22, మార్చి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 263 (నరసింహుని పూజ చేసె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
నరసింహుని పూజ చేసె నరకాసురుఁడే.

16 కామెంట్‌లు:

 1. శంకరార్యులకు
  కవి మిత్రులకు
  వీక్షకులకు
  అందరకు నమస్కారములు.
  మీ,మీ స్ఫూర్తి తో నేనొక బ్లాగునారంభించాను.
  వీక్షించి, మీ ఆశీస్సులు, సూచనలు,అభిప్రాయములు తెలుపవలసినదిగా మనవి.
  ----------------------------------------
  నర రూప యసురు డాతడు
  నరులను తా డబ్బు కొరకు నరికే ఘనుడే!
  నర ఘోష తీర వలెనని
  నరసింహుని పూజ చేసె నరకాసురుడే!

  రిప్లయితొలగించండి
 2. శాస్త్రి గారు, మీ పురాణ బాగుంది .బ్లాగును ప్రారంభిస్తున్న మీకు శుభాకాంక్షలు .

  పరికించెనేమొ? హరిలో
  నరసింహుని ! పూజచేసె నరకాసురుడే
  గిరిజావరు మ్రొక్కి, హరిని
  బరిమార్చగ నెంచి ,తుదకు బ్రాణము విడిచెన్!

  రిప్లయితొలగించండి
 3. సుర వందిత ప్రహ్లాదుడు
  నరసింహుని పూజ చేసె ;నరకాసురుడే
  పరహింసా తత్వంబున
  నర సురలకు హాని గొల్పి నారికి పడియెన్.

  రిప్లయితొలగించండి
 4. శివునికి ఉన్న పేర్లలో పంచాననుడు ఒకటి. సింహాన్ని మనం పంచాననము అంటాము. కాబట్టి శివుడినికి సింహుడు అని పిలిచే సాహసం చేస్తున్నాను. తప్పయితే క్షమించ గలరు.


  అరయన్ పంచాననుడన
  పరమశివుడు, సింహముఁ గన పంచాననమౌ!
  పరికించి చూడ నప్పుడొ
  నర సింహుని పూజ చేసె నరకాసురుఁడే!

  రిప్లయితొలగించండి
 5. హనుమచ్ఛాస్త్రి గారూ,
  మహదానందంగా ఉంది మీరు బ్లాగును ప్రారంభించినందుకు. అయితే బ్లాగు పేరు, అడ్రసు, వివరాలు ఇవ్వలేదు.
  మీ పూరణ బాగుంది. కాని "నరరూప + అసురుడు" అన్నప్పుడు యడాగమం రాదు. "నరరూపు డసురుడు" అనీ, అలాగే "నరికే" ను "నరికెడి" అంటే సరి!

  పీతాంబర్ గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ ప్రశంసార్హంగా ఉంది. అభినందనలు.

  మురళీ మోహన్ గారూ,
  "నిరంకుశాః కవయః" అని ఇంతకు ముందు చెప్పినట్లు గుర్తు. మీ రేది అనుకుంటే అదే! :-) పద్యరచన ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. శంకరార్యా! ధన్యవాదములు.సవరణలు సూచించినందులకు కృతజ్ఞతలు.
  నా పేరు మీద క్లిక్ చేస్తే నాబ్లాగ్ లోకి ప్రవేశించవచ్చు.

  రిప్లయితొలగించండి
 7. గురువు గారూ కృతజ్ఞతలు. ' సురవందిత ప్రహ్లాదుడు ' అంటే ప్ర కి ముందు ఉన్న త గురువయి గణ భంగ మవుతుందేమో కదా, అందుకని చిన్న మార్పు చేసాను

  వరసుతుడై ప్రహ్లాదుడు అని.

  హనుమచ్చాస్త్రి గారూ మీ బ్లాగుకి అభినందనలు. అప్పుడప్పుడు నేను కూడా కన్ను వేస్తుంటాను.

  రిప్లయితొలగించండి
 8. హరిఁజేర పాపులెందరొ
  నరసింహుని పూజ చేసె,నరకాసురుఁడే
  మరలనరుదెంచి వేడన్
  శరణాగతి,యజితుఁడొసఁగు సద్యోముక్తిన్!
  మనవి: నరకాసురుడు ఘోరపాపి. భూదేవి ఆతని పాపభారం మోయలేక పుత్రశోకాన్నైనా భరించటానికి సిద్దపడింది. అటువంటి పాపినయినా శరణాగతి వెడితే హరి క్షమించి ముక్తిని ప్రసాదిస్తాడనే భావము.

  రిప్లయితొలగించండి
 9. నరసింహమూర్తి గారూ! ధన్యవాదములు.
  సుస్వాగతం.

  రిప్లయితొలగించండి
 10. చమ్రశేఖర్ గారూ,
  మంచి భావంతో పూరించారు. అభినందనలు.
  "పాపు లిందరొ ... పూజ చేసె" వచనాంతరం ఉంది. "పాప సంఘము" అంటే సరి.

  రిప్లయితొలగించండి
 11. ధన్యవాదాలండి, మాస్టారూ. నా బుర్ర తినేసిన అనుమానాన్ని చక్కగా వివరించారు. అయితే శబ్ద ధార కోసం "హరిఁజేరపాపుల గణఁబు" అంటే యెట్లా వుంటుంది?

  రిప్లయితొలగించండి
 12. నరకంబౌ దైన్యతలో
  కరవుకు పాలైన భరత ఖండమ్ముకు తా
  పరువును దెచ్చిన పీ.వీ.
  నరసింహుని పూజ చేసె నరకాసురుఁడే!

  రిప్లయితొలగించండి
 13. నరకము వీడుచు చూడగ
  విరివిగ టీవీల లోన ప్రియమగు సినిమాల్
  నరలోకమునన్;..పీ. వీ.
  నరసింహుని పూజ చేసె నరకాసురుఁడే

  రిప్లయితొలగించండి