24, జులై 2016, ఆదివారం

పద్మావతీ శ్రీనివాసము - 10

పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)రచన : పోచిరాజు కామేశ్వర రావు
తృతీయాశ్వాసము
(21-40)

భామను బెంచిరి పద్మావతి యను
నామంబున శయన నళినాళి యగుడు                21

బాలి కావతరణ ఫల మోమొ కలిగె
బాలు డిమ్ముగ రాజ పత్నికి నంత                      22

గ్రహములై దున్నత రాశుల నుండ
గ్రహరాజు శుభ మేష రాశి నందుండ                    23

వసుదాను డను పేరు పన్నుగఁ బెట్టి
వసుధేశు డొనరించె వడుగు సుతునకు               24

విలువిద్య నేర్చెను పితరుని వద్ద
నలవోక గను సకలాస్త్ర శస్త్రములు                      25

బలశాలి పుత్రుని ప్రాభవమున న
తులిత శౌర్యుడు శత్రు దుర్ధర్షు డయ్యె                  26

జననీ జనకుల నిజ కరుణ గరిమ
తనయ పద్మావతి తనరారు చుండె                    27

శుక్ల పక్ష శశాంక శోభ చందమున
నక్లేశ వర్ధ మానైశ్వర్య యాయె                          28

శశి నిభానన శంఖసమకంఠ చారు
కృశమధ్య ఘననీలి కేశ రంభోరు                        29

చారుశీలి మృదుభాష చతురాతి సుకు
మార శరీరి పద్మావతీ దేవి                               30

ఉద్యాన వనమున నొకనాడు తరుణి
హృద్యంబుగ సఖీ సహితయై చను తరి             31

అమర ముని జగ దవ్యయ కారకుండు
కమలనాభ చరిత గాన లోలుండు                   32

నారదుం డేతెంచి నారీ లలామ
వారిజాక్షినిఁ గాంచె పద్మావతి నట                  33

తారల మధ్యను దారాధిపు వలె
తారానన సమాశ్రిత సఖీజని నట                  34

సంయమీశ్వరుఁ జూచి శశిముఖి భక్తి
సంయుత వినయ సుసంభ్రమములను         35

ఎదురేగి వందన మింపుగఁ జేసి
వదనము నించుక వంచి నిలబడె                 36  

బాల నీవెవ్వరి బాలిక వనిన
నా లలితాంగి తా నాకాశ రాజ                      37

తనయ మునివర పద్మావతి ననియె
వినయమ్ము తోడ నావిని సంతసించి           38

కళ్యాణ మస్తని కరము దీవించె
కల్యాణి నంత సకల శుభ కరుడు              39

తరలాక్షి శుభలక్షిత వర గాత్రమ్ము
దరహాస మాన వదన కమలమ్ము           40

8 కామెంట్‌లు:

  1. కామేశ్వర రావు గారు,
    ద్విపద కావ్యము చదువుతుంటె హాయిగా సాగిపోతుంది. చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. సత్యనారాయణ గారు ధన్యవాదములండి. పూర్తిగా సమీక్షించి గుణదోషములను దెలుప గోర్తాను.

    రిప్లయితొలగించండి
  3. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    శ్రీయుత కామేశ్వర రావు గారికి :------


    " పద్మావతీ శ్రీనివాసము " అనే మీ ద్విపద

    కావ్యము చేత భక్తిఙ్ఞానములను

    ప్రసాదిస్తున్న మీకు నమస్కృతులు

    రిప్లయితొలగించండి
  4. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    శ్రీయుత కామేశ్వర రావు గారికి :------


    " పద్మావతీ శ్రీనివాసము " అనే మీ ద్విపద

    కావ్యము చేత భక్తిఙ్ఞానములను

    ప్రసాదిస్తున్న మీకు నమస్కృతులు

    రిప్లయితొలగించండి
  5. గు రు మూ ర్తి ఆ చా రి గారు నమస్కారములు. పద్మావతీ శ్రీనివాసము ను వీక్షించు చున్నందులకు ధన్యవాదములు. వరాహ పురాణమాధారముగ యీ భక్తి కావ్యమును రచించితిని. 1967 లో "వేంకటేశ్వరా" (అది యిప్పు డలభ్యము) శతకానంతరము వేంకటేశ్వర స్వామి పై కావ్యము వ్రాయవలెనని యాశించితిని. అది ఇప్పుడు నాభాగ్య వశమున వ్రాయ గల్గితిని. అది మా యన్న గారి శంకరాభరణముల దయాదాక్షిణ్య ఫలితము.

    రిప్లయితొలగించండి
  6. కామేశ్వరరావు గారూ,
    నిన్న మధ్యాహ్నం నుండి నా లాప్ టాప్ పని చేయడం లేదు. అందువల్ల ఈరోజు మీ కావ్య భాగాన్ని ప్రకటించలేక పోయాను. అది రిపేర్ కాగానే కొనసాగిస్తాను.

    రిప్లయితొలగించండి
  7. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు . అలాగే చేయండి.పరవా లేదు.

    రిప్లయితొలగించండి