13, మార్చి 2011, ఆదివారం

సమస్యా పూరణం - 254 (ధనమె లక్ష్య మగును)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
ధనమె లక్ష్య మగును తాపసులకు.

24 కామెంట్‌లు:

  1. గోలి హనుమచ్ఛాస్త్రి.

    ధనము, దార, పుత్ర, దాయాదు లందున
    ఇతర భోగ మనిన ఇచ్ఛ నిడరు,
    స్వార్థ చింత లేక, సతతము మోక్ష సా
    ధనమె లక్ష్య మగును తాపసులకు.

    రిప్లయితొలగించండి
  2. కష్టసాధ్యమయిన గొప్ప విషయాన్ని అలవోకగా సాధించిన ఋషుల గురించి చక్కగా చెప్పారు, శాస్త్రిగారు!

    రిప్లయితొలగించండి
  3. ఎవని చేత నెటుల యీ సృష్టి కార్యము
    నడుచు? నతని రూప నామమేమి?
    అతనిఁ జేరు మార్గమరయఁగ సత్య శో
    ధనమె లక్ష్య మగును తాపసులకు.

    రిప్లయితొలగించండి
  4. ఐహి కమ్ము మిథ్య దేహమ్ము బుద్బుదం-
    బాత్మ చేరుట పర మాత్మ లోన
    సాధ్య మగును చేయ సాధన! మోహని-
    ర్ధనమె లక్ష్య మగును తాపసులకు.

    రిప్లయితొలగించండి
  5. మందాకినిగారూ! ధన్యవాదములు.
    సత్యశోధనము జేసిన జీ యస్ యన్ గారి,మోహ నిర్ధనము జేసిన మిస్సన్న గారి, పూరణలు లక్ష్యాన్ని చక్కగా చేదించాయి.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    జిగురు సత్యనారాయణ గారూ,
    మిస్సన్న గారూ,
    ప్రస్తుతం కరీంనగర్‌లో ఉన్నాను. కొద్దిగా సమయం చిక్కితే నెట్‌సింటర్‌కు వచ్చి చూస్తున్నాను. ముగ్గురి పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    ఈ రోజెందుకో మూడు పూరణలే వచ్చాయి (ఇప్పటి వరకు). ఆదివారం కనుక వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారేమో?

    మందానికి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. ఇద్దరి కవివర్యుల పూరణలూ చక్కగా ఉన్నాయండి.

    నిత్యమైన సత్యం గురించిన శోధనము అను లక్ష్యమునుఁ బట్టిన సత్యనారాయణగారు,
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. మిత్రుల పూరణలు మనోహరముగా ఉన్నాయి


    ఐహి కేచ్ఛ లుడుగి యీశ్వరు సన్నిధిన్
    గోరి ప్రతి దినమ్ము ఘోర తపముఁ
    జేయ లబ్ధి నొందు చేతస్సు సుజ్ఞాన
    ధనమె లక్ష్య మగును దాపసులకు

    రిప్లయితొలగించండి
  9. మూర్తిగారు, సర్వోత్తమమైన జ్ఞానధనం గురించి బాగా చెప్పారు.

    ఎల్లవేళ లందు పరమ శాంత మనము,
    కొరత నిడక చేయు తపము, జపము,
    సకల జీవరాశి యెడల సానురాగ
    ధనమె లక్ష్యమగును తాపసులకు.

    రిప్లయితొలగించండి
  10. భోగ లాల సునకు బొంది విడచుదాక
    ధనమె లక్ష్యమగును, తాపసులు
    పొంద నెంచు బొంది తోడ దివము
    అదియు నిదియు గాదె "యతని" లీల!
    దివము= స్వర్గము; అతని = పరమాత్ముని

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !

    01)
    ____________________________________________

    సత్య శోధ నెంచి - సర్వంబు త్యజియించి
    మోక్ష గాము లెంతొ - ముదము తోడ
    ఆచ రించు చుండు !- ఆరు వర్గముల ని
    ధనమె లక్ష్య మగును; - తాపసులకు!
    ____________________________________________

    ఆరు వర్గములు = కామ,క్రోధ ,లోభ ,మోహ ,మద,మాత్సర్యములు
    ____________________________________________

    రిప్లయితొలగించండి
  12. విద్య లక్ష్య మెపుడు వినయంబు గావలె,
    భక్తి లక్ష్య మరయ ముక్తి గాదె !
    దాత లక్ష్య మెల్ల దానంబు,తత్వబో
    ధనమె లక్ష్య మగును తాపసులకు !

    పిసినారులకును,మదిరా
    వ్యసనులకెప్పుడును "ధనమె లక్ష్య మగును! తా
    పసులకు" లక్ష్యము గావలె
    వసుదేవనందనుగొల్చి వరముల బొందన్!

    రిప్లయితొలగించండి
  13. మరల పోస్టు చేస్తున్నాను, మూడోపాదం సవరణతో:

    భోగ లాలసునకు బొంది విడచుదాక
    ధనమె లక్ష్యమగును, తాపసులు
    పొంద నెంచు దివము బొంది తోడ
    అదియు నిదియు గాదె "యతని" లీల!
    దివము= స్వర్గము; అతని = పరమాత్ముని

    రిప్లయితొలగించండి
  14. మందాకిని గారూ మీ పద్యాలు బాగున్నాయి ఆటవెలది తేట గీతులలో కూడా ప్రతి పాదములో మొదటి అక్షరముతో నాల్గవ గణము మొదటి అక్షరముతో యతి కుదరాలి. ప్రాస నియమము లేదు.

    టైపాట్ సవరించాను.

    ఐహి కేచ్ఛ లుడిగి యీశ్వరు సన్నిధిన్
    గోరి ప్రతి దినమ్ము ఘోర తపముఁ
    జేయ లబ్ధి నొందు చేతస్సు సుజ్ఞాన
    ధనమె లక్ష్య మగును దాపసులకు

    రిప్లయితొలగించండి
  15. భక్తి యనగ నేడు ముక్తి కొరకుకాదు
    భుక్తి కొరకు చూపు రక్తి గాని
    కలిమి కొరకు చేయు కలికాల మహిమలు
    ధనమె లక్ష్య మగును తాపసులకు

    రిప్లయితొలగించండి
  16. నేను నాది యనుట నజ్ఞయని తేట తె
    ల్లంగ నేర్చి, మనమ్ము లీల లెరిగి,
    మేను కష్ట మోర్చి, ముక్తికాంతా సా
    ధనమె లక్ష్య మగును తాపసులకు

    రిప్లయితొలగించండి
  17. చివరగా పోస్టు చేస్తున్నాను, మూడోపాదం సవరణతో:

    భోగ లాలసునకు బొంది విడచుదాక
    ధనమె లక్ష్యమగును, తాపసులు
    పొంద నెంచు దివము బొంది తోడనెటులో
    అదియు నిదియు గాదె "యతని" లీల!
    దివము= స్వర్గము; అతని = పరమాత్ముని

    రిప్లయితొలగించండి
  18. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    "మోక్ష సాధనమె" లక్ష్యమైన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    "ఇతర భోగ మనిన ఇచ్ఛ నిడరు" అన్నారు. "ఇతర భోగము లన నిచ్ఛ నిడరు" అంటే బాగుంటుంది కదా!
    అన్నట్టు .... పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి.

    జిగురు సత్యనారాయణ గారూ,
    "సత్య శోధనమె" మీ లక్ష్యం అయింది. బాగుంది మీ పూరణ. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.
    మోహరూపమైన ధనంలో దారిద్ర్యమా? మంచి ఆలోచన.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    "జ్ఞాన ధనమె" లక్ష్యమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. మందాకిని గరూ,
    మీ రెండు పూరణ భావాలు బాగున్నాయి. కాని లక్షణదూరంగా ఉన్నాయి. నా సవరణలతో మీ పద్యాలు...

    ఎల్లవేళ లందు నుల్లము శాంతింప
    కొరత నిడక చేసికొనెడి తపము
    సకల జీవరాశులకు సానురాగపు
    ధనమె లక్ష్యమగును తాపసులకు.

    నేను నాది యనుట నిజముగా నజ్ఞాన
    మగుట తేటతెల్ల మని యెఱింగి
    మేను కష్ట మోర్చి, పూనగ ముక్తి సా
    ధనమె లక్ష్య మగును తాపసులకు

    రిప్లయితొలగించండి
  20. చంద్రశేఖర్ గారూ,
    మంచి భావంతో పద్యం చెప్పారు. మూడవ సవరణలోను సంస్యలోని "తాపసులకు" ను "తాపసులు" అన్నారు.

    వసంత్ కిశోర్ గారూ,
    "అరిషడ్వర్గ నిధనమె" లక్ష్యంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    అయితే బ్రాకెట్లలోని కొన్ని సవరణలతో మీ పద్యం .....

    సత్య శోధ(కులయి) - సర్వంబు త్యజియించి
    మోక్ష గాము (లగుచు) - ముదము తోడ
    ఆచ రించుచుం(దు రా)రు వర్గముల ని
    ధనమె లక్ష్య మగును; - తాపసులకు!

    రిప్లయితొలగించండి
  21. మంద పీతాంబర్ గారూ,
    మీ రెండు పూరణలూ చాలా బాగున్నాయి. అభినందనలు.
    ముఖ్యంగా ఆటవెలది పాదాన్ని కందంలో ఇమిడ్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. ధన్యవాదాలు.
    "వసుదేవనందనుగొల్చి వరముల బొందన్!" అన్నప్పుడు "వనంద" అని జగణం వేసారు. కందంలో 2,4 పాదాల్లో సరిగణంగా జగణం ఉండరాదు కదా.
    "వసుదే(వాత్మజుని) గొల్చి వరముల బొందన్!" అని నా సవరణ.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ శంకరయ్య గారు నమస్కారం.గణదోషం నేను గమనించలేదు .మీ సవరణ బాగుంది ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  23. మన్నించండి గురువుగారు,
    ఇలా హడావిడిగా రాయకుండా, ఇకమీదట తెలుసుకొని రాసే ప్రయత్నము చేస్తాను.

    రిప్లయితొలగించండి
  24. సవరణకి ధన్యవాదాలు. ఇప్పుడు నా పూరణ:
    భోగ లాలసునకు బొంది విడచుదాక
    ధనమె లక్ష్యమగును, తాపసులకు
    నిందు గల్గు దివము బొంది తోడనెటులో
    అదియు నిదియు గాదె "యతని" లీల!

    రిప్లయితొలగించండి