24, నవంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2528 (చోరుని సముఁడు కవి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌనే?"
(లేదా...)
"చోరునకున్ సముండు కవి చోద్యము గా దిది నిత్యసత్యమే"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

94 కామెంట్‌లు:

  1. చోరుని వలెనే కవియున్
    గోరును నానార్థములను గొప్ప చతురతన్
    వీరిరువురి కిది సహజము
    "చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌనే?"
    (ఇరువురూ నానార్థముల వెంట బడతారు గదా !)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      నానార్థచోరుల గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. ఆర్యా!ధన్యవాదాలు!అభినందనలు "మందం నిక్షిపతే పదాని ...." శ్లోక కర్తకే. సమస్య రూపొందించటానికీ,పూరణకు ఆ చాటువే ఆధారం!

      తొలగించండి
  2. నోరుల నూరించు కథలు
    ధారాపాతముగ పాడి దయహీనుండై
    నారుల మనముల దోచెడి
    చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌనే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దయాహీనుండు' అన్నది సాధు సమాసం. "దయ లేకుండన్" అందామా?

      తొలగించండి
  3. తీరుగ ననేక విధముల
    నారుల నరుల హృదయముల నాణెముగన్ దో
    చున్ రసికసుకవి;కావున
    చోరుని సముడు కవియనుట చోద్యమ్మగునే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారికి నమస్సులు.

      మూడవ పాదపు ప్రాస సరియా?

      తొలగించండి
    2. బాపూజీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో శాస్త్రి గారు చెప్పినట్లు ప్రాసదోషం. సవరించండి.

      తొలగించండి
  4. కోరును భిన్న యర్థములు కొల్లలు గాగల మాటలెప్పుడున్
    సారము మెండుగా గలుగు చక్కని శ్లేషల తోడ పద్యముల్
    తీరుగ సొమ్ము దోచు పలు తీరుల తెన్నుల దోగ పోలికన్
    "చోరునకున్ సముండు కవి చోద్యము గా దిది నిత్యసత్యమే"

    రిప్లయితొలగించండి
  5. పేరుకు తస్కరు డనుటయె
    వీరుడు మంచి కవియనగ విద్వాంసు డటన్
    నారుల యెడదను దోచెడి
    చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌనే

    రిప్లయితొలగించండి
  6. శాస్త్రి గారెకి నమస్కారం.గమనించలేదండి.దోచు రసికుడు సుకవి-అంటాను.ధన్యవాదాలు'

    రిప్లయితొలగించండి
  7. ...దో
    చురసికుడు...

    అనినచో మూడవ పాదము లఘువుతో ప్రారంభమై దోషమగును కదా..

    రిప్లయితొలగించండి

  8. రెండవపాదం చివర 'నయముగ దోచున్'
    మూడవపాదం మొదట'గా రసికసుకవి'అంటే సరిపోతుందికదా!

    రిప్లయితొలగించండి
  9. నీరము క్షీరమున్ గలుప వేరొన రించగ రాజహంసయే
    కోరిన మానసం బునను కూరిమి జేయుచు కల్పితం బులన్
    నారికి ప్రేమమీ రగను నాకము నందలి శాంతి సౌఖ్యముల్
    చోరునకున్ సముండు కవి చోద్యము గాదిది నిత్యసత్యమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. "నీరము క్షీరమున్ గలుప నేర్పున గోలెడి రాజహంసయే" అందామా?

      తొలగించండి
  10. ధారా శుద్ధియు ఛందము
    తో రాజిలజేయు కవిత త్రోవనెరుగకన్
    వేరొండు విధముగా నిక
    చోరుని సముడు కవి యనుట చోద్యమ్మౌనే!

    రిప్లయితొలగించండి


  11. జీరాడు కవిత్వ ములన్
    వారావధివలె నిలుపుచు వచనమ్ములతో
    పౌరుల హృదయము దొంగిలు
    చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌ నే?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వారావధి' కోసం ఆంధ్రభారతి తలుపు తట్టితే, తలుపు తెరవలేదు కాని శబ్దార్థ చింతామణి (తెలుగు-ఉర్దూ) కిటికీని మాత్రం తెరిచింది.

      తొలగించండి
    2. జిలేబి గారికి వ్హాట్సప్ సమస్య:

      "మంచానికి మూడుకాళ్లు మనిషికి వలెనే"

      తొలగించండి
    3. ముంచిన ముదుసలి తనమున
      మంచమునకు కాలు విఱుగు; మనిషికి వచ్చున్
      చంకన కఱ్ఱది యొక్కటి...
      మంచానికి మూడుకాళ్లు మనిషికి వలెనే

      తొలగించండి


    4. బాంచన్నీకాల్మొక్తను,
      మంచానికి మూడుకాళ్లు మనిషికి వలెనే
      కొంచెము కూడా తప్పే
      గాంచను దొర నన్నొదులుము కామందన్నా :)


      జిలేబి

      తొలగించండి
  12. డా.పిట్టా
    పోరును కవినని ధారణ
    కూరగ సాహిత్య నిధులు గుంఫనమున నా
    చారముగ గుప్ప వేయగ
    చోరుని సముడు కవి యనుట చోద్యమ్మౌనే?!

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా
    పోరచి పుట్టం బుట్టెనె
    ధారణతో శరమునందు దా మొలిచెనె చే
    కూరిన సాహితి నిధికిన్
    చోరుని సముడు కవి యనుట చోద్యమ్మౌనే!(పోరచి.. నిస్సారమైన ..)

    రిప్లయితొలగించండి
  14. ఆ ర య వాస్తవ ఘటన ల్
    నేరుగ తన కవిత లందు నేర్పు గ చేర్చు న్
    ధీరతదోచె డు వాడై
    చోరుని సముడు కవి యను ట చోద్యమ్మవునే !

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా
    "వారె వహవ్వ! యేమిటివి వంకర టింకర భావ సంపదల్
    గూరె నివెట్టు లేసిబిని(ఆంటీ కరప్షన్ బ్యూరోను)గూర్చెద మిందును జైలు శిక్ష క
    య్యారె యనర్హతెట్లు గన యార్యుడవంచని గౌరవించ యే
    పార నిఘంటువు"న్నమర " బారు(కడ్డీ)ల లక్షల హేమ రాశులన్
    జోరుగ గూడబెట్ట నిట జూచియు జూడక నూరకుందుమే?!"(అని పాఠక జనాళి యనెను)
    చోరునకున్ సముండు కవి చోద్యము గాదిది నిత్య సత్యమే!!(అమరము,సంస్కృత శబ్ద కోశము)

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ


    చేరి దరికి మధురముగా
    నేరిచి నిజభాషణముల నెమ్మది దోచున్
    సారవచస్కుడు మానస..
    చోరుని సముడు కవియనుట చోద్యమ్మౌనే ?!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  17. ‘యస్యాశ్చోర శ్చికురనికరః కర్ణపూరో మయూరో..”

    సార కవీంద్రుల సరసన
    జేరుచు కవితాబ్జముఖికి చికుర నికరమై
    పేరెన్నిక గన్న సుకవి
    చోరుని సముడు కవి యనుట చోద్యమ్మౌనే

    రిప్లయితొలగించండి
  18. ఆరాత్రి వేళలందున
    వేరుగ కనిపించకుండ వినిపించుచునే
    జోరుగ చోరీలు జరుప
    చోరుని సముడు కవి యనుట చోద్యమ్మౌనే!

    కనిపించకుండా వినిపించే వాడు "కవి" యన్న భావంతో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      చమత్కార భరితమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. దూరును సిరి యింటికొకడు,
    దూరునొకడు వాణియిల్లు దోచగ రయమున్
    నేరస్దులే గద, యిచట
    "చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌనే?"

    రిప్లయితొలగించండి
  20. *ప్రేరణ శంకరా భరణ వేదిక నింపగ శంకరార్యులే*
    *నేరుపు లెన్నొ నేర్ప!కడు నేర్పుగ పండితమిత్ర లెల్ల ప్రా*
    *కారము గూల్చ!భారతిని కన్నుల దోచెను హర్షుడార్తిగా*
    *చోరునకున్ సముండు! కవి !చోద్యము గా దిది నిత్యసత్యమే*

    *తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      ఆత్మాశ్రయమైన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  21. ధారాళమ్ముగ పోతన
    నారాయణు భాగవతము నాటఁగ భక్తిన్
    పారించి మదుల దోచెడు
    చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌనే?

    రిప్లయితొలగించండి
  22. సార కవిత్వ తత్వ ఘన సాంద్రవచో సుగుణాభిరాముడై
    పూరిత కావ్య సంచలిత మోహన భావ విరాజమానుడై.
    ధీరత మన్మనంబు గణుతింపగ దోచెడు వాడు కావునన్.
    చోరునకున్ సముండు కవి చోద్యము గాదిది నిత్య సత్యమే

    రిప్లయితొలగించండి
  23. వారిజబాంధవు డేడగు
    వారువముల రథి యపారవారిధి జలముల్
    వారిదముల గూర్చనొడచ
    చోరునిసముడు కవియనుట చోద్యమ్మవునే?

    కవి సూర్యుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గూర్చ నొడచ'... అర్థం కాలేదు.

      తొలగించండి
    2. గురుదేవులకు నమస్సులు! వారిదముల గూర్చన్ జలముల నొడచ యని భావన! ఒడచ యనగ అపహరించుట యని, కననుక చోరుడనవచ్చునని!సరియైనదేనా?

      తొలగించండి
    3. మీ వివరణతో పద్య భావం అవగతమైంది. బాగున్నది. ధన్యవాదాలు.

      తొలగించండి


  24. వీరులకున్ జిగేల్మ నుచు వీరర సమ్ముల జేర్చు‌నాతడున్,
    పౌరులకున్ జిగీషల సెబాషన మెచ్చెడు రీతి పద్య మం
    దారములెల్లజేర్చు,ముగుదల్ మనమున్ మజ దేల్చు ప్రీతుడౌ
    చోరునకున్ సముండు కవి చోద్యము గా దిది నిత్యసత్యమే

    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. ధారుణి యందు బుట్టి యవధానము జేసిన కోవిదుండు, సా
    కారమునం జరించి మమకారము బంచిన సర్వమోహనా
    కారుడు గోపికాంగనల కల్లడి డెందము లెల్ల దోచు నా
    చోరునకున్ సముండు, కవి చోద్యము గాదిది నిత్యసత్యమే

    రిప్లయితొలగించండి
  26. వారిశు నీరజోదరుని భాసుర లీలల దెల్పుగాథలన్
    నారద సన్నుతున్ బొగడి నాటగ భాగవతమ్ము కావ్యమై
    భూరి కవిత్వమున్ వెలయ పోతన భక్తమనమ్ము దోచెడున్
    చోరునకున్ సముండు! కవి! చోద్యము గాదిది నిత్యసత్యమే!

    రిప్లయితొలగించండి
  27. చూఱాడుదురు స్థిర తలముఁ
    జోరులు, రవిగాంచనట్టి చోటుకు నైనన్
    చేరుదురు దొంగిల కథను
    చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌనే?

    రిప్లయితొలగించండి
  28. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భము :: చోరుడు చోర కళాప్రపూర్ణుడు. కవి కవిత్వ కళాప్రపూర్ణుడు. చోరుడు పరుల విత్తమును దోచుకొంటాడు. కవి పరుల చిత్తమును దోచుకొంటాడు. చోరునికి కవికి దోచు కోవడంలో సమానత్వము దోచు చున్నది. కాబట్టి చోరునితో సమానమైనవాడు కవి, అని చెబితే, ఇందులో వింత యేమీ లేదని పలికే సందర్భం.

    చోరుడు వెల్గు, *చోర కళ శోభిలగా, పర విత్త హారిగా.*
    సూరియు దా *కవిత్వ కళ శోభిలుగా పర చిత్త హారిగా.*
    వీరు సతమ్ము *దోచు* కొన, వీరికి సామ్యము *దోచు* , నెంచగా
    *చోరునకున్ సముండు కవి, చోద్యము గాదిది, నిత్యసత్యమౌ.*

    *కోట రాజశేఖర్ నెల్లూరు.*

    రిప్లయితొలగించండి
  29. ఆ రవిగాంచని చోట
    న్నా రవి నిదురించు వేళ హారియు కవియున్
    పేరొందెదరు క్రమముగా
    చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌనే?

    రిప్లయితొలగించండి
  30. నారాయణునానతితో
    ధారగ కీర్తనలు బలికి ధర, నన్నమయే
    భూరిగ సోలించె, హృదయ
    చోరుని సముడు కవియనుట చోద్యమ్మౌనే?!!!

    రిప్లయితొలగించండి
  31. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

    చోరుడు కొ౦ప లోపలికి జొచ్చుచు వస్తువు

    .......................... దస్కరి౦చగా

    నారయ గోశ పుస్తకము న౦దలి వస్తువు

    ........................... సత్కవీ౦ద్రుడే

    చౌరిక జేయు || నా క్రియల (న్) సామ్యము

    ................. కన్పడు చు౦డు : గావునన్

    చోరునకున్ సము౦డు కవి ; చోద్యము గాదిది

    ............................ నిత్య సత్యమే

    ________________________________________

    చోరుడు కూటి కోసమయి చోర తన౦

    ................... బొనరి౦చు వస్తువున్ |

    గోరి హితమ్ము స౦ఘమునకున్ , గవి

    .............. చేయును వస్తు చౌర్యమున్ |


    వీరికి సామ్య మ౦టు టెటు వీలగు నో కవి !

    ..................... క౦ది శ౦కరా !

    మారుచ నీ సమస్య నిక మ౦చి దట౦చును

    ..................... నే దల౦చెదన్


    { వ స్తు వు = ప దా ర్థ ము , క థా

    వ స్తు వు , వి ష య ము • కోశపుస్తకము =

    పద కోశ పుస్తకము • చౌరిక = చౌర్యము • }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  32. భార సమాస బృహ దలం
    కార సవర్ణన వర యుత కల్పిత కావ్యా
    పారద్యుతి గీర్పతి వా
    చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌనే?

    [వాచా+ఉరు = వాచోరు; వాక్కు లందు విరివియైన వాఁడు / విరివియైన వాక్కులు గల వాఁడు]


    ఆరయఁ జోరు లెల్లరు శుభాంగుల మానస చోరుఁ డయ్యె శృం
    గార రసామృతస్రవణ కార్య ధురీణ జగద్గురుం డిలన్
    సార మయార్థ శబ్ద సుమ సంపదఁ బండిత చిత్తహారి యై
    చోరునకున్ సముండు కవి చోద్యము గా దిది నిత్యసత్యమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  33. వీరయపలికెనునిట్లని
    చోరునిసముడుకవియనుటచోద్యమ్మౌనే?
    నారయచోద్యమ్మేగద
    చోరునినిన్బోల్చదగునెసుకవులతోడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వీరయ్య పలికె నిట్లని" అనండి బాగుంటుంది.

      తొలగించండి
  34. చోరునకున్సముండుకవిచోద్యముగాదిదినిత్యసత్యమే
    మీరలుబల్కుటిట్లుపుడుైమేదినినాయమెరాజశేఖరా!
    చోరుడుజేయునేరచనసూటిగజెప్పుమనీదుమాటయు
    న్నేరడుగాకనేరడిలనేస్తమ!యెయ్యెడజింతసేయగన్

    రిప్లయితొలగించండి
  35. మారెడి సమాజమందున
    చోరుని సముడు కవియనుట చోద్యమ్మౌనే?
    ప్రేరణ పూర్వపు వ్రాతల
    కూరుపునే కూడబెట్టు కుత్చితమందున్|
    2.ప్రేరణ గూర్చు సోయగము వేదనబంచగ దొంగచూపు కై
    వారమునన్నుదోచె|కవివర్యున కియ్యది మంచిదౌనటే?
    చోరునకున్ సముండు కవి|చోద్యము గాదిది నిత్యసత్యమే|
    మారుని చేష్ట కిద్దరికిమాయనుబంచగ కామితార్థమే|
    3.హారతి యిచ్చుచున్ వధువునందరు జూడగ డబ్బుగోర?ఆ
    హా రతిజేయకే వరునియన్నల మిన్నకిదేలయాశయో?
    చోరున కున్ సముండు కవి చోద్యము గాదిది నిత్యసత్యమే|
    కోరిన యాశకున్ కొసరు కోర్కెలుదీర్చినవేళ నిత్తులే {వరుడొకకవి }

    రిప్లయితొలగించండి
  36. పారు సుధా జలమ్ముల పిపాసి యెడందను గంగ రీతి నిం
    పారు సువేణునాదమున భామల మోహన కృష్ణు రీతి సొం
    పారు కవిత్వ నిర్ఝరుల ప్రాజ్ఞరసద్ధృదయాల దోచెడిన్
    చోరునకున్ సముండు కవి చోద్యము గా దిది నిత్యసత్యమే.

    రిప్లయితొలగించండి
  37. కోట రాజశేఖర్ గారి పూరణ

    శ్రీ చిటితోటి విజయకుమార్ గారి ప్రోత్సాహంతో
    *చోరునకున్ సముండు....* సమస్యకు
    *మందం నిక్షిపతే పదాని...* అను శ్లోకమునకు
    అనువాద పద్యంగా *మరొక పూరణ*


    ఓరిమి మెల్లగా పదములుంచును, శబ్దము గాంచు, తా నలం
    కారములన్, సువర్ణముల గైకొనుగా, రసమున్ స్పృశించెడిన్,
    కోరు వరార్థసంపదల, గొప్పగ జూచును దోషసీమలన్,
    చోరునకున్ సముండు కవి, చోద్యము గాదిది నిత్యసత్యమౌ.

    రచన కోట రాజశేఖర్ నెల్లూరు.


    మందం నిక్షిపతే పదాని, పరితశ్శబ్దం సముద్వీక్షతే
    నానార్థాహరణం చ కాంక్షతి ముదాలంకారమాకర్షతి
    ఆదత్తే సకలం సువర్ణ నిచయం ధత్తే రసాంతర్గతం
    దోషాన్వేషణ తత్పరో విజయతే చోరోపమస్సత్కవిః

    రిప్లయితొలగించండి
  38. ఊరిన భావాంబుధిలో
    నేరగ నే ముత్యమొకటి నేకత్వముగన్
    గూరుచు పోల మరొకటిన్
    చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌనే?

    రిప్లయితొలగించండి
  39. మైలవరపు వారి పూరణ

    ధీర సువర్ణ సంచయమతిన్ చరియించి , సమీకరించి గం..
    భీర వరార్థ సంపదనమేయముగా దనదౌ స్వయంకృషిన్
    చారు లతాభ సత్కృతి విచారులకెన్నడు చిక్కనట్లుగా
    నేరిచి చూచు వారలను నిత్యము మత్తున ముంచు వృత్తితో
    చోరునకున్ సముండు కవి చోద్యము గా దిది నిత్యసత్యమే !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    చోరుని పరం గా...

    సువర్ణ సంచయం... అర్థసమీకరణ , స్వయంకృషి... చారు లత వలె సుకుమారముగా తన పని నిర్వర్తించుకొనుట... చారులకు చిక్కకుండుట... ఎవరైనా చూస్తే వాళ్లను మత్తిల జేయుట... లక్షణములైతే....

    కవి పరంగా...

    సు వర్ణ సంచయం... మంచి వర్ణాలను ఎన్నుకొనుట..

    అర్థ సమీకరణ... విశేషమైన అర్థాలు సమీకరించుట...


    స్వయంకృషి

    చారు లత వంటి కృతులతో విమర్శకులకు చిక్కకుండుట..

    కావ్యం చదివే వారిని మత్తులో ముంచుట...

    అనే సమానధర్మాలున్నాయి.. కనుక

    కవి.. చోరులఁ భేదము లేదని భావం......

    ...మురళీకృష్ణ

    రిప్లయితొలగించండి
  40. బీరములెన్నియో పలకి భేదము నెంచక రైతుజాతి సా
    కారమె నాదు లక్ష్యమని కార్ష్యగణమ్మును ముంచు నేతయే
    చోరునకున్ సముండు కవి! చోద్యము గా దిది నిత్యసత్యమే
    దారుణమైన కర్షకుల దైన్య పరిస్థతి గాంచ డేలకో !

    రిప్లయితొలగించండి
  41. గురువు గారికి నమస్సులు
    సారా త్రాగిన మనుజులు
    వీరా!వారా! తమ తమ విధులన్ మరవన్
    ఔరా నటంచు పలికిరి
    చోరుని సముడు కవి యనుట చోద్యమ్మౌనే?

    రిప్లయితొలగించండి


  42. వారిధి దాటిన రాముని

    చారిత్రమువ్రాసి కీర్తి జగతిన పొందెన్

    కూరిమి తోజన మానస

    చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌనే

    రిప్లయితొలగించండి
  43. బారుగ సీసముల్ ద్విపద పంక్తులు కందలు మాలలందునన్
    నోరుల నూరుచుండునటు నూతన గీతులు పాటవమ్ముతో
    నారుల హృత్తులౌ విలుల నారుల దీటుగ మీటుచుండగా
    చోరునకున్ సముండు కవి చోద్యము గా దిది నిత్యసత్యమే

    రిప్లయితొలగించండి
  44. జారుచు రాత్రులందొకడు చౌర్యము చేయగ శక్తియుక్తులన్
    కోరుచు రాత్రులందొకడు కూర్చగ కావ్యము భక్తి శ్రద్ధలన్
    దూరరె నిర్వురుండ్రహహ దొమ్మరి గూడులు దేహచిత్తులన్
    చోరునకున్ సముండు కవి చోద్యము గాదిది నిత్యసత్యమే

    రిప్లయితొలగించండి