15, జులై 2016, శుక్రవారం

పద్మావతీ శ్రీనివాసము (ద్విపదకావ్యము)

పద్మావతీ శ్రీనివాసము (ద్విపదకావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు

ప్రధమాశ్వాసము (21-40)

నారాయ నాంచిత నామ జప మహ
దారాధనా రతు డబ్జ జాత్మజుడు                  21

నారదుం డత్తరి నగుమోము తోడ
వారి కడకు వచ్చె భాగవతుండు                    22

సురమునిఁ జూచి భూసురులు సమ్మోద
భరితులునై యర్ఘ్యపాద్యంబు లొసగి              23

అంజలి ఘటియించి యాసీనుఁ జేసి
వింజామరలు వీచి వినుతుల తోడ               24

పూజింప నానంద పులకితు డయ్యె
రాజీవగర్భు పరమ ప్రియ సుతుడు               25

బృందారక గణ సంప్రీత చిత్తుండు
మందస్మిత వదన మండితు డడిగె                26

యాగ భాగ చయార్హ తాధిపు డెవరు
భాగవ తోత్తమ పండితు లార                     27

ఈ చెంత మీయాగ మెవ్వాని గూర్చి
వాచోచితమ్ముల పలుకంగ రాదె                  28

నావిని సంయమి నాధులు చింత
నా వివశత్వమ్మున నిలిచి రంత                    29

ధర్మ తత్వజ్ఞులు దమలోనఁ దాము
మర్మ మెరుగ నెంచి మథియించి రిట్లు           30

అంభోజ గర్భాచ్యుతాంబ రాంబరుల
దంభవి హీనుడు దానెవ్వ డనుచు                 31

శాంతమక్రోధము క్షమముల నెవరు
సంతత ముందురు సక్కగ ననుచు                32

తర్కంబు జేసిరి ధరణిసుర వరు
లర్క సదృశ తేజు లన్యోన్య మంత                33

అమర ముని వరేణ్య యట్టి యీశుండు
తమ రర్హులు దెలుప దయ మాకు ననగ          34

లోకకళ్యాణ లోలు డనియె నిట్లు
నాకముని కను డనఘులార మీర                 35

అనినంత శుకశౌన కాదిగ మునులు
గని రొండొరుల గనఁ గార్య సాధకుని           36

పరమ పవిత్రుడు పాదాక్ష భృగువ
డరెను శోధింప నటన్ సత్వ గుణుని              37

అల్ప కార్యంబని యాత్మలో దలచి
సల్పెను మార్గణ సాహస యాత్ర                   38

కాంచెను సత్యలోకమున పద్మభవు
నంచిత వాణీ సమాశ్రిత లీలు                      39

నిజగురు ద్రుహిణుని నిలిచె మౌనముగ

నజు గని వందన మాచ రింపకను               40

1 వ్యాఖ్య:

  1. బృగువుని సత్యలోకం రప్పించారు. యింక కైలాసం, వైకుంఠం ప్రయాణమవ్వాలి. ద్విపదకావ్యం చక్కగా సాగుచున్నది. ధన్యవాదములు.

    ప్రత్యుత్తరంతొలగించు