పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర
రావు
తృతీయాశ్వాసము (41-60)
భాసిత శంఖ గ్రీవము సుమధ్యమము
శ్రీసమ మీవ యుచితము శ్రీహరికి 41
నాబల్కి దీవించి నారదుడు మృగ
శాబాక్షిఁ జనియె నాసతి పూజ లంది 42
చెలికత్తియల గూడి చిద్విలాసముగ
కలహంస గమన వికసిత సుమ ముఖి 43
ముదమార విహరింప మురిపెంపు వనము
సదమల చిత్తయై సాగె నభ్భామ 44
మంజుల పికశుకామర రావములును
రంజన సుఫలభార నత ద్రుమములు 45
శరభ వారణ మృగ చమర కురంగ
హరి భల్ల సంచరి తాంచిత వనము 46
విమల జలాశయ విస్ఫారితమ్ము
కమనీయ బక హంస గణ సంయుతమ్ము 47
కమల కోకనద ప్రకర భాసితమ్ము
భ్రమర యుగళ గణ పరి సర్పితమ్ము 48
సుందర వనమున సుమ సేకరణము
డెంద మలరగ రండి సుదతు లార 49
ముదమార నిట రాజపుత్రిక తోడ
కదలి సేతుమని పల్కఁ దిరిగి రపుడు 50
అంత వనాంతర మందు వీక్షించి
రింతు లుద్విగ్నులు నిద్ధ దంతి నట 51
గండ ద్వయోద్భవ ఘన మద ధార
చండ దంత యుగలోజ్వల విలసితము 52
కరిణీ గణ సమేత గజరాజుఁ జూచి
తరుణు లేగిరి వేగఁ దరుల చాటునకు 53
ధవళాశ్వ వాహన ధన్వి యొకండు
రవినిభ తేజుండు ప్రాయంపు వాడు 54
విద్యుల్లతా సమవేత మేఘ నిభు
డుద్యదంబక హస్తుడు మదన సముడు 55
రత్న కంకణ కుండల కటి సూత్ర్రాది
రత్నాభరణ సువిరాజ మానుండు 56
నళిన దళ నిభ కర్ణాంతాయ తాక్షు
డళినీల కేశుండు నసిత వర్ణుండు 57
పీతాంబర కటి సంవీతుండును కల
ధౌత యజ్ఞోపవీత విరాజితుండు 58
దక్షిణావర్తిత తరళ శ్రీవత్స
లక్షిత వక్ష సులక్ష ణాంగుండు 59
ఈహా మృగార్థము నేగి వెంటాడ
వాహాధిరోహుని వామాక్షు లచట 60
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి