18, మే 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 56 (మోచెర్ల వెంకన్న కవి)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు.
మోచెర్ల వెంకన్న నెల్లూరు జిల్లా "తెట్టు" గ్రామానికి చెందిన కవి. ఇత డొకసారి వెంకటగిరిరాజు ఒక సంస్కృతపండితుణ్ణి అవమానించిన విషయం తెలిసికొని అతణ్ణి వెంటబెట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళాడు. "మీ దే ఊరు?" అని అడిగితే "మాది తెట్టు" అన్నాడు కవి. రాజు హేళనగా "తెట్టేనా?" అని నవ్వాడట. వెంకన్న కవికి చురుకెక్కి "మహారాజా! తెట్టు మహాపట్టణం కాకున్నా అంత చులకనగా చూడదగింది కాదు.
ఉ.
తెట్టు కుమారకృష్ణజగతీవరనందన! రాజ్యలక్ష్మికిం
బట్టు; ధరాంగనామణికిఁ బాపటబొట్టు; రిపూరగాళి వా
కట్టు; సముజ్జ్వలద్ధృతికి గట్టు; బుధాళికి వేల్పుఁజెట్టు; వా
గ్దిట్టల కున్కిపట్టును మదీయ నివాసము యాచభూపతీ!"

అని సమాధానం చెప్పాడు. రాజు "మీ పేరేమిటి?" అని అడిగితే కవి
కం.
"నా పేరు వెంక నందురు
భూపాలకమకుట నీలపుంజ మిళిందో
ద్దీపిత పాదాంబుజ! కరు
ణాకర! వెలుగోటి యాచ నరనాథేంద్రా!"

అని పద్యంతోనే బదులిచ్చాడు. రాజు "కవిరాజా! గంట కెన్ని పద్యాలు చెప్పగలరు?" అని అడిగితే "మహారాజా! ఊరికే పద్యాలు చెప్పడం కాదు, ఆశువుగా ఎన్నైనా సమస్యలను పూరిస్తాను. కావాలంటే పరీక్షించండి" అని సమాధాన మిచ్చాడు.
అప్పుడు జరిగిన పరీక్షలో వెంకన్న కవి పూరించిన సమస్యలు రేపటినుండి రోజు కొకటి ....
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)

3 కామెంట్‌లు:

  1. శంకరార్యా! రోజూ పద్యములతో కను 'విందు ' చేస్తామంటే అంతకన్నానా!
    మేము విందుకు సిద్ధంగా వున్నాం!

    రిప్లయితొలగించండి
  2. శంకరాభరణం వీక్షణల సంఖ్య లక్ష దాటిన సందర్భంగా గురువుగారికి అభినందనలు!

    రిప్లయితొలగించండి
  3. కోడీహళ్ళి మురలీ మోహన్ గారు వీక్షించారు, మీ వీక్షకుల సంఖ్య లక్ష దాటింది. గురువుగారూ అభినందనలు. మోచెర్ల వెంకన్న గారి ప్రతిభ అద్భుతము. ఆయన పద్యాలతో విందు చేస్తున్నందులకు మీకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి