2, మార్చి 2011, బుధవారం

ప్రత్యేక సమస్యా పూరణం - (హర హర శంకరా)

కవి మిత్రులారా,
అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
ఈ రోజు పూరించ వలసిన ప్రత్యేక సమస్య ఇది ......
హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో.
శివరాత్రి సందర్భంగా ఈ సమస్యను సూచించిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

58 కామెంట్‌లు:

 1. రవిగారు,
  చక్కగా చిక్కు విడదీశారు.
  హరుషము (హర్షము) అన వచ్చా, ప్రమదము స్థానంలో?

  రిప్లయితొలగించండి
 2. శంకర గురువులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
  కవి మిత్రులకు, పండిత వరేణ్యులకు, తెలుగు పద్యాభి మానులకు
  మహాశివరాత్రి పర్వ దిన పవిత్ర కామనలు.

  రిప్లయితొలగించండి
 3. తెరువరి యొక్కడున్ శివుని తీరుగ పూజలఁ జేయుచూ మదిన్
  వరముగ కోరెఁ జక్కనయిన భార్యను; ఈశుడుఁ దీర్ప కోరికన్
  పరమగు సంతసంబు గొని భక్తియు రక్తియు నేకమవ్వగా
  హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో.

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి.

  ఒకప్పుడు భార్యపై శంకతో కొట్టిన భర్త తప్పు తెలుసుకొని చేరదీసిన సమయంలోఅన్న మాటలు.అతనికి హరా! అనటం అలవాటు.


  కొరకొర జూచి కొట్టితిని కోపము తోడను శంక తో, హరా!
  చరచర ఈడ్చినాను నిను చావిడి బైటకు నాడు, నేటితో
  పొరలవి వీడి పోయినవి పొల్పుగ నీయెడ యెంచనెప్పుడున్
  హర!హర!శంక,రా!యనుచు నాలిని కౌగిట జేర్చె బ్రేమతో.

  రిప్లయితొలగించండి
 5. నిరుపమ నీరసం బలమి నిస్పృహ నుండె వరాంగి భార్య. నీ
  కరుణను చూపి కావుమని కాల గళూన్ వినుతింపఁ, గాచె నా
  పరమ శివుండు.క్రోలుకొనె భార్య.ముదంబున గాంచి యాతఁడున్
  హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో.

  రిప్లయితొలగించండి
 6. మందాకిని గారు, నేను పద్యంలో లోపం గ్రహించి దిద్దేలోపు మీరు సూచించారు. "హరుషము" లో "హ" కు, పదవ అక్షరం "భ" కున్నూ యతిమైత్రి చెల్లదు. సవరించిన పద్యం చూడండి.

  కవిమిత్రులకు, బ్లాగు పాఠకులకూ అందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 7. బురహరు గొల్చి దంపతులు బుణ్యము బొందగ నేగ కాశికిన్
  తరుణిరొ దప్పె దారి ,పెను దాపము జెందె నతండు ,నశ్రువుల్
  దొరెలెను నేకధాటిగను,దోయిలిబట్టి నుతింప, గన్పడన్
  హర హర శంకరా యనుచు నాలిని గౌగిట జేర్చె ప్రేమతో !!!

  రిప్లయితొలగించండి
 8. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు!
  - బాలు మంత్రిప్రగడ

  రిప్లయితొలగించండి
 9. రవి గారూ,
  పూరణ బాగుంది. అభినందనలు.
  అయితే "చేయుచూ" అనడం, "చక్కనయిన" అన్నప్పుడు గణదోసం కల్గడం చిన్న తప్పులే.
  బహుశా మీరు "చేయుచున్" అనబోయి టైపాటు జరిగిందనుకుంటా. అక్కడ "చక్కనిది" అందాం.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మూడవ పాదం చివర "నీ యెడ నెంచ దోషముల్" అంటే ఎలా ఉంటుంది?

  చింతా రామకృష్ణారావు గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. ధన్యవాదాలు.
  "కాలగళున్" పొరపాటున "కాలగళూన్" అని టైపయింది.

  మంద పీతాంబర్ గారూ,
  ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
  కాని ఆదిలోనే హంసపా దన్నట్లు "పురహరుని" టైపాటుతో "బురహర" చేసారు.

  శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. శంకరయ్య గారూ, నాది పొఱబాటేనండి. టైపాటు కాదు. ఇంకా నేను ఔత్సాహిక కవినే కాబట్టి తప్పులు మామూలే. మీకూ తిప్పలు మామూలే. :) కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 11. కరకర లాడు యాకలిని, కాల్చెడు గ్రీష్మపు టెండ వేడిమిన్
  సరకును జేయకా హరుని సన్నిధి జేరగ బోవు వేళలో
  హరహర! శంకరా! యనుచు, నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో,
  కరము శ్రమించి వాడగను కాంచు మదే గుడి యంచు చూపుచున్.

  రిప్లయితొలగించండి
 12. శంకరార్యా! ధన్యవాదములు.నీ యెడ యెంచనెప్పుడున్(హర!హర!)శంక,.. రా! యనుచు...అని నా భావం.

  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 13. గురుకుచ భారయైన నొక కోమలి బెండిలి యాడి కూడి సం
  బరమున నామె కంఠమున బంగరు రంగులనీను లింగమున్
  ఒరిసికొనన్ గగుర్పొడిచి యోరిమి పక్కకు తీసివైచుచున్
  హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో.

  ( తీసి పక్కన పెట్టేటప్పుడు ఆ మాత్రం తలచుకోకపోతే ముక్కంటి ఆగ్రహించడూ ? )

  రిప్లయితొలగించండి
 14. విష్ణునందన్ గారూ, గురుకుచ భారయైన "కోమలి", బంగరు రంగులనీను లింగము, గగుర్పొడిచి యోరిమి, హరహర యనుచు కౌగిట చేర్చుట - బావుందండి. :))

  రిప్లయితొలగించండి
 15. గోలి హనుమచ్ఛాస్త్రి శాస్త్రి గారూ,
  క్షంతవ్యుణ్ణి. అసలు చమత్కార మంతా ఆ చివరి పాదం విరుపులోనే ఉంది. మూడు పాదాలూ చదివి, నా దృష్టిని నాల్గవ పాదంలో మీరు పెట్టిన విరామ చిహ్నాలను గమనించక మీ పూరణలోని సారస్యాన్ని గమనించలేదు. మన్నించాండి.

  మిస్సన్న గారూ,
  ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  డా. విష్ణు నందన్ గారూ,
  అద్భుతమైన పూరణ. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. శివరాత్రి రోజంతా అభిషేకాలు చేసి చేసి మంత్రాలు చదవటము అలవాటైన పురోహితుఁడి పరిస్థితి:-,

  "హర హర శంకరా!" యనుచు న్యాసముతో పలు మార్లు పల్కి వే
  ద రవము మింటినంటగ సదాశివుఁడౌను పురోహితుండు, తాన్
  పురహర మంత్రముల్ మరచి పోవక శంకర రాత్రి పిమ్మటన్
  హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో.

  రిప్లయితొలగించండి
 17. శ్రీయుతులు చింతా రామకృష్ణా రావు, విష్ణు నందను గార్ల పూరణలు
  అనుపమానంగా విరాజిల్లుతూ మహదానందాన్ని కల్గిస్తున్నాయి.
  రవి గారి భక్తుడు శివానుగ్రహం వల్ల అందమైన భార్యను పొందడం అందంగా ఉంది.
  గోలి వారి భక్తుడు దొరికిన భార్యను హింసించి, తిరిగి పశ్చాత్తాప పడటం మంచి
  విరుపుతో భాసిస్తోంది.
  పీతాంబర ధరుని భక్తుడు భార్యను పోగొట్టుకుని శివ ప్రసాదం వలన తిరిగి
  పొంది ఆనంద పడటం సుందరంగా ఉంది.
  జిగురువారి భక్త పురోహితుడు భార్యతో సరసంలో గూడ శివ నామ స్మరణ
  చెయ్యడం చిలిపిగా ఉంది.
  కానీ వసంత మహోదయుల పద్య తోరణాల భక్తుడు గానీ,
  గన్నవరపు వారి పదగుమ్ఫన భక్తుడు గానీ,
  చంద్ర శేఖరుల పురాణ పురుషోత్తమ భక్తుడు గానీ,
  ఇంకా మిగిలిన కవి మిత్రుల శివ భక్తులు గానీ
  కనపడక పోవడం వెలితిగా ఉంది.
  బహుశ వారందరూ ఉపవాస జాగరణాలతో అలసి పోయున్టారని అనుకొంటున్నాను.

  రిప్లయితొలగించండి
 18. గురువులు ,సోదరులు అందరికి మహా శివరాత్రి శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి
 19. అందరికీ
  మహాశివుని కరుణా కటాక్ష వీక్షణములు
  లభించుగాక !
  అందరి పూరణలూ చక్కగా అలరించు చున్నవి !

  రిప్లయితొలగించండి
 20. @@@@@@@@ భక్త సిరియాళుని కథ @@@@@@@@
  _______________________________________________

  కాంచీపురంలో చిరుతొండనంబి అనే వైశ్యకులశేఖరుడు ఉండేవాడు.
  చిరుతొండ నంబి అఖండ శివభక్తి తత్పరుడు.
  ఆయన భార్య తిరువెంగనాంచి.
  ఆ పుణ్య దంపతులు జంగమారాధనా తత్పరులు.
  వారి పుత్రుడు సిరియాళుడు.
  చిరుతొండడు పూర్వజన్మవాసనా విశేషంచేత ఏకామ్రనాథుణ్ణి ఆరాధిస్తూ
  జంగమ ప్రమథులకు అడిగిన పదార్థం లేదనక సదా అన్నదానం చేసేవాడు.

  ఒకనాడు పరమశివుడు పార్వతీదేవికి
  చిరుతొండని భక్తి ప్రభావం నిరూపింప దలచాడు.

  నిత్యన్నదానశీలుడైన చిరుతొండనంబికి ఒకనాడు
  ఒక్క శివయోగి కూడా కనిపించలేదు.
  తిరిగి తిరిగి చివరకు కాంచీపురం ఊరిబయట ఉన్న పాడుబడిన గుడికివెళ్ళాడు.
  గర్భమంటపంలో ఒక వృద్ధుడు, అతనికి సేవ చేస్తున్న ముసలి అవ్వ కనిపించారు.
  ఆ మాయ జోగి దంపతులకు ప్రణామం చేసి,
  తమ యింటికి వచ్చి శివార్చన నందుకొని చరితార్థుణ్ని

  చేయమని ప్రార్థించాడు చిఱుతొండడు.
  ఆ పరమ వృద్ధుడు
  "ఏడు రోజుల నుండి నిరాహార వ్రతం పూని ఉన్నాను.
  ఆ వ్రతానికి ఉద్యాపనము పశూపహారము.
  ఆ యాగపశువుగా నరుడు తప్ప మరొకడు పనికి రాడు.
  సుందరుడు, రోగ విహీనుడు, అయిన ఆ పిన్న వయసువాణ్ని
  తల్లితండ్రులు వండి మాకు వడ్డించి, మాతో పాటు భోజనం చేయాలి."
  అని పలికాడు.

  చిరుతొండడు ఇంటికి వెళ్ళి విషయమంతా భార్యకు చెప్పాడు.
  ఆమె నవ్వి "మన శరీరార్థ ప్రాణాలకు కర్తలు శివయోగీశ్వరులే కదా!
  వారి సొమ్ములు వారికి సమర్పించడానికి ఆలోచన ఎందుకు?" అని పలికింది.
  వెంటనే శివయోగిని తీసుకురావడానికి బయలుదేరాడు చిరుతొండడు.

  అంతకు ముందే శివుడు మరొకవేషంలో
  గురువుగారి యింటిలో పాఠాలు చదువుకుంటున్న సిరియాళుని దగ్గరకు వెళ్ళాడు.
  ఆ జటాధారిని చూడగానే సిరియాళుడు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసాడు.
  భక్తి తాత్పర్యంతో నమస్కరిస్తూ నిల్చున్న సిరియాళునితో

  "నాయనా! నీ తండ్రి చిరుతొండనంబి నిన్ను చంపి
  ఒక నిర్భాగ్యుడైన శివయోగికి ఆహారంగా పెట్టబోతున్నాడు.
  కడుపున బుట్టిన కూరిమి కుమారుని, మెడకోసి చంపి
  జోగులకు పెట్టే క్రూరుడు ఈ లోకంలో

  ఏవడైనా ఉంటాడా? స్నేహ శీలిని కాబట్టి ఈ విషయం నీకు చెప్పడానికై వచ్చాను.
  బ్రతికి వుంటే బలుసాకు తినవచ్చు. నీ ప్రాణాలు కాపాడుకో" అన్నాడు.
  కుమార సిరియాళుడు చెవులు మూసుకుని

  "మహానుభావా! నీవీ రకంగా మాట్లాడడం న్యాయమా!
  ఇతరుల కోసమై శరీరమును ధనమును వ్యయం చేయడం కంటె
  ఈ జన్మకు సార్థక్య మేమున్నది!" అన్నాడు.

  చిరుతొండడు వృద్ధ శివయోగిని ఇంటికి తీసుకువెళ్లాడు.
  చిరుతొండనంబి పాఠశాలకు వెళ్లి కుమారుణ్ణి తీసుకు వచ్చాడు.
  కుమారుణ్ణి తొడమీద కూర్చుండ బెట్టుకుని ,
  "తండ్రీ! సిరియాళా! ఎల్లపుడూ పంచాక్షరీ మంత్రమే జపిస్తూ ఉండు. "
  అని పలికి కత్తితో అతని శిరమును ఖండించాడు.
  ఒక్కవ్రేటుతో క్రిందపడిపోయిన సిరియాళుని శిరస్సు "నమః శివాయ" అని మంత్రం పఠిస్తున్నది.
  భోజనశాలలో వంట సిద్ధమైంది.

  అమృతాహారం ఆరగించవలసినదిగా నమస్కరించారు నంబి దంపతులు.
  నాకు మఱొక్క నియమం ఉన్నది.
  మగబిడ్డ లేని నిర్భాగ్యుని ఇంట్లో భోజనం చేయకూడదు.
  నీ కుమారుని పిలువు." అన్నాడు మాయా జంగముడు.
  "స్వామీ! ముందే ఆ విషయం చెప్పి ఉంటే కుమారుని పిలిచేవాణ్ణి.
  ఇప్పుడు వాడెక్కడికి పోయినాడో ఆడుకోవడానికి" అన్నాడు నంబి.
  వృద్ధ దంపతులు నంబి భార్యను, ఎలుగెత్తి కుమారుని పిలవమన్నారు
  వెంటనే. "రారా! రారా! కుమారా!" అని దిక్కులు ప్రతిధ్వనించేటట్లు పిలిచింది తల్లి.

  మరుక్షణమే ఆకులలో ఉన్న శాకపాకాలనుంచీ సిరియాళ కుమారుడు వారి ముందు నిలిచాడు.
  పరమశివుడు భస్మదేహంతో నాగాలంకార భూషణుడై అర్థ చంద్రాకృతితో సాక్షాత్కరించి,
  సశరీరములతో కైలాసానికి రమ్మని వారిని ఆహ్వానించాడు.
  అంత చిఱుతొండడు "స్వామీ!" నీ దయవల్ల వేయి గోత్రములకు చెందిన మా వైశ్యులందరూ
  ఈ కంచి పట్టణంలో ఈశ్వరా రాధనం చేస్తూ ఉన్నారు.
  వారి నందరిని వీడి నేనొక్కడినే రాలేను.
  ఇంతమందినీ కైలాసానికి రమ్మంటే వస్తాను" అన్నాడు.
  శంభుడు కరుణించి కంచిలో ఉన్న వైశ్యులందరూ

  కైలాసానికి వచ్చేటట్లు వరం ప్రసాదించాడు.

  కన్న కుమారుని కూడా బలిచేయడానికి వెనుదీయకుండా
  తనతోపాటు స్వజనానికి కూడా మోక్షం ఇప్పించిన చిరుతొండ నంబి,
  పరోపకారార్థమై తన శరీరమే దానమొనర్చిన సిరియాళుడు,
  శైవభక్తులలో అగ్రగణ్యులు

  రిప్లయితొలగించండి
 21. 01)
  _____________________________________________

  స్థిరమగు భక్తి తత్పరత - సేవ యొనర్చగ , శైవ యోగికిన్
  వర సిరియాళునిన్ , కొమరు;- వాజజ మందున ,కూర జేసినన్ !
  వరముగ పుత్రునే మరల - బైరవు డిచ్చిన ,తొండనంబి యే
  హర ,హర ,శంకరా! యనుచు - నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో!
  _____________________________________________

  వాజజము = భోజనము
  తొండనంబి = చిరు తొండనంబి
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 22. మిస్సన్న గారూ, "కరము శ్రమించి..." అంత కష్టపడటానికి కారణం ఏమిటో, కొంచెం వివరించండి ప్రభో (నవ్వుతూ)! మీరు సరిగానే వూహించారు, శివరాత్రి పర్వదినాన రుద్రాధ్యాయ వ్యాఖ్యానం చదటంలో మునిగిపోయాను.
  ధ్యానశ్లోకము:
  శరశ్చంద్ర ప్రకాశేన వపుషా శీతల ద్యుతిమ్ |
  ధ్యాయేత్సింహాసననాసీన ముమయా సహితం శివమ్ ||
  తాత్పర్యము: శరత్కాలమునందలి చంద్రుని వంటి కాంతి గల దేహముతో గూడిన వాడును చల్లని కాంతి గలవాడును సింహాసనమున కూర్చొండినవాడును పార్వతీ దేవితో గూడిన వాడును యగు శివుని ధ్యానించ వలెను.
  శుభం భూయాత్,
  చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 23. చంద్ర శేఖరా జన్మానికో శివరాత్రి ని ధన్యత నొందారు.
  కరము శ్రమించడానికి కారణం మీకు తెలిసిందే:
  "కరకర లాడు యాకలిని, కాల్చెడు గ్రీష్మపు టెండ వేడిమిన్"
  నడచి కొండపైనున్న శివాలయానికి వెడుతున్నారు దంపతులు.

  రిప్లయితొలగించండి
 24. కిశోర మహోదయా మీరు శివ ధ్యానంతోనే రోజంతా గడపి ఉంటారు.
  భక్త సిరియాలుని కథ చెప్పి మమ్మల్ని కూడా దురిత దూరుల్ని జేశారు.
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 25. జిగురు సత్యనారాయణ గారూ,
  మిస్సన్న గారు ప్రశింసించినట్లే మీ పూరణ సరసంగా విరాజిల్లుతున్నది. అభినందనలు.

  వసంత్ కీశోర్ గారూ,
  తెలిసిన కథ ఐనా మీరు చెప్పిన విధానం బాగుంది. నా బ్లాగును శివమయం చేసారు. ధన్యవాదాలు.
  ఇక మీ పూరణ కూడ మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. మిస్సన్న గారూ నాకు పదగుంఫన లేదు, పురాణ జ్ఞానము లేదు, సరే యీ మధ్య చర్చ నాధారంగా,

  మురిపెము లన్ని మీఱ ముది భూసురు డేగెను శీతశైలమున్
  కరవయె దర్శనం బకట ! గాంత వరూధిని వేనిఁ జిక్కెనో !
  భరమయె దృశ్య భావనలు; భారము వాయెను గాన స్వప్నమున్
  హరహర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో !

  రిప్లయితొలగించండి
 27. కిశోర్ జీ మీరు చక్కని కధకులు. శ్రీనాధుల వలె చెప్పారు. మీ పద్యము కూడా భక్తి భావముతో చాలా బాగుంది. మిత్రుల అందఱి పూరణలు చాలా బాగున్నాయి. అందఱికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివనామ స్మరణ చేయించిన మిస్సన్న గారికి కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 28. వసంత్ కిశోర్ గారూ,
  మీ అనుమతి లేకుండా మీ కథను ప్రత్యేకమైన పోస్ట్‌గా పెట్టాను. మన్నించాలి.
  మీరు కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. వ్యాఖ్యగా ఉంటే అందరి దృష్టిలో పడదు. దానిని పోస్ట్‌గా పెట్టినప్పుడే బ్లాగు అగ్రిగేటర్ల ద్వారా ఎక్కువమంది చదివే అవకాశం ఉంటుంది.

  రిప్లయితొలగించండి
 29. శంకరార్యా !మన్నించాలి !
  అది నా సొంతం కాదు !
  సిరియాళుని మీద పద్యం వ్రాద్దామని
  జాలంలో వెదకి దాన్ని కొంచెం తగ్గించి
  నా పద్యానికి నేపథ్యంగా పెట్టాను !

  మూర్తిగారూ ! మొత్తం మీద మిస్సన్న గారెత్తుకు పోయిన
  వరూధినిని చివరికి కలల్లో కౌగలించుకున్నారన్నమాట ! హవ్వ !!!
  ఎలాగయితేనేం సాధించారు ! ధన్యవాదములు !
  మిస్సన్న గారిక్కూడా !

  రిప్లయితొలగించండి
 30. అవునుస్మీ వసంత మహోదయా నరసిహ మూర్తి గారు వరూధినిని పట్టేశారు గదా! నేను మరచే పోయాను. అభినందనలు అబ్బాయీ!

  రిప్లయితొలగించండి
 31. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ చంత్కార జనకంగా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 32. నా పూరణ ..........................

  పురుషుఁ డొకండు పెండ్లి కని పోయె నదే పొరుగూరు; పెండ్లి సం
  బరముల మూడు రోజు లతి భారముగాఁగ గృహమ్ము జేరి తొం
  దరపడి భార్య చీర మెయి దాల్చిన దాసికి ముద్దు పెట్టి "హా!
  హరహర శంకరా!" యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో !

  రిప్లయితొలగించండి
 33. శంకరయ్య మాష్టారు కూడా యువకుల గ్రూప్ లో చేరిపోయారు (నవ్వుతూ). "చీర మెయి దాల్చిన దాసికి..." బాగుంది.

  రిప్లయితొలగించండి
 34. శంకరార్యా !
  మీరిలా యూత్ లో కలసి పోవడం ఏమీ బాలేదు !
  ఇంతకీ కౌగిట్లో ఎవరున్నారో ?
  ఆలి అని మీరంటున్నారు గాని
  నా కనుమానంగానే ఉంది !

  రిప్లయితొలగించండి
 35. శంకరయ్య మాస్టారు గారూ, హరహర శంకరా అని అనుకున్నది ఆ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతతోనా? తన్మయత్వంతోనా? :)

  రిప్లయితొలగించండి
 36. గురువు గారూ మీ పద్యం జిగురు సత్యనారాయణ గారి పద్యం కన్నా కూడా చిలిపిగా ఉంది.
  నరసింహ మూర్తి గారు పదగుంఫన లేదంటూనే గుప్పించేసారు.

  రిప్లయితొలగించండి
 37. అదే మూర్తి గారి స్టైల్, మిస్సన్న గారూ. ఏమీ లేదంటూనే అందరినీ మించి పోతూంటారు(జోకుతూ). దాన్నే ఇంగ్లీషు లో "underdog" అంటారేమో. ఏమిటో ఇలాంటివి ఇంగ్లీషులో చెబితే గానీ పంచ్ రాదు, స్థాన భ్రంశ మహిమో యేమో!

  రిప్లయితొలగించండి
 38. శీతశైల 'గత ' వరూధిని మీదుగా వచ్చిన పి(చ)ల్ల గాలి చక్క(ని)లి గిలి నుంచి మిత్రులు ఇంకా బైట పడినట్లు లేదు.
  గోలి.హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 39. చంద్రశేఖర్ గారూ,
  వసంత్ కిశోర్ గారూ,
  రవి గారూ,
  మిస్సన్న గారూ,
  గోలి.హనుమచ్ఛాస్త్రి గారూ,
  .................... నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 40. చంద్ర శేఖర్ గారూ మీరు ఇంగ్లీషులో చెబితే గానీ పంచ్ రాదు అన్న సందర్భంలో గుర్తు కొచ్చింది . http://dvhrao.blogspot.com/ బ్లాగులో పంచ్ మీద ఒక చక్కటి ప్రాక్టికల్ జోకుoది . చదవండి .

  రిప్లయితొలగించండి
 41. మిస్సన్నగారూ,
  హనుమంతరావు గారి బ్లాగ్ బాగుంది. బాబూ, నేను పంచ్ రాదు అని వ్రాసినప్పుడు వంటి మీద పంచున్దండీ ప్రభో (నవ్వుతూ). లేకపోతే వీపు మీద పంచ్ పడేదే!
  కొసమెరుపు: ఈ రకమైనపద ప్రయోగాన్ని చేసినప్పుడు నవ్వుతూ "Pun intended" అని అనటం ఇక్కడ అలవాటు. ఇంక ఆపేస్తాను. లేకపోతే మాస్టారు తెలుగు క్లాస్లో ఇంగ్లీషు మాట్లాడినందుకు కేకలేస్తారు.

  రిప్లయితొలగించండి
 42. ఎప్పుడు సమస్య పూరిద్దామని వచ్చినా అప్పటికే బోలెడన్ని పూరణలు కనిపించేవి. వాటి కన్నా వేరే ఆలోచనేదీ తట్టక మరి ప్రయత్నించే వాణ్ణి కాదు. చాలా రోజులకి, వచ్చిన పూరణలకన్నా కాస్త భిన్నమైన ఆలోచన చెయ్యగలిగాను! నా పూరణ:

  గరువముతోడ శంకరుని గామవిమోహితు జేతునంచు దా
  త్వరపడి పోయి బూడిదయి భార్య రతి ప్రణిధి ప్రసాదమై
  తిరిగి సజీవుడై అహము దీరగ మారుడు మ్రొక్కె నీశునిన్
  హరహర శంకరా యనుచు, నాలిని గౌగిట జేర్చె బ్రేమతో

  రిప్లయితొలగించండి
 43. భైరవభట్ల కామేశ్వర రావు గారూ,
  మనోహరమైన పూరణ. అభినందనలు.
  ఈ రోజు మధ్యాహ్నం నా సెల్‌ఫోన్‌లో లోడ్ చేసిన రహస్యం చిత్రంలోని "గిరిజా కళ్యాణం" విన్నాను. అదే అంశంతో మీ పూరణ కనిపించడం కాకతాళీయమే. నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 44. హమ్మయ్య, మా కామేశ్వర రావు గారిని ఇప్పటికి కాముడు కదిలించాడన్న మాట. ఇంకనేఁ సమస్యాపూరణ పూల బాణాలు వేస్తూవుండ౦డి.

  రిప్లయితొలగించండి
 45. కామేశ్వర రావు గారు చక్కని పూరణ. మా పూరణలు ఎన్ని వున్నా మీ పద విన్యాసము వేరుగా ఉంటొంది. మీ పద్యాలు చదవడానికి మేమెప్పుడూ సిధ్ధమే. తఱచు రండి.

  రిప్లయితొలగించండి
 46. శంకరయ్యగారు, చాలా మంచి పాట గుర్తు చేసారు. వెంటనే యూట్యూబులో పెట్టుకొని విన్నాను.
  చంద్రశేఖర్ గారు, ఇక్కడందరికీ పూరణబాణాల అక్షయతూణీరాలే ఉన్నాయండి! నాకున్నవి వేళ్ళ మీద లెక్కపెట్టే అంతే :-)
  నరసింహమూర్తిగారు, మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 47. అందని చందమామైన
  ఆముక్త మాల్యదను
  అందరికీ
  అందుబాటులోకి తెచ్చి
  అలరిస్తున్న
  కామేశ్వరరావు గారి పూరణ
  అద్భుతంగా
  అసామాన్యంగా ఉంది !

  రిప్లయితొలగించండి
 48. అమోఘమైన పూరణ నిచ్చిన భైరవభట్ల వారికి నమోవాకములు.

  రిప్లయితొలగించండి
 49. మరొక చిన్న ప్రయత్నం :

  02)
  ____________________________________________

  మరణము ,కన్నతల్లి కర - మందునె గావలె ! నన్యథా వృధా !
  వరమును గొన్న యట్టి ,ఘను ! - భండన మందున గూల్చినట్టి దౌ
  నరకుని తల్లియైన ,సతి; - నాపద గాచగ మెచ్చి; కృష్ణుడే
  హర హర శంకరా యనుచు - నాలిని గౌఁగిటఁ జేర్చెఁబ్రేమతో !
  ____________________________________________

  రిప్లయితొలగించండి
 50. వసంత్ కిశోర్ గారూ,
  పద్యం బాగుంది. అభినందనలు.
  అయినా కాపాడింది భార్య అయితే కృష్ణుడు శివుణ్ణి ఎందుకు తలచుకున్నాడు?

  రిప్లయితొలగించండి
 51. శంకరార్యా !
  ధన్యవాదములు !

  ఎందుకంటే హరి హరులిద్దరూ సదా
  ఒకరి నామం మరొకరు జపిస్తూ
  ఉంటారట గదా !

  రిప్లయితొలగించండి
 52. శంకరార్యా !
  కామేశ్వరరావు గారి పద్యం
  రెండవ పాదంలో యతి ఎలా కుదిరిందో ?

  "త్వరపడి పోయి బూడిదయి - భార్య రతి ప్రణిధి ప్రసాదమై"

  కొంచెం వివరించ గలరా !


  భార్య ర(తి )ప్రణి(ధి) ప్రసాదమై
  అన్నప్పుడు (తి) , (ది) -లు గురువు లౌతాయా ?
  సందేహ నివృత్తి చేయగలరు !

  రిప్లయితొలగించండి
 53. వసంత్ కిశోర్ గారూ,
  అసలు మీ కనుమానం ఎందుకు వచ్చింది?
  "త్వ"లోని వకారానికి "భా" కు యతి చెల్లింది. "ప - ఫ - బ - భ - వ" లకు యతి చెల్లడం "అభేద యతి". "రతి ప్రణిధి ప్రసాదమై" అనేది ఏకసమాసం కనుక తి, ధి లు గురువు లవుతాయి.

  రిప్లయితొలగించండి
 54. శంకరార్యా !
  సందేహములు తీర్చినందులకు
  ధన్యవాదములు !
  సందేహం ఎందుకంటే ,ఏంచెప్పను ?
  వాటికి హేతువు వుండదు !
  "త" కు -"భా"- కు యతి ఎలా కుదిరింది ?
  అనే ఆలోచనలో "వ" వత్తు గమనించలేదు !

  మీకు అనుభవం ఉందో లేదో
  పెద్ద కూడిక చేసేటప్పుడు మధ్యలో 2+2 = 5
  అని మొదట తప్పుగా కూడితే
  ఆ తరువాత ఎన్నిసార్లు కూడినా మన తప్పు మనకి దొరకదు
  వేరే వాళ్ళు పట్టివ్వవలసిందే !

  ఇక రెండవది అదే -ఏక సమాసమా కాదా అనే !
  మరొక్కసారి ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 55. అరచుచు భార్య బిడ్డలను హైరన జేయుచు డబ్బులేకయే
  కరవులు తీర లాటరిని గంపెడు లక్షలు చేతికందగా
  బరువగు శైవుడొక్కడహ బంగరు గాజులు చేతబూనుచున్
  హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో

  రిప్లయితొలగించండి