3, మే 2011, మంగళవారం

సమస్యా పూరణం - 327 (రణమె మనల కిఁక)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
రణమె మనల కిఁక శరణము గాదె.

45 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !

  01)
  ______________________________

  తెల్లవార,తూర్పు - దిక్కున సూర్యుడు !
  శంకరుండు వచ్చు - చక్క గాను
  శంకరార్యు డొసగు - కంకర పద్య పూ
  రణమె మనల కిఁక శ - రణము గాదె !
  ______________________________
  కంకర = కఠినము

  రిప్లయితొలగించండి
 2. 02)
  ______________________________

  మండు వేసవందు - మద్యాహ్న సమయంబు
  గొంతు యెండి మిగుల - ఘోర మైన
  చల్ల గాను యుండు - చక్కని సలిల , పా
  రణమె మనల కిఁక శ - రణము గాదె !
  ______________________________

  రిప్లయితొలగించండి
 3. శంకరార్య బ్లాగు శంకరాభరణము,
  పద్య మందు నొక్క పాద మీయ!
  నలువ రాణి దయను నామూడు పాద పూ
  రణమె,మనల కిక శరణము గాదె!

  రిప్లయితొలగించండి
 4. కిశోర్ జీ!నాపాదములు పెట్టే లోపు అదే భావంతో.. పూ 'రణమున ' మీరే ముందంజ లో వున్నారు.అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. 03)
  ______________________________

  దేశ సంప దంత - దిగమింగు మంత్రుల
  నిలువ రించ వలయు - నిజము గనుము !
  నమ్మలేము; నేటి - నరకాసురుల, నిట
  రణమె మనల కిఁక శ - రణము గాదె !
  ______________________________

  రిప్లయితొలగించండి
 6. శాస్త్రీజీ !
  ధన్యవాదములు !
  మన "రణము"
  శంకరాభరణమునకు "తోరణము" !

  రిప్లయితొలగించండి
 7. 04)
  ______________________________

  పెచ్చు పెరిగె నేడు - పిచ్చగా యవినీతి
  మౌన మూన బోకు - మాన ధనుడ !
  అలుపు లేని పోరు -సలుపుము ! దుష్ట , మా
  రణమె మనల కిఁక శ - రణము గాదె !
  ______________________________

  రిప్లయితొలగించండి
 8. 05)
  ______________________________

  నీతి తప్పి చనిన - జాతికే మనుగడ
  నిజము నిజము లేదు - నిజము వినుము !
  నీతి నిలుప కున్న - జాతికి నిజము; మ
  రణమె మనల కిఁక శ - రణము గాదె !
  ______________________________

  రిప్లయితొలగించండి
 9. 06)
  ______________________________

  జాతి వెలుగ వలయు - జగతిని స్థిరముగ
  నన్న పెరుక వలయు - నధమ బుద్ధి !
  నీతి గలిగి మసలు - నిత్యంబు; ధర్మాచ
  రణమె మనల కిఁక శ - రణము గాదె !
  ______________________________

  రిప్లయితొలగించండి
 10. నా పూరణ .....

  భారతీయులకును స్వాతంత్ర్యమును దెచ్చు
  కదనమును మొదలిడి గాంధి యనెను
  "సమరశస్త్రములుగ శాంత్యహింసాది వ
  రణమె మనల కిఁక శరణము గాదె"

  రిప్లయితొలగించండి
 11. 07)
  ______________________________

  శంకరార్యు నిచట - సంతోష మొందింప
  పద్య పూరణమును - పదును గాను
  రచన చేయ మిగుల - రక్తిగా; వాణి, చ
  రణమె మనల కిఁక శ - రణము గాదె !
  ______________________________

  రిప్లయితొలగించండి
 12. శంకరార్యా !

  " శాంత్యహింసాది వరణము "
  చక్కగా నున్నది !

  రిప్లయితొలగించండి
 13. 08)
  ______________________________

  వింత వింత గతుల - విపరీత రీతుల
  పూరణమును జేయ - బూను వార్కి
  శక్తి వలయు నన్న - శంకరు బ్లాగావ
  రణమె మనల కిఁక శ - రణము గాదె !
  ______________________________

  రిప్లయితొలగించండి
 14. 09)
  ______________________________

  అందమొలుకు నటుల - చందమున మిగుల
  పద్య రచన జేయ - హృద్య మలర !
  లెక్కలేక జేయు - మిక్కిలి పద సేక
  రణమె మనల కిఁక శ - రణము గాదె !
  ______________________________

  రిప్లయితొలగించండి
 15. రామ నామ మహిమ రమ్యంబు గాదెల్పి
  లోక మందు భక్తి లోన మనకు
  మార్గ దర్శకుండు మారుతి దివ్యచ
  రణమె మనల కిఁక శరణము గాదె.

  రిప్లయితొలగించండి
 16. పుణ్య భూమిఁ పుట్టి ; పుణ్యపఠనములు
  జేయఁ; దైవ గాథఁ జెప్పు రచనఁ
  జేయు ప్రాప్తిఁ కలుగఁశ్రీవాణి కమలచ
  రణమె మనల కిఁక శరణము గాదె.

  రిప్లయితొలగించండి
 17. భూము లున్న వనిరి, భూరిగా యిచ్చోట
  గ్రామ మందు జూడ గాన రావు,
  తాత లేక పాయె ,దండ్రియుo బోయె,క
  రణమె మనల కిఁక శరణము గాదె!.


  పూరణములు చేయ బోవంగ నిత్యమ్ము,
  శంకలు పలుగలుగు సత్యముగను,
  శారదాంబ కరుణ, గురువు గారివ్యాక
  రణమె, మనల కిఁక శరణము గాదె!.

  పూరణములు చేయ పూర్వుల కావ్యాలు
  పుజ్యు లైన కవుల పూరణాలు
  సాధనాలు గావె, శంకర బ్లాగావ
  రణమె, మనల కిఁక శరణము గాదె!.

  రిప్లయితొలగించండి
 18. మందాకిని గారూ,
  "శారదాంబ కరుణ సద్గురువుల వ్యాక/రణము" అంటే సరి!

  రిప్లయితొలగించండి
 19. మందాకిని గారు, ప్రాసయతి కుదిరిందనే అనుకున్నాను .గురువుగారి సవరణకు ధన్యవాదములు .
  " శారదాంబ కరుణ సద్గురువువ్యాక" /రణమె,

  రిప్లయితొలగించండి
 20. భారత రణ భూమిఁ బడిరి వీరులిక మ
  రణమె మనల కిఁక శరణము గాదె
  విజయమో మరినిక వీరలోకమ్మో య
  టంచు,ధర్మ యుద్ధ తరణ మందు!

  రిప్లయితొలగించండి
 21. నాల్గవ పాదం సవరణతో:
  భారత రణ భూమిఁ బడిరి వీరులిక మ
  రణమె మనల కిఁక శరణము గాదె
  విజయమో మరినిక వీరలోకమ్మో య
  టంచు,ధర్మ యుద్ధ టంక మెత్తి!

  రిప్లయితొలగించండి
 22. మందు లేని వ్యాధి మహమారిర ! ఎయిడ్సు
  మానవులకు యదియె మరణ మొసగు !
  కోరి చావు తెచ్చుకొనుట కన్నను నివా
  రణమె మనలకిక శరణము గాదె !

  రిప్లయితొలగించండి
 23. తండ్రి గారు చనిరి దైవ సన్నిధి కింక
  కన్య దాన ఫలము కలుగ జేయ
  వలె సుతకు జరిపి వివాహమీ యేడు తో-
  రణమె మనల కిఁక శరణము గాదె.

  (తల్లి గానీ తండ్రి గానీ గతించిన ఏడాది లోపు కన్యాదానం చేస్తే
  గతించిన వారికా ఫలం దక్కి సద్గతులు కలుగుతాయని పెద్దలు
  చెపుతారు. నిజానికి 'కన్యాదానం' అన్న మాటే సరైనది. కానీ
  గణం కోసం రణం.)

  రిప్లయితొలగించండి
 24. కంది వారు ఇచ్చు కఠినమైన సమస్య
  వంద లాది మెచ్చు కంద గీతి
  గణము యతుల దోష గణుతించి వ్రాయగ
  రణమె మనల కిఁక శరణము గాదె !

  రిప్లయితొలగించండి
 25. కైత వ్రాయ నెంచ కలము కదలదొక్కొ
  ఖంగుమనెడు కవిత కష్టమయ్యె
  డొక్కు బుర్రకు నొక డొంకతిరుగుడు పూ
  రణమె మనల కిఁక శరణము గాదె

  రిప్లయితొలగించండి
 26. సింహ బలుని వధకు ముందు రోజు రాత్రి
  నర్తన శాలలో పాండవుల సమావేశంలో
  నిర్ణయం :
  10)
  ______________________________

  ఆగి పోవు నింక - అఙ్ఞాత వాసంబు !
  రణమె మనల కిఁక శ - రణము గాదె !
  పరమ సాధ్విని కడు - పరితాప మొందించు
  పరుని దునుమ వలయు - పౌరుషంబు !

  ______________________________

  రిప్లయితొలగించండి
 27. శ్రీకృష్ణ రాయబారము విఫలమైన
  తదుపరి పాండవుల నిర్ణయం :
  11)
  ______________________________

  రాయ బార మునకు - రారాజు వద్దకు
  బావ వెళ్ళి మిగుల - భంగ పడెను !
  రాజ్య భాగ మడుగ - రారాజు, కాదనె
  రణమె మనల కిఁక శ - రణము గాదె !
  ______________________________

  రిప్లయితొలగించండి
 28. యాయవారమును బంధించిన
  లవకుశులు :
  12)
  ______________________________

  అశ్వ మేధ హయము - నవలీల బంధించి
  చెట్టు వెనుక కట్టి - పెట్టి నాము !
  రక్ష సేయ వచ్చు - రామ సైన్యము తోడ
  రణమె మనల కిఁక శ - రణము గాదె !
  ______________________________

  రిప్లయితొలగించండి
 29. గోగ్రహణా నంతరము విరాటుడు
  మంత్రులతో :

  13)
  ______________________________

  పశులె మనకు పాడి - పంటల నిచ్చును !
  పశుల విడిచి మనము - బ్రదుక లేము
  ఆల మందల గొన - నాహవ రంగంబు
  రణమె మనల కిఁక శ - రణము గాదె !
  ______________________________

  రిప్లయితొలగించండి
 30. అంగద రాయబారము కూడా ఫలించ నందున
  సుగ్రీవాదులతో శ్రీరాముడు :

  14)
  ______________________________

  రమణి నప్ప జెప్ప - రావణుం డొప్పడు
  వేరె మనకు లేదు - దారి గనగ !
  లంక నుండి సీత - రక్షింప ; దప్పదు
  రణమె మనల కిఁక శ - రణము గాదె !
  ______________________________

  రిప్లయితొలగించండి
 31. క్షమించాలి " మొదటి పాదంలొ " ఇచ్చు " బదులుగా " యిచ్చు " ఉండాలనుకుంటాను

  రిప్లయితొలగించండి
 32. హయమును విడిపించుకొన తానే
  స్వయముగా వచ్చిన శ్రీరాముడు
  లవకుశులతో :

  15)
  ______________________________

  ముద్దు పలుకు పలుకు - ముని బాలకుల గని
  ముద్దుకూన లార - వద్దు మంకు !
  దండ మొదల కున్న - దండంబు దప్పదు
  రణమె మనల కిఁక శ - రణము గాదె !
  ______________________________
  దండము = గుఱ్ఱము

  రిప్లయితొలగించండి
 33. యాగాశ్వము కొఱకై వచ్చిన లక్ష్మణుడు
  లవకుశులతో :

  16)
  ______________________________

  రావణాది ఘోర - రాక్షసులను జంపె !
  రమ్య సుగుణ శీలి - రామ ప్రభువు !
  యాగ మాగి పోవు - నశ్వము లేకున్న
  రణమె మనల కిఁక శ - రణము గాదె !

  ______________________________

  రిప్లయితొలగించండి
 34. ఇద్దరు విడాకులు పొందిన యింతుల నడుమ సంభాషణ:-

  మొగుని పైన మనకు మోజు తీరగ గృహ
  హింస కేసు పెట్టి హింసఁ జేసి
  అతి తెలివి విరియ విడాకులందితిమి భ
  రణమె మనల కిఁక శరణము గాదె!!

  రిప్లయితొలగించండి
 35. GSN గారూ, ఎక్కడ యువతుల గురించి మాట్లాడుతున్నారో తెలియదు గానీ, మా వూళ్ళో అయితే, "భ-రణమె మనలకిఁక భోగము గాదె" అన్నది నిజం. యతి కలవలేదనుకొండీ, అది వేరే విషయం. ఆడవాళ్ళకి అదొక ఫ్రీ మనీ.

  రిప్లయితొలగించండి
 36. సూచన: రెండవ పద్యంలో పూరణ పాదం. మెదటి పద్యం విడిచి చదువుకొన్నాపరవాలేదు.

  లాడెనుండు గృహము రాతి కట్టడమట
  దాని నావరించి దాచె ఎత్తు
  గోడ,యతడు దలచి నాడట యంతయు
  భద్ర మేను నమ్మ బంటు లుండ.
  -----
  లాడె నంత నమ్మినాడట గృహావ
  రణమె మనల కిఁక శరణము గాదె
  యనుచు,గోడ లాపునా యెగిరెడి
  హెలిక పుటరు దాడి, హేతు వేల?

  రిప్లయితొలగించండి
 37. అవును చక్కగా చెప్పారు.ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు తేలిక సంపాదన అనుకుంటున్నారేమో జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారు. ? అసలు నాకు తెలియ కడుగుతాను " ఆ మొగుడే వద్దను కున్నాక ఇంక అతగాడి డబ్బు ఎందుకు ? అంత రోషం లేని వాళ్ళ గొప్పతనం ఏపాటిదో అక్కడే తెలిసి పోతోంది. కేవలం డబ్బు కోసమేనా ? ఇక ముందు ముందు ఎలా ఉంటారో ? ఉహ కందని ప్రశ్న.

  రిప్లయితొలగించండి
 38. వసంత కిశోర్ గారూ,
  షోడశకళానిధు లయ్యారు. చాలా సంతోషం!
  రెండవ పూరణ తప్ప మిగిలిన వన్నీ అన్ని విధాలా బాగున్నాయి.
  రెండవ పూరణలో కుసంధి (వేసవి + అందు), యడాగమాలు (గొంతు + ఎండి, చల్లగాను + ఉండి ... ఇక్కడ యడాగమాలు రాకూడదు) పానకంలో పుడకలా బాధిస్తున్నాయి.
  ఇక "పారణము" శబ్దానికి త్రాగడం అనే అర్థం లేదు.
  మిగిలిన పూరణ లన్నీ నిర్దోషంగా అద్భుతంగా ఉన్నాయి.
  ప్రతి రోజూ ఇన్ని పూరణలు పంపుతున్న మీ ఉత్సాహానికి, ఓపికకు, పద్యరచనా నైపుణ్యానికి నమోవాకాలు.
  మీకు ప్రత్యేక ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 39. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  మందాకిని గారూ,
  మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.

  మంద పీతాంబర్ గారూ
  మీ మూడు పూరణలూ చాలా బాగున్నాయి. అభినందనలు.
  అక్కడ్ "సద్గురువు వ్యాక" కంటే "సద్గురువుల వ్యాక" అంటేనే గణదోషం ఉండదు.

  చంద్ర శేఖర్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

  నాగరాజు రవీందర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  "మహామారి" అంటే కలరా. మహమ్మారి వ్యవహార రూపం. మహమారి ప్రయోగం లేదు.

  రిప్లయితొలగించండి
 40. మిస్సన్న గారూ,
  మంచి ఆలోచనతో పూరణ చేసారు. అభినందనలు.
  కన్యాదానం విషయంలో మీరు పడ్డ ఇబ్బందిని గమనించాను. ఇలా చేస్తే ...?
  తండ్రి మరణ మందె తగును కన్యాదాన
  మదియె పుణ్యఫలము నంద జేయ
  వలె సుతకు జరిపి వివాహమీ యేడు తో-
  రణమె మనల కిఁక శరణము గాదె.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  మీకు సమస్యా పూరణమే రణమయింది. బాగుంది. అభినందనలు.
  "వారు + ఇచ్చు" అన్నప్పుడు యడాగమం రాదు. "వారొసంగు" అంటే సరి!

  రవి గారూ,
  మీ డొంక తిరుగుడు పూరణం బాగుంది. అభినందనలు.

  జిగురు సత్యనారాయణ గారూ,
  భరణం కోరిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  అజ్ఞాత గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 41. గురువుగారూ మీరు చెప్పిన పద్యం నా భావానికి సరైన అక్షర రూపం.
  నమోవాకాలు.

  రిప్లయితొలగించండి