8, మే 2011, ఆదివారం

సమస్యాపూరణం - 333 (తమ్ములఁ గాంచి కోపమున)

వారాంతపు సమస్యాపూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
తమ్ములఁ గాంచి కోపమునఁ
దామరసేక్షణ తిట్టె నయ్యెడన్.

8 కామెంట్‌లు:

  1. మాతృ మూర్తుల దినోత్సవ సందర్భంగా నొక తనయ తన తమ్ములతో అమ్మను సత్కరించు కొరకు ఒక ముత్యాల హారాన్ని తెమ్మని, తాను గులాబిహారాన్ని తెచ్చి వేయు సమయంలో,

    తమ్ముల నామెదెమ్మనెను తల్లికి ,ముత్యపు మాలనొక్కటిన్,
    యమ్మకు బ్రీతి గూర్చగను, యన్నులమిన్న గులాబి పూలహా
    రమ్మును ,వేయబోయి గనె, రంగును మాసిన హీనజాతి ము
    త్యమ్ముల గాంచి కోపమున దామరసేక్షణ తిట్టె నయ్యెడన్!

    రిప్లయితొలగించండి
  2. గుమ్ముగ పేక పందెములు గుర్ర్రపు రేసులు లాటరీలతో
    ద్రిమ్మరి,మిత్రబృందముల ద్రిప్పుచు,యార్జన లేకపోయినన్
    సొమ్ములు గుల్లజేయు తెగ సోమరిపోతగు భర్తయాడు ద్యూ
    తమ్ముల గాంచి,కోపమున దామరసేక్షణ తిట్టె నయ్యెడన్!

    రిప్లయితొలగించండి
  3. రమ్మని కోరగన్ ప్రియుని రాగము చిందిచు రాకయుండినన్
    పమ్మిన కోపముల్ విరహ భావము నిండిన మానసంబునన్
    ఝుమ్మని తుమ్మెదల్ వలపుఁ జూపుచు తామర పూలఁ జుట్టినన్
    తమ్ములఁ గాంచి కోపమునఁ దామరసేక్షణ తిట్టె నయ్యెడన్.

    తమ్ములు = తామర పూలు

    రిప్లయితొలగించండి
  4. హనుమచ్చాస్త్రి గారూ, సత్యనారాయణ గారూ మీ మీ పూరణలు అద్భుతమైన విరుపుతో భాసిస్తున్నాయి.
    పీతాంబర ధరా మీ పూరణ సమస్య పాదాది లోని పదానికి భంగం కలిగిస్తోందేమో చూడండి.

    నా పూరణ చిత్తగించండి.

    " అమ్మ యనంగ దేవతర! అమ్మ యనన్ మిము గన్న తల్లిరా!
    అమ్మయె చీము నెత్తురును ఆయువు పంచెర మీకు! అట్టి మీ
    యమ్మను పంచు కొందమని యల్లరి చేతురె హీన జన్ములై ? "
    తమ్ములఁ గాంచి కోపమునఁ దామరసేక్షణ తిట్టె నయ్యెడన్.

    రిప్లయితొలగించండి
  5. మిస్సన్న గారు ,పోస్ట్ చేసిన తర్వాత నాకు సందేహం వచ్చింది .మీ వ్యాఖ్యతో సందేహం సబబే అనిపించింది .మీరన్నట్లు శాస్త్రి మరియు జి .ఎస్. యెన్ గారల పూరణలు చాలా బాగున్నాయి .ఏమాటకామాటే చెప్పుకోవాలి మీ పూరణ అద్భుతంగా ఉంది .నా పూరణకు చిన్న సవరణలు చేశాను .
    మాతృ మూర్తుల దినోత్సవ సందర్భంగా నొక తనయ తన తమ్ములతో అమ్మను సత్కరించు కొరకు ఒకరత్నాల హారాన్ని తెమ్మని, తాను గులాబిహారాన్ని తెచ్చి వేయు సమయంలో,

    తమ్ముల వేసినామనిరి తల్లికి ,రత్నపు హారమొక్కటిన్,
    యమ్మకు బ్రీతి గూర్చగను, యన్నులమిన్న గులాబి పూలహా
    రమ్మును ,వేయబోయి గనె, రత్నపు హారము లేకబోవుటన్,
    తమ్ముల గాంచి కోపమున దామరసేక్షణ తిట్టె నయ్యెడన్!

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న గారూ! పీతాంబర్ గారూ! ధన్యవాదములు.అమ్మతనముతో మీ మీ పూరణలు చాలా బాగున్నవి.

    రిప్లయితొలగించండి
  7. పీతాంబరధరా ఇపుదు మీ పూరణ బాగుంది.

    రిప్లయితొలగించండి
  8. అమ్మవి రాళ్ళ నెక్లెసును హారము గాజులు వడ్డెనమ్మునున్
    కమ్మలు ముక్కు పొడ్కలును కాళ్ళకు గజ్జెలు పట్టుచీరలున్
    పిమ్మట నాకు చెందుగద! వీడురు! దొంగలు మీరటంచుచున్
    తమ్ములఁ గాంచి కోపమునఁదామరసేక్షణ తిట్టె నయ్యెడన్

    రిప్లయితొలగించండి