగకున్ గలిగె మామిడికాయలు నేత్రపర్వమై"
(విద్వాన్ జి. గోవిందయ్య గారు)
చల్లని రేయి వెన్నెలలు సాంద్రతరమ్ముగ వ్యాప్తి నొందఁగా
నల్లన వచ్చె భామ విరహాతురుఁ డాతఁడు కొంగు లాగి తా
మెల్లఁగఁ గన్నుగీటెను తమిం గొనియాడి వయారి! యిచ్చటన్
మల్లియ తీఁగకున్ గలిగె మామిడికాయలు నేత్రపర్వమై.

13) "రాముఁడు గౌతముని సతిని రంజిలఁ జేసెన్"
(శ్రీరాములు గారు)
ప్రేమమయంబగు దైవము
భామకు శాపంబుఁ బాపి పతిదేవుని స
ద్ధామముఁ జేర్చఁగ దశరథ
రాముఁడు గౌతముని సతిని రంజిలఁ జేసెన్.

14) "కత్తులఁ గని బాలుఁ డొకఁడు కరకర నమిలెన్"
(డా. వి. జయమ్మ గారు)
మొత్తం బిచ్చెద ననుచును
చిత్తం బూరించు తల్లి చేష్టల విసిగెన్
దుత్తల దొంతరలో బి
స్కత్తులఁ గని బాలుఁ డొకఁడు కరకర నమిలెన్.

15) "కారముతో నాముదాల కవి యలరారెన్"
(డా. మస్తానమ్మ గారు)
రారండని పిలువంగనె
చేరిన సాహిత్యపరులు స్నిగ్ధమనస్కుల్
గూరిమి నెచ్చెడి యీ సహ
కారముతో నాముదాల కవి యలరారెన్.

16) "పయ్యెద జారెఁ గోమలికిఁ బాపని బొజ్జనుఁ గాంచినంతటన్"
(డా. పి.సి. వెంకటేశ్వర్లు గారు)
కుయ్యిడుచున్న బాలుఁ గని కోడలి వంకకుఁ జూచె నత్తయున్
పొయ్యిని వీడి వచ్చె నటు పొంగుచునుండెడి పాలు దించి "రా
రయ్య" యటంచు దగ్గరకు హారతు లెత్తిన ప్రేమ జోరులోఁ
బయ్యెద జారెం గోమలికిఁ బాపని బొజ్జనుఁ గాంచినంతటన్.

17) "మమతలు దూరమైనపుడె మానవజాతియు వృద్ధినొందెడున్"
(కత్తి మమత గారు)
క్రమముగ ప్రేమ తగ్గె ధనకాంక్షకు లోకము లొంగెఁ బిల్లలన్
సమిధలఁ జేయు విద్యలిట సాగుచునుండెఁ బ్రమాదఘంటికల్
ప్రమదల చుట్టు మ్రోగె పరిరక్షణ లేదు గణింప నిట్టి దు
ర్మమతలు దూరమైనపుడె మానవజాతియు వృద్ధినొందెడున్.

18) "కుక్కకు చెమ్మటల్ బొడమకుండును రేఁబగ లొక్కరీతిగన్"
(మాధవీలత గారు)
మిక్కుటమైన యెండలకు మేనులు బొబ్బలు పుట్టె దుర్భరం
బక్కట! ప్రాణముల్ నిలుచు నాశలు లేవిక పుత్ర! దేహముల్
స్రుక్కెఁ దుషారయంత్రములు సోషిలఁ జేయవు గానఁ దెమ్ము మా
కుక్కకు చెమ్మటల్ బొడమకుండును రేఁబగ లొక్కరీతిగన్.

19) "రతికిన్ దూరము గాని మేటి యతియే రాజిల్లు మోక్షార్థియై"
(డా. నెమిలేటి కిట్టన్న గారు)
శతసంవత్సరకాలజీవితము నిస్సారంబుగా నెంచి శా
శ్వతసత్యంబగు బ్రహ్మమున్ మనసులో స్థాపించి నిష్కాముఁడై
సతతానందవిలోలమూర్తిమహితస్వాంతుండు వేదాంత భా
రతికిన్ దూరము గాని మేటి యతియే రాజిల్లు మోక్షార్థియై.

20) "రాతిరి సూర్యుండు నంబరమునన్ దోఁచెన్"
(యువశ్రీ మురళి గారు)
పూతమనస్కులు యోగులు
చేతముద మొప్పఁ దపముఁ జేయుచునుండన్
బ్రాతిగ నంతట జరిగెను
రాతిరి; సూర్యుండు సంబరమునన్ దోఁచెన్.

21) "కలదే యిలలోన హాయి కైవల్యమునన్" (వృత్తంలో పూరించాలి)
(డా. నాదెండ్ల శ్రీమన్నారాయణ గారు)
తుల్యపు భావముల్ గలుగు తొయ్యలి భార్యగ ముద్దుఁ గూర్చు సా
కల్యమనోరథంబులనఁ గల్గిన పుత్రుల దైవమాతృకౌ
హల్యపు భూమి గల్గ మనసా కలదే యిలలోన హాయి కై
వల్యమునన్ వికుంఠపురవర్యమునన్ మఱి యెందుఁ జూచినన్.

22) "తలవ్రాతను మార్చ బ్రహ్మ తరమే ధరలో"
(గంగుల నాగరాజు గారు)
కలుములు లేములు గల్గిన
వలయం బీ జీవితంబు ప్రాప్తించిన యా
ఫలములఁ జేకొనవలయును
తలవ్రాతను మార్చ బ్రహ్మ తరమే ధరలో?

23) "తిరుపతి పురవాసులెల్లఁ దిర్యగ్జడముల్"
(మల్లిపూడి రవిచంద్ర గారు)
స్మరియింతురు గోవిందునిఁ
దిరుపతి పురవాసులెల్లఁ; దిర్యగ్జడముల్
హరి సేవకుఁ బాత్రములై
తరియించును మోక్షసిద్ధి తదనంతరమున్.

24) "మామిడిచెట్లకుఁ గాసె మెండుగాఁ బనసలు కోయ రండహొ" (ఛందోగోపనం)
(తారకరామ్ గారు)
వినుతినిఁ గాంచు పుష్పఫలవృక్షతదాశ్రయకీరపైకమౌ
వనయజమాని పల్కె నిటు "ప్రాప్తము లేనిదె భాగ్య మబ్బునే
మనిషికిఁ, జీడ పట్టినది మామిడిచెట్లకుఁ, గాసె మెండుగాఁ
బనసలు, కోయ రండహొ విపన్నులఁ గావఁగ దైవ ముండెడిన్".

25) "చెవిటి నర్తించె సంగీతము విని సభను"
(సాత్పాటి సురేశ్ గారు)
రాజనర్తకి సభ నాడ రాని దివస
మొక్క వేశ్యను పిలిపించె నుర్విపతియు
కాలు కందగ నాడగాఁ గంబళిఁ బర
చె, విటి నర్తించె సంగీతము విని సభను.

26) "స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాదు చూడఁగన్"
(విద్వాన్ బి. కన్నయ్య గారు)
వనజజు నాల్కపై సతతవాసముఁ జేసెడి పల్కులమ్మకున్
స్తనములు రెండు వాఙ్మయము తాన లయాన్వితగానవిద్య లా
స్తనములు పూరుషుండు దగు సాధనఁ జేసియుఁ బొంద నొప్పు నా
స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాదు చూడఁగన్. 

13 కామెంట్‌లు:

  1. మోదము గూర్చెనోయి యిట పూరణలన్నియు నెంచిచూసినన్

    రిప్లయితొలగించండి


  2. గడుసరి బామ్మయు వడ్డన
    గడగడ జేయగ నటునిటు కాస్తైన సుమా
    యుడుకువ లేక జిలేబుల
    వడదెబ్బకు వృద్ధుఁ డొకఁడు వహ్వా యనియెన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. అద్భుతమైన పద్యముల నల్లిన తీరది వారెవాయనన్!

    రిప్లయితొలగించండి


  4. ధారణ తో చట్టను నయ
    గారము తో మెరుపుల కల కలల జిలేబీ
    సారముతో భళిభళి మమ
    కారముతో నాముదాల కవి యలరారెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. పరువైనవారు సుమ్మీ
    తిరుపతి పురవాసులెల్లఁ, దిర్యగ్జడముల్,
    పరులెవరో! రమణు సిసులు
    కరుకుగ మాట్లాడలేరు కవన జిలేబీ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. చెలి!విను మానవ యత్నము
    చెలియలికట్టను కడచుచు చెలరేగంగన్
    ఫలితంబుగాన్పడు సుమా
    తల వ్రాతను మార్చ బ్రహ్మ తరమే ధరలో!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. విత్తము దండిగ గలవా
    డత్తఱి జన్మదినమున లడాయీ జేయన్
    హత్తము తోచాక్లెట్టుల
    కత్తులఁ గని బాలుఁ డొకఁడు కరకర నమిలెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  8. పిండగ జిలేబులనటన్
    గుండమ్మకు హాయి హాయి గురుడా! తానై
    దండగ గుచ్చుగ పదముల
    నెండలు మండుటయు నిచ్చు నెంతో హాయిన్

    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. జోతల నిడుచు జిలేబియు
    తాతల కాలంపు నోకు తడుమగ నహహో
    పాతాళ భైరవి చలువ
    రాతిరి సూర్యుండు నంబరమునన్ దోఁచెన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి


  10. గలగల పద్యము కందపు
    ములుగుల రాయంగవీలు ముప్పిరి గొనునీ
    "తలమున" !జిలేబి వినవే
    కలదే యిలలోన హాయి కైవల్యమునన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి


  11. తనదగు విధముల జిలేబి తకధిమి యని
    తాళమున్వేయగ భళిరా దద్ద రిల్లె
    నుర్వియునకట! శబ్దపు నుక్కటగని,
    చెవిటి నర్తించె సంగీతము విని, సభను

    జిలేబి

    రిప్లయితొలగించండి