23, మే 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 61 (తలలొ క్కేబదినాల్గు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 5

సమస్య - "తలలొ క్కేబదినాల్గు కానఁబడియెన్
దద్గౌరి వక్షంబునన్"
మ.
లలితాకారుఁ గుమారు షణ్ముఖునిఁ దా లాలించి చన్నిచ్చుచో
గళలగ్నగ్రహరత్నదీప్తికళికా గాంభీర్యహేమాంచితో
జ్జ్వలరత్న ప్రతిబింబితాననములన్ శంభుండు వీక్షింపఁగాఁ
దలలొ క్కేబదినాల్గు కానఁబడియెన్ దద్గౌరి వక్షంబునన్.

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

4 కామెంట్‌లు:

 1. (అర్థనారీశ్వరుడైన శివుడు వంద పడగల పామును ధరించి నాట్యము చెసేటప్పుటి పరిస్థితి)

  కలిసెన్ దేహములొక్కటై గిరిజతో కైలాస శైలంబుపై
  వెలసెన్ సాంబ శివుండు, వంద పడగల్ వేష్టించి నర్తింపగన్
  నలభై యారవి శీర్షముల్ భవునిపై నర్తించె మోదంబుగన్
  తలలొ క్కేబదినాల్గు కానఁబడియెన్ దద్గౌరి వక్షంబునన్!!

  రిప్లయితొలగించండి
 2. గోలి హనుమఛ్చాస్త్రి.

  ఒక సినిమా వాల్ పొస్టర్ లో నాయిక గౌరి వక్షస్థలంపై ఆ సినిమాలోని నటులందరినీ ముద్రించారని భావన...

  ఇలలో నాయిక గౌరి పోస్టరును తా మీరీతి ముద్రించెగా
  వలలా భాగములుండె కప్పుకొనియెన్ వస్త్రంబు వక్షంబుపై
  వలలో యాక్టరులందరన్ వరుసగా భాగాలుగా జూపగా
  తలలొ క్కేబదినాల్గు గానబడియెన్ తద్గౌరి వక్షంబునన్.

  రిప్లయితొలగించండి
 3. కళకళ్లాడెడి పెండ్లి పందిరినిమా గౌరక్క కూర్చుండగా
  తళతళ్ళాడెడి సిల్కు బట్టపయినన్ ధట్టించి కుట్టించినన్
  మిలమిల్లాడెడి గాజుపెంకులను భల్ మేలైన తన్ బ్లౌసునన్
  తలలొ క్కేబదినాల్గు కానఁబడియెన్ దద్గౌరి వక్షంబునన్

  రిప్లయితొలగించండి