14, మే 2011, శనివారం

చమత్కార పద్యాలు _ 54 (సరిగమల పద్యాలు)

సరిగమల పద్యాలు
కం.
మాపని నీపని గాదా?
పాపమ మా పాపగారి పని నీ పనిగా;
నీ పని దాపని పని గద,
పాపని పని మాని దాని పని గానిమ్మా!

కం.
సరి సరిగా మా మానిని
గరిమగ మరిమరిని దాని గదమగ పదమా
సరిగాని దాని సమ మని
సరిగద్దా గసరి దాని దారిగ మారీ!

- అజ్ఞాత కవి
("చాటుపద్య రత్నాకరము" నుండి)

9 కామెంట్‌లు:

  1. ఈ పద్యాల అర్థాన్ని కూడా అక్కడే ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అప్పుడు ఈ సాహితీసౌరభాన్ని మరింతగా ఆస్వాదించగల్గుతాను.

    రిప్లయితొలగించండి
  2. గురువు గారు! నేనూ ఒక చిన్న ప్రయత్నము చేసాను. తప్పులు తెలపగలరు

    నీ గరిమ నీ పసఁ గని సదా నీ పద దరి
    దారి మాదారి మాపని దాసరి పని
    సామ నిగమమా నీ దారి సాగ సరిగ?
    పాప మారి! మా మానినీ పాద దామ!!



    భావము: ఓ! పాపమారి! (పాపానికి మరణము వంటి వాడా!) మా మానినీ పాద దామ! (లక్ష్మీ దేవిని పాదములకు హారముగా కలిగినవాడా!) నీ గొప్పతనము నీ శక్తి చూసి ఎల్లప్పుడూ నీ పాదాల చెంతకే మాదారి. ఇక మాపని విష్ణు సేవకుడైన దాసరి సేవించినట్టు నిను సేవించుటయే. సామ వేదమే నీ మార్గానికి సాగుటకు సరి అయినదా? (మాకు సామ వేద గానము రాదని చెప్పుట)

    రిప్లయితొలగించండి
  3. శ్రీనివాస్ కుమార్ గారూ,
    "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    పై పద్యాలకు వివరణ ఇవ్వాలనే అనుకున్నాను. కాని పనుల ఒత్తిడి వల్ల వీలుకాలేదు. కవి మిత్రు లెవరైనా స్పందించి వివరణ వ్రాస్తే సంతోషం. చూద్దాం .. ఎవరైనా అర్థాన్ని వివరిస్తారేమో?

    రిప్లయితొలగించండి
  4. జిగురు సత్యనారాయణ గారూ,
    ధన్యోస్మి! మీ సప్తస్వరాల పద్యం అద్భుతంగా ఉంది. క్రింద వివరణ కూడా ఇచ్చి మంచి పని చేసారు.
    "పద దరి" అన్నప్పుడు దరిని సంస్కృతపదంగా తీసుకుంటేనే సమాసం నిర్దోషమౌతుంది. దరి శబ్దానికి గుహ అనే అర్థం ఉంది. నీ పాదాలు అనే గుహ చెంతకే మా దారి అని చెప్పుకుంటే సరి!

    రిప్లయితొలగించండి
  5. గురువు గారు,
    "దరి" ని సంస్కృతపదంగా తీసుకున్నా, "నీ పద దరి దారి" అన్నది ఒక పద బంధం కదా! అందులో "దారి" తెలుగుపదమై సమాసము దుష్టమవుతుందేమోనని నా సందేహము.

    రిప్లయితొలగించండి
  6. సత్యనారాయణ గారూ,
    ఇక్కడ దోషం లేదనే నా అభిప్రాయం. 'నది ఒడ్డున' అంటాము కదా. అలాగే 'దరి దారి'. సమాసగతమైతే 'నదీతీరం' అవుతుంది. క్రింది పద్యం చూడండి ...
    ఆ మందిడి యతఁ డరిగిన
    భూమీసురుఁ డరిగెఁ దుహిన భూధరశృంగ
    శ్యామల కోమల కానన
    హేమాఢ్య'దరీఝరీ'నిరీక్షాపేక్షన్.

    రిప్లయితొలగించండి
  7. గురువుగారూ మీ సప్త స్వరాల పద్యాలు అద్భుతం.
    సత్యనారాయణ గారి పద్యం అత్యద్భుతం.

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు.
    కాని అవి "నా" పద్యాలు కావు. ఎవరో అజ్ఞాత కవిరాజు పద్యాలు.

    రిప్లయితొలగించండి