31, జులై 2016, ఆదివారం

పద్మావతీ శ్రీనివాసము - 16



పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
చతుర్థాశ్వాసము (61-80)

తప మాచరించు నతని నుతించి యమ
పతినుతేంద్ర నీలమణి వర్ణుండు                     61

పీతామలాంబ రోపేంద్ర కృష్ణ సహి
తాతత బాహుడు తాలాంకు నచట                    62

రామకృష్ణులు శుకారాధ్యులట బల
రాముడు తీర్థయాత్రకు నేగు వాడు                    63

వార లిరువురను భక్తి నుతించి           
వారిజములఁ గొని పద్మాకరమున                      64

ముదిత యంత సువర్ణముఖి నుత్త రించి
పదిలమ్ముగ వనోప వనములు దాటి                  65

అరణీ నదీ తీర మనువుగఁ జేరి
విరిబోడి వనమున విశ్రాంతి గొనుము                 66  

అట జన నారాయణాఖ్య పురమ్ము
నటవీ పరివృతము నరయంగ నోపు                   67

వనమున కన్పట్టు ఫలపుష్ప సహిత
పనసామ్ర తిందుక పాటల కుంద                       68

చంపక వరుణ రసాల శిరీష
యింపైన పున్నాగ హింగు ప్రియంగు                  69

సాల తాళాంకోల శాల్మలీ ప్లక్ష
మాలతీ యూధికా మల్లికా కుంద                       70

ఖర్జూర నింబ నాగ వకుళాశోక
భూర్జ హింతాల జంబూ బీజపూర                        71

కీచకోదుంబర కింశుక లికుచ
మాచీ ముఖప్రియ మందార నీప                        72

చించార్జున బదరీ శ్రీ పూగ మధుక
మంచిత నారికేళాశ్వత్థ యుతము                     73

కరవీర తామర కల్హార విరుల
గరుడ సారస శుక ఖగ సంకులమును              74  

భ్రమర ఝంకార సుస్వర మనోహరము
కమనీయ ఘన తటాక విరాజితమ్ము                75

మగువ పుష్పోత్తర మార్గమునఁ జని
నగరమ్ము రమ్యము నారాయణపురి                 76  

గంగానదీ సమ కల్లోల వతియు
భంగ తట్యరణి శైవలిని యచ్చోట                       77

కని యధోచితమగు కార్యము సేయు
మని నుడివి శయన మాశ్రయించె హరి              78  

అంజలి ఘటియించి హరికి నయ్యింతి
గుంజామణి సమము గుఱ్ఱము నెక్కి                 79

శ్రీనివాసోక్తంపు చెలువంపు దారి
మానిని చనియె కమలనేత్రి దృతిని                   80

2 కామెంట్‌లు:

  1. సురుచిరపదాాలకూర్పుచేశుధ్ధముగను
    రచనసాాగుచుoడెనుగడురమ్యముగను
    పూర్వజన్మాానజేసినపుణ్యఫలిత
    మీయదినిజముసోదర!యిట్టిరచన

    రిప్లయితొలగించండి