11, మార్చి 2011, శుక్రవారం

ప్రత్యేక సమస్యా పూరణం - 252 (విగ్రహముల పైన)

కవి మిత్రులారా,
నిన్నటి విధ్వంసం తెలుగువారంతా సిగ్గుపడవలసిన సంఘటన. ఈ విధ్వంసంపై కవిమిత్రులు స్పందించ వలసిందిగా మనవి.
ఈ పూట పూరించ వలసిన సమస్య ఇది ......
విగ్రహముల పైన నాగ్రహమ్ము.

51 కామెంట్‌లు:

  1. నిగ్రహమున జనత నినదించ కోరగా
    కుత్సితమున ప్రభుత కుళ్ళబొడిచె!
    నీతి లేని ప్రభుత నిర్దయకు ఫలితమ్ము
    విగ్రహముల పైన నాగ్రహమ్ము!!

    రిప్లయితొలగించండి
  2. నచికేత్ గారూ,
    వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు. పద్యమూ, అందలి విషయమూ బాగున్నాయి.
    "నిర్దయకు ఫలితమ్ము" అంటే గణదోషం ఉంది. "నిర్దయ ఫలితమ్ము" అంటే సరి.

    రిప్లయితొలగించండి
  3. అత్త మీద యలిగి దుత్త పై యన్నటుల
    దుష్ట బుద్ధి తోడ దనుజు లైరి
    కన్ను పొడుచు కొనిరి మిన్నుగానక యుండి
    విగ్ర హముల పైన నాగ్రహమ్ము

    రిప్లయితొలగించండి
  4. కూల్చిరేమొ బూని గొప్పలెంచకనట
    విగ్రహముల పైన నాగ్రహమ్ము
    కుదురునొందె మాదు గుండెలోతులఁగల
    వెండినిండినట్టివిగ్రహములు

    రిప్లయితొలగించండి
  5. కృష్ణ రాయల కీర్తి కీడు కల్గించెనా ?
    .................బ్రహ్మ నాయుండన్న భయమ నీకు?
    నన్నయ, యెర్రన నగుబాటు జేసిరా?
    .................క్షేత్రయ్య, మొల్లలు చెడిరె నీకు?
    సిద్ధేంద్ర యోగులు సిగ్గిల జేసిరా?
    .................బళ్ళారి రాఘవ పరు డె నీకు?
    అన్నమయ్య పదాలు చిన్న బుచ్చెనె నిన్ను?
    .................జాషువా, శ్రీశ్రీ లు శత్రు లైరె?
    రఘుపతి, ముట్నూరి రచ్చ చేసిరె నిన్ను?
    .................రామలింగా రెడ్డి రంకె లిడెనె ?
    గురజాడ, చౌదరి ఘూర్ణిల్ల జేసిరే ?
    .................వీరేశ లింగము వెతల నిడెనె ?
    ఆర్థరు కాటను ఆరడి బెట్టెనే ?
    .................పింగళి వెంకయ్య దొంగ యగునె?

    చూడ లేనట్టి యంధుని చూడ్కి నీవు
    వ్యవహ రించితి వీనాడు అధము డవయి
    తెలుగు మహనీయ మూర్తుల వెలుగు జూపు
    విగ్రహ మ్ముల పైననా నాగ్ర హమ్ము?

    రిప్లయితొలగించండి
  6. మిడిసి పడుచు ప్రభుత మిలియను మార్చికి
    అనుమతించ కుండ అణచ జూడ
    త్రోవ దప్పి జనులు తుదకు జూపించిరి
    విగ్రహముల పైన నాగ్రహమ్ము.

    రిప్లయితొలగించండి
  7. నన్నయ జేసిన నయ వంచనేమిటి?
    ................. తెలుగు భారతమును తెలిపెఁ గాని!
    అన్నమయ యొనర్చి నన్యాయము కలదె?
    ................. భక్తి కీర్తనముల బాట తప్ప!
    బళ్లారికి కలవె ప్రాంత భావంబులు?
    .................. నాటక రంగాన మేటి గాని!
    కార్పణ్యము కలదె కందుకూరికిఁ జూడ?
    ................. సంఘ సంస్కరణము సలిపె గాని!

    తగునె దుర్జనులకు తారతమ్యము లేక
    మూర్ఖులగుచు వెనుక ముందు గనక
    తెలుగు వారి ఘనత నిలిపినట్టి ఘనుల
    విగ్రహముల పైన నాగ్రహమ్ము?????????????????????

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు.

    సమస్యా పూరణము-251 లో
    గురువుగారికి నేను చేసిన విఙ్ఞాపన ఇది.
    _________________________________________

    మందాకిని గారూ !
    మీ స్పందన చాలా చక్కగా తెలిపారు !

    నిన్నటి దురదృష్ట మైన సంఘటన
    టాంక్‌బండ్ వద్ద
    విఙ్ఞాన మూర్తుల విగ్రహ ధ్వంసం పై
    నా తీవ్ర నిరసనము :

    01)

    ఉద్యమ మనగా నేమది ?
    విద్యార్థులు , ప్రజలు గూడి - విధ్వంసమ్మే ?
    మద్యము త్రావిన చందము
    నధ్యాత్ముల విగ్రహముల - నాశమ్మేనా ?

    శంకరార్యా !దీనికొక ప్రత్యేక పేజీ కేటాయించి
    సభ్యులందరికీ స్వేచ్చగా నిరసన
    తెలుపుట కవకాశము కలిగింపుడు !

    11 మార్చి 2011 7:18 సా
    ___________________________________________

    కాని నాకన్నా గంట ముందే గురువుగారు
    ఈ సమస్య నిచ్చి యుండుట నేను గమనించలేదు !

    శంకరార్యా !
    మీ స్పందనకు పాదాభివందనం !

    రిప్లయితొలగించండి
  9. అందరికీ వందనములు.

    నచికేత్ గారూ !
    "నీతి లేని ప్రభుత"
    సరిగ్గా చెప్పారు !

    అక్కయ్యా !
    "కన్ను పొడుచు కొనిరి"
    నువ్వు చెప్పింది నిజం !
    మన చేత్తో మన కంటినే పొడుచుకున్నట్లుంది
    ఈ దుందుడుకు చర్య !

    వూకదంపుడు గారూ !
    ముమ్మాటికీ నిజం !
    రాతి విగ్రహాల్ని కూల్చ గలరు గాని
    గుండె లోతుల్లో గూడు కట్టుకున్న
    విగ్రహాల్నెవరు కూల్చ గలరు !

    కళ్ళుండీ చూడలేని అంధుల్లారా !
    మిస్సన్న మహాశయుల ప్రశ్నలకు
    ఎవరు జవాబు చెబుతారు ?

    హరిగారూ !
    "మిడిసి పడుచు ప్రభుత"
    సరిగ్గా చెప్పారు !

    జి ఎస్ జీ !
    "వెనక ముందు గనక మూర్ఖులగుచు"
    నూటికి నూరు పాళ్ళూ నిజం !

    ఇది ప్రపంచంలోని ప్రతీ తెలుగువాడూ
    ఏక కంఠంతో గర్‌హించ వలసిన విషయం !

    తీవ్రంగా స్పందించిన వారందరికీ
    నా పాదాభి వందనం !

    రిప్లయితొలగించండి
  10. @@@ స్వేచ్ఛా గీతము @@@

    రాయ లేమి జేసె ?
    రాయితో గొట్టగ !!!
    ఓ యన్నలారా !

    నన్నయ దే నేరము ?
    మన్నన మరచిరి !!!
    ఓ యన్నలారా !

    ఎర్రన తప్పేమి ?
    గుర్రు మనుటకు!!!
    ఓ యన్నలారా !

    నాయుడెన్న డైన
    న్యాయంబు దప్పెనా ?
    ఓ యన్నలారా !

    క్షేత్రయ్య కూల్చగ
    కారణంబది ఏమి ?
    ఓ యన్నలారా !

    మొల్ల కెందుకు మీరు
    ముష్టి ఘాతము లిడిరి
    ఓ యన్నలారా !

    సిద్ధేంద్రుని దునుమ
    సిగ్గు లేదా మీకు?
    ఓ యన్నలారా !

    రాఘవ నెందుకు
    రాలగొట్టితిరయ్య ?
    ఓ యన్నలారా !

    అన్నమయ్య కింత
    అన్యాయ మెందుకు?
    ఓ యన్నలారా !

    జాషువా పట్లను
    జాతివైర మదేమి ?
    ఓ యన్నలారా !

    శ్రీ శ్రీయె చివరికి
    శత్రువై పోయెనా?
    ఓ యన్నలారా !

    రఘుపతి నేలనో
    రచ్చ జేసిరి మీరు ?
    ఓ యన్నలారా !

    ముట్నూరి పట్ల ,న
    మర్యాద ఎందుకు ?
    ఓ యన్నలారా !

    గురజాడ నీతులు
    గుర్తెరుగరా మీరు ?
    ఓ యన్నలారా !

    చౌదరి పట్ల , నప
    చార మెందుకు ?
    ఓ యన్నలారా !

    వీరేశు నెందుకు
    వికల మొనర్చిరి ?
    ఓ యన్నలారా !

    కాటను పట్లింత
    కాఠిన్య మెందుకు ?
    ఓ యన్నలారా !

    పింగళి కెందుకు
    మంగళము పాడి?
    రో ,యన్నలారా !

    నీ వేలితో నీవు
    నీ కన్నునే పొడుచు
    టో ,యన్నలారా!

    జాతి వెలుగుల పట్ల
    జాలైన లేదేమి?
    ఓ యన్నలారా !

    మహనీయుల పట్ల
    మర్యాద మరచి ?
    రే, యన్నలారా !

    నీడ నిచ్చిన కొమ్మ
    నే నరుకు కొందురా ?
    ఓ యన్నలారా !

    మీ యింటి దీపమ్ము
    మీ రార్పు కొందురే ?
    ఓ యన్నలారా !

    కళ్ళుండి గూడను
    కబోదు లైతిరే ?
    ఓ యన్నలారా !

    కుళ్ళు ప్రభుత్వపు
    కుట్ర కే బలైతిరే ?
    ఓ యన్నలారా !

    మంచి యన్నది మీరు
    మరచి రయ్యయ్యో!!!
    ఓ యన్నలారా !

    మానవత్వపు విలువ
    మాయమైనది నేడు
    ఓ యన్న లారా !

    మంచి చెడు తేడాను
    గమనించ కున్నారు !
    ఓ యన్నలారా !

    చేసిన తప్పుకు
    చెంపలేసి కొనుడు !
    ఓ యన్నలారా !

    మహనీయ మూర్తుల
    మన్నింపు కోరు
    డో ,యన్నలారా !

    రిప్లయితొలగించండి
  11. 01)
    ____________________________________

    జాతి వెలుగు కోరి - జగమెల్ల ,కీర్తింప
    ధన్య చరితు లైరి - ధరణి యందు !
    మంచి గోరు నట్టి - మహనీయ మూర్తుల
    విగ్రహముల పైన - నాగ్రహమ్ము!
    _____________________________________

    రిప్లయితొలగించండి
  12. 02)
    ____________________________________

    వలదు వేర టంచు !- వారేమి జెప్పిరె ?
    నోరు వాయి లేక - నూర కుండు !
    ధరణి బుట్టి నట్టి - ధన్య మూర్తు లయిన
    విగ్రహముల పైన - నాగ్రహమ్ము!
    _____________________________________

    రిప్లయితొలగించండి
  13. 03)
    ____________________________________

    చేత నైన మంచి - చేసిన వారలు
    నేడు లేరు; గనుము - నిలను , నిజము !
    తెలుగు జాతి దివ్య - దీప్తు లై నటువంటి
    విగ్రహముల పైన - నాగ్రహమ్ము!
    _____________________________________

    రిప్లయితొలగించండి
  14. 04)
    ____________________________________

    సాము గరిడి నేర్చి - సాహసంబును జూపి
    మూల నున్న ముసలి - మోది నట్లు !
    గడ్డి తినుట మేలు !- గౌరవ మూర్తుల
    విగ్రహముల పైన - నాగ్రహమ్ము!
    _____________________________________

    రిప్లయితొలగించండి
  15. 05)
    ____________________________________

    కరుణ సుంత లేద ? - కఠినాత్ములే మీరు
    కూరు చున్న కుదురు - కూల గొట్ట ?
    వెలుగు జూపి నట్టి - విఙ్ఞాన మూర్తుల
    విగ్రహముల పైన - నాగ్రహమ్ము!
    _____________________________________

    రిప్లయితొలగించండి
  16. 06)
    ____________________________________

    వింత చర్య లివి; వి - వేకమును మరచి
    వికృత చేష్ట జేయు - వెర్రు లార !
    వీధి వెంట నిలచి - వెలుగుల నిచ్చెడు
    విగ్రహముల పైన - నాగ్రహమ్ము!
    _____________________________________

    రిప్లయితొలగించండి
  17. 07)
    ____________________________________

    అంధ కార మెంతొ - అంతరంగము నందు !
    అంధు లైతి రయ్యొ ! - అక్షి గలిగి !
    న్యాయ మిదియె జూడ ?- నాశమ్ము జేయగా
    విగ్రహముల పైన - నాగ్రహమ్ము!
    _____________________________________

    రిప్లయితొలగించండి
  18. 08)
    ____________________________________

    చెంప లేసు కొనుడు - చేసిన తప్పుకు
    ఛిద్ర మైన వారి - చెంత జేరి !
    పాప ఫలము సుంత - పరిహార మగుగాక !
    విగ్రహముల పైన - నాగ్రహమ్ము!
    _____________________________________

    రిప్లయితొలగించండి
  19. 09)
    ____________________________________

    తప్పు జేయు టిలను - తప్పు గాదులె గాని
    తప్పు నెరుగ కున్న - తప్పె యౌను !
    తప్పు తెలిసి పశ్చ - తాపము నొందిన !
    తప్పు వలన ముప్పు - తక్కు వగును !
    తప్పు నెరుగు వాడె - ధన్యుండు గాడొకొ !
    విగ్రహముల పైన - నాగ్రహమ్ము!
    _____________________________________

    రిప్లయితొలగించండి
  20. వసంత మహోదయా మీ పద్యాల పరంపర, గేయం విగ్రహాల కూల్చివేత వల్ల
    మీలో కలిగిన ఆవేదనను తెలియ జేస్తోంది.
    తెలుగు సాంస్కృతీ వైభవం నీటి పాలు కావడం ప్రతి ఒక్కరి గుండెకూ గాయం చేసింది.
    ఇది మనందరం సిగ్గుతో తల దిన్చుకోవలసిన దుష్కార్యం.

    రిప్లయితొలగించండి
  21. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంశనివారం, మార్చి 12, 2011 7:15:00 AM

    ఆత్మగౌరవం కాపాడుకోవాలి అని సందేశాలిచ్చే తెలుగువాళ్ళం మనం. కానీ మనవారిని మనమే గౌరివంచుకోలేమనే అపప్రథ మరొక్కసారి చాలా అసహ్యకరంగా ఋజువయ్యింది. ప్రాంతాలు వేరయినా తెలుగు వారంతా ఒకటే అన్న కనీస మర్యాద తెలియని ఉద్యమకారులపై తీవ్ర నిరసన తెలియజేస్తూ...
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  22. విగ్రహముల పైన నాగ్రహమ్ము తగునె?
    నిగ్రహమ్ము వీడ నియతి దప్పె!
    చిత్త శుద్ధి లేని చెత్త పాలనవల్ల
    తెలుగు వెలుగు జిలుగు మలిన మయ్యె!

    తగునే నుద్యమ కారికి,
    తగునే నెవ్వారికైన, తగదేనాడున్!
    జగమెఱిగిన ఘన మాన్యుల
    పగ వారిగ నెంచి గూల్చపాడియె చూడన్!

    రిప్లయితొలగించండి
  23. రాజేశ్వరి నేదునూరి గారూ,
    మంచి భావంతో పద్యం చెప్పారు. బాగుంది. అభినందనలు.
    అయితే కొన్ని చిన్న లోపాలు. (బ్రాకెట్లో) నా సవరణలతో మీ పద్యం......

    అత్త మీ(ది యలుక) దుత్త పై (న)న్నటుల
    దుష్ట బుద్ధి తోడ (ధూర్తు) లైరి
    (కన్ను మిన్ను గనక) కన్ను పొడుచు కొనిరి
    విగ్ర హముల పైన నాగ్రహమ్ము

    రిప్లయితొలగించండి
  24. ఉకడంపుడు గారూ,
    మీ స్పందన బాగుంది. ధన్యవాదాలు.

    మిస్సన్న గారూ,
    తెలుగు జాతి ఆవేదన మీ పద్యంలో ప్రతిబింబిస్తున్నది. ఆర్ద్రత నిండిన మీ పద్యానికి జోహార్లు.
    అయితే ఎత్తుగీతిని తేటగీతిలో వ్రాసారు. నేను ఇచ్చింది ఆటవెలది కదా. మీ తేట గీతిని ఆటవెలదిగా మార్చాను (మీకు కోపం రాదు కదా!)

    చూడ లేని గ్రుడ్డి చూడ్కి తోడను నీవు
    వ్యవహరించినాడ వధముడ వయి
    తెలుగు వెలుగు స్ఫూరి మలుగజేసెను నీదు
    విగ్రహముల పైన నాగ్ర హమ్ము?

    రిప్లయితొలగించండి
  25. హరి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ సీస పద్యం చాలా బాగుంది. మీ స్పందనకు ధన్యవాదాలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ స్వేచ్ఛా గీతం తెలుగువారి ఆవేదనకు ప్రతిబింబం. మీ స్పందనకు ధన్యవాదాలు.
    మీ తొమ్మిది పద్యాలూ అర్ద్రతను నింపుకొని తప్పు దిద్దుకొనేలా చేస్తున్నవి. ఏకధాటిగా అన్ని పద్యాలు రాసారంటే జరిగిన విధ్వంసానికి మీ రెంత బాధ పడుతున్నారో తెలుస్తున్నది.
    సాంస్కృతిక విధ్వంసకారులకు వివేకం కలగాలని భగవంతుణ్ణి వేడుకొందాం.

    రిప్లయితొలగించండి
  26. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    మీ స్పందనకు ధన్యవాదాలు.

    మంద పీతాంబర్ గారూ,
    మీ పద్యాల స్పందన బాగుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. మిత్రుల సందేశాలు చాలా బాగున్నాయి. మిస్సన్న,సత్యన్నారాయణ గారుల సీస పద్యాలు వసంత కిశోర్ గారి పద్య మాలికలు అలరించాయి. ఒక వివాహానికి వెళ్ళడము వలన ఆలశ్యమయ్యాయి నా పద్యాలు . గురువుగారు మన్నించాలి.


    ప్రజ్ఞ పాటవముల పరిణతి నొందిన
    జ్ఞాన ఖనులు వారు చారు మతులు
    విద్య గఱప,వీర విధ్వాంస కాండలో
    విగ్రహముల పైన నాగ్రహమ్మ !


    దేశ మొకటి గాదె బాసయు నొక్కటే
    ఆశ లొకటి గాదె ఆశయమ్ము
    సర్వ జనుల సుఖము సకలురు కోరంగ
    విగ్రహమ్ము మీద నాగ్రహమ్మ !

    తెలుగు తల్లి గాదె తెలగాఁణ తల్లియౌ
    వెలుగు చూప రాదె వెల్ల మవగ
    చెట్టు కొమ్మలె యిరు చిగురించెను గవిత
    విగ్రహముల పైన నాగ్రహమ్మ !

    ఒకటి,ఒకటి యైన నొక్కటి రెండైన
    ఒరుగు లేక మనకు తరుగు నేమి
    రెక్క యాడకున్న డొక్కయు నాడదే
    విగ్రహముల పైన నాగ్రహమ్మ!

    పెద్ద మనుషు లేరి పద్దులు వ్రాయంగ
    చెన్నకేశు డేల చిన్న బోయె
    మంత్రి పదవు లీయ మంత్ర ముగ్ధులు గారె
    విగ్రహముల పైన నాగ్రహమ్మ !

    నీరు నిలువ దొకట నిక్కము గాలియున్
    నిలుతు రొక్క చోట ? యిలను జనులు
    పరువ నతిశయిల్లు పరిమళ సౌరభుల్
    విగ్రహముల పైన నాగ్రహమ్మ !

    ఆత్మహత్య లేల అవని ద్రుంచుట యేల
    అలరు తెలుగు జాతి కలగు టేల
    ఒలకు నీరు తుడిచి ఒత్తరె కన్నీళ్ళు
    విగ్రహముల పైన నాగ్రహమ్మ !

    మనసు విప్ప రాదె మన్మోహ నాంగుడా
    శుభము పల్క రాదె సోని యమ్మ
    చిత్త మేమి గలదొ చెప్పు చిదంబరా
    విగ్రహముల పైన నాగ్రహమ్మ !

    రిప్లయితొలగించండి
  28. గోలి హనుమచ్ఛాస్త్రి.

    కవిమిత్రులు తమతమ పద్యముల ద్వారా తమ ఆవేదన తెలియజేశారు.ఈ ఈ పద్య పాదాలు ఆవేశంతోనున్న సోదరుల గుండెలను తాకి శాంత చిత్తులగుదురు గాక.

    నిగ్రహమును వీడి నేడు చూపితి వీవు
    విగ్రముల పైన నాగ్రహమ్ము!
    విగ్రహముల? కావు? విజ్ఞత తోజూడ
    తాత,తాతతాత,తనువు లవియె!

    నిగ్రహమును వీడి నేడు చూపితి వీవు
    విగ్రముల పైన నాగ్రహమ్ము!
    నీదు తాత,మామ,స్నేహితుండును,భార్య
    ఆంధ్ర వారు అయిన అపుడు యెటుల?

    నిగ్రహమును వీడి నేడు చూపితి వీవు
    విగ్రముల పైన నాగ్రహమ్ము!
    చదువు నేర్పి బుద్ధి చక్కదిద్దిన ఒజ్జ
    ఆంధ్ర వారు అయిన అపుడు యెటుల?

    రిప్లయితొలగించండి
  29. గురువుగారూ నా సీస పద్యం బాగున్న దన్నందుకు కృతజ్ఞతలు.
    మీరిచ్చిన సమస్య ఆట వెలది అని తెలిసినా ఆవేదన వెళ్ళ గ్రక్కుకోవడంలో
    అలా వ్రాసాను. మీ సవరణతో ఆ పద్యానికి శోభ ఇనుమడించింది.
    మీ/మన శంకరాభరణం సంకుచిత భావాలకు ఎప్పుడూ దూరంగా ఉంటూ,
    అధర్మాన్ని, అక్రమాన్నీ నిరసిస్తూ, సాటి సోదర తెలుగు ప్రజలకు ఆదర్శంగా
    యిలాగే శోభ లీనుతూ ఉండాలని నా ఆకాంక్ష.
    భవదీయుడు - మిస్సన్న.

    రిప్లయితొలగించండి
  30. మిత్రులందరి పద్యాలూ తెలుగు ప్రజల మనో వేదనకు అద్దం పడుతున్నాయి.

    రిప్లయితొలగించండి
  31. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మనస్సు లోతులను తడిమే పద్యాలు చెప్పారు. ముఖ్యంగా చివరి పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఆర్ద్రమైన భావాలతో చక్కని పద్యాలు చెప్పారు, ధన్యవాదాలు.
    "చదువు నేర్పి బుద్ధి చక్కదిద్దిన ఒజ్జ
    ఆంధ్ర వారు అయిన అపుడు యెటుల? " అన్నారు.
    ఆ ముచ్చటా తీరింది. ఈ మధ్యే "తెలుగు పద్యం" బ్లాగులో ఈ విషయాన్ని ప్రస్తావించాను. చూడండి...
    http://telugupadyam.blogspot.com/2011/01/2.html#comments

    రిప్లయితొలగించండి
  32. శంకరయ్య గారికి మరియు ఇతర కవిపండితులకి నమస్కారం..
    (నాకు పద్యాలు రాయటం రాదు)
    ఒక్క విషయం మీరందరూ అర్థంచేసుకోవలె..
    విగ్రహద్వంసం కవులమీద ఆగ్రహం కాదు,
    వాటిని పక్షపాత వైకరితో ప్రతిష్టించిన ఆంద్ర నాయకుల మీద.
    ఆ పక్షపాతం ఏమిటో మీలాంటి పండితులకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నా..

    శంకరయ్య గారు..
    ఇన్ని రోజులనుంచి తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం గురించి గాని, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, 600 మంది ఆత్మ బలిదానాల గురించి గాని,
    ప్రతిరోజూ కడుపు కాలపెట్టుకొని జరుపుకుంటున్న రిలే నిరాహారదీక్షలు...
    బందులు, రాస్తారోకోల గురించి గాని..
    ఏనాడూ ఒక్క మాటైనా చెప్పని మీరు ఈ ఒక్క విషయాన్ని మాత్రమే ప్రస్తావిచండం శోచనీయం
    మిమ్మల్ని అభిమానించే మా అందరి మమనసుల్ని గాయపరిచారూ

    రిప్లయితొలగించండి
  33. డి.నిరంజన్ కుమార్ఆదివారం, మార్చి 13, 2011 11:02:00 AM

    స్వంత రాష్ట్రమనుచు సంస్కారమును వీడి
    నిగ్రహంబు బాసి నిలిచియున్న
    విగ్రహముల పైన నాగ్రహమునుజుపి
    దానవతను జాటి ధన్యులైరి

    రిప్లయితొలగించండి
  34. మిట్టపెల్లి సాంబయ్యఆదివారం, మార్చి 13, 2011 5:35:00 PM

    శంకరయ్య గారు,
    మార్చి 11 నాటి మీ శంకరాభరణం బ్లాగులో "నిన్నటి (మార్చి 10) విధ్వంసం తెలుగు వారంతా సిగ్గుపడవలసిన సంఘటన. ఈ విధ్వంసంపై కవిమిత్రులు స్పందించ వలసిందిగా మనవి" అంటూ ఒక వ్యాఖ పెట్టి "విగ్రహముల పైన నాగ్రహమ్ము" అనే సమస్యను ఇచ్చారు. దీన్ని నేను ఆలస్యముగా చూడటం జరిగింది. దీనిపై నా స్పందనను తెలియజేస్తున్నాను.
    విగ్రహాల విద్వంసాన్ని తెలంగాణ వాదులెవ్వారు సమర్థించలేదు. గద్దరు, కొదండ రాం, కే.సి.ఆర్. సహా అందరు ఖండించారు. "మిలియన్ మార్చ్" కు ప్రభుత్వం కలిగించిన అడ్డంకులకు సహనం కోల్పోయిన కొందరు ఉద్యమకారులు విగ్రహాల ద్వంసనికి పూనుకున్నారు. ఇది ప్రభుత్వం మీద కోపంతో చేసిందే కాని ప్రత్యేకంగా ఆ విగ్రహ మూర్తుల మీద కోపంతో కాదనే సంగతి మర్చిపోకూడదు. ఆ విగ్రహాలు ఏ ప్రాంతం వారివనే సంగతి కూడా ఉద్యమకారులు చూడలేదు. ద్వంసమైన విగ్రహాలలో రుద్రమదేవి, రామదాసు విగ్రహాలు కూడా ఉన్నాయి.
    రామారావు గారు ట్యాంక్ బండ్ పై విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడే నిరసన గళాలు విన్పించాయి. రామారావు గారు కొంత అహంకార పూరితంగా వ్యవహరించి వేటిని పట్టించుకోలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంతోమంది వైతాళికులకు స్థానం లభించలేదు.
    నైజాం రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారికి చోటు లేకుండా చేసారు. కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, రావి నారయణరెడ్డి, దాశరథి, రామానందతీర్థ, వట్టికోట ఆళ్వారుస్వామి, కాళోజి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహానుభావులుంటారు.
    భాగమతి ప్రేమ చిహ్నంగా వెలసిన భాగ్యనగరంలో భాగమతి విగ్రహమేది? ఇలాంటి విషయాలు మీవంటి మేధావులకు కన్పించవనుకుంటాను. ఇక మీరన్నట్లుగా విగ్రహాల విధ్వంసానికి "సిగ్గుపడవలసిన పనేమీలేదు". గర్వంగా "తల ఎత్తుకోవచ్చు".

    రిప్లయితొలగించండి
  35. సాంబయ్య గారూ!విగ్రహ విధ్వంసం తల యెత్తుకోదగిన పని అని అన్నారు.ఆవేశంలొ జరిగిన పొరపాటని నా ఉద్దేశం.ఉన్న విగ్రహాలు కూల్చకుండ మీరన్న మహనీయుల విగ్రహ ప్రతిష్టాపన కొరకు పోరాడి సాధిస్తే అందరికీ సంతొషమే.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  36. సాంబయ్య గారూ మీ భావాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  37. /విగ్రహాల విధ్వంసానికి "సిగ్గుపడవలసిన పనేమీలేదు". గర్వంగా "తల ఎత్తుకోవచ్చు". /

    సిగ్గు,లజ్జ వుంటేనే పడాలి లేండి, లేనప్పుడు పడాల్సిన పనిలేదు. తల కూడా అంతే , వుంటేనే ఎత్తుకోవడం, దించుకోవడాలుంటాయి. అది లేనోళ్ళకి ఆ ప్రశ్నే అన్వయించదు.

    క్షమించండి శంకరయ్య మాస్టారు గారు. మీలాంటి సాత్వికులైన పెద్దల అభిప్రాయాలను తన మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడుతున్న ఇలాంటి తుంటరులకు (ఆతను సంస్యలు పూరించే పెద్ద పూరీ అయిన అగునుగాక) జవాబివ్వాలనిపించింది.

    రిప్లయితొలగించండి
  38. సాంబయ్య గారితో ఒక విషయము ఏకీభవిస్తాను. విగ్రహాలు ధ్వంసము చేసిన వారికి ఆ విగ్రహాలు ఎవరివో తెలియదు. ఇక్కడ విగ్రహాల కంటె గమనించ వలసిన విషయము విద్వేషము,విరోధ భావము. బడా రాజకీయ నాయకులు, కోటీశ్వరుల పైన గల ఆగ్రహాన్ని విగ్రహాలపైన, సామాన్య ప్రజల పైన , బస్సుల పైన చూపిస్తారు.
    ప్రతివారు తాము పుట్టిన గ్రామము, పట్టణము రాష్ట్రము అవసరమైతే దేశము విడిచి పొట్ట కోసము వలస వెళ్ళే ఈ రోజుల్లో పరుల పైన విద్వేషము చూపించడము భావ్యము కాదు. ప్రజలను రెచ్చ గొట్టే పెద్దలు తమకు యీ విధ్వంస కాండతో బాధ్యత లేదనడము భుజాలు దులుపు కోవడమే. తమ రాజకీయ లబ్ధి కొసము ప్రజల ప్రాణాలతో చెలగాటము ఆడుకొంటారు రాజకీయ నాయకులు. ముక్కు పచ్చ లారని పిల్లలు ఆత్మ హత్యలు చేసుకోవడ మేమిటి ? పెద్దలు పబ్బము కట్టు కోవడ మేమిటి ? ఒక ఎం.ఎల్.యే కావా లంటే కోట్లు అవాల్సిన యీ రోజుల్లో సామాన్య ప్రజల ప్రాణ త్యాగాలు, విధ్వాంస కాండలు అర్ధ రహితము.

    రిప్లయితొలగించండి
  39. మిట్టపెల్లి సాంబయ్యఆదివారం, మార్చి 13, 2011 10:38:00 PM

    శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారికి నమస్కారాలతో, విగ్రహాల విధ్వంసం ఆవేశంతో చేసిన పని అని గుర్తించినందుకు ధన్యవాదాలు. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా పరస్పరం ప్రేమానురాగాలతో కలసి ఉండాలనేదే నా కోరిక.

    విస్సన్న గారికి ధన్యవాదాలు. నా భావాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయన్నారు. నిజమే. ఒక ప్రాంతం మీద కొనసాగుతున్న వివక్షకు నిరసనగా ఉద్యమకారులు ఆవేశానికి లోనైనారని చెప్పడమే నా ఉద్దేశం.

    గన్నవరపు నరసింహమూర్తి గారికి ధన్యవాదాలు. మీలాంటి విజ్ఞుల అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. సమస్యను పరస్పరం చర్చించుకొని ఇరుప్రాంతాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించుకోవడమే ఉత్తమం.

    రిప్లయితొలగించండి
  40. చేసిన తప్పులకు
    పశ్చాత్తాప పడకుండా
    సమర్థించు కొనే వారిని
    ఆ పరమాత్ముడే రక్షించుగాక !

    రిప్లయితొలగించండి
  41. అందరికీ నమస్కారం.

    విగ్రహాల ఏర్పాటులో వివక్ష చూపినపుడు, విగ్రహాల విధ్వంసంలో సిగ్గు పడవలసిన అవసరం ఉందా?

    ఒకవేళ సిగ్గు పడవలసినదే అంటే - వాటి ఏర్పాటులో వివక్షపై కూడా సిగ్గుపడాలి కదా. మరి దాని గురించి మాట్లాడరేంటి?

    సరేగాని, తెలుగు జాతి అంతా ఒకటే అన్నపుడు తెలుగు రాష్ట్రం అంతటా అన్ని ప్రాంతాలకు చెందిన వారి విగ్రహాలు ఉండాలి. తెలంగాణలో సీమాంధ్ర ప్రాంత మహనీయుల విగ్రహాలున్నాయి. మరి సీమాంధ్రలో తెలంగాణకు చెందిన మహనీయుల విగ్రహాలు ఉన్నాయా? ఈ వివక్ష మాటేంటి???

    రిప్లయితొలగించండి
  42. ఆరు నూర్ల ప్రజలు ఆత్మార్పణముజెయ్య
    కరుణ జూప నెవరు కాన రారె!
    విగ్రహముల తొలుచ వేనోల్ల దూషణ,
    మనిషి కంటే బొమ్మ ఘనమె, అకట!!

    రిప్లయితొలగించండి
  43. Dear sirs,
    Let Sambayya resolve his political concerns/views somewhere else, let him not deviate the issues here.

    kattula Sammayya/Saambyya , would mind to shutup and get lost from here?

    రిప్లయితొలగించండి
  44. శ్రీకాంత్ గారూ! విడిపోయిన తరువాత అడగవలసిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నారు.ఉమ్మడిగా ఒక ఇంట్లో కలసి ఉన్న అన్నదమ్ములు విడిపోవాలనుకున్నప్పుడు,నాకు వచ్చే భాగంలోనె నీవు ఇంతకాలం భోజనం చేశావు,సామాను పెట్టుకున్నావు,నీ భాగంలో కేవలం పండుకోవటమే అంటే యెలా వుంటుందీ..సామాను విసరి వేస్తే యెలా ఉంటుందీ.. విడి పొయిన తరువాత మాత్రమే ఆ ప్రశ్నలు తలెత్తాలి.


    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  45. @snkr
    మీలాంటి వారితో కలిసి ఉండలేము అనిచేప్పినా పట్టుకొని యాలకాడుతున్నారే
    సిగ్గు, లజ్జ గురించి మీరు మాట్లాడుటయా? హాస్యాస్పదం...
    తలకాయ, జ్ఞానము మొదలైనవి మీకు ఉంటె పైన అంత వివరముగాఉన్నా అర్థం చేసుకోలేకపోతున్నారే???

    @వసంత కిశోర్..
    తప్పులు లెక్కపెడితే
    తెలంగాణను ఆంధ్రలో
    కలిపినప్పడి నుండి
    లెక్కపెట్టవలసి ఉంటుంది..

    రిప్లయితొలగించండి
  46. డి. నిరంజన్ కుమార్ గారూ,
    చక్కని పద్యం చెప్పారు. ధన్యవాదాలు.

    అజ్ఞాత గారూ,
    "విగ్రహముల తొలుచ వేనోల్ల దూషణ" అన్నారు. ఆ విధ్వంస కాండకు బాధపడి ఆవేదన తెలియజేసానే కాని ఎవరినీ దూషించలేదే!
    ఇక మీ పద్యంలో "జెయ్య" పద ప్రయోగం గ్రామ్యం. "ఆత్మార్పణము జేయ" అనాలి.
    "విగ్రహముల తొలుచ వేనోల్ల దూషణ" ఇక్కడ "తొలుచ" కాకుండా, "కూల్చ" లేదా "చెఱచు" అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  47. మిత్రులకు మనవి ....
    "శంకరాభరణం" బ్లాగు కేవలం తెలుగు భాషా సాహిత్యాలకు మాత్రమే పరిమితం. రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిపోయినా ఆ భాషా సాహిత్యాలకు ప్రపంచంలోని తెలుగువాళ్ళందరం వారసులమే!
    సమైక్య, వేర్పాటు వాదాలకు సంబంధించిన వివాదాలకు, చర్చలకు, పరస్పర దూషణలకు కావలసినన్ని బ్లాగులు, వెబ్‌సైట్లు అంతర్జాలంలో ఉన్నాయి.
    దయచేసి నా బ్లాగును వివాదాలకు దూరంగా ఉంచండి. చేతనయితే మిత్రుల పూరణలలోని ఛందో వ్యాకరణాల గురించిన గుణదోషాలను సమీక్షించండి.
    ఇక్కడితో ఈ చర్చకు స్వస్తి పలుకుదాం. ఇకముందు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు వస్తే నేను వ్యాఖ్యల "మోడరేషన్" పెట్టి నాకు సముచితంగా తోచిన వ్యాఖ్యలనే ప్రకటిస్తాను. తప్పదు మరి!
    "దేశభాష లందు తెలుగు లెస్స!"

    రిప్లయితొలగించండి