2, మే 2011, సోమవారం

సమస్యా పూరణం - 326 (నరసింహుం డాగ్రహించి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
నరసింహుం డాగ్రహించి నరకునిఁ జంపెన్.

38 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    01)
    ___________________________________

    కరములతో జంపె నసురు
    నరసింహుండాగ్రహించి !- నరకుని జంపెన్
    మురహరి సతియగు సత్యయె
    వరలగ జగమంత నసురు - వధకై వేడన్ !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  2. 02)
    ___________________________________

    కరుణను గాచెను బాలకు
    నరసింహుం డాగ్రహించి !- నరకుని జంపెన్
    మురళీ గాన విలోలుని
    సరసన మురిపెము లొలికెడు - ముద్దుల సతియే !
    ___________________________________
    బాలకుడు = ప్రహ్లాదుడు

    రిప్లయితొలగించండి
  3. 03)
    ___________________________________

    అరుదగు వరములు పొందిన;
    నరసింహుం డాగ్రహించి - నసురుని జంపెన్
    నరకుని జంపెన్ భామయె
    సుర,ముని,ధారుణి జనులకు - శుభములు గలుగన్ !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  4. వరబాలు దండ్రి జంపెను
    నరసింహుండాగ్రహించి;నరకుని జంపెన్
    హరి,హరి సంహా రకుడౌ
    వర గర్విత దుష్టులైన వారిని జంపన్!

    రిప్లయితొలగించండి
  5. 04)

    ___________________________________

    పరుగున వచ్చెను గావగ;
    నరసింహుం డాగ్రహించి !- నసురుని జంపెన్ !
    నరకుని జంపెన్ , క్రోధిలి
    పరమాత్ముని భార్య సత్య - భామా మణియే !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  6. కరనఖములతోఁజంపెను
    నరసింహుం డాగ్రహించి; నరకునిఁ జంపెన్
    కరివరదునిరమణీమణి
    మురిపించఁగపతినివీరమునిరూపించెన్

    రిప్లయితొలగించండి
  7. నరపతి పుత్రిక లందర
    జెరబట్టెడు నక్కలాటి జిత్తుల మారిన్!
    హరి,కృష్ణుడు,యాదవ వర
    నర సింహుండాగ్రహించి;నరకుని జంపెన్!

    రిప్లయితొలగించండి
  8. 05)

    ___________________________________

    మరణంబు తల్లి వలనని
    వరమును గొన్నట్టి వాని - వనజాక్షిణితో
    గిరినెత్త్తి ప్రజల గాచిన
    నర-సింహుం డాగ్రహించి - నరకుని జంపెన్ !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  9. సురవైరినిఁజంపెనదో
    నరసింహుం డాగ్రహించి; నరకునిఁ జంపెన్
    మురవైరిసతీమణిభీ
    కరసమరమ్మున మురారి ఘనతను పెంచెన్

    రిప్లయితొలగించండి
  10. ఉరమునుచీల్చుచుఁజంపెను
    నరసింహుం డాగ్రహించి; నరకునిఁ జంపెన్
    మరణము జననివలనయని
    వరమునుఁగొనివిఱ్ఱ వీగు వానిని హరియై!

    రిప్లయితొలగించండి
  11. అసురుడు కశ్యపు జంపెన్
    నరసింహుం డాగ్రహించి; నరకుని జంపెన్
    గిరిధర గోపాలు డలిగి;
    కరివేలుపు హుంకరించి కంసుని జంపెన్ !

    రిప్లయితొలగించండి
  12. క్షమించాలి ! పై పద్యంలో ప్రాసదోషాన్ని గమనించలేదు.
    ఇలా చదువు కొనవలసిందిగా మనవి.


    మురికొని కశ్యపు జంపెన్
    నరసింహుం డాగ్రహించి; నరకుని జంపెన్
    గిరిధర గోపాలుడలిగి;
    కఱివేలుపు హుంకరించి కంసుని జంపెన్ !

    *మురికొను = కలియబడు

    రిప్లయితొలగించండి
  13. నరకుడు దైత్యుల కధిపతి
    నరకడు, జనకంటకుండు నక్తంచరుడున్ !
    కరి జంపు సింగము పగిది
    నరసింహుం డాగ్రహించి నరకుని జంపెన్ !

    *నరకడు = దుష్టుడు
    *నరసింహుడు = నరులలో శ్రేష్ఠుడు

    రిప్లయితొలగించండి
  14. పరికించిరి వాక్యమ్మును,
    "నరసింహుండాగ్రహించి నరకుని జంపెన్"
    సరియైన పదము కాదని
    చిరు నగవు లొలుక పలికిరి చిరు విద్యార్థుల్!

    రిప్లయితొలగించండి
  15. ధరణి సుతుడు వరమహిమన్
    తరుణులను మునీంద్రులను సతాయించంగన్
    పరుడై సమ భావమ్ము త
    నర సింహుం డాగ్రహించి నరకునిఁ జంపెన్!!

    సింహుండు = విష్ణువు
    {విష్ణు సహస్ర నామ స్త్రోత్రం:-
    గభస్తినేమి: సత్త్వస్థ: సింహో భూతమహేశ్వర:!
    ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురు: !! }

    రిప్లయితొలగించండి
  16. పరిమార్చెహిరణ్య కశిపుఁ
    నరసింహుం డాగ్రహించి; నరకునిఁ జంపెన్
    వరములిడ,వనిత తోడుగ
    హరి నీ లీలావిలాసమది చిత్రంబే!

    రిప్లయితొలగించండి
  17. పీతాంబర్ గారి పూరణ బాగుంది. చిన్నప్పటి తరగతి వాతావరణం గుర్తుకు తెచ్చింది. మీరు టీచరా సార్?

    రిప్లయితొలగించండి
  18. వసంత కిశోర్ గారూ,
    మీ ఐదు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    నాకు తెలిసినంతవరకు నరక సంహారంలో సత్యభామ కృష్ణునికి సహకరించింది. నరకుని చంపింది కృష్ణుడే కదా!
    రెండవపూరణ నాల్గవపాదంలో యతి తప్పింది. "సరసన మురిపెము లొలికెడు సాత్రాజితియే!" అంటే ఎలా ఉంటుంది?
    మూడవ, నాల్గవ పూరణలలో "నరకుని" ట్రన్స్‌ఫర్ చేసారు. సమస్యా పూరణలో ఈ సంప్రదాయం ఉన్నట్టు లేదు.
    ఐదవ పూరణ ఉత్తమంగా ఉంది. "వనజాక్షిణితో" అనేది "వనజనయనతో" అయితే? వనజాక్షి ఉంది, కాని వనజాక్షిణి ప్రయోగం తప్పనుకుంటా.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో "సంహారకుడౌ, చంపన్" అని పునరుక్తి వస్తున్నది. పద్యాంతంలో "వారల నెల్లన్" అంటే సరి!
    రెండవ పూరణ అత్యుత్తమం.

    మందాకిని గారూ,
    ప్రశస్తంగా ఉన్నాయి మీ మూడు పూరణలు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. శంకరార్యా !
    ధన్యవాదములు !
    మీ
    సవరణలలో
    నా
    సంశయాలకు
    సమాధానములు లభించినవి !
    సంతోషం !

    రిప్లయితొలగించండి
  20. శంకరార్యా !
    తల్లి చేతి లోనే మరణమను
    వరము గలిగిన నరకుని
    శ్రీ కృష్ణు డెట్లు సంహరించ గలుగు ?
    సత్య భామ శర ప్రయోగమే
    కారణము గదా !

    రిప్లయితొలగించండి
  21. నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    జిగురు సత్యనారాయణ గారూ,
    అత్యుత్తమంగా ఉంది మీ పూరణ. ముఖ్యంగా ఆ విరుపు ఎన్నదగింది. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    మంద పీతాంబర్ గారు బ్యాంకు ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.

    రిప్లయితొలగించండి
  22. వసంత కిశోర్ గారూ,
    రెండు కథలూ ప్రచారంలో ఉన్నాయి. గూగుల్ లో వెదికితే రెండురకాల ఇతివృత్తాలు కనబడుతున్నాయి. నా దగ్గర భాగవతం రెండవ భాగం లేదు. ఉంటే సందేహ నివృత్తి జరిగేది.

    రిప్లయితొలగించండి
  23. సమదేభేంద్రము నెక్కి భూమిసుతుఁడా చక్రాయుధున్ వైవ శూ
    లము చేఁబట్టిన నంతలోన రుచిమాలాభిన్న ఘోరాసురో
    త్తమ చక్రంబగు చేతిచక్రమున దైత్యధ్వంసి ఖండించె ర
    త్నమయోదగ్ర వినూత్నకుండల సమేతంబైన తన్మూర్ధమున్. (మ)

    * నరకాసురుఁడు మదగజాన్నెక్కి చక్రాయుధునిపై ప్రయోగించటానికి శూలాన్ని పట్టుకుని పైకెత్తేలోపుగానే శ్రీకృష్ణుఁడు ఎందరో రాక్షస వీరులను ఖండించిన తన చక్రాయుధాన్ని వానిమీద ప్రయోగించాడు. ఆ చక్రం రత్నాలు పొదిగిన కుండలాలతో కూడిన నరకుని శిరస్సును తెగవేసింది.

    రిప్లయితొలగించండి
  24. అయ్యా అదీ విషయం. పోతన భాగవతం దశమస్కంధం ౪ వ భాగం చూసి రాస్తున్నాను.
    మీ మీ ప్రేరణవల్ల రెండవసారి మొత్తం భాగవతం చదవాలనే సంకల్పం కలిగింది. కృతజ్ఞురాలిని.

    రిప్లయితొలగించండి
  25. శంకరార్యా !
    మరి శ్రీ కృష్ణుడే సంహరిస్తే
    నరకాసురిని వరం సంగతేంటి ?
    అది కూడా అభూత కల్పనేనా ?

    రిప్లయితొలగించండి
  26. వసంత కిశోర్ గారూ,
    రామాయణానికి వాల్మీకి లాగా భాగవతానికి వ్యాసుడు రాసిందే ప్రమాణం. భాగవతంలో నరకాసుర వధలో సత్యభామ సహకరించిందనే ఉంది కాని ఆవిడే స్వయంగా చంపినట్టు లేదు. తల్లి చేతిలో తప్ప మరణం లేదనే వరం పొందిన కథా లేదు.

    రిప్లయితొలగించండి
  27. మందాకినిగారు
    వీటినెలా సమర్థించు కుంటారో !

    1)

    నరకునిఁ జంపెన్
    కరివరదునిరమణీమణి
    మురిపించఁగపతినివీరమునిరూపించెన్
    2)"నరకునిఁ జంపెన్
    మురవైరిసతీమణిభీ
    కరసమరమ్మున మురారి ఘనతను పెంచెన్ "
    03)నరకునిఁ జంపెన్
    మరణము జననివలనయని
    వరమునుఁగొనివిఱ్ఱ వీగు వానిని హరియై!

    రిప్లయితొలగించండి
  28. వసంతకిశోర్ గారు,
    నాకూ సత్యభామ చంపినదనే భావనే ఉండి అలా రాశానండి. మీ సంభాషణ తర్వాతే చదివి చూశాను. ఒకసారి మాత్రమే నేను భాగవతం చదివాను. కానీ చిన్నప్పట్నించీ సత్యభామ చంపిందనీ తల్లి చేత చావు అనే వరమనీ మనసులో ఉన్నది. అదే గుర్తులో రాశాను. తప్పు అని తెలిసింది కాబట్టే భాగవత పద్యం సంజాయిషీ పూర్వకంగానే రాసి పెట్టానిక్కడ.

    రిప్లయితొలగించండి
  29. మందాకినిగారూ !
    ధన్యవాదములు !

    శంకరార్యా !
    భాగవతంలో లేని కథ
    ఇంతగా జనాల్లోకి ఎలా చొచ్చుకు పోయిందో ???
    నాకు సినిమా పరిఙ్ఞానమే ఎక్కువ
    గ్రంథములకన్నా !

    రిప్లయితొలగించండి
  30. నరకు డెవరి చేత చంప బడ్డాడు అన్న విషయం మీద
    సాధికారికమైన చర్చ జరిగింది. బాగుంది.

    రిప్లయితొలగించండి
  31. కరనఖముదరముజీల్చెను
    నరసింహుం డాగ్రహించి; నరకునిఁ జంపెన్
    మురళీధరుడావేళన్
    చిరుసాయముసత్యభామజేయగరణమున్

    శ్రీ కృష్ణుడే నరకుని జంపినట్టు పూరణ..

    రిప్లయితొలగించండి
  32. మందాకిని గారూ,
    మీ చివరి పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. నరకుని రూపము దాల్చిన
    పరులకు దాసోహమనెడు వనరుల స్థితిపై
    నరవరు డాంధ్రుడు పీ. వీ.
    నరసింహుం డాగ్రహించి నరకునిఁ జంపెన్

    రిప్లయితొలగించండి
  34. కొరగాని శిష్యునొక్కని
    పరమానందయ్య కిచ్చి పలుకగ మనగా
    గరువముతో నిట్టులనెను:
    "నరసింహుం డాగ్రహించి నరకునిఁ జంపెన్"

    రిప్లయితొలగించండి