23, మార్చి 2024, శనివారం

సమస్య - 4714

24-3-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు”
(లేదా...)
“ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

41 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
మాయరోగము లోకులమరణమెంచి
వ్యాప్తిచెందెను తొలినాళ్లగుప్తముగను
దాక నన్యుల, మూతికి తప్పి తొడుగు
ముట్టి యొకఁడు సచ్చె, మడిసె ముట్టకొకఁడు!

ఉత్పలమాల
మట్టిని గల్పగన్ జనుల మారణహోమము మాయరోగమై
చుట్టెను లోకమున్ జెలఁగి చూర్ణము సేసెను దొల్త పెక్కురిన్
జట్టము తాకకేరినని, జాలిక మూతికిఁ జెప్ప, మీరుచున్
ముట్టి యొకండు సచ్చె, మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్

రామోక్తం చెప్పారు...

గొట్టు కోవిడు జగతిని చుట్టు ముట్టి
కట్టిడి తనమున జనుల ముట్టడించ
ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు
గిట్టె నర్భకుండైనను జెట్టి యైన

సరిగ్గా నాలుగేళ్ల క్రితం మార్చ్ 24, 2020 న భారత దేశంలో లాక్డౌన్ ప్రకటించిన సందర్భం జ్ఞాపకం చేసుకుంటూ.

వివియన్ వరలక్ష్మి చెప్పారు...

గట్టిగ నెయ్యమున్న చెలికాండ్లు విహారమునేగ నెంచి రా
పట్టు నొకండు కోరి సురపానము జేసియు చాలనంబు చే
పట్టి నపాయమై విగత ప్రాణులునైరి నిజమ్ము మద్యమున్
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడగన్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

తరుణి ద్రౌపదీ దేవిని ధరణి యందు
*ముట్టి యొకఁడు సచ్చె ,మడిసె ముట్టకొకఁడు*
ధరణిజ నశోకవనమున దాచి వడిగ
స్త్రీలనవమానపరచినశిక్షయిదియె

Sitharamayya Solasa చెప్పారు...

నేస్తు లిద్దరు విద్యుత్తు నిట్ట నెక్క
తీగ తగిలి చచ్చె నొకడు దిటయరపున
బెదరినట్టి రెండవ వాడు పృథ్వికొరగె
ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు

విరించి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
జిగురు సత్యనారాయణ చెప్పారు...

పట్టగ మౌని శాపమున పాండు నృపాలుడు రాలి పోయె చే
పట్టకనంబ శాపమున పావన భీష్ముడు కూలి పోయె నీ
పట్టున పెద్ద తండ్రియును పట్టియు వాలిన తీరు తెన్నులన్
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్!!

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

వింత రోగము వ్యాపించె విశ్వ మంత
వార్త లందున గనుపించు ప్రత్య హంబు
జూచి చర్చించి రయ్యె డ చోద్య ముగను
ముట్టి యొకడు సచ్చె మడిసె ముట్టకొకడు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

అసువులను దీసె కోవిడు విసము జిమ్మి
వసనములు మారెనానాడు మసనములుగ
నెంత కట్టడి చేసిన నేమి ఫలము
ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఎట్టి విపత్తు లేర్పడిన వెందరు కోవిడు బారిఁ జిక్కియా
పట్టున మట్టిలో కలిసి వావిరిగా గతియించి పోయిరో
కట్టడిచేయజాలని వికల్పమునన్బడవైచి రోగులన్
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్

M.B.G.TILAK చెప్పారు...

చట్టము నతిక్రమించుచు పెట్టిరకట
జనహననముకై బాంబుల సంచినొకటి
ప్రేలె నొకటి పరీక్షించు వేళలోన
ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు

చట్టము మీఱువారు జనసంహరణమ్ముకు బాంబులుంచగా
పెట్టగ ప్రేలలేదనుచు వెళ్ళి పరీక్ష నొనర్చు వేళలో
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్
బెట్టిన బాంబు ఢమ్మనుచు ప్రేలెను తత్సమయంబునక్కటా

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:అధిక మైన రక్తపు పోటు నన్న కలిగి
కారమును మెక్కె,తమ్ముడు కలిగి యల్ప
మైన పోటును కార మింతైన తినడు
ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు”

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:ముట్టెడు జీతమే కరణమున్ బతికించునొ!లంచ మింతయేన్
ముట్టక దప్పదంచు దిని మూర్ఖుడు ఖైదును పొంది చచ్చె ,దా
నట్టిది చేయనన్ కరణ మాకలి తోడనె చచ్చె నయ్యయో
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్”
(పూర్వం కరణాలకి అతి తక్కువ జీతాలు లుండేవి.తాలూకాఫీస్ జమాను కంటే వీళ్ల జీతాలు తక్కువ.ఏదో చిలుక కొట్టుడు తప్పదు.తింటే కేసుల తో చచ్చే వాళ్లు.తినక పోతే తిండికి మాడి చచ్చే వాళ్లు.)

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ చట్టమును జుట్టమనుచును జక్కఁ గాను
దోఁచె నొకఁడు యండ నొసఁగి ప్రోచె నొకఁడు
పట్టఁగ నిఘావిభాగమ్ము చట్టన యటు
ముట్టి యెకఁడు సచ్చె మడిసె మట్ట కొకఁడు

ఉ॥ చట్టముఁ జుట్టమంచు నటు సర్వము దోఁచె నొకండు వానికిన్
గట్టిగ నిచ్చి మద్దతును గాయు నొకండు నిఘా విభాగమున్
జట్టన పట్టి పంప చెఱసాలకు నట్టుల నీతిబాహ్యులన్
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్

Surya చెప్పారు...

పుట్టె విషజ్వరంబకట పూర్తిగ జుట్టె ప్రపంచమంతటిన్
పట్టణ వాసులైన నటు పల్లెల నుండెడి వారలైన లే
దిట్టి యుపద్రవంబు మునుపెన్నడెరుంగని సంకరంబనన్
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'ఒకడు + అండ' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "దోఁచె నొక్కఁ డండ.. చట్టన నటు..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

subbarao చెప్పారు...

రోజ! యీమధ్య వచ్చిక రోన వినుము
ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్టకొకఁడు
చూడ శక్యము గానిదై చొచ్చి హృదికి
తీయు ప్రాణము నిమిషాన దెలియ కుండ

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

ధన్యవాదములండి. తెలిసిన సూత్రమే కాని అప్పుడప్పుడు మరచిపోతూనే ఉంటాను. అనేక ధన్యవాదములు. తేటగీతి మార్చిన పద్యము

తే॥ చట్టమును జుట్టమనుచును జక్కఁ గాను
దోఁచె నొకఁడు సాయమొసఁగి ప్రోచె నొకఁడు
పట్టఁగ నిఘావిభాగమ్ము చట్టన యటు
ముట్టి యెకఁడు సచ్చె మడిసె మట్ట కొకఁడు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పట్టి తగఁ జెట్టపట్టాల నట్టహాస
మునను జుట్టరికము మూర ముదము తోడఁ
దిరిగి యిద్దఱు విద్యుత్తు తీఁగ నకట
ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్ట కొకఁడు


దట్టపు గుట్టు రట్టయినఁ దట్టుకొనంగఁ దరమ్ము గాక యే
పట్టున నెట్టు లైన మెయి వట్టఁగ నెట్టనఁ దట్ట కన్యముల్
పట్టిన యట్టి బెట్టిదపుఁ బట్టును వీడక యగ్ని నన్నమున్
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

విరించి చెప్పారు...


పుట్టనుండి పై కెగయుచు పుట్ట పురుగు
మట్టి చదును జేసెడి వారి మధ్యదూరి
ముట్టి యొకఁడు సచ్చె , మడిసె ముట్టకొకఁడు
బిలశయపు రూపమును గని భీతి తోడ.


కట్టెదమంచు గోడనట కార్మికులిద్దరు వచ్చి యచ్చటన్
మట్టిని త్రవ్వు వేళనొక మండలి బుస్సుని పైకి లేవగా
ముట్టి యొకండు సచ్చె, మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్
పుట్టసమీపమందు బుసపుర్వును గుండెయె యాగిపోవగన్.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

తరుణి ద్రౌపదీ దేవిని ధరణి యందు
*ముట్టి యొకఁడు సచ్చె ,మడిసె ముట్టకొకఁడు*
ధరణిజ నశోకవనమున దాచి వడిగ
స్త్రీలనవమానపరచినశిక్షయిదియె

పట్టగనాంజనేయునటబందినిచేయగ దైత్యు లెంచుచున్
చుట్టిరికట్టివేయగనుసూత్రముతోడనుమేఘనాథుతో
బెట్టునుచేయకన్వడిగవెంబడిసాగుచుహూంకరించగా
ముట్టియొకండుసచ్చెమరిముట్టకచచ్చెనొకండు చూడగన్