16, మే 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 55 (నస్యము)

నస్యముపై చాటుపద్యములు
(ఎన్నో తరాలుగా మా యింట్లో నస్యం తయారుచేసి అమ్మడం కులవృత్తిగా ఉండేది. ఇప్పుడు లేదనుకోండి! అసలు మా ఊళ్ళో మమ్మల్ని "నశపోళ్ళు (నస్యం వారు) అని పిలిచేవారు. 50,60 సంవత్సరాల క్రితం మా మేనమామ "నశ్యం పాపయ్య" అంటే వరంగల్ లో అందరికీ హడల్. ఈ తరం వాళ్ళకు తెలీదు కాని పాతతరం వాళ్ళకు బాగా తెలుసు. "చాటుపద్య రత్నాకరము"లో నస్యమును గురించిన పద్యాలు దొరికాయి.)
ఉ.
నస్యము శీతమత్తగజనాశనహేతువిచారధీరపం
చాస్యము, సుస్తిరోగనిబిడాంధతమఃపటలార్కబింబసా
దృశ్యము, వేదశాస్త్రపటుదివ్యసుపండితవాగ్విచిత్రసా
రస్యము, రాజవశ్య, మహిరాణ్మణికైన నుతింప శక్యమే?

ఉ.
మట్టపొగాకులో నడుమ మందము గల్గినచోటఁ దీసి, తాఁ
బట్టుగఁ బక్వశుద్ధిగను బాగుగఁ గాచి, యొకింత సున్నమున్
బట్టను వ్రేల నొత్తి, తన బల్మికొలందిగ నల్చి, నస్యమున్
బట్టపు డబ్బిలో నునిచి ప్రాజ్ఞుల కిచ్చిన పుణ్య మబ్బదే!

సీ.
నస్యమా యిది? మరు న్నారీశిరోమణి
కుచకుట్మలము మీఁది కుంకుమంబు;
నాసికాచూర్ణమా? నలినరుడ్వనితాధ
రార్పిత తాంబూలికాసవంబు;
పొడుమటే? వెడవిల్తు పొలఁతి నెమ్మోముపైఁ
గొమరొందు కసటు కుంకుమపుఁ దావి;
ముక్కుపొడే యిది? ...... ..........
................. .............. జ్జ్వలరసంబు;
తే.గీ.
సకలజన మానసోజ్జ్వల చరమమార్గ
తత్త్వమస్యాది వాక్య ప్రధాన సార
హేతుకంబై చెలంగుచు నింపు నింపు
నస్యము గణింప శక్యమే నలువ కైన!
- అజ్ఞాత కవి.

7 కామెంట్‌లు:

  1. మాస్టారూ,
    అదరగొట్టారుగదా! రెండవ ఉత్పలమాలలోని ప్రతి పనీ నేను చిన్నప్పుడు నా చేతులతో స్వయంగా చేశాను, మా మేనమామ కోసం. మంచి పట్టు పట్టేవాడు. ఇక సీస పద్యం చదివి ఒకటే నవ్వుకొన్నాను. వళ్ళు పులకరించింది. మీరు సభా మర్యాద కోసం డాష్..డాష్..అని వదిలివేసిన పాదం నాకు ఈమెయిలు లో పంపగలరు. మరొక్కసారి ఆనందామృత ధారలతో, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. చంద్రశేఖర్ గారూ,
    సభామర్యాదను పాటించి డాషులు పెట్టింది దీపాల పిచ్చయ్య శాస్త్రి గారే. వారు సేకరించిన "చాటుపద్య రత్నాకరము" నుండి ఆ పద్యాలను తీసుకున్నాను.

    రిప్లయితొలగించండి
  3. మాస్టరు గారూ! నశ్యం పద్యాల ఘాటు నసాళానికి అంటిందండీ!

    రిప్లయితొలగించండి
  4. సనత్ కుమార్ గారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    .................. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. మా చిన్నపుదు మా పెదనాన్న తో కలసి ఆయనకు నస్యమును నూరుటకొరకు నీరు సున్నము తీసుకొని గుడ్డలొ వుంచి గట్టిగా పిండి,ఆ సున్నమును వేఇంచిన పొగాకులొ నెయ్యి తొ కలిపి బాగా మట్టి మూకుడు లొ నూరటము నాకు మళ్ళీ గుర్తుకు వచ్చింది సుమండీ.. శ్రీనివాస్ HYD

    రిప్లయితొలగించండి
  6. ఇప్పుడే గోంగూర పచ్చడితో భోజనము చేసి నస్యముపై పద్యాలు చదివా.నిజంగానే నాలో పంచాస్యము మేలుకొంది. ఘాటంటే అలా వుండాలి.ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి