22, మే 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 60 (భార్య లిద్దఱు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 4

సమస్య -
"భార్య లిద్దఱు శ్రీరామభద్రునకును"
తే. గీ.
రావణుని సంహరించియు రాజ్యమునకు
నంగనను గూడి యభిషిక్తుఁడై వెలుంగ
హార తిచ్చిరి ప్రేమతో హరుని ముద్దు
భార్య లిద్దఱు శ్రీరామభద్రునకును.

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

10 కామెంట్‌లు:

  1. విజయ నగరాధిపుడే విజయమంది
    రాయలప్పుడు నగరికి రాగ, రయము
    మ్రొక్కు దీర్చిరి వేడ్కను మోదమలర
    భార్యలిద్దరు శ్రీరామ భద్రునకును.

    రిప్లయితొలగించండి
  2. రామ పట్టాభి షేక సంరంభ మిద్ది:
    మూర్థ్న మాఘ్రాణ మును జేయ మురిసి తల్లి
    హార తిచ్చిరి ప్రేమము నాదశరథు
    "భార్య లిద్దఱు శ్రీరామభద్రునకును"

    రిప్లయితొలగించండి
  3. రామ పట్టాభిషేకసంరంభ మందు
    కూడె సుగ్రీవు డలరాము తోడ, విజయ
    హార తిచ్చిరి రఘురాము నాత్మసఖుని
    భార్య లిద్దరు, శ్రీరామభద్రునకును.

    రిప్లయితొలగించండి
  4. హరికి హరునకు శేషాద్రి యధిపునకును
    భార్యలిద్దరు ; శ్రీరామ భద్రునకును
    పడతి యొక్కతె, యాదర్శ ప్రాయుడయ్యె
    సకల లోకములుపొగడె సంభ్రమమున.

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    రాయల భార్య లిద్దరు రాముని మ్రొక్కు తీర్చిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    సుమిత్ర, కైకలతో రామునికి హారతి ఇప్పించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    అజ్ఞాత గారూ,
    సుగ్రీవుని భార్యలతో రామునికి హారతి నిప్పించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    వైవిధ్యమైన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    "ఆదర్శప్రాయు" డన్నప్పుడు "ర్శ" గురువై గణదోషం వస్తున్నది. "ఆదర్శపతి యటంచు" అంటే సరి!

    రిప్లయితొలగించండి
  6. రామ చరిత నాటకమాడ రంగు పూయ
    మొదటి సీతకును జ్వరము మొదలు కాగ
    జతగ రెండవ సీతను వెతికి తెచ్చె
    భార్య లిద్దఱు శ్రీరామభద్రునకును!!

    రిప్లయితొలగించండి
  7. జిగురు సత్యనారాయణ గారూ,
    మొత్తానికి రాముణ్ణి ఇద్దరు పెళ్ళాల మొగుణ్ణి చేసారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    __________________________________

    రామ రావిల రాముడే - రమ్య మలర !
    లక్ష్మి పార్వతి బెండ్లాడె - లక్షణముగ !
    బసవ తారక మను తన - భార్య సమయ !
    భార్య లిద్దఱు శ్రీరామ - భద్రునకును !
    __________________________________

    రిప్లయితొలగించండి
  9. నా పూరణ మొదటి పాదం లోని గణదోషాన్ని సవరిస్తూ....

    విజయ నగరపు సామ్రాట్టు విజయమంది
    రాయలప్పుడు నగరికి రాగ, రయము
    మ్రొక్కు దీర్చిరి వేడ్కను మోదమలర
    భార్యలిద్దరు శ్రీరామ భద్రునకును.

    రిప్లయితొలగించండి