21, మార్చి 2011, సోమవారం

సమస్యా పూరణం - 262 (పోలేరమ్మను నుతింప)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
పోలేరమ్మను నుతింప ముప్పు గలుఁగురా.

19 కామెంట్‌లు:

 1. "పో" కి "ము" యతి కలుస్తుందా ? "౦పు" కి "ము" కలుస్తుందని తెలుసు గానీ, ప వర్గకి మ కారానికి యతి మైత్రి లేదు కదా?

  రిప్లయితొలగించండి
 2. గోలి హనుమచ్ఛాస్త్రి.

  (ఈ మధ్య కొన్ని భక్తి గీతాలు వింటుంటే మూలంలోని పాట గుర్తుకు వస్తుంది తప్ప భక్తి భావం గలుగదు.భక్తి లేని నుతులు ముప్పు అని నా భావం)
  అజ్ఞాత గారు చెప్పినట్లు యతి మైత్రి లేదని భావించి చిన్న సవరణతో...

  లేలే నారాజా,మరి
  లేలేరా తిరగబడర లెమ్మను, పాటల్
  మేలే యని పేరడితొ
  పోలేరమ్మను నుతింప పోవునె అఘముల్?

  రిప్లయితొలగించండి
 3. అజ్ఞాత గారూ,
  "పో-ము"లకు యతి చక్కగా కుదురుతుంది. దానిని పోలికవడి అంటారు.
  "అనంతుని ఛందోదర్పణము" లోని ఈ యతిభేదం చూడండి.
  వెలసిన పుఫుబుభు వర్ణం
  బులు పోలిక వడి ముకారముగ నిడఁ దగు ని
  మ్ముల హరిచరణసరోరుహ
  ములు నా హృత్సరసియందుఁ బొదలు ననంగన్. (ఇక్కడ ము-బొ లకు యతి)
  పు-ఫు-బు-భు అను నాల్గు వర్ణములు స్వపంచమాక్షరమగు మకారము ఉత్వ, తన్మిత్ర స్వరములతో గూడినపుడు యతి కూర్చవచ్చును.
  మీరు చెప్పినట్లు అనుస్వారంతో కూడిన ప-ఫ-బ-భ లు ఏ స్వరంతో ఉంటే తన్మిత్రస్వరాలతో ఉన్న మకారానికి యతి చెల్లుతుంది. ఉదా. 0ప-మ, 0ఫి-మి, 0బె-మె, 0భే-మే .... ఇది "అనుస్వార యతి" అనంతుని ఛందోదర్పణంలో ....
  భువి ననుస్వారయతి బిందుపూర్వకముగ
  ణాకు నిట నాల్గు చెల్లుఁ బాండవసహాయ
  నాకు నిట నాల్గు చెల్లుఁ గందర్పజనక
  మాకు నిట నాల్గు చెల్లు సంపదలరాజ.
  అయ్యా! సందేహనివృత్తి జరిగిందా?

  రిప్లయితొలగించండి
 4. మందాకిని గారూ,
  కచ్చితంగా వస్తుంది. నిజానికి పద్యంలో విసంధిగా, అచ్చులను ప్రయోగించడం సంప్రదాయం కాదు.

  రిప్లయితొలగించండి
 5. గోలి హనుమచ్ఛాస్త్రి.

  శంకరార్యా! త్వరపడి సవరణ చేసినందులకు క్షంతవ్యుణ్ణి.
  సోదాహరణముగా వివరించినందులకు ధన్యవాదములు.నా సవరణలో యడాగమ పొరపాటు కూడా తెలుసుకున్నాను.మీమార్గములో నా పూరణ...

  లేలే నారాజా,మరి
  లేలేరా తిరగబడుము లెమ్మను,పాటల్
  మేలేయని పేరడితో
  పోలేరమ్మను నుతింప ముప్పు గలుగురా!

  రిప్లయితొలగించండి
 6. కాలే కడుపులు నింపని
  మేలేమియు జేయ లేని, మెప్పుల బొందే
  నేలికల నేమి జేయని
  పోలేరమ్మను నుతింప ముప్పు గలుగురా!

  రిప్లయితొలగించండి
 7. సవివరణకు ధన్యవాదాలు. అయితే ఇంకో సందేహం. పో-ము లు యతి కుదిరినట్లే, మో-పు లకు యతి మైత్రి వున్నదా?

  రిప్లయితొలగించండి
 8. గురువు గారూ యడాగమము గురించి చెప్పి ఒక సందేహము నివృత్తి చేసారు.ధన్యవాదములు.

  ప్రేలాపనలకు నేమిలె
  కాలే కడుపులకుఁ దిండి గావలెఁ గానీ
  మేలని మూలను గూర్చొని
  పోలేరమ్మను నుతింప ముప్పు గలుగురా !

  రిప్లయితొలగించండి
 9. అజ్ఞాత గారూ పొ, ము , లకు యతి కుదిరినట్లే, గురువుగారు స్వపంచ పంచమాక్షరమగు మకారమునకు ఉత్వ,తన్మిత్ర స్వరములతో యతి కుదురుతుంది అని చెప్పారు కదా ! ఒకారము ఉకారమునకు మిత్ర స్వరము . మొ, పు లకు యతి కుదురుతుంది.

  మరి ఒక పద్యము వ్రాయండి గురు దక్షిణగా !

  రిప్లయితొలగించండి
 10. అందరికీ వందనములు.
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి.

  01)
  __________________________________

  వీలైన విధంబున, నతి
  బేలల వలె బ్రతికెడు ,నిరు - పేదల వద్దే
  పేలాలను లాగు కొనుచు
  పోలేరమ్మను నుతింప - ముప్పు గలుగురా !
  __________________________________

  రిప్లయితొలగించండి
 11. అప్పుడప్పుడు మన గురు దక్షిణలు గురువుగారికి శిక్షేమో, పాపము భరిస్తారు మన తప్పులని. అందుకే గురువులు పూజ్యనీయులు.

  కిశోర్ జీ మీ పేలాలు బాగున్నాయి. అందులో వడియాలు పెట్టి వేయించి నట్లున్నాయి.

  రిప్లయితొలగించండి
 12. హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  పీతాంబర్ గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  "మెప్పుల బొందే నేలికల" అన్నారు. "మెప్పుల బొందెడి + ఏలికల" కదా..
  "మెప్పులఁ గను నా యేలికల" అని నా సవరణ.

  అజ్ఞాత గారూ,
  మో-పు లకు యతి మైత్రి వున్నది. సందేహ మావంతయు వలదు. నరసింహ మూర్తి గారి వివరణ చూడండి.

  నరసింహ మూర్తి గారూ,
  నిజమే! మూలకు కూర్చుని దేవిని నుతించినంత మాత్రాన కాలే కడుపు నిండుతుందా? మంచి పూరణ. అభినందనలు.
  నా పక్షాన అజ్ఞాత గారికి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  వసంత్ కిశోర్ గారూ,
  పాపాలు చేసి దైవస్తుతి చెసినంత మాత్రాన ముప్పుకలుగకుండా పోదు. చక్కని పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. చేల నడుమ చేఁబట్టుచు
  పోలేరమ్మను నుతింప ముప్పు గలుఁగురా!
  కాలుని వంటి పహిల్వాన్
  పోలేరమ్మకు పెనిమిటి, బొమికలు విఱుచున్!!

  రిప్లయితొలగించండి
 14. సత్యనారాయణ గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. కాలేయ మందు కేన్సరు
  మేలౌనని రోజు రోజు మిక్కిలి వెఱతో
  పాలింపుము నీవేనని
  పోలేరమ్మను నుతింప ముప్పు గలుఁగురా

  రిప్లయితొలగించండి
 16. ప్రభాకర శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. బాలకు కామెర్లవగా
  మాలిన్యము ద్రోల గలుగు మందుల నిడకే
  కాలేయపు పుష్టి కొరకు
  పోలేరమ్మను నుతింప ముప్పు గలుఁగురా

  రిప్లయితొలగించండి