20, మే 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 58 (గుఱ్ఱానికి నైదుకాళ్ళు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 2

సమస్య - "గుఱ్ఱానికి నైదుకాళ్ళు కోడికి వలెనే"
కం.
మఱ్ఱాకుఁ బాన్పుగాఁ గొని
బొఱ్ఱను బ్రహ్మాండపఙ్తిఁ బూనిన ముద్దుం
గుఱ్ఱఁడ! విను, వన్నెలు గుహు
గుఱ్ఱానికి నైదు; కాళ్ళు కోడికి వలెనే.

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

13 కామెంట్‌లు:

 1. (పంచముఖి ఆంజనేయునిలా పంచముఖ గరుత్మంతుడిని ఊహించి బుఱ్ఱావారు మఱ్ఱాకు పైన చిత్రించారని నా భావన..)

  కుఱ్ఱాడ!తలలు శ్రీహరి
  గుఱ్ఱానికి నైదు,కాళ్ళు కోడికి వలెనే!
  మఱ్ఱాకు పైన వేసెను
  బుఱ్ఱా వారిటుల,క్రొత్త బొమ్మను గనుమా!

  రిప్లయితొలగించండి
 2. కుఱ్ఱడ! యివేమి బొమ్మలు?
  జెఱ్ఱికి తల లేమొ రెండు చేపకు నాల్గున్!
  వెఱ్ఱివె? యిక్కడ చూడగ
  "గుఱ్ఱానికి నైదుకాళ్ళు కోడికి వలెనే" !

  రిప్లయితొలగించండి
 3. సఱ్ఱియలిస్టిక్ ఆర్టట
  వెఱ్ఱికి పోకడలువేయి వీర్సిగ తరగా!
  చిఱ్ఱెత్తుకొచ్చుఁ జూచిన
  గుఱ్ఱానికి నైదుకాళ్ళు కోడికి వలెనే!

  రిప్లయితొలగించండి
 4. గుఱ్ఱము యీనెను ; వృక్షపు
  తొఱ్ఱలలో బుట్టె కోడి , దోషపు వేళన్ !
  కుఱ్ఱ లిరువురికి గ్రహణము
  గుఱ్ఱానికి నైదు కాళ్ళు కోడికి వలెనే !

  * కోడి = అడవి కోడి / కలివి కోడి

  రిప్లయితొలగించండి
 5. జెఱ్ఱికి కాళ్ళకు చెప్పులు
  గుఱ్ఱానికి నైదు కాళ్ళు, కోడికి వలెనే
  గొఱ్ఱెకు ,బఱ్ఱెకు యీకలు
  కుఱ్ఱాడట గీసి జూపె కోతికి కొమ్ముల్!

  రిప్లయితొలగించండి
 6. గుఱ్ఱము ఆచూకిని గొర్రెల గాచే కుర్రానితో నడుగు చున్నాడు యజమాని.

  ఎఱ్ఱని చాఱిక లుండెను
  గుఱ్ఱానికి నైదు;కాళ్ళు కోడికి వలెనే
  కఱ్ఱను గాల్చిన చందము
  కుఱ్ఱడ గనినావ? నీవు, గొఱ్రెల చెంతన్ !

  రిప్లయితొలగించండి
 7. ఎఱ్ఱని జెండా పైనను

  కఱ్ఱెపు కపి రాజు యొకడు కిచ కిచ మనుచున్ !

  వెఱ్ఱిగ గంతులు వేసెను

  గుఱ్ఱానికి నైదు కాళ్ళు కోడికి వలెనే !

  రిప్లయితొలగించండి
 8. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  02)
  ____________________________________

  వెఱ్ఱా డొకండు జెప్పెను
  " కఱ్ఱావులు తెల్లగుండు ! - కాళ్ళవి మూడే
  గొఱ్ఱెలకూ ,బఱ్ఱెలకును !
  గుఱ్ఱానికి నైదుకాళ్ళు - కోడికి వలెనే ! "
  ____________________________________

  రిప్లయితొలగించండి
 9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ బుఱ్ఱావారి, కుఱ్ఱవాని పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.

  నాగరాజు రవీందర్ గారూ,
  "గ్రహణ దోషం"తో మీ పూరణ బాగుంది. అభినందనలు.

  మంద పీతాంబర్ గారూ,
  తప్పిపోయిన గుఱ్ఱాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
  "రాజు + ఒకడు" అన్నప్పుడు యడాగమం రాదు. "రాజొకండు" అంటే సరి!

  వసంత కిశోర్ గారూ,
  మీ వెఱ్ఱివాని పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. గురువుగారూ ఇద్దర్ని విస్మరించారు.

  రిప్లయితొలగించండి
 11. మిస్సన్న గారూ,
  నిజమే సుమా! మిమ్మల్ని "మిస్" చేసినందకు మన్నించాలి. వెఱ్ఱికుఱ్ఱడు వేసిన బొమ్మను చక్కగా వర్ణించారు. ఇంత మంచి పూరణ చేసినందుకు అభినందనలు. నా పొరపాటును గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 12. ఫణిప్రసన్న కుమార్ గారూ,
  సఱ్ఱియలిస్టిక్ గా మీరు చెప్పిన పూరణ అద్భుతంగా ఉంది అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. వెఱ్ఱోడి కొట్టమందున
  గుఱ్ఱముతో బాటునుండ కోడియు నచటే
  చిఱ్ఱని మంటలు రగులగ
  గుఱ్ఱానికి నైదుకాళ్ళు కోడికి వలెనే

  రిప్లయితొలగించండి