28, జులై 2016, గురువారం

పద్మావతీ శ్రీనివాసము - 13




పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
చతుర్థాశ్వాసము (1-20)

శ్రీభూనీళాదేవీ
వైభవ నాథా మురహర పక్షీంద్ర విహా
రా భువనోద్ధార కమల
నాభా భువనైక మోహనా పరమాత్మా                         1

దివ్య సౌధమ్ము నేతెంచి హరి దిగి
భవ్యంపు మణి మండపముఁ జేరె నంత                             2

సఖులు నిషాద వేషము వీడి నాక
ముఖులైరి దివిజులు మురహరి వేడ                                 3

సూటిగ మణిమయ సోపానములను
దాటి ముక్తాలయ తల్పము జేరె                                       4

నవరత్న ఖచిత సనాతన మంచ
వివశ శయనుడు శ్రీ విష్ణుప్రియ నిభ                                  5

తనుమధ్య మందస్మిత వదనాంబుజ
యన విశాల నళినజాభ పద్మభవ                                     6

సుందరి పద్మిని సోయగమ్మునకు
కందర్ప శరఘాత కల్లోలుడాయె                                        7

అంత మధ్యాహ్న కాలాసన్న మైన
సంతత భక్తి సత్సంగ నిజ సఖి                                           8

సతి వకుళాదేవి సన్నుతుని నధి
పతి శ్రీనివాసుని పరమ పురుషుని                                     9

పద్మాక్షు సేవింప భక్ష్యములు గొని
పద్మావతియు పద్మపత్రయు మరియు                               10             

చిత్రరేఖయు సమంచిత సుదతులు
విత్ర మానసు లంత విచ్చేసి రచట                                       11

వ్యంజన సహిత దివ్యాన్నము గంధ
మంజుల మమర సమ్మత భాసితమ్ము                                12             

పాయ సాన్నము నపూప వటక గౌడ
ఛాయంపు ముద్గాన్న సౌచాన్నములును                            13             

కాంచన పాత్రలం గైకొని సఖుల
నుంచి ద్వార తటిని నుత్సహించి చని                                  14

వకుళ మాలిక పరాత్పరుఁ గాంచి భక్తి
ముకిలిత హస్తయై పూజించె నతని                                     15  

లలితాంగి రత్న తల్పస్థిత వివశుఁ
జలితాత్ముఁ గని పాద సంవాహనమ్ము                                 16

చేసి యేల శయనించితి వింత తడవు
వాసుదేవ భుజియింప వలయు సుమ్ము                              17

నాపల్కి నన్య మనస్కు విలోలు
వేపమానుం గని వేదన నడిగె                                              18

నీ విటు నిర్లిప్త నిరవధి కార్తి
నో వీరవర యేల నుంటి వార్తిహర                                        19

మృగ యార్థి వచట నే దృశ్యంబు గంటి
వి గజయాన వలని వివశత తోచె                                         20

7 కామెంట్‌లు:

  1. ఉరములోన కవిత లుప్పొంగిపారెను
    అడవిలోని ఝరులయట్లె గాగ
    పద్య కావ్యమెన్ని పరవళ్ళు దొక్కినా
    వచనకావ్యమంత వాసిగొనెనె?

    -Dr.Pitta Satyanarayana

    రిప్లయితొలగించండి
  2. డా. సత్యనారాయణ గారు నమస్సులు. మీ వచనకావ్యాభిలాష ప్రశంసనీయము. "లోకోభిన్నరుచిః" అని నానుడి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      డా. సత్యనారాయణ గారు పై పద్యాన్ని 'పద్యరచన' శీర్షికకోసం వ్రాసి పొరపాటున ఇక్కడ పోస్ట్ చేశారు. బ్లాగులో వ్యాఖ్యను పోస్ట్ చేయడం వారికి జీవితంలో ఇదే మొదటిసారి. అందువల్ల ఆ తడబాటు...
      ఇక వారు పద్యకవితాభిమాని. ఒక కవిసమ్మేళనంలో పాల్గొన్నప్పట్టి అనుభవాన్ని ఆ పద్యంలో వెలిబుచ్చారు. ఆ సమ్మేళనంలో వచనకవిత్వాన్ని అందల మెక్కించి, పద్య కవిత్వాన్ని చిన్నచూపు చూశారన్న బాధతో ఆ పద్యాన్ని వ్రాశారు. అయితే తమ భావాన్ని స్పష్టంగా, సంపూర్ణంగా ప్రకటించలేక పోయారు. వారికి వచన కవిత్వం పట్ల నిరసన భావమే ఉంది.
      వృత్తిరీత్యా వారు ఇంగ్లీషు ప్రొఫెసరుగా పనిచేసి రిటైరయ్యారు. వృత్తరచనలో దిట్ట. కొన్ని పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. ఈమధ్యే వ్యక్తిగతంగా వారితో పరిచయం ఏర్పడింది. రోజూ ఫోన్ ద్వారా మాట్లాడుకుంటాము.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీవివరణకు ధన్యవాదములు.

      తొలగించండి
  3. గురువుగారూ నమస్సులు మీ పద్మావతీ శ్రీనివాసము ధారావాహిక చాలా బాగున్నది.

    రిప్లయితొలగించండి
  4. శర్మ గారు నమస్కారములు. పద్మావతీ శ్రీనివాసమును వీక్షించుచున్నందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి