4, జనవరి 2018, గురువారం

సమస్య - 2563 (రుచిమంతంబగు కోడిమాంసము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కోడిమాంసమ్ము హితము యోగులకుఁ దినఁగ"
(లేదా...)
"రుచిమంతంబగు కోడిమాంసమది యారోగ్యంబు సన్యాసికిన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో మింగవరపు పవన్ కుమార్ గారు ఇచ్చిన సమస్య)

113 కామెంట్‌లు:

 1. అనుదినమ్మును మాంసము నాబతోడ
  తినెడి వాగుడుకాయయె తిక్కమీరి
  తనదు లఘుదృష్టి నలుగడ దనర బలికె
  'కోడిమాంసమ్ము హితము యోగులకు దినగ'.

  రిప్లయితొలగించండి
 2. హఠము జేసి ప్రాణమ్ముకు హాని మరచి
  ధ్యాన ధారణ జేయుచు ధన్యుడగుచు,
  కూర నారలు ఫలములు; ...కోర కుండ
  కోడిమాంసమ్ము;... హితము యోగులకుఁ దినఁగ :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కోరుకొనని కోడిమాంసమ్ము...' అంటే అన్వయం బాగుంటుంది.

   తొలగించండి
  2. సార్!

   ఎందుకో తెలియదు కానీ, దాదాపు గత 500 పూరణలలో సమస్యా పాదాన్ని చివర పాదంగా ఉంచాలని నిశ్చయించుకొని అన్వయంతో క్రిందా మీదా పడుచున్నాను.

   ధన్యవాదములు, ప్రణామములు!

   తొలగించండి
 3. శుచిమంతంబగు సాధుపుంగవులకున్ శోధింప దైవంబునున్,
  వచియింపంగను వేదవేద్యు ఘనతన్, వైరాగ్య భావంబులే
  తుచ పాటింపగ మేలు| లేని యెడలన్ ద్రోహంబు| వర్జించినన్
  రుచిమంతంబగు కోడిమాంసమది, యారోగ్యంబు సన్యాసికిన్||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ గారూ,
   విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 4. యోధులకు మేలగు,జిలేబి, యోగ్య మగుచు
  కోడిమాంసమ్ము; హితము యోగులకుఁ దినఁగ
  సాత్విక గుణము లన్పెంచి చల్ల గూర్చు
  భోజనమ్ము తెలుసుకొను పుష్కలాక్షి !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. శతావధాని శ్రీ జి. మెట్రామశర్మ గారి పూరణ....

  శుచి లేనట్టి పదార్థముల్ దినఁగ వచ్చున్ వ్యాధు లెన్నేనియున్
  రచితానేక సుశాకపాకములవే రాజిల్లె నీనేలపై
  ప్రచలింపన్ మది జంతు హింస లవురా భావ్యంబొకో కాదుపో
  రుచవంతంబగు కోడిమాంసమది యారోగ్యంబు సన్యాసికిన్.

  రిప్లయితొలగించండి
 6. దేశ రక్షణ సల్పెడి ధీరులకును
  కోడిమాంసమ్ము హితము; యోగులకు దినగ
  కాయ గూరలు పండ్లును కంటె నధిక
  హితము గూర్చెడి ఆహార మెందు గలదు?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీనాథ్ గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఫలముల కంటె...' అనండి. అన్వయం బాగుంటుంది.

   తొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  మందుబాటిళ్లు సిగరెట్లు మతిని చెరచు
  మాదకద్రవ్యముల ప్రక్క మోదమిడును
  కోడిమాంసమ్ము , హితము యోగులకుఁ దినఁగ
  కందమూల పర్ణ ఫలాదికము లటండ్రు !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పండితాః సమదర్శినః..

   ఘనమహావాక్య సారమ్ములనునెరింగి
   సాధనాచతుష్టయముతో సర్వమాత్మ
   భావమని నేర్వ, పర్ణముల్ ఫలములట్లు
   కోడిమాంసమ్ము హితము యోగులకుఁ దినఁగ"

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మైలవరపు వారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. పచితమ్మైనదొ ! పచ్చిదో యనుచు సంభావింపగా నేర్వవే !
   సుచరిత్రుండగు తిన్నడివ్వ గొనితో ! జూడంగ యోగీశ్వరా !
   శుచితో భక్తిని మాంసమున్ !., నిను గనన్ శుద్ధాంతరంగమ్మునన్
   రుచిమంతంబగు కోడిమాంసమది యారోగ్యంబు సన్యాసికిన్"

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  4. శ్రీ జిలేబీ గారికి ధన్యవాదాలు ( మీ ద్వారా) 🙏🙏

   మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  7. అధ్భుతమైన పూరణ మురళీకృష్ణగారూ! అభినందనలు!

   తొలగించండి
  8. శ్రీమతి సీతాదేవి గారికి నమస్సులు.. ధన్యవాదాలు 🙏

   మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి

 8. శ్రీకృష్ణ ఉవాచ

  సచివా! యోధుల భోజనమ్ము ఘనమై చాకుల్ వలెన్తీర్చగన్
  రుచిమంతంబగు కోడిమాంసమది; యారోగ్యంబు సన్యాసికిన్
  శుచియై సాత్విక మైన జేమనమగున్, శుభ్రమ్ము గన్ వండగన్
  పచనమ్మే కళ నేర్వ మేలగునయా పార్థా! జిలేబీయమై!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. దేహ దార్ఢ్యము మిగుల సాధించుటకును
  కోడిమాంసము హితము;యోగులకుఁదినగ
  సాత్వికాహారమే మేలు సాధనమున
  పరమ సర్వేశ్వరుని పొంద సురుచిరముగ

  రిప్లయితొలగించండి
 10. డాఎన్.వి.ఎన్.చారి 9866610429
  నచికేతా!యిహసౌఖ్య లాలసులకే నయ్యా విచారింపగా
  రుచిమంతంబగు కోడిమాంసమది; యారోగ్యంబు సన్యాసికిన్
  శుచిమంతంబగు వేంకటేశుపద సంస్తుత్యామృతమ్మే గదా
  యచిరంబైనటి దేహవాంఛలను దివ్యాత్ముండువీడన్వలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "...యచిరంబై తగు..." అనండి.

   తొలగించండి
 11. విచలంబొందక, మానసమ్మును సదా వేదాంత భావాల నిం
  పుచు,దేవాయని నార్తితో పిలుచుచున్ పూజాది కృత్యంబులన్
  శుచిగా జేసెడి యోగిపుంగవులకున్ చోద్యంబగున్ చెప్పగా
  రుచిమంతంబగు కోడిమాంసమది యారోగ్యంబు సన్యాసికిన్

  రిప్లయితొలగించండి
 12. క్రొవ్వుతక్కువ గా నుండి కూర జేయు
  కోడిమాంసమ్ము హితము, యోగులకుఁ దినఁగ
  కందమూలములొసగును కడుసుఖమ్ము
  జీర్ణమై సులభమ్ముగ శీఘ్రముగను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మరి కోడిమాంసం ఎవరికి హితం?

   తొలగించండి

  2. క్రొవ్వుతక్కువ, జనులకు కూర జేయు
   కోడిమాంసమ్ము హితము, యోగులకుఁ దినఁగ
   కందమూలములొసగును కడుసుఖమ్ము
   జీర్ణమై సులభమ్ముగ శీఘ్రముగను

   తొలగించండి
 13. మాంస భక్షణమున బుద్ధి మందమగును
  తెలుసుకొనుము నరుడ, నీవు దినగ నేమి
  "కోడిమాంసమ్ము; హితము యోగులకుఁ దినఁగ"
  సాత్వికంబగు దిండియె సాధువనగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నీవు దినగవలదు...' అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య 2563
  *రుచిమంతంబగు కోడిమాంసమది యారోగ్యంబు సన్యాసికిన్.*
  సందర్భం:: విందుకు వెళ్తే ప్రస్తుతం భోజనాల దగ్గర మాంసాహారాన్ని శాకాహారాన్ని ప్రక్కప్రక్కనే ఉంచి వడ్డించడం మనం చూస్తున్నాం. ఒక సన్యాసి భోజనం చేసేందుకు రాగా , వారిని ఆహ్వానించిన వ్యక్తి ‘’ ఓ స్వామీ! అది శాకాహారం, *భగవద్గీత* లో చెప్పినట్లు అది రస్యము స్నిగ్ధము హృద్యము అగు సాత్వికాహారము.
  ఇది మాంసాహారం, ఇది మొదట ఇష్టంగా ఉంటుంది. చివరకు దుఃఖాన్ని కలిగించే రాజసాహారము. దీన్ని వదలివేయండి. మీకు ఇది (ఈ కోడిమాంసము) సరిపడదు.
  అది అంటే ఆ శాకాహారం మీకు ఆరోగ్యకరము ‘’ అని దారి చూపించే సందర్భం.

  అచటన్ సాత్విక భోజన మ్మదియె రస్య స్నిగ్ధ హృద్యమ్మునౌ,
  నిచటన్ రాజస భోజన మ్మిది సదా యిష్టమ్ము దుఃఖ మ్మిడున్
  వచియింపంగను, మాంసభోజనములన్ వద్దంచు, వర్జింపు డీ
  రుచిమంతంబగు కోడిమాంస , మది యారోగ్యమ్ము సన్యాసికిన్.
  *కోట రాజశేఖర్ నెల్లూరు.* (4.1.2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   అదీ... ఇదీ... అని వేలితో చూపినట్టే వివరించారు సాత్త్విక, రాజస భోజనాలను. అద్భుతమైన పూరణ. అభినందనలు.
   నేను మాంసాహారాన్ని తామసభోజనమనీ, ఉప్పు, కారం, మసాలాలు మిక్కుటంగా వేసిన శాకాహారాన్ని రాజసభోజనమనీ భావిస్తున్నాను.

   తొలగించండి
 15. జీవ హింస ను మానుటే క్షేమ మను చు
  బోధ సలుపు చు పాటి oచు పుణ్య యతుల
  కె ట్లు తగు న య్య లోకాన ని ట్లు పలు క
  కోడి మాంసమ్ము హితము యోగుల కు ది నగ ?

  రిప్లయితొలగించండి
 16. మల్లయోధులకు భుజింప కొల్లగాను
  కోడిమాంసమ్ము హితము;యోగులకు దినగ
  సాత్వికాహారమేతగు సమ్మతముగ
  కర్మతోడుత జరియింప కర్తకగును!

  రిప్లయితొలగించండి
 17. అధికులు దినెడి యాహార మరయ నేది? యేమి గూర్చు మితాహార మిలను జూడ? కంద మూలమ్ము లేసరి కబళమౌను; కోడి మాంసమ్ము ; హితము ; యోగులకు దినగ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. జనార్ధన రావు గారు

   చక్కని దృశ్యమాలిక నందించారు!

   జిలేబి

   తొలగించండి
  2. జనార్దన రావు గారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 18. అవయవంబులగట్టికియార్యులండ్రు
  కోడిమాంసమ్ముహితము.యోగులకుదినగ
  గాయగూరలుమాత్రమేశ్రేయముగద
  కామక్రోధాదులేవియుగానరావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "అవయవంబుల దార్ఢ్యత కార్యులండ్రు" అంటే బాగుంటుందేమో (లేదా "గట్టికి నార్యులండ్రు" అనండి).

   తొలగించండి
 19. సాత్వి కాహారమే మేలు జనుల కెపుడు
  పండ్లు కాయ గూరలు మెండు ఫలిత మిచ్చు
  యెంచి జూడంగ భువిలోన నెట్టు లౌను?
  కోడి మాంసమ్ము హితము యోగులకు దినగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనర్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "ఫలితమిచ్చు। నెంచి చూడగ..." అనండి. (ఎంచి+చూడగ' అన్నపుడు సరళాదేశం రాదు).

   తొలగించండి
 20. కోరి ధ్యానమ్ము హితము యోగులకన విని
  కోడి మాంసమ్ము హితము యోగులకుఁ దినఁగ
  ననియె నల్లరి బాలుండు నదియె నేడు
  మాకు బ్లాగునందున నో సమస్య యయ్యె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఒక'ను 'ఓ' అనరాదు. "బ్లాగునందున నొక సమస్య..." అనండి.

   తొలగించండి
  2. 'బ్లాగునందున నో' అంటే గణదోషం కూడా...

   తొలగించండి
  3. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

   కోరి ధ్యానమ్ము హితము యోగులకన విని
   కోడి మాంసమ్ము హితము యోగులకుఁ దినఁగ
   ననియె నల్లరి బాలుండు నదియె నేడు
   మాకు బ్లాగునందు నొక సమస్య యయ్యె

   తొలగించండి
 21. రిప్లయిలు
  1. శాంతి భూషణ్ గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శాకాహారము' అనడం సాధువు. అక్కడ "...కందమూలముల్ హితము నొసగు" అనండి.

   తొలగించండి
  2. "..నెంచగాను శాకాహారమే హితమగు" అన్నా సరిపోతుంది.

   తొలగించండి
 22. వచియించెన్ వెస మందుకొట్టి యొకడావాచాలతన్ జూపుచున్
  పచనమ్మందున కోడిమాంస మిలలో ప్రఖ్యాతిగాంచెం గదా
  శుచియై ధ్యానము జేసి మేటి ఫలముల్ చోద్యమ్ముగా నానకన్
  రుచిమంతంబగు కోడిమాంస , మది యారోగ్యమ్ము సన్యాసికిన్.

  రిప్లయితొలగించండి
 23. సాత్వికాహార మనిశము సబబు గాని
  తాపసులకు మాంస భక్షణ పాప మగును
  కాయమునుపెంచ కొఱగాదు గాన, కాదు
  కోడిమాంసమ్ము హితము యోగులకుఁ దినఁగ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. మూర్తి ప్రయాగ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "తాపసులకు మాంసము గొన బాప మగును" అందామా?

   తొలగించండి

 24. తే.గీ.

  ఇహసుఖమ్ములు మరిగెడు హీనజనులు,

  దైవతార్చన నెరుగని తామసులకు

  కోడిమాంసమ్ము హితము; యోగులకు దినగ

  నెంచగ మరి శాఖాహారమే హితమగు

  🌿🌿 🌿ఆకుల శాంతి భూషణ్ 🌺
  వనపర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శాకాహారము' సాధువు.

   తొలగించండి
 25. రిప్లయిలు
  1. జీవ హింస కూడ దనుచుఁ జెప్పి సతము
   దుష్టులు కపట చిత్తులై తుచ్చ వాంఛ
   కోడి మాంసమ్ము హితము యోగులకుఁ దినఁగ
   నందురు మహా పురుషు లిలఁ గొంద ఱకట!


   వచియింపంగ గృహమ్ముఁ బావనము సంభావ్యంబుగన్ సేయరే
   యచిరం బంచును వేడ రా నుడివి తే నా మౌనికిన్ భక్తినిన్
   శుచులై వండిరి శాకరాజముల నిచ్చో, వీడుఁడీ దానినిన్
   రుచిమంతంబగు కోడిమాంసమది, యారోగ్యంబు సన్యాసికిన్

   [మాంసము వీడుట సన్యాసికి నారోగ్యదాయకము]

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 26. వ్యాధిగ్రస్తులు రోగాల బాధ పడుచు
  శక్తి గోల్పోవ వైద్యు నవోక్తి కతన
  శాకపాకమ్ము మేలు తా సాధువులకు
  కోడి మాంసమ్ము హితము యోగులకుఁ దినఁగ

  రిప్లయితొలగించండి
 27. జంతు హింసని దెలిసిన జగతిలోన
  మాంసహారులు భుజియించ మానలేరు
  కోడిమాంసమ్ము, హితము యోగులకు దినగ
  సాత్వికాహార మే యిల సంతతమ్ము!!!

  రిప్లయితొలగించండి
 28. సుచియున్ శుబ్రత చేత ।వండుటకునై శోధించివండివ్వగా?
  మచిలీపట్టణ హోటలందు గని సామాన్యుండుప్రశ్నించగా ?
  పచనంబెంచని పండ్లుకాయలు దినన్ప్రాప్తించుసంతోషమౌ?
  రుచి వంతంబగు!కోడిమాంసమది!యారోగ్యంబు సన్యాసికి న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ క్రమాలంకార పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 29. సమస్య:కోడి మాంసమ్ము హితము యోగులకుఁ దినగ
  సందర్భం:శాశ్వతసుఖం కలుగాలంటే
  యెన్నటికైనా యింద్రియాలను గెలువాల్సిందే! పొట్టకూటికై కాషాయం కట్టితే సరిపోదు.

  పొట్ట కూటికై యొక కావి
  బట్ట గట్టి
  నట్టి యొక యోగి తోడ ను
  న్నట్టి వారి
  కిట్టు లని చెప్పె నంట జి
  హ్వేంద్రియమున
  కోడి... "మాంసమ్ము హితము యో
  గులకుఁ దినగ"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెలుదండ వారూ,
   'జిహ్వేంద్రియమునకు ఓడి' అన్న వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. అద్భుతమైన విరుపు ఆర్యా!అభినందనలు!

   తొలగించండి
 30. శివునితో తిన్నని ప్రార్ధన:
  సారవంతమౌ దినుసుల సమముగాను
  గూర్చి వండిన శుచియైన కొత్తదైన
  కోడిమాంసమ్ము హితము యోగులకు,దినగ
  సంశయమ్మేల గొనుమిదె సంయమివర
  పెట్టితిని నేనమలభక్తి ప్రేమమీర!

  రిప్లయితొలగించండి
 31. చేవ గొన కొలది ప్రజ భుజింతు రిచట
  కోడి మాంసమ్ము! హితము యోగులకు దినగ
  సాత్త్వికాహారము సతము శక్తి నొసఁగు
  మేనునకు మఱి మేధకు మేలు చేయు !
  (సవరించిన పద్యం)

  రిప్లయితొలగించండి
 32. మాంస బక్షకుల కది మీమాంసయేల?
  ॥కోడిమాంసమ్ '॥హితము యోగులకు దినగ
  పండ్లు కాయలు చిరు ధాన్య వంటకాలు
  రోజు కొక మారు భోంచేయు మోజుగాను!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ధాన్య వంటకాలు' దుష్టసమాసం. 'భోంచేయు' అన్నది వ్యావహారికం. సవరించండి.

   తొలగించండి
 33. జీవహింసను కలుగగ జేసి తినక
  కోడిమాంసమ్ము, హితము యోగులకుఁ దినఁగ
  సాత్వి కాహార మయ్యది శాకపాక
  ములన శ్రేష్ఠము; గోరగ ముదము గూర్చు

  నిన్నటి సమస్యకు నా పూరణ

  పుట్టినట్టి బిడ్డ పురుషుడో పుత్రికో
  నైన మాకు వారు నయనములని
  తలుచ బోక స్త్రీని తక్కువ గా జూచు
  కన్నవారి కన్న ఖలులు గలరె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 34. ప్రపంచ తెలుగు మహా సభల సందర్భముగా వ్రాసినది:

  తెలుగు వెలుగు:

  సుకవి త్రయాంచిత ప్రకటి తాంధ్ర సుమహా భారత సన్నుత వాఙ్మయముల
  సహజ కవిత్వ భాస విరాజి పోతన భాగవత మధుర పద్య రుచుల
  కవితా పితామహ కవిసార్వభౌమ వాక్పటిమ విరాజిత కావ్య ఘృణుల
  సూర నాది విబుధ చూడా మణి గణ విరచిత వాఙ్నిధి వర రత్నములను

  దక్షిణాంధ్ర యుగ సుదర్శిత శబ్ద లా
  లిత్య పటిమ క్షీణ నిత్య తప్త
  మైన నాధునిక యుగాభివృద్ధినిఁ గాంచ
  దేశ భాష లందు తెలుగు లెస్స

  [దక్షిణాంధ్ర యుగము 1600 - 1775
  క్షీణ యుగము 1775 - 1875
  ఆధునిక యుగము 1875 – 2000]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆర్యా!సమగ్ర ఆంధ్రసాహిత్య వైభవాన్ని ఒక సీసపద్యములో వర్ణించిన మీప్రతిభ శ్లాఖనీయము!ప్రణామాలు!

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   ఆంధ్రసాహిత్యం యొక్క లెస్సదనాన్ని అద్భుతంగా వర్ణించారు. అభినందనలు, ధన్యవాదాలు.

   తొలగించండి
  3. డా. సీతా దేవి గారు నమస్సులు, ధన్యవాదములు.
   పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 35. శ్రీగురుకంది శంకరయ్యగారికి వందనములతో సవరించిన పద్యం
  4.1.17.మాంస భక్షకులకది మీమాంసయేల?
  కోడి మాంసమ్ము”హితముయోగులకు దినగ
  సాత్వి కాహారమేమేలు సంతసంబు|
  రోజుకొకమారుతినుతయే మోజుగాన|

  రిప్లయితొలగించండి
 36. తే.గీ
  చికెను గునియాజ్వరమును తెచ్చెనిటఁ దినగ
  "కోడిమాంసమ్ము, హితము యోగులకుఁ దినఁగ"
  సాత్త్వికాహారము కలుగు సత్త్వశక్తి
  ధ్యానయోగములకదియు దైవశక్తి

  రిప్లయితొలగించండి
 37. సన్య సించిన వారికి సాత్వి కమని
  ఆకు లలములు చప్పిడి శాక ములను
  తెలుసు కొనలేని మూర్ఖులు బలిమి నిడగ
  కోడి మాంసమ్ము హితము యోగులకుఁ దినఁగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బలిమి నిడగ' కంటే "బలుకుదు రిటు" అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 38. సమస్య
  కోడి మాంసమ్ము హితము యోగులకుఁ దినగ
  **************************************
  సందర్భం: మహావాక్యాల సారం తెలుసుకోవడం అంత సులభమైనదేమీ కాదు. సాధన చతుష్టయం ఆధారంగా సాధన జరుగాలంటే మామూలు విషయ మసలే కాదు.అన్నీ ఒకటై అద్వైతానుభూతి సిద్ధించాలంటే నేపథ్యంలో ఎంతో తతంగం నడువాల్సి వుంది. ఎన్నో పరిణామాలు జరుగాల్సి వున్నవి.
  అందులో కొన్ని సోపానా లిక్కడ ప్రస్తావిస్తాను.
  ==============================
  ఇష్టములు వీడవలె, నప్డు కష్ట వితతి
  క్రమముగా వీడు,కోర్కెల గాడ్పు తగ్గు,
  నపుడు మనసు నిశ్చల మగు, నర్థ మగును
  ఘన మహా వాక్యములును, సాధన చతుష్ట
  యమ్ము దానికి తోడైన యట్టి వేళ
  నాత్మ రూపమై సకల చరాచరములు
  నిల తమంతట తాముగా వెలిగిపోవు--
  తినెడు వాడును బ్రహ్మము, తినబడునది
  బ్రహ్మమును,తిను టను పని బ్రహ్మ మగును
  అపుడు మాత్రమే సమదర్శి యగు నరుండు
  నతడు మాత్రమే యోగియై యలరుచుండ
  నన్నియు నొకటౌ-- ఫలములు నాకులు మరి
  కోడి మాంసమ్ము హితము యోగులకుఁ దినగ

  ✒~ డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెలుదండ వారూ,
   మీ పూరణ మనోహరంగా, జ్ఞానదాయకంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 39. యోగు లయిన నేమి పుడమి భోగులైన నిష్ట పడినచో తినదగు నేది యైన కలుషితాహార కబళము కన్న శుధ్ధ కోడి మాంసమ్ము హితము యోగులకు దినగ!

  రిప్లయితొలగించండి
 40. ఎదో ఇలా కిట్టించాను.
  పచనంబున్ సలుపంగ చక్కగసదా ప్రఖ్యాతుడౌ వ్యక్తిచే
  రుచిమంతంబగు కోడిమాంసమది, యారోగ్యంబు సన్యాసికిన్
  శుచిగాగ్రోల ఫలమ్ములన్ తరణిచే శుద్ధమ్ముగాపండినన్
  రచియించెన్ విధి లోకమందుప్రజకున్ ప్రాంతీయమౌరక్షణల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొంత అన్వయ దోషం ఉన్నది.

   తొలగించండి
 41. పాలు శ్రేష్టము పసివారి ప్రాణప్రదము,
  శాకముల్ మేలు జనులకు శక్తి నిడును
  ఫలములేయోగ్యమౌ
  "తినపాడిగాదు
  కోడిమాంసమ్ము"హితముయోగులకుఁదినగ!!!

  రిప్లయితొలగించండి 42. బలము కొరకని తిందురు వసుధయందు

  కోడిమాంసమ్ము హితము యోగులకుఁ దినఁగ

  శాకములతోడను ఫలరసములతోడి

  సాత్త్వికాహారమేనండ్రు. జగతి యందు.


  క్రూరజంతువులు తినును కువలయమున

  కోడిమాంసమ్ము హితము యోగులకుఁ దినఁగ

  నాకు కూరలు ఫలములు నర్హ మైన

  వనుచు భావించి గైకొందు రవని యందు.

  రిప్లయితొలగించండి
 43. శుచిమంతుండగు స్వామినిన్ గని నమస్సుల్ జేసి విందందున
  న్నుచితంబైన పలావుగన్ బనసతో నొప్పారెడున్ పోలికన్
  రుచివంతంబగు కోడిమాంసమది! యారోగ్యంబు సన్యాసికిన్
  పచనమ్మెంతయొ మేలు మీకనుచుఁ దా వడ్డించె శూద్రుండటన్

  రిప్లయితొలగించండి
 44. సరదాగా:

  రచనల్ జేయుచు సంస్కృతంబునను భారమ్మౌ విధానమ్ముగా;
  వచనల్ జేయుచు దండిగా వినగ నెవ్వారున్ ఘనమ్ముగన్ వినా;
  శుచిగా వండిన కూరలన్ తినగ కూర్చుండన్; విసర్జించుచున్
  రుచిమంతంబగు కోడిమాంసమది; యారోగ్యంబు సన్యాసికిన్!

  రిప్లయితొలగించండి
 45. రచనల్ కూర్చుచు డబ్బు కోసమతిగా రాబట్టి లాభమ్ములన్
  వచనల్ జేయుచు మూఢ భక్తులకు తా వంచించి లోకేశులన్
  శుచిగా వండిన మత్స్యరాజములతో షోకైన బెంగాలులో
  రుచిమంతంబగు కోడిమాంసమది యారోగ్యంబు సన్యాసికిన్

  రిప్లయితొలగించండి