18, మే 2011, బుధవారం

సమస్యా పూరణం -341 (కలిమిఁ గలిగించు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కలిమిఁ గలిగించు కలకంఠి కంటినీరు.

16 కామెంట్‌లు:

  1. సంపదను కాచు కొనుటకే సమయ మగును
    వ్యసనములఁ వృద్ధి నొందును వ్యాధి తతులు
    ఆలు బిడ్డలు పట్టరు అంతు లేని
    కలిమిఁ గలిగించు కలకంఠి కంటినీరు.

    రిప్లయితొలగించండి
  2. భర్త మరణము తరువాత భార్య నిలచి
    పోటి జేసెను సభయందు సీటు కొరకు
    కరుణ జూపెను ఓటరు గాన గెలిచె;
    కలిమి గలిగించు కలకంఠి కంటి నీరు!

    రిప్లయితొలగించండి
  3. లచ్చి మాతల్లి సిరులను నిచ్చు మనకు
    నాయురారోగ్యములఁ దోడ నరసి కృపను
    దృప్తి చేకూర్చు 'మా!'సదా, తృప్తి లేని
    కలిమి గలిగించు కలకంఠి కంటి నీరు !

    రిప్లయితొలగించండి
  4. హనుమచ్చాస్త్రి గారూ మీ పూరణ భావాన్ని సరిగా ప్రకటిస్తోందా అన్న సందేహం.............
    మూర్తి మిత్రమా భేషైన పూరణ.

    రిప్లయితొలగించండి
  5. మిస్సన్నగారూ! భర్త చనిపోయిన తరువాత ఖాళీ అయిన ఆ చట్ట సభ సీటు కోసం భార్య పోటీ చేసి కన్నీరొలికిస్తూ ఓట్లు అడగటం వలన కలిమి(గెలుపు)కలిగింది అని నాభావం.
    భావం స్పష్టంగా ఊన్నట్లు లేదని నాకూ అనిపించింది.
    మరొకటి ప్రయత్నిస్తాను.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  6. బయట వ్యాపారములు జేయ బాగు గాను
    కలిమి గలిగించు; కలకంఠి కంటి నీరు
    యింట గార్చిన, యిల్లాలి యేడ్పు వలన
    కదలి పోవును చెప్పక కలుములన్ని.

    రిప్లయితొలగించండి
  7. చిత్ర సీమలో జరిగె విచిత్రములును
    నాటి లవకుశ నిర్మాత మేటి గాను
    కాసు లార్జించె సీతమ్మ కనులు జెదర
    కలిమిఁ గలిగించు కలకంఠి కంటినీరు.

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు ! అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _______________________________________

    పవలు రాత్రియు ,పరుగెత్తు - పతికి తోడు
    ఇల్లు పట్టక దిరిగెడు - పిల్ల లకట !
    కలిమి గబళించ ముదమంత; - కలత హెచ్చ
    కలిమిఁ గలిగించు కలకంఠి - కంటి నీరు !
    _______________________________________

    రిప్లయితొలగించండి
  9. కలవరము గల్గజేయును కలికి యలుక
    ప్రళయమును రేపు యింటిలో ప్రమద కినుక
    వెలది కనువెల్గుల వెతలు దొలగు; నెటుల
    కలిమి గలిగించు కలకంఠి కంటి నీరు ! ?

    రిప్లయితొలగించండి
  10. కలిమిఁ గలిగించు కలకంఠి; కంటినీటి
    నొత్తు కష్టనష్టముల కోర్చుకొని; కాన
    కలహకంఠులు దప్ప కలకంఠు లిలను
    లేరు శివ! కాలమవ్వారి తీరుఁ బోవ !

    రిప్లయితొలగించండి
  11. కలమి కలగినదినముల కర్పురంపు
    హారతులిడుచుఁబిల్చిన యతివ తానె ( ఆలు తానె)
    నిందలాడు లేమిడినాండ్ల. నిజము! పోవ
    కలిమి; గలిగించు కలకంఠి - కంటి నీరు.

    రిప్లయితొలగించండి
  12. ఎంత కలగియున్నను, ఇంతి వింత గాను
    ఇరుగు పొరుగు వారలఁ జూసి ఈర్ష్య నొందు;
    స్వంత లేమికన్న,తెలుప సాధ్వి! పరుల
    కలిమి గలిగించు కలకంఠి కంటి నీరు ! ?

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్న గారూ,
    సంపాదనలో పడి భార్యను పట్టించుకొనని భర్త గురించి చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    కన్నీరు కార్చి సానుభూతితో ఎన్నికైన కలకంఠి గురించిన మీ మొదటి పూరణ బాగుంది.
    ఇక మీ రెండవ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    తృప్తి నివ్వలేని కలిమి కన్నీరు తెప్పిస్తుందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అంజలి కన్నీరు శంకర్ రెడ్డికి డబ్బు సంపాదించి పెట్టిన వైనాన్ని చక్కగా చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    నాగరాజు రవీందర్ గారూ,
    ప్రశ్నార్థకంగా ఉన్న మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    మంచి భావంతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. "కలహకంఠులె గా కలకంఠు లిలను" అంటే సరి!

    ఊకదంపుడు గారూ,
    బహుకాల దర్శనం! సంతోషం. కలిమి పోయినప్పుడు, పరుల కలిమి చూసినప్పుడు కన్నీరు కార్చే కలకంఠుల గురించిన మీ పూరణలు శ్రేష్ఠంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి