17, మే 2011, మంగళవారం

సమస్యా పూరణం -340 (వంక బెట్టఁదగును)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
వంక బెట్టఁదగును శంకరునకు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

 1. బంక మన్ను తోడ బాగుగా చేసిన
  పార్వతీశు ప్రతిమ పరగె. శశిని
  తలకు పెట్టవైతి. తలపైన యా నెల
  వంక బెట్టఁ దగును శంకరునకు.

  రిప్లయితొలగించండి
 2. శార్జ్గ పాణి కిడగ శంఖుచ క్రములుండ
  నాల్గు తలలు కూడు నాభిజునకు
  వంక లేని వాని కింక సిగన నెల
  వంక బెట్టఁదగును శంకరునకు!

  రిప్లయితొలగించండి
 3. ఇలా అయితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది.
  శార్జ్గపాణి కిడగ శంఖు చక్రము లుండ
  నాల్గు తలలు కూడు నాభిజునకు
  శంక విడచి చూడు మింక, సిగన నెల
  వంక బెట్టఁదగును శంకరునకు!

  రిప్లయితొలగించండి
 4. భక్తి మనసు నిండ,పరమేశు దలచుచు
  పద్య మొకటి చెప్పి ప్రస్తుతించ;
  నీమమేమి లేదు,నిందాస్తుతులు జెప్ప
  వంక బెట్ట దగును శంకరునకు.

  రిప్లయితొలగించండి
 5. చిట్టి పొట్టి బొమ్మ లిట్టుల సర్దుము
  ముందు వైపు నిడుము స్కందు నిటుల
  కరి ముఖుని కుడి మరి గిరితనయ నెడమ
  వంక బెట్ట దగును శంకరునకు.

  రిప్లయితొలగించండి
 6. శివుని రూపు దలచి చిత్రము గీసితి
  వంక బెట్ట లేము శంకరునకు
  కాని యొకటి మరచితిని కొప్పుపై నెల
  వంక బెట్టదగును శంకరునకు

  రిప్లయితొలగించండి
 7. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  పార్వతిని పరీక్షింప నెంచిన శివుడు పార్వతితో :
  01)
  _________________________________

  బూది నొంటి నిండ - పూసు కొనెడి వాడు !
  అహిని మెడను దాల్చు ! - యాచకుండు !

  కన్న వారు లేరు ! - కరి చర్మమును కట్టు !
  ముదురు వయసు వాడు ! - మూడు కళ్ళు !

  నిలువ నీడ లేదు - నెలవు స్మశానము !
  ముష్టి నెత్తు కొనును !- భ్రష్ట చారి !

  చిప్ప యందు తినును ! - కప్పెరల ధరించు !
  ఎద్దు మీద దిరుగు - మొద్దు వాడు !

  నెత్తి మీద నెపుడు - నెలవంకను నిలుపు !
  వంక బెట్టఁదగును - శంకరునకు !
  _________________________________
  చిప్ప = కప్పెర = కపాలము
  మొద్దు = జడుడు

  రిప్లయితొలగించండి
 8. మెత్తనైన మనిషి మేలైన గురుడునౌ
  శంక రాభరణపు స్రష్ట జూడ
  ' అహిత మైన పలుకు లాడరు వార ' ని
  వంక బెట్టఁదగును శంకరునకు.

  రిప్లయితొలగించండి
 9. విష్ణు పత్ని బొమ్మ విష్ణువక్షమ్ముపై ,
  వనజ భవుని చెంత వాణి బొమ్మ,
  పార్వతమ్మ బొమ్మ భక్తిమీరనెడమ
  వంక బెట్టఁదగును శంకరునకు !

  రిప్లయితొలగించండి
 10. మంద పీతాంబర్ గారి పూరణ చాలా బాగున్నది

  రిప్లయితొలగించండి
 11. గరళ కంఠు డాయె కరుణించి లోకాల
  దివిజ గంగ నాపి భువిని గాచె
  మంచు కొండ నుండు మా మంచి దేవు డే-
  వంక బెట్టఁదగును శంకరునకు ?

  రిప్లయితొలగించండి
 12. కవిమిత్రులందరూ వంకలు బాగానే పెట్టుచున్నారు.అందరికీ అభినందనలు.
  మిస్సన్నగారూ! యెవరూ వెళ్ళని వంకకు వెళ్ళి గురువుగారి 'వంక ' చూసి చక్కగా చెప్పారు.అదుర్స్!

  రిప్లయితొలగించండి
 13. హనుమచ్చాస్త్రి గారూ కడుంగడు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 14. చింతా రామకృష్ణారావు గారూ,
  మనోహరమైన పూరణ నిచ్చి నా బ్లాగును నెలవంకతో అలంకరించారు. ధన్యో೭స్మి.
  మీ నెలవంక మిగిలిన కవిమిత్రులకు అనుసరణీయ మయింది.

  చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  "తలలు కూడు" అనేది "తల లలరును" అంటే ఎలా ఉంటుంది?

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా రెండవ పూరణ ప్రశంసనీయం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. నాగరాజు రవీందర్ గారూ,
  అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.

  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అయితే ద్విపదలాగా ఆటవెలదిని మాలికలాగా వ్రాసే సంప్రదాయం లేదనుకుంటాను. దీనిని సీసంగా మార్చితే ...?
  సీ.
  బూది నొంటి (పయిన) - పూసు కొనెడి వాడు !
  ............ అహిని మెడను దాల్చు ! - యాచకుండు !
  కన్న వా(రే) లేరు ! - కరి చర్మమును కట్టు !
  ........... ముదురు వయసు వాడు ! - మూడు కళ్ళు !
  నిలువ నీడ(యె) లేదు - నెలవు స్మశానము !
  ......... ముష్టి నెత్తు కొనును !- భ్రష్ట చారి !
  చిప్ప యందు తినును ! - కప్పెరల ధరించు !
  .......... ఎద్దు మీద దిరుగు - మొద్దు వాడు !
  ఆ.వె.
  (మునుల సురల నరుల ముప్పుతిప్పలు పెట్టు
  రాక్షసుల కొసఁగు వరముల నెన్నొ!)
  నెత్తి మీద నెపుడు - నెలవంకను నిలుపు !
  వంక బెట్టఁదగును - శంకరునకు !

  రిప్లయితొలగించండి
 16. మిస్సన్న గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  "అహితమైన పలుకు లాడకపోవడం" కూడా ఒక వంకేనా? సర్లెండి. ఆ వంక ఉందని ఒప్పుకుంటాను.
  ప్రశ్నార్థకంగా మీ రెండవ పూరణ ఉత్తమంగా ఉంది.

  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. గురువుగారూ ఏ వంకా లేనప్పుడు ఏదో ఒక వంక పెట్టాలి గదండీ.

  రిప్లయితొలగించండి
 18. శ్రీ చింతా రామకృష్ణా రావు గారితో ప్రారంభ మయి మిత్రుల అందఱి పూరణలు బ్రహ్మాండముగా ఉన్నాయి. శంకరులకు నెలవంక ఆభరణంగా తక్క మరో వంక లేదు !

  రిప్లయితొలగించండి
 19. శంకరార్యా ! మీ సవరణల సీసానికి ధన్యవాదములు !
  మొన్న "నవరస నాయకుడు " సీసంలో 9 పాదాలు ఉన్నవి గదా !
  మరి ఆటవెలదికి 10 పాదాలు ఉండ కూడదా ?
  పోనీ 4 మరియు 6 పాదాలుగా 2 ఆటవెలదు లనుకోవచ్చుగా !

  మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  రిప్లయితొలగించండి