15, మే 2011, ఆదివారం

సమస్యాపూరణం - 338 (దేశము మాకు వద్దనెడి)

వారాంతపు సమస్యాపూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
దేశము మాకు వద్దనెడి
తెంపరులే మన జాతిరత్నముల్.

10 కామెంట్‌లు:

  1. గోలి హనుమచ్ఛాస్త్రి

    దేశము దోచుకుందమిక దేశము ముక్కలు జేసుకుందమా
    కాశము హద్దు,నేడిటుల కాసులు స్విస్సున దాచుదామనున్
    దేశము కేమి జేసితిని,దేశము కిత్తును ప్రాణమన్న సం
    దేశము మాకు వద్దనెడి తెంపరులే మన జాతి రత్నముల్.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    శాస్త్రిగారూ ! బావుంది మీ సందేశం !

    01)
    _________________________________________

    ఆశల కంతులేదు ! మన - సంతయు నిండిన చోర బుద్ధితో
    దేశము నెట్లు దోచి,మన - దేశపు మేరలు దాటుటెట్లు? యా
    వేశమె గాని; దేశమును - ప్రేమగ జూచెడి వారలేరి ? యీ
    దేశము మాకు వద్దనెడి - తెంపరులే మన జాతి రత్నముల్ !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  3. దేశము మట్టిగాదుగన, దేశము మానవ శక్తియే గనన్,
    దేశము నందు భక్తియును దేశము నందనురక్తి బెంచు , సం
    దేశము నిచ్చు నేతలును, దేశపు పాలనలో విదేశ నా
    దేశము మాకు వద్దనెడి తెంపరులే మన జాతి రత్నముల్!!!.

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని సందేశంతో మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
    "దేశమునకు + ఏమి జేసితిమి" కదా! దానికి బదులు "దేశము కోసమే బ్రతికి" అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోర్ గారూ,
    మనోహరమైన పూరణ. అభినందనలు.
    "ఎట్లు + ఆవేశమె" అన్నప్పుడు యడాగమం రాదు. "దాటు టెట్టు లావేశమె" లేదా "దాటునట్టి యావేశమె" అందాం.

    రిప్లయితొలగించండి
  6. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    కాని "విదేశ నాదేశము" అనేదే పానకంలో పుడకలా ఇబ్బంది పెడుతున్నది. "విదేశి యాదేశము" అందామా?

    రిప్లయితొలగించండి
  7. దేశము కొల్లగొట్టి పరదేశము చెంతకు పారిపోయి, యా
    దేశపు శక్తులన్ గలిసి, దేశ వినాశము గోరు వారలే -
    ఆశకు అంతులేక పలు యాస్తులు దండిగ కూడబెట్టుచున్
    దేశము మాకు వద్దనెడి తెంపరులే - మన జాతిరత్నముల్ !

    రిప్లయితొలగించండి
  8. మాస్టరు గారూ! సవరణ బాగుందండీ! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  9. ఆశల కంచు లెక్కడివి? అంతయు తానె గుడించు, హెచ్చి యా-
    వేశము! తెల్వి గోల్పడి! వివేకము భ్రష్ఠత నొంది! శీలమే
    నాశనమై! అనుక్షణము నవ్వుల పాలయి! స్వార్థ బుద్ధితో
    దేశము మాకు వద్దనెడి తెంపరులే మన జాతిరత్నముల్.

    రిప్లయితొలగించండి
  10. అమెరికా ప్రియుడు:

    కోశము డబ్బునిండినది కూడుకు గుడ్డకు లేనెలేదిటన్
    లేశము స్వచ్ఛతన్ గనము లేవిట రోడ్డున డస్టుబిన్నులున్
    నాశము జేసె సోనియమ నవ్వుచు పుత్రుని బుజ్జగించి;...యీ
    దేశము మాకు వద్దనెడి తెంపరులే మన జాతిరత్నముల్

    రిప్లయితొలగించండి