1, మే 2011, ఆదివారం

సమస్యా పూరణం - 324 (రామమూర్తిఁ గన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
రామమూర్తిఁ గన విరక్తి గలిగె.
ఈ సమస్యను సూచించిన కవి మిత్రునికి ధన్యవాదాలు.

39 కామెంట్‌లు:

  1. దేవతలకు విభుడు దివ్య భామిను లుండ
    మౌని పత్ని గోరె మాన ముడిగి
    యోను లాయె వేయి మేనెల్ల నట్టి సు-
    త్రామమూర్తిఁ గన విరక్తి గలిగె.

    రిప్లయితొలగించండి
  2. మిస్సన్న గారూ! 'సుత్రామ మూర్తి పై విరక్తి ' బాగుందండీ!మా కేరాముడు దొరుకుతాడో?

    రిప్లయితొలగించండి
  3. కుశుడు లవునితో .....

    అన్న లవుడ! చూడు మాడుదానిని జంపె!
    చెట్టు నక్కి వాలి మట్టు బెట్టె!
    భార్య నొంటి నడవి పాల్జేసె గద! నిట్టి
    రామ మూర్తి గన విరక్తి గలిగె!

    రిప్లయితొలగించండి
  4. మిస్సన్న గారూ ! రమణీయమైన పూరణ ! చాలా సాధికారికంగా నడిచింది పద్యం . అభినందనానీకం !!!

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    మిస్సన్నమహాశయుల పూరణ
    ముచ్చటగా నున్నది !

    శాస్త్రిగారూ !
    బావుంది !కాని ఆ మాటలు
    లవుడు కుశునితో అనినవి !

    మందాకిని గారూ !
    బావుంది !

    01)
    __________________________________

    చిన్న తనమున బడిలోని - స్నేహితుండు
    పరుష వాక్కుల నిందించు - పాపి యతడు !
    తోటివారివి కలములు - దోచు కొనెడు
    లటుడు ,రామమూర్తిఁ గన ,వి - రక్తి గలిగె !
    ___________________________________
    లటుడు = దొంగ

    రిప్లయితొలగించండి
  6. హనుమచ్ఛాస్త్రి గారూ చక్కగా కమనీయంగా పూరించారు...చాలా బాగుంది...మూడవ పాదం లొ 'నిట్టి ' ని యిట్టి చేయండి .ఇంకా బాగుంటుంది...!!!

    రిప్లయితొలగించండి
  7. విష్ణు నందన్ గారూ! బహుకాల వీక్షణం.సంతోషంగా వుంది.సవరణకు ధన్యవాదములు.
    కిశోర్ జీ!ఆటవెలదిని తేట గీతి చేశారు. బాగుంది.
    సవరణలతో నాపూరణ..
    ----------------------------------------
    లవుడు కుశునితో .....

    అన్నకుశుడ! చూడు మాడుదానిని జంపె!
    చెట్టు నక్కి వాలి మట్టు బెట్టె!
    భార్య నొంటి నడవి పాల్జేసె గద!యిట్టి
    రామ మూర్తి గన విరక్తి గలిగె!

    రిప్లయితొలగించండి
  8. మందాకిని గారూ! అన్వయం ఒకసారి చూస్తారా!'విరక్తి ' కలగాలి.

    రిప్లయితొలగించండి
  9. మంధర బోధనలు తలకెక్కిన
    కైక తన మదిలో :

    02)
    __________________________________

    తెల్లవారి నంత - స్థిరముగ రాముడు
    రాజు యగును మిగుల - రమ్య మలర !
    భరతు డింక వాని - బానిస గామారు !
    రామమూర్తిఁ గన ,వి - రక్తి గలిగె !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  10. 03)
    __________________________________

    జగతి రాముడె యని - జనులు మెచ్చు నటుల !
    నటన మాడు నతడు - నాటకమున !
    చక్రయాగము , నట - సలుపు బాలిశుడగు
    రామమూర్తిఁ గన ,వి - రక్తి గలిగె !
    ___________________________________

    చక్రయాగము = మధుసేవ
    బాలిశుడు = మూర్ఖుడు

    రిప్లయితొలగించండి
  11. ధర్మవర్తనమ్ముఁదప్పక మసిలెడి
    వాఁడు ,నిహపు భోగ వాంఛ లేని
    త్యాగ మూర్తి ; రక్తి దారుల వీడెదఁ
    రామ మూర్తి గన విరక్తి గలిగె.

    శాస్త్రి గారు,
    ధన్యవాదాలు. ఇప్పుడు కుదిరిందనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  12. నిండు గర్భిణి యైన సీతను రాముడు
    పరిత్యజించాడని విన్న కౌసల్యాదిగాగల
    అంతఃపుర స్త్రీలు వారి వారి మనసులలో :

    04)
    __________________________________

    నెలలు నిండు చుండ - నెయ్యంబు దలపక
    భార్య నడవి కంపె - పాప మనక !
    కరుణ లేని వాడు - కర్కశ హృదయుండు !
    రామమూర్తిఁ గన ,వి - రక్తి గలిగె !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  13. చెట్టు చాటు నుండి రాముడు వేసిన
    శరాఘాతముతో నేలకూలిన వాలి :

    05)
    __________________________________

    ముందు నిలువ లేక - మోసంబుగా నన్ను
    మట్టు బెట్టె నిటుల - బిట్టుబిళ్ళు !
    వెనుక నుండి జంపు - వేషధారి యగు
    రామమూర్తిఁ గన ,వి - రక్తి గలిగె !
    ___________________________________
    బిట్టు+బిట్టు = బిట్టుబిళ్లు = తటాలున
    వేషధారి = ముని వేష ధారి

    రిప్లయితొలగించండి
  14. అడవిలో విడువ బడిన జానకి దుఃఖ్ఖాన్ని
    భరించ లేని భూదేవి :

    06)
    __________________________________

    జాలి సుంత లేని - జనులకు రాజట !
    బుద్ధి లేని వారి - పొల్లాపులను విని
    అగ్ని జాత సీత - నడవుల కంపిన
    రామమూర్తిఁ గన ,వి - రక్తి గలిగె !
    ___________________________________
    పొల్లాపు = అసత్యము

    రిప్లయితొలగించండి
  15. అయోధ్యలో రామాయణ గానం విని మెచ్చుకున్న
    రాముణ్ణి సీతామాతను చూపించమని
    అడిగిన లవకుశులు :

    07)
    __________________________________

    అడవి కంపె సీత - నందాల రాముడు
    అనగ వినిన , వారు - అలుక జెంది
    అతివ జూప లేని - అవతార పురుషుని
    రామమూర్తిఁ గన ,వి - రక్తి గలిగె !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  16. మిత్రులు రామమూర్తిపై విరక్తి కలిగిందని పూరిస్తున్నారు.
    నేను రామమూర్తిని గనగానే నాకు ఇహము పై విరక్తి కలిగిందని పూరిస్తున్నాను.
    గురువులు, కవి మిత్రులు ఇది సరి కాదేమో వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  17. లవకుశ సినిమాలో చివరి ఘట్టం !
    రెండుగా విడిన భూమిలోనికి
    సీతామాత , భూజాత ప్రవేశం :

    08)
    __________________________________

    తండ్రి మించి నట్టి - తనయుల నిరువుర
    తండ్రి కప్ప జెప్పి - ధరణి విడగ
    తల్లి చెంత జేరె - తరుణి సీత యపుడు
    రామ మూర్తి గన వి-రక్తి గలిగి !
    ___________________________________

    @@@@@@@@@@ శుభం @@@@@@@@@@

    రిప్లయితొలగించండి
  18. తండ్రి ఆనతి తల దాల్చి కానల కేగు
    రామమూర్తి గని విరక్తి గలిగె
    పురజనులకు, రాచ పరివారమునకును ;
    "ఏమిది విధివ్రాత !? యిటుల అయ్యె !?"

    రిప్లయితొలగించండి
  19. మందాకిని గారూ! సవరించిన పూరణ అన్వయం కుదురింది.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. వచ్చె నితరదేశ వస్తాదు యొక్కండు
    భరతఖండ మందు బలిమి జూప;
    కాని యతనికి బహు గట్టివాడగు కోడి
    రామమూర్తి గన విరక్తి గలిగె !

    రిప్లయితొలగించండి
  21. కోడి రామ మూర్తిని స్మరించిన మీ పూరణ బాగుంది రవీందర్ గారూ.

    రిప్లయితొలగించండి
  22. మీకు నా పూరణ నచ్చినందుకు ధన్యవాదములు మిస్సన్న గారూ !

    రిప్లయితొలగించండి
  23. ధర్మ మూర్తి యేల దయలేని రాజాయె?
    ధరణి జాత యెట్టి తప్పు జేసె ?
    గర్భవతిని సతిని గానల బోద్రోలు,
    రామ మూర్తి గన విరక్తి గలిగె!

    రిప్లయితొలగించండి
  24. అమర శిల్పులిచట యవతరించెను నాడు
    నాటి కాలమింక దాటి పోయె
    నేర్పు లేని శిల్పి నిలువుగ చెక్కిన
    రామమూర్తిఁ గన విరక్తి గలిగె!!

    మూర్తి = విగ్రహము

    రిప్లయితొలగించండి
  25. జయము గలుగు నీకు జయజయ జానకీ
    రామమూర్తిఁ గన; విరక్తి గలిగె
    విష్ణు కథ చదవక వినకనె పరదైవ
    దూషణంబు చేయు ధూర్తు లఁగని.

    సూచన: గన=తెలియు; పర="గొప్ప" అనే అర్థంలో ; "ఇతరుల" అని అనుకొన్నా భావరాహిత్యం కలగదు.

    రిప్లయితొలగించండి
  26. ఉదయం సమస్య ఇస్తున్నప్పుడే నా మనస్సులో ఒక భావం రూపుదిద్దుకున్నది. మియాపూర్‌లో బంధువుల ఇంటికి విందుకు వెళ్ళి ఇప్పుడే వచ్చి "బ్లాగు" తెరిచాను. మిత్రుల పూరణలూ, వాటిపై స్పందనలు చూచి ఆనందించాను. ఎవరో ఒకరు నే ననుకున్న అంశంతో పూరణ పంపుతారేమో అని చూసాను .....
    హమ్మయ్య!
    నే ననుకున్నదానిని ఎవ్వరూ పట్టుకోలేదు ... ఇంత కాలానికి :-))
    నా పూరణ ....

    పాట పరవశించె వేటూరి సుందర
    రామ మూర్తిఁ గన; విరక్తి గలిగె
    శబ్ద భావ రాగ సౌందర్య రహిత గీ
    తముల వ్రాయు వారిఁ దలఁచి నపుడు.

    రిప్లయితొలగించండి
  27. శంకరార్యా !
    వేటూరి వారిని బాగా పట్టుకున్నారు !
    ఔను !
    ఇప్పుడొచ్చే గీతాలన్నీ
    శబ్ద భావ రాగ సౌందర్య రహితాలే !

    రిప్లయితొలగించండి
  28. గురువు గారూ హృద్యమైన పాటల తోట మాలిని స్మరించుకొన్న మీ పూరణ హృద్యంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  29. నా రెండవ పూరణ .....

    పట్టుపట్టె జనుల వాడుకబాసనే
    వ్రాయవలె నటంచు; గ్రాంధికమ్ము
    నిచ్చగించు పండితేంద్రులకు గిడుగు
    రామమూర్తిఁ గన విరక్తి గలిగె.

    రిప్లయితొలగించండి
  30. గురువుగారు మీ పూరణలూ విభిన్నంగా ఉండి అలరించాయి.
    అన్ని పూరణలూ బాగున్నాయి.
    శాస్త్రి గారు , ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  31. మిస్సన్న గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉండి డా. విష్ణు నందన్ గారి ప్రశంసకు పాత్ర మయింది. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    డా. విష్ణు నందన్ గారి మెచ్చుకోలు పొందిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    డా. విష్ణు నందన్ గారూ,
    ధన్యవాదాలు.

    వసంత కిశోర్ గారూ,
    మీ ఎనిమిది పూరణలూ అద్భుతంగా ఉన్నాయి.
    మొదటి పూరణలో చిన్ననాటి "రామమూర్తి"ని గుర్తుకు తెచ్చుకొనడం, ఆటవెలది సమస్య పాదాన్ని తేటగీతిలో బంధించిన విధానం బాగుంది.
    రెండవ పూరణలో కైక స్వగతం బాగుంది. "రాజు + అగును" అన్నప్పుడు యడాగమం రాదు. "రాజపీఠ మెక్కు" అంటే ఎలా ఉంటుంది?
    త్రాగుబోతు రామమూర్తి గురించిన మూడవ పూరణ ప్రశస్తంగా ఉంది.
    నాల్గవ పూరణలోని అంతఃపురకాంతల స్వగతం బాగుంది.
    అయిదవ పూరణలో "బిట్టుబిళ్ళు" ప్రయోగం బాగుంది. "వేషధారి యగు" అనడం కంటే "పిరికివా డైనట్టి" అంటే ఎలా ఉంటుంది?
    ఆరవ పూరణ బాగుంది. కాని రెండవ పాదంలో గణదోషం. "పొల్లు నుడుల కగ్ని ... " అంటే ఎలా ఉంటుం దంటారు?
    ఏడవ పూరణ అత్యుత్తమంగా ఉంది.
    ఎనిమిదవ పూరణ కూడ బాగుంది. కాకుంటే "కలిగె" అనేది "కలిగి" అయింది.
    మీకు అభినందనాష్టకం.

    రిప్లయితొలగించండి
  32. మాస్టారూ, నల్ల రామమూర్తి (మాయాబజార్ లంబు జంబూలలో ఒక నటుడు), గిడుగు రామమూర్తి పంతులు గారు నా తలపుకు వచ్చారు. అయితే వీరు ఆధునిక కాలంలో యెక్కువ మందికి తెలియదనుకొని వదిలేశాను. గిడుగు వారి మీద పద్యం బాగుంది. వేటూరి ఐడియా తో పులై పోయారు ఈరోజు మీరు(నవ్వుతూ).

    రిప్లయితొలగించండి
  33. గురువుగారూ మీ రెండవ పద్యం మరింత హృద్యం.

    రిప్లయితొలగించండి
  34. శంకరార్యా! ఇద్దరు రామమూర్తులను గుర్తుకు దెచ్చిన మీ పూరణలు అలరించాయి. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  35. మిత్రులందరి పూరణలూ
    ముచ్చటగా నున్నవి !


    శంకరార్యా !
    ఈ సారి గిడుగు వారిని పట్టుకొచ్చారు !
    భలే బావుంది !

    మీ విలువైన సవరణలకు
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  36. ఉదయం వ్యాఖ్యలు టైపు చేస్తుండగా "పవర్ కట్" :-(
    మళ్ళీ ఇప్పుడే వచ్చింది.

    రిప్లయితొలగించండి
  37. మూర్తి యన్నభార్య ముక్కోపి యనివింటి
    మఱదిఁగనినఁ గోపమధిక మగును
    వాదులాడు చుండు వదినతో శ్రీరామ
    రామ! మూర్తినిఁగని విరక్తి కలిగె.

    రిప్లయితొలగించండి
  38. మందాకిని గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    నాగరాజు రవీందర్ గారూ,
    మీ మొదటి పూరణ చాలా బాగుంది.
    రెండవ పూరణలో "కోడి రామమూర్తి"ని ప్రస్తావించడం బాగుంది. అభినందనలు.
    "వస్తాదు యొక్కండు" ... ఇక్కడ యడాగమం రాకూడదు. "వస్తా దొకడు మన" అందాం.

    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణకు శిల్పకళను ఆలంబనం చేసుకున్నారు. బాగుంది. అభినందనలు.
    "శిల్పులిచట యవతరించెను" చివర "చిరి" ఉండాలనుకుంటాను.

    చంద్రశేఖర్ గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  39. నా పూరణలను ప్రశంసించిన
    వసంత కిశోర్, మిస్సన్న, మందాకిని, చంద్రశీఖర్, గోలి హనుమచ్ఛాస్త్రి గారలకు ధన్యవాదాలు.

    మందాకిని గారూ,
    మీ లేటెస్ట్ పూరణ చమత్కార భరితమై అలరించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి