31, మే 2011, మంగళవారం

సమస్యాపూరణం - 349 (జనసంహార మొనర్చువాని)

వారాంతపు సమస్యాపూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
జనసంహార మొనర్చువాని పదకం
జాతమ్ములే దిక్కగున్.

13 కామెంట్‌లు:

 1. జనులే రాజ్యపు మూలమంచు జనతాసౌఖ్యమ్ము క్షేమమ్ములే
  తన కర్తవ్యమటంచునమ్మి జనులన్ తాఁ దండ్రియై కాచుచున్
  జనస్వాతంత్ర్యము కొల్లఁగొట్టు పగతున్ శార్ధూలమై పోరి దు
  ర్జన సంహార మొనర్చువాని పదకంజాతమ్ములే దిక్కగున్.

  రిప్లయితొలగించు
 2. గుణ హీనుల్, భువి దుర్మదాంధ చరితుల్, కూర్మిన్ ప్రదర్శించుచున్
  జనపాళిన్ వినశింపఁ జేయఁ దొడగెన్. సన్మాన్యులౌ వారికిన్
  ప్రణవోద్ధాముని, దుర్విదగ్ధుని, యధర్మస్వాంతులన్ గాంచి, దుర్
  జనసంహార మొనర్చువాని పదకంజాతమ్ములే దిక్కగున్.

  రిప్లయితొలగించు
 3. శ్రీయుతులు రామకృష్ణా రావు గారి పద్యం అద్భుతంగా ఉన్నది.
  ఫణిగారి పద్యం అలరించుచున్నది.

  ఘనమౌ చేపయి మ్రుచ్చు సోమకుని వేగన్ ద్రుంచడే, పందియై
  కనకాక్షున్ వధియింపడే, నరమృగాకారంబునన్ చీల్చడే
  దనుజున్ కుందన కశ్యపున్, హరి ప్రమోదం బొప్పగా నాసురీ
  జనసంహార మొనర్చువాని పదకంజాతమ్ములే దిక్కగున్.

  రిప్లయితొలగించు
 4. ఫణిప్రసన్న కుమార్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  "జనస్వాతంత్ర్యము" అన్నప్పుడు "న" గురువై గణదోషం ఏర్పడుతున్నది కదా. "జనసంక్షేమము" అంటే ఎలా ఉంటుంది?

  చింతా రామకృష్ణారావు గారూ,
  అద్భుతమైన పూరణతో అలరించారు. ధన్యవాదాలు.

  మిస్సన్న గారూ,
  మీ పూరణ మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 5. శంకరయ్య గారూ,
  మీ సవరణ కడు ప్రశస్తముగానున్నది. ధన్యవాదములు.

  రిప్లయితొలగించు
 6. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  శ్రీరాముడు ఖర దూషణాదులను వధించిన సందర్భం :

  01)
  ___________________________________________

  తనదౌ రాజ్యము వీడి , భ్రాతయును , సీ - తాదేవి తోడై చనెన్
  వనవాసం బొనరింప, రాము డట ,కో - పావేశమున్ బూని , తా
  మునివేషంబున నుండి గూడ నియతిన్ - పోకిళ్ళ మార్లన్ ,ఖరా
  జన సంహార మొనర్చువాని పదకం - జాతమ్ములే దిక్కగున్ !
  ___________________________________________

  రిప్లయితొలగించు
 7. వినతా పుత్రుని సేవలందుకొను శ్రీవిష్ణుండు, వైకుంఠనా
  థునిపాదాలనునేనుఁబట్టెదను, నాదుష్కృత్యముల్ నేరముల్
  ఘనమౌకారుణిదృక్కులన్ విభుడునన్ గావంగ; దుర్మార్గులౌ
  జన సంహార మొనర్చువాని పదకంజాతమ్ములే దిక్కగున్ !


  శ్రీ జగన్నాథుని దర్శనార్థం పూరీ (ఒడిషా) వెళ్ళి, ఇప్పుడే ఇంటికి చేరుకున్నందున ఆలస్యంగా పూరించగలుగుతున్నాను. మన్నించి సరిచూడగలరు.

  రిప్లయితొలగించు
 8. ఘన నీలాంబరదేహుడై,నిరతమున్ కాలంబులన్ శ్రేష్ఠుడై,
  కనగా జ్ఞానము గల్గి యుండి వెదుకన్, కన్పించి శిష్టప్రజన్
  మునులన్ బ్రోచుచు,ధర్మమున్నిలుపుటన్ ముందుండి భాసించి, దు
  ర్జన సంహార మొనర్చువాని పదకంజాతమ్ములే దిక్కగున్ !

  రిప్లయితొలగించు
 9. వసంత కిశోర్ గారూ,
  బాగుంది మీ పూరణ. భినందనలు.

  మందాకిని గారూ,
  జగన్నాథుని దర్శనం చేసుకున్నందుకు సంతోషం.
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించు
 10. వినరా! భారత మాత సేవకుడ! నీ విధ్వంసమున్ వీడుమా!
  చనుటన్ మానుము మెక్డొనాల్డ్సునకికన్ జంజాటమౌ తీరునన్
  కనగా పిజ్జలు పస్త బర్గరులవోల్ కల్లోల భూయిష్ఠ భో
  జనసంహార మొనర్చువాని పదకంజాతమ్ములే దిక్కగున్

  రిప్లయితొలగించు