వసంత్ కిశోర్ చెప్పిన
భక్త సిరియాళుని కథ
కాంచీపురంలో చిరుతొండనంబి అనే వైశ్యకులశేఖరుడు ఉండేవాడు. అతడు అఖండ శివభక్తి తత్పరుడు. ఆయన భార్య తిరువెంగనాంచి. ఆ పుణ్య దంపతులు జంగమారాధనా తత్పరులు. వారి పుత్రుడు సిరియాళుడు.భక్త సిరియాళుని కథ
చిరుతొండడు పూర్వజన్మవాసనా విశేషంచేత ఏకామ్రనాథుణ్ణి ఆరాధిస్తూ జంగమ ప్రమథులకు అడిగిన పదార్థం లేదనక సదా అన్నదానం చేసేవాడు.
ఒకనాడు పరమశివుడు పార్వతీదేవికి చిరుతొండని భక్తి ప్రభావం నిరూపింప దలచాడు.
నిత్యన్నదానశీలుడైన చిరుతొండనంబికి ఒకనాడు ఒక్క శివయోగి కూడా కనిపించలేదు. తిరిగి తిరిగి చివరకు కాంచీపురం ఊరిబయట ఉన్న పాడుబడిన గుడికివెళ్ళాడు. గర్భమంటపంలో ఒక వృద్ధుడు, అతనికి సేవ చేస్తున్న ముసలి అవ్వ కనిపించారు. ఆ మాయ జోగి దంపతులకు ప్రణామం చేసి, తమ యింటికి వచ్చి శివార్చన నందుకొని చరితార్థుణ్ని చేయమని ప్రార్థించాడు చిఱుతొండడు.
ఆ పరమ వృద్ధుడు "ఏడు రోజుల నుండి నిరాహార వ్రతం పూని ఉన్నాను. ఆ వ్రతానికి ఉద్యాపనము పశూపహారము. ఆ యాగపశువుగా నరుడు తప్ప మరొకడు పనికి రాడు. సుందరుడు, రోగ విహీనుడు, అయిన ఆ పిన్న వయసువాణ్ని తల్లితండ్రులు వండి మాకు వడ్డించి, మాతో పాటు భోజనం చేయాలి." అని పలికాడు.
చిరుతొండడు ఇంటికి వెళ్ళి విషయమంతా భార్యకు చెప్పాడు. ఆమె నవ్వి "మన శరీరార్థ ప్రాణాలకు కర్తలు శివయోగీశ్వరులే కదా! వారి సొమ్ములు వారికి సమర్పించడానికి ఆలోచన ఎందుకు?" అని పలికింది.
వెంటనే శివయోగిని తీసుకురావడానికి బయలుదేరాడు చిరుతొండడు.
అంతకు ముందే శివుడు మరొకవేషంలో గురువుగారి యింటిలో పాఠాలు చదువుకుంటున్న సిరియాళుని దగ్గరకు వెళ్ళాడు. ఆ జటాధారిని చూడగానే సిరియాళుడు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసాడు.
భక్తి తాత్పర్యంతో నమస్కరిస్తూ నిల్చున్న సిరియాళునితో "నాయనా! నీ తండ్రి చిరుతొండనంబి నిన్ను చంపి ఒక నిర్భాగ్యుడైన శివయోగికి ఆహారంగా పెట్టబోతున్నాడు. కడుపున బుట్టిన కూరిమి కుమారుని, మెడకోసి చంపి జోగులకు పెట్టే క్రూరుడు ఈ లోకంలో ఎవడైనా ఉంటాడా? స్నేహ శీలిని కాబట్టి ఈ విషయం నీకు చెప్పడానికై వచ్చాను. బ్రతికి వుంటే బలుసాకు తినవచ్చు. నీ ప్రాణాలు కాపాడుకో" అన్నాడు.
కుమార సిరియాళుడు చెవులు మూసుకుని "మహానుభావా! నీవీ రకంగా మాట్లాడడం న్యాయమా? ఇతరుల కోసమై శరీరమును ధనమును వ్యయం చేయడం కంటె ఈ జన్మకు సార్థక్య మేమున్నది?" అన్నాడు.
చిరుతొండడు వృద్ధ శివయోగిని ఇంటికి తీసుకువెళ్లాడు. పాఠశాలకు వెళ్లి కుమారుణ్ణి తీసుకు వచ్చాడు. కుమారుణ్ణి తొడమీద కూర్చుండ బెట్టుకుని, "తండ్రీ! సిరియాళా! ఎల్లపుడూ పంచాక్షరీ మంత్రమే జపిస్తూ ఉండు. " అని పలికి కత్తితో అతని శిరమును ఖండించాడు.
ఒక్కవ్రేటుతో క్రిందపడిపోయిన సిరియాళుని శిరస్సు "నమః శివాయ" అని మంత్రం పఠిస్తున్నది.
భోజనశాలలో వంట సిద్ధమైంది. అమృతాహారం ఆరగించవలసినదిగా నమస్కరించారు నంబి దంపతులు.
"నాకు మఱొక్క నియమం ఉన్నది. మగబిడ్డ లేని నిర్భాగ్యుని ఇంట్లో భోజనం చేయకూడదు. నీ కుమారుని పిలువు." అన్నాడు మాయా జంగముడు.
"స్వామీ! ముందే ఆ విషయం చెప్పి ఉంటే కుమారుని పిలిచేవాణ్ణి. ఇప్పుడు వాడెక్కడికి పోయినాడో ఆడుకోవడానికి" అన్నాడు నంబి.
వృద్ధ దంపతులు నంబి భార్యను, ఎలుగెత్తి కుమారుని పిలవమన్నారు
వెంటనే. "రారా! రారా! కుమారా!" అని దిక్కులు ప్రతిధ్వనించేటట్లు పిలిచింది తల్లి.
మరుక్షణమే ఆకులలో ఉన్న శాకపాకాలనుంచీ సిరియాళ కుమారుడు వారి ముందు నిలిచాడు.
పరమశివుడు భస్మదేహంతో నాగాలంకార భూషణుడై అర్థ చంద్రాకృతితో సాక్షాత్కరించి, సశరీరములతో కైలాసానికి రమ్మని వారిని ఆహ్వానించాడు.
అంత చిఱుతొండడు "స్వామీ!" నీ దయవల్ల వేయి గోత్రములకు చెందిన మా వైశ్యులందరూ ఈ కంచి పట్టణంలో ఈశ్వరా రాధనం చేస్తూ ఉన్నారు. వారి నందరిని వీడి నేనొక్కడినే రాలేను. ఇంతమందినీ కైలాసానికి రమ్మంటే వస్తాను" అన్నాడు.
శంభుడు కరుణించి కంచిలో ఉన్న వైశ్యులందరూ కైలాసానికి వచ్చేటట్లు వరం ప్రసాదించాడు.
కన్న కుమారుని కూడా బలిచేయడానికి వెనుదీయకుండా తనతోపాటు స్వజనానికి కూడా మోక్షం ఇప్పించిన చిరుతొండ నంబి, పరోపకారార్థమై తన శరీరమే దానమొనర్చిన సిరియాళుడు, శైవభక్తులలో అగ్రగణ్యులు
ఓం నమః శివాయ
రిప్లయితొలగించండి