6, మార్చి 2016, ఆదివారం

శ్రీకృష్ణావతార వర్ణనము


రచన :- గుండు మధుసూదన్

పంచాశత్పాద మత్తేభవిక్రీడిత మాలిక
ధరణీ భారము నుజ్జగింపఁగను స్వత్వాంశాస్థ సంభూతుఁడై
చెఱసాలన్ జనియింప నా యమున గూర్చెన్ దారి వ్రేపల్లెకై
పరఁగన్ నందయశోద లింట నడుగుం బద్మమ్ములన్ మోపియున్
సరవిన్ బూతన పాలుఁ ద్రావి యుసురుల్ సర్వమ్ముఁ దాఁ బీల్చి, యెం
దఱు దుష్టాత్ములు నేఁగుదెంచి యతనిన్ దర్పోద్ధతిం జంపఁగా
విరచింపన్ బలు మాయలన్ విఱిచియున్ వేగమ్ముగన్ జంపి, సో
దర యుక్తుండయి వ్రేఁత లిండ్లఁ జని దుగ్ధమ్మంతయుం ద్రావ,
త్వర మా బాలుని చేష్టలన్ని తెలుపన్, ♦ దన్మాత యా బాలునిన్
బరమాత్మున్ బసిబాలుఁ డంచుఁ దెలుపన్ వారందఱుం బోవ, నా
దరమెంతేఁ గనిపింప గోపిక లటన్ స్త్నానమ్ముఁ జేయంగ,
ల్వుర వల్వల్ దగ దొంగిలించియు వెసన్ భూజమ్ముపై దాఁచఁగన్
బరమాత్ముండని వారలంత కరముల్ పైకెత్తి దండమ్మిడన్
గరుణాత్ముండయి వారి కిచ్చె వలువల్, ♦ కైమోడ్పులం గొంచుఁ, దా
నరుదెంచెన్ బశుపాలనమ్మునకు సఖ్యాళిం దగం గూడియున్
జిరకాలమ్మట బంతులాఁడు కలనన్, ♦ జిత్రమ్ముగా బంతి యా
సరసిన్ మున్గఁగఁ గృష్ణుఁ డప్డు మడువున్ జక్కంగఁ దా దూఁకఁగన్
సరసిం గాళియ సర్ప మప్పుడు హరిన్ జంపంగ నుంకించఁ, దా
నురుహస్తమ్మున ముష్టిఘాత మిడఁగా నుద్వేగ మెంతేని రా
నురగ మ్మప్పుడు కృష్ణుపైఁ దనదు దంష్ట్రోత్సేక హాలాహలో
త్కరముల్ చిమ్మ యశోద సూనుఁ డపుడున్ దా వేగ సర్పమ్ముపై
నుఱికెన్ భోగము పైన నెక్కి నటరాజోత్తంస విద్వాంస రా
డ్వర నాట్యాంబుధి మున్గి ధింతకిట ధిం తద్ధింత తద్ధింత ధిం
ధిర ధిమ్మంచును నాట్యమాడ నపుడున్ దీనుండు కాళీయుఁ డా
దరమొప్పంగను "గావు" మంచుఁ బలికెన్ దర్పమ్ము సర్పమ్మునన్
దరలెన్; గర్వము ఖర్వమయ్యె, సతులున్ దర్జించి రా కాళియున్;
గరుణన్ వీడు మటంచుఁ బల్క నపు డా కాళీయ దర్పోర్జితుం
డురగమ్మున్ విడనాడి దూఁకె భువిపై దూరీకృతావేశుఁడై;
వరమిచ్చెన్ దన పాదముద్రఁ గని వే పక్షుల్ దొలంగున్ సదా
త్వరఁ బొమ్మంచును బల్కి, చేరె సఖులన్ వర్ణింప నా గాథనున్;
సరసీజాత సునేత్రుఁ డప్డు మఱలెన్ సభ్రాతృమిత్రాదుఁడై;
కరియానల్ మురళీరవమ్ము వినియున్ గానామృతమ్మానఁగన్
దరహాసాంబుధి ముంచి తేల్చి, దయతోఁ దన్వంగులం గూడి, వే
గిరమే కంసుని ప్రోలికిం జనియుఁ గల్కిం గుబ్జనున్ వేగ సుం
దరిగన్ జేసియు, హస్తిఁ దున్మి, జనులత్యాదృత్యుదారాత్ములై
వఱలన్ జాణుర ముష్టికాఖ్యుల వధింపన్ యుద్ధముం జేసి కూ
ల్చి రణౌత్సుక్యునిఁ గంసుఁ జంపియును దల్లిందండ్రినిన్ జేరి వే
చెఱసాలన్ వెడలించి, కొల్చి, మురిపించెన్ సేవ లందించియున్;
సరసీజాక్షిని రుక్మిణీ మణిని హృత్స్థానమ్మునందున్ దగన్
బరిగృహ్యాంచితగా నొనర్చి వరుసన్ భార్యాష్టకుండయ్యు,
ద్వరదుండయ్యెను పాండుభూపు తనయుల్ ధర్మాత్ములై కొల్వఁగన్
నరు సారథ్యముఁ జేసి కూర్మి సలహా నందించి గెల్పొందఁగన్
కురువీరుల్ తమయంతఁ దాము తొలఁగన్ గోపాలుఁడే పూని యు
ర్వరనున్ గెల్వఁగఁ జేసెఁ; బుట్టి ముసలంబా యాదవామ్నాయమున్
బరిమార్పన్ సమకట్ట, నప్డు, మునిశాపమ్మున్ మదిం గాంచియున్
జరియింపంగను లేక తాను వనిలో శయ్యావిలోలుండయెన్;
శరమున్ వేయఁ గిరాతుఁ డొక్కఁ డట, విశ్వాకారుఁ డా వెంటనే
సరవిన్ జన్మ సమాప్త మౌట, వెడలెన్ సర్వేశుఁ డా చక్రియున్
వర వైకుంఠముఁ జేరె! నట్టి ఘనుఁడౌ పక్షీంద్ర యానుండు శ్రీ
హరి విశ్వాత్ముఁడు పద్మనాభుఁడు నిలింపారాతివైరుండు శా
ర్ఙ్గి రమానాథుఁడు పాంశుజాలికుఁడు పుండ్రేక్షుండు మమ్మోమెడున్!


-:శుభం భూయాత్:-

41 కామెంట్‌లు:

  1. గురువర్యులు గుండు మసుసూధన్ గారు చక్కని కవిత్వంతో అలరింప జేశారు.ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. మధుసూదన్ గారూ !మంచి పద్యమాలికను అందించి నందులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  3. దయచేసి "మమ్మోమెడున్" వివరింపగలరు.

    రిప్లయితొలగించండి
  4. దయచేసి "మమ్మోమెడున్" వివరింపగలరు.

    రిప్లయితొలగించండి
  5. భాగవత గాధనంతయు
    నీగతి మత్తేభపద్య నిరుపమ మాలన్
    శ్రీ గుండు వారు వ్రాసిరి
    బాగుండెను, మెచ్చు బ్రోచు భగవంతుండే .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవిమిత్రులు గోలి హనుమచ్ఛాస్త్రి గారూ...ధన్యవాదములు!

      నా పద్యము నుతియించుచుఁ
      దేనెలొలుకు కందమందు ♦ దివ్యముగ నిటుల్
      వీనుల విందుగ వ్రాసితి!
      శ్రీనిలయుం డోముఁ గాత ♦ సిరులిడి మిమ్మున్!!

      తొలగించండి
    2. గుండు వారూ,
      మొదటిపాదంలో ప్రాస తప్పింది. ‘నా నూత్నకవిత మెచ్చుచు’ అందామా?

      తొలగించండి
    3. ధన్యవాదములు శంకరయ్యగారూ....తమరి సూచన బాగున్నది. సవరించెదను.

      నా నూత్నకవిత మెచ్చుచుఁ
      దేనెలొలుకు కందమందు ♦ దివ్యముగ నిటుల్
      వీనుల విందుగ వ్రాసితి!
      శ్రీనిలయుం డోముఁ గాత ♦ సిరులిడి మిమ్మున్!!

      తొలగించండి
  6. రిప్లయిలు
    1. మత్తేభారిస్కంధుని
      మత్తేభప్రాణ దాత మాధవు గొలుతు
      న్నుత్తుంగాభంగ తరం
      గోత్తంసోత్కర దయాపయోనిధిఁ గుణధిన్

      ఆర్యా మధుసూదన్ గారు నమస్కారములు. శ్రీమదాంధ్ర మహా భాగవతము లోని సర్వంసహాదశమ స్కంధము మత్తేభ విశేషములో బంధించి పద్య సుధారస ధారల దనిపితిరి. మహదానందమయినది. ధన్యవాదములు. “స్త్నానమ్ము” పదము సందేహాస్పదముగా నున్నది. విశదీకరించ గోర్తాను. “స్నానము” కదా.

      తొలగించండి
    2. సుకవిమిత్రులు పోచిరాజు కామేశ్వర రావు గారూ...ధన్యవాదములు!

      కరివరదుఁ గవిత మనమునఁ
      దిరమగు నరుసమును నిడఁగ దితిజ విమతునిన్
      గురు కవితను నుతు లిడితిరి!
      హరి మిముఁ గృపఁ గని సిరులిడి యనిశ మరయుతన్!!

      స్వస్తి.

      తొలగించండి
    3. గీ.
      అవని టతప వర్గముల నంత్యాక్షరములు
      పరమునందునఁ గల యూష్మ వర్ణములకు
      మొదలి వర్ణంబు లాగమంబులయి నిలుచు
      నాగమ విరామ మనఁగ రామార్ధదేహ!

      (కూచిమంచి వేంకటరాయని "సుకవి మనోరంజనము" నందలి 2ఆ.312వ పద్యము)

      >>>ణనమ వర్ణములందుఁ గల శషసహలకు, టతప వర్ణము లాగమమగును. అనఁగ మధ్యను వచ్చును.

      అఘోషా దూష్మాణః పరః ప్రథమోభినిధాన స్పర్శపరా త్తస్య సస్త్నానః"(కుమారవ్యాకరణ సూత్రము)

      ఏవం కృష్ట్ణ, స్త్నాన, భీష్ప్మాది.

      కృష్ణయ్యను కిట్టయ్య యనెదము.
      స్నానమును తాన మనెదము.

      వీటియందు టకారమును, తకారమును లేకున్న నివి యెటులు వచ్చును? కాన పై సూత్రము ననుసరించి ’స్త్నాన’ పదము నర్థముచేసికొనవలసినది.

      స్వస్తి.

      తొలగించండి
    4. వ్యాకరణ సూత్రాలను తెలియజేసి సందేహ నివృత్తి జేసారు. ధన్యవాదములు. సుందరమైన కందములో మీ యాశీర్వచనములకు ధన్యవాదములు.

      తొలగించండి
    5. తానమన్న పదమును నేనూ వాడాను నా శతకములో.
      అపరాహ్నపు తానంబులు
      విపరీతపు జాప్యములును వికటపు నిద్రా
      జపము పగలందు తగదు గ
      ద పని వదలి పోచిరాజతనయా వినుమా

      తొలగించండి
    6. ఆర్యా నా పద్యములో "పయోనిధి" లో అర సున్న పొరపాటున నుండి పోయింది. ముందు "దలతున్" వ్రాసి తర్వాత "గుణధిన్" గా మార్చితిని.

      తొలగించండి
    7. సుకవీ..."ప్రమాదో ధీమతా మపి" యనికదా యార్యోక్తి! చింతించవలదు. పొరపాటు లెవ్వరికైనను సహజము!

      స్వస్తి.

      తొలగించండి
    8. గుండు వారూ,
      కామేశ్వరరావు గారిని ప్రశంసించిన మీ సర్వలఘుకందం చాలా బాగున్నది.

      తొలగించండి
  7. శ్రీ గుండు మధుసూదన్ గారూ నమస్కారము. మీ " శ్రీకృ ష్ణావతార వర్ణన" చాలా బాగుంది అభినందనలు. పెద్దన గారు వ్రాసినట్లు చెబుతున్న దీర్ఘ ఉత్పల మాలికను జ్ఞాపకము చేస్తుంది మీ ఈ మత్తేభ మాలిక .

    విరిసెంబూవులు శంకరాభరణ బ్లాగ్విన్వీధిలోవిర్విగా
    తిరిగెన్ యేనుగులన్ని నొక్కొకటిగా తేనీయలన్ మోయుచున్
    కురిసెన్ మానసమందు కోరకనె శ్రీకృష్ణామృతంబేరులై
    స్థిరమౌ మిత్రమ సంపదల్ విజయముల్ శ్రేయంబు నీస్వంతమౌ !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవిమిత్రులు మంద పీతాంబర్ గారూ...ధన్యవాదములు!

      చక్కని పద్దెము నందున
      నిక్కపు భక్తిని వెలార్ప నీరజనాభున్
      మక్కువ మీరఁగఁ బొగడితి!
      దిక్కయి శ్రీకృష్ణుఁడు నినుఁ దిరముగఁ బ్రోచున్!!

      స్వస్తి.

      తొలగించండి


  8. మత్తేభమ్మునగృష్ణుని
    మత్తుగవర్ణించితీవుమధుసూదన!నే నిత్తునునతులనుగొనుమా యుత్తుత్తిగబలుకలేదుయొట్టునుసుమ్మా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవిమిత్రులు సుబ్బారావు గారూ...ధన్యవాదములు!

      హరిని నుతియించు కవితను
      మరిమరి వొగడుచును నన్ను మాన్యునిగ నుతుల్
      విరచించితి సుకవీ! నిను
      మురళీధరుఁ డిచ్చ మెచ్చి ముదమునఁ బ్రోచున్!!

      స్వస్తి.

      తొలగించండి
  9. సుకవి మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారూ...ధన్యవాదములు...నమశ్శతములు!

    నా పద్దియమును శంకరాభరణమునం బ్రచురించి, నన్నిందఱు కవి మిత్రుల యాదరాభిమానముల కర్హునిఁ గావించినందులకుఁ గృతజ్ఞుఁడను!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా పద్య ప్రచురణ మిడి
      యేపారెఁ ద్వదీయ సుకవి హృదయమ్ము వెసన్!
      గోపాలుఁడు దయఁ జూచుచుఁ
      గాపాడుత మిమ్ము నెపుడు కాంక్షిత మిడియున్!!

      తొలగించండి

  10. గుండు మధుసూధనార్యులు
    మెండుగ శ్రీకృష్ణసామి మెప్పును పొందెన్
    నిండగు వీరి పదము పూ
    చెండులు గదవే జిలేబి చెంగలువయనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారికి ధన్యవాదములు! మీ పద్యాభినందనలకుం గృతజ్ఞుఁడను!

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      ‘శ్రీకృష్ణదేవు మెప్పును...’ అనండి.

      తొలగించండి
  11. శ్రీ మధుసూదన్ గారికి ...చాలా చక్కని మధురమైన పదములతో కళ్ళకు కట్టినట్లు శ్రీకృష్ణావతార వర్ణన రచించారు..ధన్యవాదములు..

    రిప్లయితొలగించండి
  12. మధుసూదను నవతారము
    సుధాభరితముగ నుడువుచు సూనృతమందన్
    వ్యధలేవియు దరిజేరని
    పథమందును 'గుండువారు' భాగ్యములందన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవులు గుండా వేంకట సుబ్బ సహదేవుఁడు గారూ...ధన్యవాదములు!

      శ్రీకృష్ణుని నుతియించిన
      నా కిచ్చిన పద్యసూన నవకముఁ గనియున్
      మేకొని దయలను సిరులనుఁ
      జేకూర్చుత మీకు నెపుడు శ్రీకృష్ణుండున్!!

      తొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. కం .గుండు మధు సూదనార్యుల
    దండకమా? కృష్ణలీల దర్పణమా?మీ
    నిండు మనసునగలహరియె
    అండగ ఆరోగ్యభాగ్యమందించుసుమా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవులు కే. ఈశ్వరప్ప గారూ...ధన్యవాదములు!

      మీ యాదరణమునుం గని
      నా యెద యుప్పొంగె సుకవి! హర్షముతోడన్!
      శ్రేయోఽంచిత కరుణనుఁ గని
      యా యాదవుఁ డిడుత మీకు నారోగ్యశ్రీల్!

      స్వస్తి.

      తొలగించండి
  15. ఈరోజు శంకరాభరణం బ్లాగులో ‘శ్రీకృష్ట జన్మాష్టమి’ వేడుకలు జరిగినంత సంబరంగా ఉంది. తమ మనోహరమైన కావ్యఖండికను ప్రచురించడానికి అనుమతించిన గుండు మధుసూదన్ గారికి, దానిని చదివి రసాస్వాదన చేసి ప్రశంసించిన కవిమిత్రులకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి