16, మే 2011, సోమవారం

సమస్యా పూరణం -339 (కవిని పెండ్లియాడి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కవిని పెండ్లియాడి కాంత వగచె.

22 కామెంట్‌లు:

  1. చందమామ నుంచి జాలు వెన్నెల యందు
    చంద్ర ముఖియు నంచు స్వామి పొగడి
    జన్మదినము మఱచు జడుడైన 'ఘనుడైన '
    కవిని పెండ్లి యాడి కాంత వగచె !

    రిప్లయితొలగించండి
  2. కలికి కూర లడుగ కంద పద్యము జెప్పు
    పూల నడుగ చంప మాల జెప్పు
    పాత్ర లడుగ సీస పద్యమ్ము జెప్పును
    కవిని పెండ్లి యాడి కాంత వగచె!

    రిప్లయితొలగించండి
  3. కొంచెం కొంటెగా,
    పండితుండు శక్తి పదగుంభనలఁ జూప
    కవిని పెండ్లియాడి కాంత వగచె
    “చవక మాట లేల సరకులేదా”యంచు
    పాల బుడ్డి దెచ్చి, పాన్పు నెక్కి!

    సూచన: కవి=పండితుడు అనే అర్థంలో.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !

    విద్యాధరీ కాళిదాసుల కథ :

    01)
    ____________________________

    వెఱ్ఱి గొల్ల దెచ్చి - వెలదికి కట్టగా
    కవిని జేసె కాళి - కరుణ జేత !
    కాంత మరచి యెటకొ - కాళిదాసు వెడల !
    కవిని పెండ్లి యాడి - కాంత వగచె !
    ____________________________

    రిప్లయితొలగించండి
  5. కలము కంట బడగ ,కరము విడిచి బెట్టు ,
    కాన రాని కలికి కనులు మెచ్చు ,
    రాత్రి పూట గూడ రాముణ్ణి వర్ణించు
    కవిని పెండ్లి యాడి కాంత వగిచె !!!

    రిప్లయితొలగించండి
  6. ఆ: పట్టుచీరదెచ్చి పాన్పుపై పవళింప
    జేసి,గోర్కె దీర్చి సేవ జేయు
    ననిదలచిన రాత్రి యాశలు వమ్ముమై
    కవిని పెండ్లి యాడి కాంత వగచె !

    రిప్లయితొలగించండి
  7. ఆట వెలది యనును తేట గీతి యనును
    కంద పద్య మనును గణము లనును
    సరస మాడ మన్న సరస యతు లనును
    కవిని పెండ్లియాడి కాంత వగచె.

    రిప్లయితొలగించండి
  8. సీస పద్యముఁ జెప్పు చెలియ సొగసు వీడి
    ......తేట గీతి పలుకు పైట వీడి
    ఉత్పలమే గాని యోర కంటఁ గనడు
    ......ఆట వెలదియె సయ్యాట లేదు
    మత్తేభమే వ్రాయు మరులుగొనగ రాడు
    ..... శార్దూలమే గాని శక్తి లేదు
    చంపకమే గాని చెంప నిమర రాడు
    ..... ఉత్సాహమే గాని "ఉమ్మ" లేదు

    కంద రచనఁ జేయు నందముఁ జూడడు
    మత్త కోకిలఁ గను మగువఁ వీడి
    తరళ కవిత వ్రాయు తరుణి తలపు లేక
    కవిని పెండ్లియాడి కాంత వగచె!!

    రిప్లయితొలగించండి
  9. మగని చెంత జేరి ముదముగ నాయింతి
    తనదు కోర్కె తెలుప తెలివి గాను
    కతలు కవిత లల్లి కలవర పరచగ
    కవిని పెండ్లి యాడి కాంత వగచె !

    రిప్లయితొలగించండి
  10. కవిమిత్రులంతా మా అమాయక "కవి" ని ఆడిపోసుకొంటున్నారు. కానీ వర్కింగ్ "కాంత" యేమీ తక్కువ తినలేదు, చూడండి:

    అలరె వలతి సరసు డతిచమత్కారియౌ
    కవిని పెండ్లి యాడి; కాంత వగచె
    వర్కు కెళ్ళ లేక వాలి పోయి, మగని
    వంట జేయ మనుచు వఱ్ఱ గాను!

    మనవి: బాపు సినిమా "మిస్టర్ పెళ్ళాం" గుర్తొచ్చింది.

    రిప్లయితొలగించండి
  11. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    "చంద్ర ముఖియు నంచు" అనడం కంటె "చంద్రముఖి వటంచు" అంటే ఇంకా బాగుంటుంది.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    కాని "చంప(క?)మాల"ప్రయోగమే కాస్త ఇబ్బంది పెట్టించి. నా సవరణ ...
    కలికి కూర లడుగ కంద పద్యము జెప్పు
    పాత్ర లడుగ సీస పద్య మిచ్చు
    పూల నడుగ జెప్పు మేలు చంపకమాల
    కవిని పెండ్లి యాడి కాంత వగచె!

    రిప్లయితొలగించండి
  12. చంద్రశేఖర్ గారూ,
    మీ రెండు పూరణలూ బహు బాగున్నవి. అభినందనలు.
    "సరుకు"లేని కవిని పెండ్లాడి కాంత వగచిన మొదటి పూరణ చమత్కరభరితంగా ఉంది.
    రెండవ పూరణలో "వర్కుకు + వెళ్ళలేక" కదా. "వర్కు కేగలేక" అందాం.

    వసంత కిశోర్ గారూ,
    ఉత్తమమైన పూరణ మీది. కాళిదాసు కథను గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.

    మంద పీతాబర్ గారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్న గారూ,
    సరసయతులే కాని సరసం తెలియని కవిని గురించిన మీ పూరణ శ్రేష్ఠంగా అలరించింది. అభినందనలు.

    జిగురు సత్యనారాయణ గారూ,
    నిస్సందేహంగా ఈనాటి పూరణ లన్నింటిలో మీది ఉత్తమోత్తమం. చక్కని సీసపద్యంతో ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. నా పూరణ .....

    త్రాగుబోతు, దొంగతనమె యాతని వృత్తి,
    వెల వెలఁదుల వెంట వెడలువాఁడె
    కాని పెద్ద లతఁడు కడు యోగ్యుఁ డని పలు
    క, విని పెండ్లియాడి కాంత వగచె.

    రిప్లయితొలగించండి
  15. శంకరార్యా! చంపకమాలను కత్తిరించకుండా పూరించదానికి సరియైన ఆలోచన తట్టలేదు.సొగసైన సవరణ చేసినందులకు ధన్యవాదములు.
    కవి లో విరుపుతో చేసిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది.

    రిప్లయితొలగించండి
  16. శంకరార్యా ! ధన్యవాదములు !
    "క" ను భలే కత్తిరించారే !!! అద్భుతమైన పూరణ మీది !
    మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    రిప్లయితొలగించండి
  17. గురువుగారూ మీ పూరణ అద్భుతంగా ఉంది.
    మీరన్నట్లు సత్యనారాయణ గారికి నూటికి నూట పాతిక మార్కులు.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ సత్యనారాయణ గారి పూరణ గురువుగారన్నట్లు ఉత్తమోత్తమంగా ఉంది. కవిని విడదీసిన గురువు గారి చాతుర్యం ప్రశంసనీయం.

    రిప్లయితొలగించండి
  19. గురువు గారూ ! మీ పూరణ నిరుపమానం. మిస్సన్న గారి పూరణ కూడ బావుంది.

    రిప్లయితొలగించండి
  20. మాస్టరుగారూ! మీరు చేసిన సవరణతో,చిన్న మార్పుతో..

    కలికి కూర లడుగ కంద పద్యము జెప్పు
    పాత్ర లడుగ సీస పద్య మిచ్చు
    పూల నడుగ నుడువు పూని చంపకమాల
    కవిని పెండ్లి యాడి కాంత వగచె!

    రిప్లయితొలగించండి
  21. నా పూరణను మెచ్చుకున్న
    గోలి హనుమచ్ఛాస్త్రి.
    వసంత కిశోర్,
    మిస్సన్న,
    మంద పీతాంబర్,
    నాగరాజు రవీందర్
    గారలకు ధన్యవాదాలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఇప్పుడు మీ పూరణ సర్వాగసుందరమై శోభిస్తున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి