31, జులై 2016, ఆదివారం

పద్మావతీ శ్రీనివాసము - 16



పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
చతుర్థాశ్వాసము (61-80)

తప మాచరించు నతని నుతించి యమ
పతినుతేంద్ర నీలమణి వర్ణుండు                     61

పీతామలాంబ రోపేంద్ర కృష్ణ సహి
తాతత బాహుడు తాలాంకు నచట                    62

రామకృష్ణులు శుకారాధ్యులట బల
రాముడు తీర్థయాత్రకు నేగు వాడు                    63

వార లిరువురను భక్తి నుతించి           
వారిజములఁ గొని పద్మాకరమున                      64

ముదిత యంత సువర్ణముఖి నుత్త రించి
పదిలమ్ముగ వనోప వనములు దాటి                  65

అరణీ నదీ తీర మనువుగఁ జేరి
విరిబోడి వనమున విశ్రాంతి గొనుము                 66  

అట జన నారాయణాఖ్య పురమ్ము
నటవీ పరివృతము నరయంగ నోపు                   67

వనమున కన్పట్టు ఫలపుష్ప సహిత
పనసామ్ర తిందుక పాటల కుంద                       68

చంపక వరుణ రసాల శిరీష
యింపైన పున్నాగ హింగు ప్రియంగు                  69

సాల తాళాంకోల శాల్మలీ ప్లక్ష
మాలతీ యూధికా మల్లికా కుంద                       70

ఖర్జూర నింబ నాగ వకుళాశోక
భూర్జ హింతాల జంబూ బీజపూర                        71

కీచకోదుంబర కింశుక లికుచ
మాచీ ముఖప్రియ మందార నీప                        72

చించార్జున బదరీ శ్రీ పూగ మధుక
మంచిత నారికేళాశ్వత్థ యుతము                     73

కరవీర తామర కల్హార విరుల
గరుడ సారస శుక ఖగ సంకులమును              74  

భ్రమర ఝంకార సుస్వర మనోహరము
కమనీయ ఘన తటాక విరాజితమ్ము                75

మగువ పుష్పోత్తర మార్గమునఁ జని
నగరమ్ము రమ్యము నారాయణపురి                 76  

గంగానదీ సమ కల్లోల వతియు
భంగ తట్యరణి శైవలిని యచ్చోట                       77

కని యధోచితమగు కార్యము సేయు
మని నుడివి శయన మాశ్రయించె హరి              78  

అంజలి ఘటియించి హరికి నయ్యింతి
గుంజామణి సమము గుఱ్ఱము నెక్కి                 79

శ్రీనివాసోక్తంపు చెలువంపు దారి
మానిని చనియె కమలనేత్రి దృతిని                   80

దత్తపది - 94 (అసి-కసి-నుసి-రసి)

కవిమిత్రులారా,
అసి - కసి - నుసి - రసి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగించి
పల్లె పడుచు అందాలను వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

30, జులై 2016, శనివారం

పద్మావతీ శ్రీనివాసము - 15


పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
చతుర్థాశ్వాసము (41-60)

అగణిత గుణశీలి నష్టాదశ కలి
యుగమున వరియింతు నువిదను బ్రీతి                           41  

అమర పూజల నంది యబ్జజ లోక
మమరి యుండును నారి యంత వరకును                       42

తదనంతరము భూమి తనయగ పుట్ట
ముదముగ నా వరము సిరి వరమును                             43

ఆకాశ రాజున కాసతి యిపుడు
రాకుమారి ధరణి రంజిల్ల దొరికె                                             44

నారాయణ పురమున నళిన రాశి
నారాయణీ నిభ నళిన దళాక్షి                                               45  

చెలికత్తియల గూడి చిరునవ్వు తోడ
నలినాక్షి యంత వనమున తిరుగుచు                               46

మృగముల వేటాడ మెలగెడి నాకు
నగపడె కోయుచు నలివేణి విరుల                                       47

వర్ష శతమ్ముల వర్ణింప దరమ
హర్ష మెసగ కలహంస గమనను                                         48

పద్మాభ పద్మజ పద్మ దళాక్షి
పద్మాభయప్రద పద్మాక్ష వరద                                             49

మేన నసువుల కల్మి పొసగు నపుడ
తాను రమా సహితము నన్నుఁ జేర                                   50  

వకుళ తెల్పుము వియత్పతి పుర మేగి            
సుకుమారిఁ గని నాకు సుందరి తగునె                               51

అనవిని వకుళ మోహాపన్నుఁ గాంచి
చనియెద చెప్పుడి సతియున్న దారి                                  52

వేగమ నేగుదు విశ్వేశ జూడ
నా గజయానఁ గల్హార నయనను                                         53

అంత జెప్ప దొడంగె నరవింద నేత్రు
డింతికి ప్రియమార నింపైన దారి                                          54

అతివ యీ శ్రీనృసింహ కుహర మార్గ
ము తరించి భూధరము మనోజ్ఞము దిగి                           55  

సంయ మీంద్రుం డగస్త్య సదాశ్రమమ్ము
సంయానఁ గని కుంభ సంభ వార్చితము                            56

లింగ మగస్త్యేశు లీలా మయుం
రంగ భాసిత సువర్ణ ముఖరీ తటిని                                      57

పూజించి కడుభక్తి  పూఁబోఁడి సనుము
భాజనీయము శుక వనము సుందరము                         58  

అన్నదీ తట పధ మనుసరించి చన
కన్నుల కింపగు కమలాకరమ్ము                                       59

రుచిరమ్ము పద్మసరోవర మందు
శుచిగ తానము జేసి శుక మహాత్ముండు                         60  

సమస్య - 2102 (వ్యర్థ మొనరింపఁ దగును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

వ్యర్థ మొనరింపఁ దగును సంపదల బుధులు.

29, జులై 2016, శుక్రవారం

పద్మావతీ శ్రీనివాసము - 14


పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
చతుర్థాశ్వాసము (21-40)

దేవ కన్యను గంటె ద్విజ కన్య నైన
భావాపహరి నర భామినిఁ గంటె                                           21  

చెప్పు మార్య యని యా చేడియ యడుగ
నప్పుండరీకాక్షు డంత నిట్టూర్చి                                         22

వకుళ మాలికఁ గని వామాక్షు డనియె
సకలమ్ము నుడివెద సత్యమ్ము వినుము                             23             

త్రేతాయుగ మది వధించితి నేను
సీతాపహారి దుశ్శీలు రావణుని                                          24

వేదవతీ కన్య వినయ సంపత్తి
యాదరించె సిరి సహాహియై కరము                                   25

సీతయై లక్ష్మియ క్షితి నుద్భవించె
భూతల పతికి నపుడు పువ్వుబోణి                                   26

పంచవటిని వీడ వధకు మారీచు
పంచగ సీత యవరజు డే తెంచ                                         27

అంత సమీపించె నా రావణుండు
పంతమూని మది నపహరింప సీత                                   28

అగ్ని హోత్ర గతాగ్ని యంత కార్య సుని
మగ్నుడై రావణు మనసు నెఱింగి                                    29

స్వాహా సతి సరసఁ బాతాల మందు
స్నేహ భావము మీర సీతను దాచి                                  30

రావణ స్పృష్ట కారణ దగ్ధ తరుణి
నా వేదవతిని సీతాకృతి విడిచె                                         31

రావణాపహృతయై లంకానగరము
దైవోపహత సేరె దైన్య భావమున                                    32

దశకంఠుని మరణోత్తరమునఁ దిరిగి
కృశమధ్య దారుణాగ్ని శిఖల దూక                                 33

పావకుండు మహానుభావుండు రక్షి
తావని సుతను స్వాహాశ్రిత సుమతి                               34

సీత వినుత భద్ర శీలిని కీల
వ్రాతమున సవేదవతి నుద్ధ రించి                                  35

ఐచ్చి పలికె సీత యీమె యని మన
మచ్చెరు వందగ నా వేదవతిని                                      36

పుణ్యవతినిఁ జూపి పూబోడి బదుల
గణ్య సంకటములఁ గందె యిభ్భామ                               37  

లంక యందని పల్కి లావణ్య వతిని
నింక కరుణ జూచి యేలుకొను మనె                               38

నావిని జానకి ననుజూచి పలికె
దేవ వేదవతి ప్రీతి యొస గనిశము                                39

వారిజాక్షి పరమ భాగవతి సతి
కారుణ్యము వహించి కళ్యాణ మాడు                             40