14, మే 2011, శనివారం

సమస్యా పూరణం - 336 (మీసముల దువ్వి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి.
ఈ సమస్యను పంపిన టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి ధన్యవాదాలు.

13 కామెంట్‌లు:

  1. గోలి హనుమచ్ఛాస్త్రి.

    బుర్ర మీసాలు యున్నట్టి పుణ్యమూర్తి
    తాత వద్దకు చనువుగ తరలి వెళ్ళి
    నిమ్మకాయలు నిలబడు నిజము అనుచు
    మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి.

    రిప్లయితొలగించండి
  2. రాయబార నాటకమందు రమణులంత
    పురుష పాత్రలుఁ గట్టిరి సరసముగను
    పుట్టు మీసములే లేక పెట్టినట్టి
    మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి!!

    రిప్లయితొలగించండి
  3. అన్ని రంగాలలో వారు యడుగు బెట్టి
    మగువలు మగరాయుళ్ళుగా మారి పోవ ;
    హాస్యమున కనవచ్చును హాయి గొలుప
    "మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి"

    రిప్లయితొలగించండి
  4. బుద్ధదేవు,కరుణలకున్ బద్ధ వైరు
    లగు మమత లలితలును బల్రాజకీయ
    మీసముల దువ్వి వనితలే మిడిసి పడిరి
    యెన్నికల మించి గెల్చి పేరెన్నికగని!

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !

    01)
    _____________________________

    పిల్లి పరుగుల పోటీలు - ఢిల్లి యందు !
    నాతు లందరు వచ్చిరి - నాసి తోడ !
    పోటి యందున పాల్గొన - బోవు ముందు !
    మీసముల దువ్వి వనితలే - మిడిసి పడిరి !
    _____________________________

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    తాత మీసాలను మనుమరాళ్ళచే దువ్వించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    "మీసాలు + ఉన్నట్టి" అన్నప్పుడు యడాగమం రాదు. "మీసమ్ము లున్నట్టి" అంటే సరి!

    రిప్లయితొలగించండి
  7. జిగురు సత్యనారాయణ గారూ,
    పెట్టుడు మీసాలు దువ్వించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    నాగరాజు రవీందర్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    "వారు + అడుగుబెట్టి" అన్నప్పుడు యడాగమం రాదు. 'వార లడుగుబెట్టి' అందాం.

    రిప్లయితొలగించండి
  8. చంద్రశేఖర్ గారూ,
    నేను ఎదురుచూస్తున్న పూరణ మీ నుండి వచ్చింది. సంతోషం. నిజానికి 'టేకుమళ్ళ' వారు ఇచ్చింది "వనిత తా మిడిసి పడెను". నేను ఇద్దరి వనితల విజయాన్ని దృష్టిలో పెట్టుకొని "వనితలే మిడిసిపడిరి" అని మార్చి ఇచ్చాను. నా ఆలోచనను మీరు సాకారం చేసారు. ధన్యవాదాలు.
    'పడిరి + ఎన్నికల' అన్నప్పుడు యడాగమం రాదు. ఐతే "వాక్యాంతమందు అచ్చు రావచ్చు" అనే సూత్రాన్ని బట్టి అక్కడ విసంధిగా 'ఎన్నికలు' అని అచ్చుతోనే మొదలు పెట్టవచ్చు.

    రిప్లయితొలగించండి
  9. వసంత కిశోర్ గారూ,
    వనితలచేత పిల్లిమీసాలను దువ్వించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి

    శంకరార్యా! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. ధన్యవాదాలు మాస్టారూ. యడాగమం విషయంలో నా ఆలోచన కూడా అదే. అయితే "యెన్నిక" అని కాకుండా "ఎన్నిక" అని వ్రాయవలెనని తెలియజేసినందులకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. శంకరార్యా ! ధన్యవాదములు !

    02)
    _____________________________

    చిత్తు చేసెను కరుణను - చెత్త గాను !
    మట్టి గరిపించె బుద్ధుని - ముట్టడించి !
    నేడు లలితయు , మమతయు - నిజము ! జూడ
    మీసముల దువ్వి వనితలే - మిడిసి పడిరి !
    _____________________________

    రిప్లయితొలగించండి