7, మార్చి 2011, సోమవారం

సమస్యా పూరణం - 247 (పెండ్లి సేయఁదగును)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......

పెండ్లి సేయఁదగును ప్రేతమునకు.
ఈ సమస్యను పంపిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

 1. గోలి హనుమచ్ఛాస్త్రి.

  మాట వినని యెడల మరియొ కార్థంబున
  పెండ్లి చేతు మంద్రు పెద్ద లెపుడు
  అంటి పెట్టు కొనుచు అట్టులే యుండిన
  పెండ్లి సేయ దగును ప్రేత మునకు.

  రిప్లయితొలగించండి
 2. ఈడు జోడు చూసి యేమిచే యదగును
  ఆడు బిడ్డ నిచ్చి నాడు మెచ్చ?
  కనగ జరుగు నేరి క౦త్య క్రియలవెల్ల?
  పెండ్లి సేయఁదగును, ప్రేతమునకు.

  రిప్లయితొలగించండి
 3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  "పెండ్లి"కి ఉన్న వ్యంగ్యార్థంతో సమస్యను చక్కగా పూరించారు. అభినందనలు.
  "మరియొక + అర్థమున" సవర్ణదీర్ఘసంధి చేయకూడదు కదా. దానిని "మరొక యర్థంబున" అంటే సరి.

  చంద్రశేఖర్ గారూ,
  పద్య్మ్ బాగుంది. కాని భావమే ఇబ్బంది పెడుతున్నది. కాస్త వివరణ ఇస్తారా?

  రిప్లయితొలగించండి
 4. ఈడు జోడు చూసి యేమిచే యదగును
  ఆడు బిడ్డ నిచ్చి నాడు మెచ్చ? -----పెండ్లి సేయఁదగును,

  కనగ జరుగు నేరి క౦త్య క్రియలవెల్ల? ----- ప్రేతమునకు.

  నాడు =దేశం కనగ= చూడగ

  అదండీ గురువుగారూ, సంగతి!


  అంత్యక్రియలు జరిగేది కాయానికి కదండీ, కాయం లేనిదాన్నే కదా ప్రేతం అంటారు!

  రిప్లయితొలగించండి
 5. మందాకిని గారూ,
  విచిత్రం. ఇంతవరకు నేను ఇలాంటి ప్రశ్నోత్తర రూపమైన పూరణలను ఎన్నో చేసాను. మీరు వివరంచేదాక నేను గుర్తించలేదు. ఇప్పుడా పూరణ అద్భుతంగా తోస్తున్నది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !

  01)
  _______________________________________

  జీత భత్య ములను - చేకొను చుండెడి
  గరువము పెరుగు , నధి - కారు లకును
  లంచగొండి తనము - రక్కసి బట్టిన
  పెండ్లి సేయఁదగును ప్రేతమునకు.
  _______________________________________

  రిప్లయితొలగించండి
 7. 02)
  _______________________________________

  మంచి వాడ నెంచి - మాన్యుడని దలంచి
  నిలుప గద్దె మీద; - నేత లరరె
  స్వార్థ మన్న బెద్ద - సాల్వుని వశమైన
  పెండ్లి సేయఁ దగును - ప్రేత మునకు.
  ________________________________________

  సాల్వుడు = రాక్షసుడు
  ________________________________________

  రిప్లయితొలగించండి
 8. 03)
  _________________________________________

  విద్య నేర్చు కొనగ - విద్యార్థు లందరు
  మిగుల శ్రద్ధ తోడ - మెలగ వలయు
  ఆర్జ నందు మిగుల - నశ్రద్ధ జూపిన
  పెండ్లి సేయఁ దగును - ప్రేత మునకు.
  _________________________________________

  ఆర్జన = విద్యార్జన
  _________________________________________

  రిప్లయితొలగించండి
 9. పాల పీక చాలు పాపకు, కన్యకు
  పెండ్లి సేయఁదగును, ప్రేతమునకు
  పిండ దానమె గతి, విషయమేదైనను
  విందు భోజనంబె బందువులకు!!

  రిప్లయితొలగించండి
 10. మాస్టారుగారికి, మందాకిని గారికి మరీ ధన్యవాదాలు. సమస్య ప్రశ్నోత్తర పూరణే.
  మందాకిని గారూ, మంచి పట్టే పట్టారు. అంత్య క్రియలు దేహానికి కదా అని. నిజమే, క్రియ దేహానికి, కర్మ ప్రేతానికి. నేను కూడా ముందు "అంత్య కర్మలవెల్ల" అని వ్రాసి, "అంత్య క్రియలు" ఎక్కువమందికి తెలిసిన పదమని మార్చాను. ఎందుకయినా మంచిదని "అవెల్ల" అని కలిపాను, సరిపెడదామని. ఇంత పరిశీలనగా చదివే మిత్రులు వుండటం ముదావహము. ఇంకా శ్రద్ధగా వ్రాయటానికి ప్రయత్నిస్తాను.

  రిప్లయితొలగించండి
 11. ప్రేత మావహించి ప్రేలాపనలు జేసి
  పేద పొట్ట గొట్టి బాధ పెట్టు
  వెఱ్ఱి వార బట్టి వేప మండల చేత
  పెండ్లి సేయఁ దగును ప్రేత మునకు!

  రిప్లయితొలగించండి
 12. శంకరార్యా! ధన్యవాదములు. అర్థవంతమైన సవరణకు కృతజ్ఞతలు.ప్రేతమునకు వివిధ పద్ధతులలో పెండ్లిని చేయుచున్న కవి మిత్రులకు అభినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి

  రిప్లయితొలగించండి
 13. వసంత్ కిశోర్ గారూ,
  మీ మూడు పూరణలు చూసాను
  మూడు పద్యాలూ బాగున్నాయి.
  రండవ పద్యంలో మొదటి పాదంలో ఏకవచనంలో చెప్పి, రెండవ పాదంలో "నేత లమరె" అని బహువచనంలో చెప్పారు. "నేత యమరె" అంటే సరి.
  మొత్తానికి అందరికీ "పెండ్లి" చేయాలన్నారు. బాగుంది. అభినందనలు.

  జిగురు సత్యనారాయణ గారూ,
  "విషయమేదైనను విందు భోజనంబె బందువులకు" అనడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

  మంద పీతాంబర్ గారూ,
  మంచి పద్యం చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. కవి మిత్రులందరి పూరణలూ వైవిధ్య భరితంగా ఉన్నాయి.అందరికీ అభినందనలు.

  మాధవుండు నిండె మనమున నో తండ్రి
  రుక్మిణీశు డతడె రూఢి గాను
  అన్య పురుషు నొల్ల నది తప్ప దన్న నా
  పెండ్లి సేయఁదగును ప్రేతమునకు.

  రిప్లయితొలగించండి
 15. నా పూరణ ......

  వెఱ్ఱి కుదురుటకును పెండ్లి సేయవలెను,
  పెండ్లి చేసినపుడె వెఱ్ఱి కుదురు,
  భూతవైద్యు నడుగ ముందె చెప్పె నిటుల
  "పెండ్లి సేయవలయు ప్రేతమునకు"

  రిప్లయితొలగించండి
 16. కొంతమంది చిన్నప్పుడు ఆకతాయిగా ఉండి,పెద్దయ్యాక మంచి వాళ్ళయిపోతారు కదండీ !


  పెండ్లి సేయఁ దగును ప్రేతమునకు నని
  పెండ్లి చేసినాము పిన్న దాని
  పెండ్లి పిదప కుదిరె పిచ్చి,నా చినతల్లి
  పెద్దరికము పొందె ముద్దు తల్లి !

  రిప్లయితొలగించండి
 17. గురువుగారూ, నా పూరణ వేస్తూ, చూసాను మీ పూరణ. ఇంచు మించు మీ వలె నేనూ ఆలోచించానేమో, కాకపోతే నేను పెళ్ళి చేసేసాను. కాపీ కొడుతే గురువు గారినే కాపీ కొట్టాలి !

  రిప్లయితొలగించండి
 18. మిత్రులు డా.మూర్తి గారూ, కిట్టించారుగా "పెండ్లి సేయ వలయు" ని "పెండ్లి సేయ దగును" అని మార్చి. పూరణ బాగుంది.

  రిప్లయితొలగించండి
 19. అయ్యొ రామ! "ఖర్మ"! అచ్చుతప్పులగోల
  కలనయంత్ర కృత వికిలిత ముద్ర
  "ప్రీత"మనడి వాడి పేరఁదొరలనయ్యఁ:
  "పెండ్లి సేయఁదగును ప్రేతమునకు".

  'ఖర్మ' తెలిసిన తప్పైతే,ముద్ర బహుశః ఇక్కడ సరైన వాడుక కాకపోవచ్చు
  సరదాగా రాశాను, కవిమిత్రులందరికీ సరదాగా తీసుకొనమని మనవి చేస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 20. శంకరార్యా !
  ధన్యవాదములు !

  మిత్రులందరి పూరణలూ
  ముచ్చటగానున్నవి !

  రిప్లయితొలగించండి
 21. మిస్సన్న గారూ,
  మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  చక్కని ఊహతో మంచి పద్యం రాసారు. అభినందనలు.
  నేనూ పద్యం రాసాక చూస్తే మంద పీతాంబర్ గారి పూరణ కనిపించింది. నేను వారిని "కాపీ" కొట్టినట్లు అవుతుందేమో అని పోస్ట్ చేయడానికి తటపటాయించి చివరికి పోస్ట్ చేసాను. ఇది నేను ప్రతి రోజు ఎదుర్కొనే సమస్యే. "నా పూరణగా" ఏదో ఆలోచిస్తాను, లేదా పద్యమే వ్రాస్తాను. తీరా చూస్తే అలాంటి భావంతో ఒకరు పూరణ పంపిస్తారు. తరువాత నా పూరణ పెడితే "కాపీ" కొట్టినట్లే అవుతుంది. ఇలా పోస్ట్ చేయని పూరణలు నా వద్ద కొన్ని ఉన్నాయి.
  ఏ రోజైనా నా పూరణ లేదంటే ఆ రోజు ఎవరో నేనూహించిన భావంతో పూరణ పంపారనీ, దానికి మరో కోణంలో నాకు పరిష్కారం దొరకలేదని అర్థం.

  ఊకదంపుడు గారూ,
  "ప్రీతం" పెండ్లి ..... చక్కని ఊహ. మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి