20, జులై 2016, బుధవారం

సమస్య - 2092 (మాతను బెండ్లియాడి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
“మాతను బెండ్లియాడి జనమాన్యుఁడుగా నుతి కెక్కె మిత్రమా!”
లేదా...
“మాతను బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్”

67 వ్యాఖ్యలు:

 1. నేతగు దశరధ తనయుడు
  నాతా రకరాము డంట నభవుని విల్లున్
  చేతనము విరిచి సీతా
  మాతను బెండ్లాడి లోక మాన్యుండయ్యెన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘నేత+అగు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘నేత దశరథ కుమారుం| డా తారకరాము డంట...’ అనండి.

   తొలగించు
  2. నేత దశరధ కుమారుం
   డాతారక రాముడంట నభవుని విల్లున్
   చేతనము విరిచి సీతా
   మాతను బెండ్లాడి లోక మాన్యుండయ్యెన్

   తొలగించు


 2. మా తండ్రి, షష్టి పూర్తిని
  మా తరపున బంధువర్గ మాశీస్సుల, న
  య్యర్, తా జిలేబి యను మా
  మాతను బెండ్లాడి లోకమాన్యుండయ్యెన్

  సావేజిత
  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   మూడవపాదంలో ప్రాస తప్పింది. ర్+తా=ర్తా అవుతుంది. దానివల్ల ప్రాసదోషం.

   తొలగించు


  2. ఔరా !

   ఇంత సూక్ష్మం ఉందా !

   నెనర్లు కంది వారు


   జిలేబి

   తొలగించు
 3. భూతేశుడైన శంకరు
  డా తన్వంగిని హిమాలయాత్మజను శివన్
  చేతం బలరగ త్రిజగ
  న్మాతను బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్.
  (హ.వేం.స.నా.మూర్తి)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 4. త్రేతాయుగమున రాముడు
  ప్రీతిగ శివధనుసు విరిచి ప్రేముడితోడ
  న్నా తరళేక్షణ సీతా
  మాతను బెండ్లాడి లోకమాన్యుండయ్యెన్!!!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శైలజ గారూ,
   ఈమధ్య కొంత ‘గ్యాప్’ ఇచ్చినట్టున్నారు!?
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘శివధనువు విరిచి’ అనండి.

   తొలగించు
  2. 15 రోజులు ముంబయ్ వెళ్ళాల్సి వచ్చింది గురువుగారు ..అందువలనే ఈ గ్యాప్ ధన్యవాదములు..

   తొలగించు
 5. గురుమూర్తి ఆచారి గారి పూరణ....

  భూతలమున్, దివిన్, నభము భూజుడు ఖేదమొనర్చె దేవతల్
  "మా తర మౌనె బ్రోవు" మని మాధవు వేడగ నా ధరా౦శ స౦
  భూతకు సత్యభామకు విభు౦డయి, వాని వధి౦ప జేసె, భూ
  మాతను పె౦డ్లియాడి జన "(సుర)" మాన్యుడుగా నుతి కెక్కె మిత్రమా

  { భూజుడు = నరకాసురుడు }

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 6. భూతేశుడు పరమశివుం
  డాతత సంప్రీతి దోడ నా పార్వతికై
  దూతయె తానౌచు జగ
  న్మాతను బెండ్లాడి లోక మాన్యుండయ్యెన్!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మిత్రులందఱకు నమస్సులు!

  ప్రీతిగ మౌని యాగమును వేగమె కావఁగఁ దాటకన్ విని
  ర్ఘాత శరమ్మునం జిదిమి రాముఁడు మౌనిని వెన్నడించియున్
  మాత నహల్యఁ బ్రోచి యసమాంబకు విల్ దెగవేసి జానకీ

  మాతను బెండ్లియాడి జనమాన్యుఁడుగా నుతి కెక్కె మిత్రమా!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మధుసూదన్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 8. భూతగణాధిపా! రయమె బ్రోవుమటంచు సురల్ నుతించగన్
  ఘాతక తారకాసురుని గర్వమడంచ తదీశ్వరాంశ సం
  భూత కుమారసంభవపు మోదము గూర్చగ పార్వతిన్ జగ
  న్మాతను పెండ్లియాడె జన(సుర)మాన్యుడుగా నుతికెక్కె మిత్రమా!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 9. లేత పరువాన జనకుడు
  ఘాతుకమగు వ్యాధి సోకి కాలము చేయన్!
  నేత యొకడు నా బాలుని
  మాతను బెండ్లాడి లోక మాన్యుండయ్యెన్!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది, బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 10. జోతలు దేవత లిడగను
  ప్రీతిగ తపమును సలిపెడి వేళన్ శివుడే
  ఖ్యాతిని బొందిన దుర్గా
  మాతను బెండ్లాడిలోక మన్యుండయ్యన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీనివాస్ చారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 11. నిన్నటి సమస్యకు పూరణము:

  శత్రు రహితున కబ్బు నే శాంతి సుఖమ
  ది బడయంగను బ్రతుకున దివ్య మవగ
  పాత్రతను గని జేరగ మిత్రుని దరి
  ధాత్రి యందున దొరకును, మైత్రి బలము!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శర్మ గారూ,
   మీ పై పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 12. ఖ్యాతిగ శ్రీరాముడు సం

  ప్రీతిగ శివధనువు విరిచి పెద్దల కెల్లన్

  జోతలనిడి యా సీతా

  మాతను బెండ్లాడి లోక మాన్యుండయ్యెన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 13. గీతా !ఖగపతి యాశ్రీ
  మాతను బెండ్లాడి లోక మాన్యుo డ య్యె
  న్సీతామాతను రాముడు
  ప్రీతిని దను బెండ్లి యాడి ప్రేమగ నుండెన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఖగపతి అంటే గరుత్మంతుడు. ‘గీతా! ఖగ గమనుడు శ్రీ...’ అనండి.

   తొలగించు
 14. వీత భయంబు తోడ రఘు వేవురు జూడగ మండపంబు న
  న్మా తను బెండ్లి యాడి జనమాన్యుడుగా నుతి కెక్కె మిత్రమా
  యాతని చేష్ట కున్బ్ర జలు నద్భుత మందిరి యాక్షణంబున
  న్మాత యనంగ నేర్వు డిలమాపినమామకు గూతు రే సుమా

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సుబ్బారావు గారూ,
   (మా)మ (త)నూజ మాత అయిందా? ఆ అర్థంతోనే పూరణ చేశారా? కొంత ఇబ్బంది పెట్టినా పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు

 15. సీతను కోరినాడ నొక చిన్న సమస్యను జేతు పూరణం
  చా తరళాక్షిి దీని నిడి హాయిగ పండెను ప్రొద్దు పోయినన్
  రాతిరి నిద్ర లేదు మరి రాదయె పూరణ యెవ్వ రేడ నే
  మాతను పెండ్లి యాడి జనమాన్యుడుగా నుతి కెక్కె మిత్రమా?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మిస్సన్న గారూ,
   పూరించడం కష్టమంటూనే పూరించారు. బాగుంది. అభినందనలు.
   ‘పూరణ+అంచు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘సీతను కోరినాడ నొక చిన్న సమస్య నొసంగ మంచు నే| నా తరళాక్షి...’ అంటే ఎలా ఉంటుంది?

   తొలగించు
  2. ధన్యవాదాలు గురువుగారూ మీ సవరణకు. మీ సూచనను గమనించాను

   తొలగించు
 16. రాతిని నాతిగ మారిచి
  పాతకి తాటకినిఁదునిమి భాణపు హతితో
  ప్రాత విలువిరిచి సీతా
  మాతను పెండ్లాడి లోక మాన్యుండయ్యెన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 17. ఆతత బాహు విక్రముడు నంబర రత్న కులాంబురాశి సం
  జాతుడు రాఘవుండు శివ చాప సుభంగము సేసి వేగ భూ
  జాత విరాజమాన తను ఛాయ జితాంబుజ దేవి జానకీ
  మాతను బెండ్లియాడి జనమాన్యుఁడుగా నుతి కెక్కె మిత్రమా!


  వీతపతిని బుచ్చెమ్మను
  బాతక మనక విధవా వివాహ నిచయ సం
  ధాత గిరీశమ్మట, విను
  మా, తను బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ముఖ్యంగా రెండవ పూరణలోని విరుపు అద్భుతం!
   ఐతే ఒక మాట... గురజాడ వారి కన్యాశుల్కంలో గిరీశం బుచ్చమ్మను పెళ్ళాడలేదు. అది కేవలం సినిమా వారి కన్యాశుల్కంలోనే జరిగింది.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. అవునా నేను గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కము చదవ లేదండి.

   తొలగించు
 18. ఆతత వక్షుడౌ హరి సదా జనియించును భూతలమ్ముపై
  పాతకులైనవారలను బాధ్యత తోడుత మట్టుబెట్టగన్
  ఘాతక రక్కసీడు కన కాక్షుని పోరున సంహరించి భూ
  మాతను బెండ్లియాడి జన మాన్యుడుగా నుతికెక్కె, మిత్రమా

  జంధ్యాలపాపయ్య శాస్తి గారి క్రింది పద్యములను చవిన తరువాత మొదటిపాదం లోఉన్న “ఆ” కు 10 వ అక్షరంలో “దా” లో ఉన్న “అ” కు యతిచెల్లుతుందేమో అని వేశాను. తప్పొప్పులు తెలియజేయ ప్రార్థన.
  హంస తీర్పు
  క/
  ల్లంతన నిల్చి పిల్చె “ ఖగమా! యిటురా!యిటురా౧ యటంచు వి
  విజయ సిద్ధార్థం
  అప్పుడె పెండ్లి సిగ్గు లవురా! జవరాలికి మోము ప్రక్కకున్
  ధ్యానముద్ర
  యామహిళామతల్లి సుతులా! మన శాక్య మహా మహీతల

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీరు ఉదాహరించిన జంధ్యాల వారి ప్రయోగాలు ‘ప్లుతయతి’కి చెందినవి. మీరు ప్రయోగించింది అన్యము. అది సాధువా కాదా అని ఛందోగ్రంధాలలో గంట సేపు వెదికాను. దొరకలేదు. ‘కాకుస్వరయతి’కి చెందుతుందో లేదో ఎవరైనా నిష్ణాతులు చెప్పాలి.

   తొలగించు
  2. ఇక్కడ అన్నపురెడ్డి వారు 'ఆతత వక్షుడౌ హరి సదా' అన్న ఉత్పలమాలాపాదంలో ఆ అన్న అచ్చుకు 'సదా' లోని 'దా'యందు ఉన్న 'ఆ'కారస్వరంతో యతిమైత్రి ప్రయత్నం చేసారు.

   ఈ సదా అన్న పదంలోని దా యందు ఉన్నది సహజమైన ఆకారం. అది విడదీయరానిది. ఆకారం విడదీయటానికి వీలైనప్పుడే దానితో మనం యతిమైత్రి చేయగలం.

   'ఆ'తో సంబోధనాప్రథమలోని 'ఆ'కారంతో మనం‌యతిమైత్రి దివ్యంగా చేయవచ్చును. కరుణశ్రీగారి 'అంతన నిల్చి పిల్చె ఖగమా' అన్న పాదభాగంలో 'అ' యతి. దానికి మైత్రిస్థానంలో ఉన్న అక్షరం 'ఖగమా' అన్న సదంలోని చివరి 'ఆ' కారం. అది చెల్లుతుంది. ఎందుకంటే ఖగము + ఆ => ఖగమా అని సంబోధన. ఇలాంటివే రాముడా, రామా వగైరా సంబోధనలూను.

   రెడ్డిగారు వాడిన'సదా'లోని 'ఆ'కారం పదంలో అంతర్భాగం కాని వ్యాకరణకార్యంద్వారా సిధ్ధించినది కాదు. విడిగా తీసిచూపలేము! కాబట్టి సదా లో యతికి మైత్రిచేయదగ్గ ఆ-కారం లేదు. అదీ సంగతి.

   ఛందోదర్పణంలో
   .....నితఁ
   డే కదలక జలధిఁ బవ్వళించె......

   అన్న చోట కాకుస్వరయతిని చెప్పారు. ఇతడే అన్నది ఇతడు + ఏ => ఇతడే అని సాధించబడిన పదం. ఈ‌ 'ఏ' యతిగా ఉండి, యతిమైత్రిస్థానంలో పవ్వళించె అన్న దాని లోని ఇంచుక్ పదం మొదట ఉన్న ఇ-కారంతో‌మైత్రి చెల్లించటం జరిగింది. ఈ ఇంచుక్ గురించి బా।వ్యా క్రియాపరిఛ్చేదంలోని 77వ సూత్రాన్ని చూడండి ఇంచుక్....గానంబడియెడి అన్నది. కావించు, రప్పించు వగైరా. అలాగే పవళించు కూడా.

   తొలగించు
  3. శ్యామల రావు గారూ,
   వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు! మీ వ్యాఖ్యను బ్లాగులో చూసి కడుంగడు సంతసించాను.

   తొలగించు
  4. శోక భయాదుల వల్ల కలిగే ధ్వని వికారం కాని, ప్లుతోచ్చారణం వల్ల పిలుపు, రోదనం, సంశయం కానీ సదా (ఎల్లప్పుడు) పదోచ్ఛారణలో కనిపించుట లేదు కాబట్టి యతి మైత్రి సంశయమే యని నా యభిప్రాయము. దీనికి పరిష్కారముగ:

   “ఆతత వక్షుడా హరి నియంత జనించును భూతలమ్ముపై” అనిన బాగుండును.

   తొలగించు
  5. ఆహా శ్యామల రావు గారి స్పందన చాలా సంతోషాన్ని కలిగించింది. ధన్యవాదములండి శ్యామల రావు గారు.

   తొలగించు
  6. కొద్ది సులభసూత్రాలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుండండీ.

   1. పాదప్రథమాక్షరం యతి అని వ్యవహరించబడుతుంది. ఈ యతిస్థానం దగ్గర సంధికార్యం ఉంటే ముందుగా అది విడదీసి చూసుకోవాలి. అలాగే యతిమైత్రిస్థానం ఎక్కడ చెప్పబడిందో అక్కడకూడా ఇలాగే సంధికార్యం ఉన్నట్లైతే విడదీసి చూసుకోవాలి.

   2. సంధికార్యం అంటే రెండుపదాలను కలపటంద్వారా ఒకేపదంగా చూపటం. అందుచేత మనం పైసూత్రంలో చెప్పినట్లుగా సంధికార్యంలో‌ పాల్గొన్న పూర్వ,పర పదాలను (మొదటి, రెండవ పదాలను) గుర్తించి పూర్వపదాన్ని వదిలివేయాలి. పరపదంతోనే పాదాదిని ఉండే యతిస్థానమూ, పాదమధ్యంలో నిర్దేశించినచోట యతిమైత్రిస్థానమూ కూడా గుర్తించాలి.

   3. ఇప్పుడు యతి-మైత్రి స్థానాల్లోని పదాల ప్రధమాక్షరాల మధ్య మైత్రిని విచారించాలి. హల్లులమధ్యా, అచ్చుల మధ్యా కూడా మైత్రిని విచారించాలి. వాటిలో ఏస్థానంలో ఐనా హల్లు లేవ్కపోతే అచ్చుతో మైత్రి సరిపోతుంది.

   4. సంధికార్యం ఏమీ‌లేనప్పుడు ప్రయాసతగ్గుతుంది. నేరుగా పైనున్న 3వ సూత్రం వర్తింపజేస్తే చాలు.

   తొలగించు
  7. గురువర్యులు శంకరయ్య గారికి, నాపదప్రయోగాన్ని విశ్లేషించి, సులభ వ్యాకరణ సూత్రాలను వివరించి నా అనుమానమును పోగొట్టిన శ్యామలీయం గారికి, సవరణ సూచించిన కామేశ్వర రావుగారికి ధన్య వాదములు. తెలుగు భాషపై ప్రేమతో శంకరాభరణంలోని కవులకు అవసరసమయంలో సహకరిస్తున్న శ్యామలీయం గారికి హృదయపూర్వక ధన్యవాదములు మరొక్క సారి తెలియ జేస్తున్నాను.

   తొలగించు
  8. శ్యామలీయం గారికి ధన్యవాదములు

   తొలగించు
 19. సీతను స్వయంవరమున,
  “నీతిని బాలించగలుగు నేత నయోధ్యన్
  జాతికి మేలొసగగ భూ
  మాతను” బెండ్లియాడి లోకమాన్యుండయ్యెన్. {రాజుగాభూమాతకురక్షకుడు}
  2.ద్యోతిత మైనయందమది తోడుగ నిల్వగ రామచంద్రుడే
  నేతగ వచ్చి నేర్పున ననేకులు జూడ ?స్వయం వరమ్మునన్
  జేతగ నిల్వ|మెప్పున విశేష గుణంబును జూచి జానకీ
  మాతను పెండ్లి యాడె జన మాన్యుడు నుతికెక్కె మిత్రమా|

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో కొంత అన్వయదోషం ఉన్నట్టుంది.

   తొలగించు
 20. ఘాతకులైన దుండగుల కర్కశ చర్యల వేటు వడ్డ నా
  తాతయు తండ్రియున్ బ్రతుకు దారులు గానక ప్రాణముల్విడన్
  ప్రీతిగ నేత యౌనొకడు భీతిని దూరము చేయబూని నా
  మాతను బెండ్లి యాడి జన మాన్యుడుగా నుతి కెక్కె మిత్రమా!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు

   తొలగించు
 21. ఓ తరుణీ! మహోన్నత గుణోత్తమ శీలుడు నీదు భ్రాతయే
  నీతిని వీడి జారిణుల నెయ్యము గోరలేదు, నమ్ముమా!
  ఖ్యాతిని బొందనెంచి కులకాంతగ వేశ్యను స్వీకరించె, భా
  మా! తను పెండ్లియాడి జన మాన్యుడు గానుతి కెక్కె మిత్రమా!

  ఆతడు సంస్కర్తగ తా
  ఖ్యాతిగ డింపదలపోసి యాలిగ కులటన్
  భీతిల్లక చేకొనె భా
  మా! తను పెండ్లాడి లోక మాన్యుండయ్యెన్

  నిన్నటి పూరణ

  మిత్రులకేమి లోటు జనమెల్లరు వాని హితాభిలాషులే
  శత్రువు లేనివానికి, ల శాంతి సుఖంబులు గల్గనేర్చు నే
  మాత్రము? సత్యమున్ విడిచి మాటల రువ్వెడు వారికీ భువిన్
  మిత్రుడె శత్రువై చెలగు మేధిన నొంటరియౌను నిక్కమే.

  శత్రువులధికు లైనను సంతసమ్ము
  కరువగునను మాట యదియె కల్లగాదు
  దినదినమొక గండమ్ముయై తిరుగ వలయు
  శత్రురహితునకబ్బునే శాంతిసుఖము

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విరించి గారూ,
   మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   చివరి పద్యంలో సమస్య సమర్థంగా పరిష్కరింపబడనట్టుంది.

   తొలగించు
  2. విరించిగారూ, మొదటి పద్యంలో భామా అనీ మిత్రమా అనీ రెండుసార్లు సంబోధన ఉన్నది. అవసరమా అన్నది ప్రక్కనబెడితే మిత్రమా అన్న సంబోధన స్త్రీపరంగా చేయటంలోని ఔచితి చర్చనీయం. వాదం దేనికంటే, భూమిపై అనెయ్యండి ఓ పనైపోతుంది! అదే పద్యంలో రెండవపాదంలో కోరగలేదు అని ఉండాలి గణౌచితికోసం.
   ఇకపోతే కందంలో చేసిన పూరణలో భావౌచితీభంగం‌ కనిపిస్తోంది. ఖ్యాతిగడింపదలపోసి అనటం‌ సులభమే కాని ఉద్దేశం కీర్తికాని హృదయపూర్వకమైన సంగతియేనా అన్నది ప్రశ్నార్థకం ఐపోతున్నది! కులట అని నిందార్థపదం‌ నేరుగా ప్రయోగించి ఔచితీభంగాన్ని సంపూర్ణం చేసారండి. కొంచెం‌ ఇలాంటివి ఎంతపూరణల్లోనే ఐనా సమర్థనీయంగా ఉండవు.

   మీ‌ మూడవపద్యం నాకు కొంత గందరగోళంగా అనిపించింది! మరలా చూడాలి. చివరి కందంలో పరిష్కరణ సందిగ్ధంగా ఉంది. అన్నట్లు గండమ్ముయై అని ఎక్కడి యడాగమం? గండమై గండమ్మై అని రెండే సాధువులిక్కడ. గండమ్ముగా అనేసి గండం నుండి గట్టెక్కండి హాయిగా.

   తొలగించు
 22. త్రేతాయుగమున రాముడు
  భూతలమందున దశరథు పుత్రుండై తా
  ప్రీతిగ జనకజ సీతా
  మాతను పెండ్లాడి లోకమాన్యుండయ్యెన్.

  భూతలమందున ముదమున
  భూతేశుడు తా హిమగిరి పుత్రిని గాంచన్
  చేతము కోరుకొనగ జగ
  న్మాతను పెండ్లాడి లోకమాన్యుండయ్యెన్.

  త్రేతాయుగమున సీతా
  మాతను పెండ్లాడి లోకమాన్యుండయ్యెన్
  యా తరణి కులోద్భవుడిల
  ప్రాతఃకాలమున దలవ భవభయహరమౌ.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఉమాదేవి గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవపూరణ మూడవపాదంలో గణదోషం. ‘చేతము కోరుకొన జగ../ చేతము కోరంగ జగ...’ అనండి.
   మూడవపూరణలో ‘అయ్యెన్+ఆ’ అన్నపుడు యడాగమం రాదు. ‘అయ్యె| న్నా తరణి..’ అనండి.

   తొలగించు
 23. నిన్నటి పద్యాన్ని ఓ సారి చూడండి.
  వైరి వర్గీయులు సఖులే వసుధ యందు
  శత్రు రహితునకబ్బునే శాంతి సుఖము
  దుష్ట బుద్ధి తోడ మెలగు దోస్తులకును
  నరసి చూడుడు తమరెల్ల నయము తోడ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఉమాదేవి గారూ,
   ఈ పూరణలో సమస్య పరిష్కరింపబడలేదని అనిపిస్తున్నది. ‘దోస్తు’ అని అన్యదేశ్యాన్ని వాడారు.

   తొలగించు
 24. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శిరీష గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నా ఎందుకు తొలగించారు?

   తొలగించు
 25. పాతకుడైన రావణుని పట్టి వధింపగ మానవుండు గా
  కోతుల సాయ మొంద హరి కోసల రాజ్యమునన్ జనించి యీ
  క్ష్మాతల మందునన్ వెలయ జానకిగా సిరినంపె ; సీత నా
  మాతను బెండ్లియాడి జనమాన్యుఁడుగా నుతి కెక్కె మిత్రమా!

  నాతుల బట్టెడి యసురుడు
  సీతను చెఱబట్ట వాని చెండాడంగన్
  భూతలమున రాముడగుచు
  మాతను బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్


  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కృష్ణారావు గారూ,
   పైన ‘శిరీష’ పేరుతో పూరణలు పెట్టింది మీరేనన్నమాట!
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 26. మిత్రులారా,
  మధ్యాహ్నం స్వల్పంగా మొదలైన జ్వరం ఇప్పుడు తీవ్రమైంది. ఇంటి ప్రక్కనే ఉన్న డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చి మాత్రలు ఇచ్చారు. రేపటికి ఎలా ఉంటుందో? ఈమధ్య తరచుగా అనారోగ్యానికి గురవుతున్నాను.
  రేపటి సమస్యను షెడ్యూల్ చేసి పడుకుంటాను. మన్నించండి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మిత్రులు శంకరయ్యగారు, ఒకసారి మీరు సమగ్రంగా అన్నిపరీక్షలూ చేయించుకొనటం మంచిదండీ. రోగనిరోధకశక్తిలో‌ తగ్గుదల కూడా ఒక కారణం‌ కావచ్చును. అదెలాగు అన్నది పరీక్షల్లో తేలవలసిందేను. తాత్కాలికంగా జ్వరాదుల్ని అణచే వైద్యాలు చివరకు మరిన్ని ఇబ్బందులు కలిగిస్తాయండి. జాగ్రత. సమస్యాపూరణల విషయంలో నావలన ఐనంతగా పరిశీలించగలనండి.

   తొలగించు
  2. శ్యామల రావు గారూ,
   ధన్యవాదాలు.
   ఈరోజు ఉదయం వార్తాపత్రికతో పాటు ఒక కరపత్రం వచ్చింది. ఇక్కడ ‘విఘ్నేశ్’ హాస్పిటల్‍లో రేపటినుండి మూడు రోజులు మెడికల్ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నారట. ‘మాస్టర్ హెల్త్ చెకప్’ పేరుతో 40 రకాల పరీక్షలు ఒక ప్యాకేజీగా చేస్తున్నారట.. రేపే వెళ్ళి పరీక్షలు చేయించుకుంటాను.

   తొలగించు