20, మార్చి 2011, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - (అవధానం బొనరించి)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......

అవధానం బొనరించి పామరుఁ డయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్.

19 కామెంట్‌లు:

 1. పాండిత్యం లేశమైనా లేకున్న పామరురాలైన నేను కొద్దో గొప్పో మెప్పు పొందిన సందర్భంలో తల్లిగారి తర్వాత తొలిగురువు అయిన నరస రామయ్య పాదపద్మాలకు నమస్సులు అర్పించాలని....
  తప్పులేమైనా ఉన్నా గురువుగారు మహతీ వాచకమునకు మార్చే సాహసం చేసినందుకు మన్నించి సరిదిద్దాలని ప్రార్థన.


  శివరూ పంబున, బోధనంబుగఱపే, శ్రీ శై లదాక్షి ణ్యమూ
  ర్తివనీ; బోధకుఁ నర్సరామ!నినుఆర్తిన్ వేడుదున్ భక్తితో;
  ఇవదాన్యంబున ధన్యనైతినిక నే, మీదీవనం; బొందితిన్
  నవధానం బొనరించి పామర ను,ఈ ఖ్యాతింక విద్వత్సభన్.

  రిప్లయితొలగించండి
 2. శివ సంకల్పమొ,పూర్వ జన్మ ఫలమో శ్రీవాణి కారుణ్య మో,
  కవి రాజన్యుల కావ్యరాశులను నేకళ్ళార శోధించె నో ,
  చవులూరించు కవిత్వతత్వ సుధనాస్వా దించెనో, నాతడే
  యవధానం బొనరించి పామరుడయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్!

  రిప్లయితొలగించండి
 3. శివసా యుజ్యముపొం దగోరి మదికాశీదైవమున్ తాఁ తలం
  చి,వయోవృద్ధుల పూజలన్ తనువు,వాక్జిత్త్తం బులన్ జేయుచూ
  నవగానామృత వైభవంబునిక వేనోళ్ళం దుకీర్తిం చియున్
  అవధానం బొనరించి పామరుఁ డయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్.

  మహాకావ్యాలు పఠించకపోయినా ఇలాంటి విషయాల్లో అవగాహన చేత అవధానం చేసి గెలిచాడని
  భావన చేశాను.

  రిప్లయితొలగించండి
 4. మందాకిని గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. మీ ఉత్సాహం ప్రశంసనీయం. కాకుంటే చిన్న చిన్న లోపాలు.
  మొదటి పూరణలో మీ గురుభక్తికి సంతోషం. వారికి నా నమోవాకాలు.
  "కఱపే, మూర్తివనీ, ఇవదాన్యంబు" మొదలైన ప్రయోగాలు గ్రామ్యాలు. మీ పద్యంలో నా సవరణలు (బ్రాకెట్‌లలో) .....
  శివరూపంబున, బోధనంబుగఱ(పన్), శ్రీశైల దాక్షిణ్యమూ
  ర్తి(వి, సద్బోధక!) నర్సరామ!నిను (నా)ర్తిన్ వేడుదున్ భక్తి (న
  మ్మి) వదాన్యంబున ధన్యనైతినిక నే, మీదీవనం; బొంది (యీ
  య)వధానం బొనరించి పామరను, (ప్ర)ఖ్యాతింక విద్వత్సభన్.
  రెండవ పూరణ మూడవ పాదంలో యతి తప్పింది. నా సవరణలతో మీ పద్యం ....
  శివసా యుజ్యము పొందగోరి మదికాశీదైవమున్ (దాఁ ద)లం
  చి,వయోవృద్ధుల పూజలన్ తనువు,వా(క్చిత్తం)బులన్ జేయు(గా)
  నవగానామృత వైభవంబు (ముద మమందం బొంది) కీర్తించి (తా)
  (న)వధానం బొనరించి పామరుఁ డయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్.

  రిప్లయితొలగించండి
 5. పీతాంబర్ గారూ,
  మంచి పూరణ. చక్కని ధార. ఉచిత పదవిన్యాసం. వెరసి అద్భుతమైన పద్యం. ధన్యవాదాలు.
  "రాశులను నేకళ్ళార శోధించె" అనేదాన్ని రాశులనుఁ దాఁ గళ్ళార శోధించె" అందాం.
  "సుధనాస్వా దించెనో, నాతడే" అనేదాన్ని "సుధనాస్వా దించెనో, యాతడే" అందాం.

  రిప్లయితొలగించండి
 6. గురువుగారు,
  సంతోషం. మీకు పని ఎక్కువ పెట్టేసినట్టున్నాను.
  "మి" కోసం చాలా ప్రయత్నించాను . ఎంతైనా గురువర్యులు గురువర్యులే. నమ్మి అని చెప్పేశారు.
  రెండో పూరణ వెంటనే 15 నిముషాల్లో అయిపోయింది. మూడవపాదంలో న,నో యతిమైత్రి కుదరలేదన్నారు. కానీ మీ సవరణలో యతిమైత్రి ఎలా కుదిరిందో నేను పట్టుకోలేకపోయాను. చెప్పమని ప్రార్థన. (న మం ?)
  నెనరులు.

  రిప్లయితొలగించండి
 7. మందాకిని గారూ,
  అక్కడ ఒక "మ" ఎక్కువగా టైపయింది. అది
  నవగానామృత వైభవంబు (ముద మందం బొంది) కీర్తించి (తా).
  ఇక్కడ "న - 0ద" లకు యతి ఉంది. దీనికి సంబంధించిన చర్చ ఈనాటి సమస్యాపూరణ "పోలేరమ్మను ..." శీర్షిక క్రింద చూడండి.

  రిప్లయితొలగించండి
 8. కవనోత్సాహము కల్గజేసి గురువుల్ కౌశల్యమే బెంచగా
  శివసంకల్పము ధారణే సలుపగా శ్రీ భారతీ సత్కృపన్
  లవ లేశంబును తొట్రు పాటు పడకన్ రంజింపజేసెన్ గదా
  అవధానం బొనరించి, పామరుడయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్.

  రిప్లయితొలగించండి
 9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ అద్భుతమైన పూరణతో అలరించారు.
  నా మనసులోని భావాన్ని పలికించారు. కొన్నాళ్ళలో శంకరాభరణం
  కవులందరూ అవధానాలు చెయ్యగలరు అనడంలో అతిశయోక్తి లేదు అనిపిస్తోంది.
  ఆ భావం మీ పద్యంలో స్ఫురిస్తోంది.

  రిప్లయితొలగించండి
 10. హనుమచ్ఛాస్త్రి గారూ,
  అత్యుత్తమమైన పూరణ మీది. మిస్సన్న గారి ప్రశంసను పొందడమే దానికి నిదర్శనం. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 11. శంకరార్యా! ధన్యవాదములు.
  మిస్సన్న గారూ! ధన్యవాదములు.
  మీ అందరి ప్రోత్సాహమే మాకు బలం.

  రిప్లయితొలగించండి
 12. గురువు గారికి నమస్కారం మీ అభినందనలకు ధన్య వాదములు
  శాస్త్రి గారి పూరణ అద్భుతంగా ఉంది .వారికి అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. పవలున్ రేయియు శంకరా భరణమన్ బ్లాగున్, విశేషించి, స-
  త్కవియౌ శంకర వర్యుడిచ్చుపలు ఛందస్సూత్రముల్ జూచి, తా
  నవలోకించి నిఘంటువుల్, సరస కావ్యమ్ముల్ తపో నిష్ఠగా
  నవధానం బొనరించి పామరుఁ డయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్!

  రిప్లయితొలగించండి
 14. మిస్సన్న గారూ,
  నా కంత "సీన్" ఉందా? సంతోషం. మీ వృత్తగమనం నల్లేరుపై బండి నడకలా ఉంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 15. గురువుగారూ నేత్రము తన సౌందర్యాన్ని తానుగా చూడలేనట్లు
  మీ సౌజన్యాన్ని మీరు కానలేరు.

  రిప్లయితొలగించండి
 16. మిస్సన్న గారు మీ పూరణ అద్భుతం ,అక్షర సత్యం మీకు అభినందనలు .

  రిప్లయితొలగించండి
 17. పీతంబార్ గారూ ధన్యవాదాలు.
  మీ పూరణ సుమధురం.

  రిప్లయితొలగించండి
 18. చవటల్ పృచ్ఛక శ్రేష్ఠులై మెలగుచున్ శ్లాఘించగా కోతలన్
  కవనం బెన్నడు చేయనిన్ సభికులే గారాబుగా మెచ్చగా
  చెవిలో పూవులు పెట్టుచున్ నగవుతో చీకాకులన్ త్రోయగా
  నవధానం బొనరించి పామరుఁ డయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్

  రిప్లయితొలగించండి