6, మార్చి 2011, ఆదివారం

సమస్యా పూరణం - 246 (కాశి కేఁగువాఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కాశి కేఁగువాఁడు ఖలుఁడు గాఁడె.
ఈ సమస్యను పంపిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

29 కామెంట్‌లు:

  1. గోలి హనుమచ్ఛాస్త్రి.

    తీర్థ యాత్ర గాక స్వార్థయాత్ర కొరకు
    క్షేత్ర మహిమ మదిని సోకనీక
    ఈశు ధ్యాస నసలు ఇంతైన దలుపక
    కాశి కేగు వాడు ఖలుడు గాడె.

    రిప్లయితొలగించండి
  2. దేశమందు శాంతి నాశమ్ము గావింప
    పేల్చి భవనములను కూల్చి వేయ
    మందుగుండుకొనగ మర్మంబుగా శివ
    కాశి కేగు వాడు ఖలుడు గాడె.

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని భావంతో పూరణ నందించారు. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది. "క్షేత్ర మహిమ మదిని చేరనీక" అందాం.

    కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    ప్రశస్తమైన పూరణ నిచ్చారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. తల్లి దండ్రు లందు దైవంబు గానక
    గురువు బ్రహ్మ యనెడి తెరువు దెలియ
    రాని వాఁడు యిలను రాకాసి,రంజిల్లఁ
    గాశి కేఁగు వాఁడు ఖలుఁడు గాఁడె !

    రిప్లయితొలగించండి
  5. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. పరులఁ జంపినంత పరమ పదమనుచు
    టెర్రరిస్టు పేర విర్ర వీగి
    ప్రజలఁ జంపఁ గోరి బాంబులు పెట్టగ
    కాశి కేఁగువాఁడు ఖలుఁడు గాఁడె.

    రిప్లయితొలగించండి
  7. వేడ,ఆడ, పాడ విశ్వనాథుని లీల
    వారణాసి జూడ నరగ జనులు,
    ఈశు మ్రొక్కు వారి కిక్కట్లు గల్పింప
    కాశికేగు వాడు ఖలుడు గాడె!

    రిప్లయితొలగించండి
  8. కోడిహళ్లి మోహన్ గారి "శివకాశి" పూరణ సందేశాత్మకంగా, విలక్షణంగా వుంది. ప్రశంసలు.

    రిప్లయితొలగించండి
  9. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    మీరూ జిగురు వారి దారి పట్టారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మిత్రులందరి పూరణలూ చాల బాగున్నాయి.

    రాక దురిత మౌను పోకయు దురితమ్ము
    రాక పోక నడుమ రక్తి జూడ
    దురిత మౌను గాన హరుని సేవింపగ
    కాశి కేఁగువాఁడు ఖలుఁడు గాఁడె.

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న గారు, రక్తి మార్గం విడచి విరక్తి ముసుగులో చేరినట్లుంది :-). పూరణ చాలా బాగుంది. వేదాంత ధోరణి ధ్వనిస్తోంది.

    రిప్లయితొలగించండి
  12. చంద్ర శేఖర్ గారూ రక్తి దొరక్క పోతే విరక్తే గదా మరి?
    అందని ద్రాక్ష పుల్లన గదా!

    రిప్లయితొలగించండి
  13. శంకరార్యా!"కాశికేగు "తొందరలో ని 'యతి 'తప్పాను.సరియగు బా(మా)ట చూపినందులకు ధన్యవాదములు.కవి మిత్రులపూరణలు అలరించుచున్నవి. మురళీ మోహన్ గారి పూరణ - కాశి ముందు శివుణ్ణి నిలిపి -విలక్షణముగా పూరించారు.అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  14. మనవి: ఒకానొక తెలుగు సంప్రదాయంలో పెళ్లి కొడుకు కాశీ కి వెళతానంటే, బావమరిది వెనక్కు పిలిచి మా సోదరినిచ్చి పెళ్లి చేస్తామని, మా నాన్న గారు చెప్పమన్నారని బ్రతిమలాడి పెళ్ళికొడుకుని వెనక్కి తీసుకొస్తాడు. ఆ సందర్భాన్ని కొంచెం హాస్యం జోడించి పూరించాను. అటువంటి పెళ్లి జేసిన మామ పట్ల, గృహస్థాశ్రమము పట్ల సగౌరవ మర్యాదతో,
    బ్రహ్మచర్య మందు బతుకనెంచు వరుడు
    కాశి కేఁగువాఁడు, ఖలుఁడు గాఁడె
    పిల్ల నిచ్చు మామ పిలిచిముంచె నతని
    పెళ్లి జేసి లాగె పీక ముణుగ!

    రిప్లయితొలగించండి
  15. అందరికీ వందనములు
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి.

    01)
    _______________________________________

    తలపు చూలియైన - తమ్మి దాయైనను
    తల్లి ,దండ్రి మరచి - తప్పు జేయు
    తనయు డెంత గొప్ప - తత్వఙ్ఞు డైనను
    కాశి కేఁగువాఁడు - ఖలుఁడు గాఁడె !________________________________________

    తలపుచూలి = మన్మథుడు
    తమ్మిదాయ = చంద్రుడు
    ________________________________________

    రిప్లయితొలగించండి
  16. 02)

    ________________________________________

    జనని మరచు వాడు - జడధారి యగుగాక
    జలజ నాభు డైన - జముడు గాని
    జగతి మెచ్చు నట్లు - జన్నంబొనర్చియు
    కాశి కేఁగువాఁడు - ఖలుఁడు గాఁడె !________________________________________

    రిప్లయితొలగించండి
  17. 03)

    ________________________________________

    కన్న తల్లి కింత - కశిపువు నిడలేని
    కంక పత్ర మంటి - కఠిను డౌర
    కనక కశిపు డైన - కమలాక్షు డైనను
    కాశి కేఁగువాఁడు - ఖలుఁడు గాఁడె !________________________________________

    కశిపువు = అన్నవస్త్రములు
    కంకపత్రము = బాణము
    ________________________________________

    రిప్లయితొలగించండి
  18. 04)

    ________________________________________

    మాత పట్ల మిగుల - మాత్సర్యము వహించి
    మాన ప్రాణ ధనము - మాడ్చువాడు
    మాగు డగును గాని - మాణిక్య మవ్వడు
    కాశి కేఁగువాఁడు - ఖలుఁడు గాఁడె !________________________________________

    మాఁగుడు = మాలిన్యము = మలినత్వము, మురికి.
    _______________________________________

    రిప్లయితొలగించండి
  19. 05)
    ________________________________________

    కన్న వారి మిగుల - కష్టాల పాల్జేసి
    కాల ధర్మ మొంద; - కరుణ లేక
    కనక రాశి బంచి - కర్మ కాండొనరించి
    కాశి కేఁగువాఁడు - ఖలుఁడు గాఁడె !________________________________________

    కరుణ = కనికరము = శోకము = దుఃఖము
    ________________________________________

    రిప్లయితొలగించండి
  20. చిన్న సవరణతో :

    06)

    ________________________________________

    జన్మ భూమి యందు - జన్మ దాతల యందు
    జగతి యందు పేద - జనుల యందు
    జంతు కూట మందు - జనువు జూపెడివాడు
    కాశి కేగ నేల? - ఖరువు గాఁడె !
    ________________________________________

    చనువు = ప్రేమ

    ఖరువు = శివుడు
    ________________________________________

    రిప్లయితొలగించండి
  21. శంకరాభరణ వసంత కిశోరుఁడు
    కడవ లందు దెచ్చి కాశి గంగ
    పద్య ధారలందు పంచి బెట్ట నికపై
    కాశి కేఁగు వాఁడు ఖలుఁడు గాదె !

    రిప్లయితొలగించండి
  22. మిస్సన్న గారూ,
    చంద్రశేఖర్ గారూ ప్రశంసించినట్లుగా మీ పూరణ వేదాంత ధోరణితో చాలా బాగుంది. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణలోని చమత్కారం బాగుంది. అభినందనలు.
    అనుకూలమైన భార్య లభిస్తే సంతోషమే, కాని విపరీతమైతే ఆ కన్యాదానం చేసిన మామ "ఖలుడే" కదా. అన్నీ అనుభవైకవేద్యాలు :-(

    వసత్ కిశోర్ గారూ,
    మీ ఆరుపూరణలను చూసి "షడ్రసాలు" దొరుకుతాయని ఆశ్పడ్డాను. మొదటి అయిదింటిలో కరుణరసం, ఆరవ దానిలో శాంత రసం దొరికాయి. అన్నీ బాగున్నాయి. అభినందనలు.
    నాల్గవ పూరణలో "మాన ప్రాణ" అన్నప్పుడు "ప్రా"కు ముందున్న "న" గురువవుతుంది.

    రిప్లయితొలగించండి
  23. గోలి హనుమచ్ఛాస్త్రి.

    వరుస వ్రాసి నట్టి వ.కిశోరు పద్యాలు
    తాను చదివి గూడ తల్లి దండ్రి
    ఇలను బాధ బెట్టి ఈశ్వరు కోసమై
    కాశి కేగు వాడు ఖలుడు గాడె.

    రిప్లయితొలగించండి
  24. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    పసందైన పూరణ. సంతోషం. అభినందనలు.
    వసంత కిశోరా! చూసారా? మీ దగ్గర వీరతాళ్ళ "బ్యాలెన్స్" ఏమైనా ఉందా?

    రిప్లయితొలగించండి
  25. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీరూ వసంత్ కిశోర్ గారినే లక్ష్యం చేసుకున్నారు. పూరణ బాగుంది. అభినందనలు.
    వసంత్ కిశోర్ గారి దగ్గర వీరతాళ్ళు ఉన్నాయో, లేవో?

    రిప్లయితొలగించండి
  26. మాస్టారూ, ధన్యవాదాలు. చింతామణి నాటకం చివరి ఘట్టంలో భవానీ శంకరం చెప్పినట్లు, "స్వానుభవమున చెప్పుచుంటిని సభికులారా..."(జోకండీ, జోకు, నిజమనుకోనేరు!).

    రిప్లయితొలగించండి
  27. శంకరార్యా !
    మూర్తిగారూ !
    శాస్త్రి గారూ !
    మరియు మిత్రులందరికీ
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి