15, మే 2011, ఆదివారం

సమస్యా పూరణం -337 (విద్య యొసఁగునే)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
విద్య యొసఁగునే వినయంబు వెఱ్ఱి గాక!
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

14 కామెంట్‌లు:

 1. గోలి హనుమచ్ఛాస్త్రి

  బుద్ధి,సుద్దులు నేర్పెడు విద్దె వదలి
  శాస్త్ర విజ్ఞాన, గణితము చాలు ననుచు,
  బట్టి బట్టుచు ఆబ్జెక్టు బాట నడువ;
  విద్య యొసగునే వినయంబు వెఱ్ఱిగాక!

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  శాస్త్రిగారూ ! బావుంది !

  01)
  ________________________________

  నాల్గు వేదాల పుట్టిల్లు - నందు నేడు
  వేద విద్యయె వెగటైన - విధిని గనుమ !
  కాసు లిచ్చునో , మానునో - గాని; నేటి
  విద్య యొసఁగునే వినయంబు - వెఱ్ఱి గాక !
  ________________________________

  రిప్లయితొలగించండి
 3. సత్య సారమ్ము దెల్పెడు శాస్త్ర మేది,
  ధర్మ మార్గమ్ము జూ పెట్ట దలుచు నెవడు,
  నీతి నియమాలు నిశిలోన నీల్గ, నేటి
  విద్య యొసఁగునే వినయంబు వెఱ్ఱి గాక!

  రిప్లయితొలగించండి
 4. మిత్రులు హనుమఛ్ఛాస్త్రిగారు,వసంత కిశోరు గారు,శ్రీ పీతాంబరుల గారి పూరణలు చాలా బాగున్నాయి

  ఓం నమః శివాయ యనగ నొప్పు విద్య
  వాణి మ్రొక్కగ గురుముఖ వాణి విద్య
  గాక నేర్చిన పరభాషఁ గాసు లొసగు
  విద్య యొసఁగునే వినయంబు వెఱ్ఱి గాక !

  రిప్లయితొలగించండి
 5. కవి మిత్రు లందరికీ వందనాలు.
  సీ.
  "గోలి హనుమచ్ఛాస్త్రి" కోరి వ్రాసెను బుద్ధి
  ..........సుద్దులఁ జెప్పెడి విద్దె గూర్చి
  సహృదయుండైన "వసంత కిశోర్" చెప్పె
  ..........వేదవిద్యలు పోవు విధము గూర్చి
  "మంద పీతాంబర్" సమంచితమ్మనె నీతి
  ..........వెలయించు మేలైన విద్య గూర్చి
  అరయ "గన్నవరపు నరసింహ మూర్తి" యా
  ..........ధ్యాత్మిక విద్యల యాత్మఁ దెలిపె
  తే.గీ.
  నిట్లు తమ తమ ప్రతిభల నెల్లఁ జూపి
  సారమతు లెల్ల మెచ్చెడి పూరణములఁ
  జెప్పు కవిమిత్రు లందఱ కిప్పు డేను
  ధన్యవాదమ్ము లందింతు మాన్యులార!

  రిప్లయితొలగించండి
 6. శంకరార్యా ! ధన్యవాదములు ! తప్పులు దిద్దకుండా మీరిలా పొగిడితే
  మాకు కొమ్ములు వచ్చే ప్రమాదముంది ! జర చూసుకోండ్రి !

  రిప్లయితొలగించండి
 7. పూజలొసఁగునే మోక్షము పొత్తు విడక
  దానమొసఁగునే ఫలములు దయ లేక
  నేతిబీరకాయ పగిది నేర్చినట్టి
  విద్య యొసఁగునే వినయంబు వెఱ్ఱి గాక!

  రిప్లయితొలగించండి
 8. రెండు మూడు పాదాలలో చిన్నసవరణలతో:
  పూజలొసఁగునే మోక్షము పొత్తు విడక
  దానమొసఁగునే ఫలములు దయ విడచిన
  నేతిబీరకాయ పగిదిన్ నేర్చినట్టి
  విద్య యొసఁగునే వినయంబు వెఱ్ఱి గాక!

  రిప్లయితొలగించండి
 9. గురువు గారూ మీ చక్కని సీసపద్యానికి ధన్యవాదములు.

  మిత్రులు చంద్రశేఖరులు చక్కని సూక్తులు పద్యరూపములో చెప్పారు.

  రిప్లయితొలగించండి
 10. ద్విపద.
  చంద్రశేఖర! నీదు సద్భావకవిత
  సాంద్రమై యలరించె నభినందనములు.

  రిప్లయితొలగించండి
 11. శంకరార్యా! మీ సీసపద్యము ద్వారా చేసిన అభినందనకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 12. మాస్టారూ, ధన్యవాదాలు. వసంతకిశోర్ గారన్నట్లు, గురువులు శిష్యులని పొగడకూడదండీ. నచ్చితే, "ఏదో బాగానే వ్రాశావులే ఇప్పటికి" అనే వారు మా చిన్ననాటి మాష్టారు, శ్రీకంఠ శాస్త్రి గారు. అదే మాకు స్ఫూర్తి.

  రిప్లయితొలగించండి
 13. గురువు గారి పద్య రూపక ప్రశంస మహదానందాన్ని కలుగ జేసింది .ధన్య వాదములు

  రిప్లయితొలగించండి